breaking news
January 6
-
కాల్ డ్రాప్‌లపై టెల్కోలకు జనవరి 6 దాకా ఊరట
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్‌కి పరిహారం విషయంలో టెల్కోలకు కొంత ఊరట లభించింది. తదుపరి విచారణ తేది జనవరి 6 దాకా ఈ అంశానికి సంబంధించి ఆపరేటర్లను ఒత్తిడి చేసే చర్యలు తీసుకోబోమని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అయితే, ఇందుకు సంబంధించిన నిబంధనలు మాత్రం ముందుగా నిర్ణయించినట్లు జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. నెట్వర్క్ సమస్యల వల్ల కాల్ డ్రాప్ అయిన పక్షంలో యూజర్లకు రూ. 1 పరిహారంగా చెల్లించాలన్న ట్రాయ్ నిబంధనలను సవాలు చేస్తూ టెల్కోలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వొడాఫోన్, ఎయిర్టెల్, ఆర్‌కామ్ తదితర 21 టెల్కోలు ఇందులో ఉన్నాయి. భౌతిక శాస్త్రం ప్రకారం నూటికి నూరుపాళ్లు కాల్ డ్రాప్ సమస్య ఉండని నెట్వర్క్ ఏర్పాటు అసాధ్యమని తెలిసీ ట్రాయ్ పరిహారం నిర్ణయం తీసుకుందని ఆపరేటర్ల తరఫు లాయర్ హరీశ్ సాల్వే పేర్కొన్నారు. అయితే, సంబంధిత వర్గాలన్నింటి అభిప్రాయాలు తీసుకున్న మేరకే అక్టోబర్ 16న నిబంధనలను ప్రకటించడం జరిగిందని, టెల్కోల స్థూల ఆదాయంలో పరిహార భారం కేవలం ఒక్క శాతం కన్నా తక్కువే ఉండొచ్చని జస్టిస్ రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్‌లతో కూడిన బెంచ్‌కి అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ తెలిపారు. వాదోపవాదాలు విన్న మీదట కేసు తదుపరి విచారణను బెంచ్ జనవరి 6 దాకా వాయిదా వేసింది. -
6న తుది జాబితా
చెన్నై, సాక్షి ప్రతినిధి :వచ్చే నెల జనవరి 6వ తేదీన ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేసి 25న కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తామని ఎలక్షన్ కమిషన్ డెప్యూటీ కమిషనర్ త్రిపాఠి పేర్కొన్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై భారత ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఆదేశాల మేరకు శుక్రవారం అత్యున్నతస్థాయి అధికారులు, అఖిలపక్ష సమావేశాన్ని చెన్నై లో నిర్వహించారు. ఎన్నికల నగారా మోగకముందే రాష్ట్రంలో ఓటర్ల జాబితా సిద్ధం చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం తాత్కాలిక ఓటర్ జాబితాను వెల్లడించారు. ఇంకా అనేక మార్పులు, చేర్పులు అవసరమయ్యాయి. కొత్తగా పేర్లను నమోదు చేసుకునేందుకు ఓటర్లు ముందుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అధికారులు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన ఓటర్ల తుదిజాబితా సిద్ధం చే సి 25న కొత్త ఓటర్లకు గుర్తింపుకార్డులు జారీచేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు కొలిక్కి వస్తున్న సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయ డెప్యూటీ కమిషనర్ త్రిపాఠి ఆధ్వర్యంలో శుక్రవారం చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో మనోజ్ పాండియన్ (అన్నాడీఎంకే), టీకేఎస్ ఇళంగోవన్ (డీఎంకే), ఏఎస్ శక్తివేల్ (కాంగ్రెస్), కేడీ రాఘవన్ (బీజేపీ), పార్థసారథి (డీఎండీకే), సేతురామన్ (సీపీఐ), ఎన్.గుణశేఖరన్ (సీపీఎం), రజనీకాంత్ (బీఎస్పీ) హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లతో సహాయ కమిషనర్ సుధీర్ త్రిపాఠి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి కలెక్టర్‌తోనూ వేర్వేరుగా చర్చలు జరిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్‌తో కలిసి నేరుగా సమీక్షలు నిర్వహించారు. ఓటర్ల జాబితా, వాటిలో మార్పులు, చేర్పులు, పోలింగ్ బూత్‌ల సంఖ్య, నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికలపై పార్టీ నేతల అభిప్రాయాల, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీల నేతలు ఇచ్చిన సలహాలు, సూచనలను నమోదు చేసుకున్నారు.