ప్రిక్వార్టర్స్‌లో సబలెంక | Aryna Sabalenka enters into pre-quarterfinals | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సబలెంక

May 31 2026 6:26 AM | Updated on May 31 2026 6:31 AM

Aryna Sabalenka enters into pre-quarterfinals

 ఒసాకా, జ్వెరెవ్‌ ముందంజ 

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ 

పారిస్‌: సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్‌ సబలెంక (బెలారస్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో సబలెంక 6–0, 7–5తో డారియా కసాట్కినా (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. 76 నిమిషాల్లో ముగిసిన పోరులో టాప్‌ సీడ్‌ సబలెంక పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఈ పోరులో ఒక ఏస్‌ సంధించిన బెలారస్‌ ప్లేయర్‌... రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 27 అనవసర తప్పిదాలు చేసిన సబలెంక... 37 విన్నర్స్‌తో ముందంజ వేసింది. 

మరో మ్యాచ్‌లో నవోమీ ఒసాకా (జపాన్‌) 7–6 (7/5), 6–7 (3/7), 6–4తో ఇవా జోవిక్‌ (అమెరికా)పై గెలిచింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో... ఇరువురు ప్లేయర్లు ప్రతి పాయింట్‌ కోసం తీవ్రంగా పోరాడారు. ఇది ఒసాకాకు వందో గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ కావడం విశేషం. ఉత్కంఠ పోరులో ఒసాకా 12 ఏస్‌లు సంధించగా... జోవిక్‌ 4 ఏస్‌లకే పరిమితమైంది. ఒసాకా 46 విన్నర్స్‌ బాదితే... అమెరికా ప్లేయర్‌ 34 కొట్టింది. ప్రిక్వార్టర్స్‌లో సబలెంకతో ఒసాకా అమీతుమీ తేల్చుకోనుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) 6–2, 6–3తో టమార కొరపాష్‌ (జర్మనీ)పై, 11వ సీడ్‌ బెన్‌కిక్‌ (స్విట్జర్లాండ్‌) 6–3, 6–3తో పైటన్‌ మెకంజీ స్టీర్న్స్‌ (అమెరికా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. 

జ్వెరెవ్‌ జోరు... 
పురుషుల సింగిల్స్‌లో జ్వెరెవ్‌ (జర్మనీ) జోరు కొనసాగుతోంది. మూడో రౌండ్‌లో రెండో సీడ్‌ జ్వెరెవ్‌ 6–4, 6–3, 5–7, 6–2తో క్వెంటిన్‌ హాలిస్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు. 3 గంటల 7 నిమిషాల పాటు సాగిన పోరులో 6 ఏస్‌లు కొట్టిన జ్వెరెవ్‌... 53 విన్నర్స్‌తో విజేతగా నిలిచాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌)  గాయంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌కు దూరం కాగా... ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) రెండో రౌండ్‌లోనే పరాజయం పాలయ్యాడు. మూడో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) మూడో రౌండ్‌లో వెనుదిరగడంతో రెండో సీడ్‌ జ్వెరెవ్‌కు చక్కటి అవకాశం కనిపిస్తోంది.  ఇప్పటి వరకు మూడు గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నల్లో ఫైనల్‌ వరకు చేరినా... ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయాడు. ప్రిక్వార్టర్స్‌లో జెస్పెర్‌ డి జాంగ్‌ (నెదర్లాండ్స్‌)తో జ్వెరెవ్‌ పోటీపడనున్నాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement