breaking news
jail break Punjab
-
మోస్ట్ వాంటెడ్ విక్కీ ఖతం
ఛండీగఢ్ : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ విక్కీ గౌండర్ ఎట్టకేలకు హతమైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి రాజస్థాన్ పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో విక్కీ ప్రధాన అనుచరుడు, నభా జైలుదాడి సూత్రధారి ప్రేమ లహోరియా కూడా మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే చిన్నతనం నుంచే నేరప్రవృత్తిని అలవర్చుకున్న విక్కీ.. తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా మారిన పరిణామం అంశం ఓసారి పరిశీలిస్తే... విక్కీ ఓ సంచలనం... విక్కీ గౌండర్ అలియాస్ జిందర్.. అసలు పేరు హర్జిందర్ భుల్లార్. విక్కీది స్వగ్రామం టర్ఫ్ లంబిలోని సరవాన్ బొద్లా. చిన్నతనంలో జేబు దొంగలకు సహయకుడిగా వ్యవహరించేవాడు. ఆ పై బ్లేడు దొంగగా మారి క్రమక్రమంగా గ్యాంగ్‌స్టర్ గా మారిపోయాడు. సుపారీలు తీసుకుని స్థానిక నేతలను హత్య చేయటం.. అక్రమ ఆయుధాల సరఫరా.. ఉగ్రవాదులకు సాయం... ఇలా మొత్తం 83 కేసులు అతని మీద ఉన్నాయి. పలువురు రాజకీయ నాయకుల అండతోనే అతను అలా చెలరేగిపోయేవాడని.. పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా అతనికి సహకరించేవారన్న ఆరోపణలు ఉండేవి. ఇక గౌండర్ ఫేస్ బుక్‌లో ఎప్పుడూ క్రియాశీలకంగా ఉంటాడు. పోలీసులు తనపై కేసులు నమోదు చేసినప్పుడల్లా వారికి చిక్కకుండా.. ఫేస్బుక్ ద్వారానే వాటిని ఖండిస్తుంటాడు. అయితే జైలుకెళ్లాక అక్కడి నుంచి కూడా అతను ఫేస్బుక్లో అప్డేట్లు చేయటం విమర్శలకు దారితీయగా.. ఇద్దరు అధికారులు సస్పెండ్‌కు గురయ్యారు కూడా. ఇక్కడ సంచలన విషయం ఏంటంటే.. నభా జైలుపై దాడి జరిగింది ఉగ్రవాదులను విడిపించేందుకు కాదు. విక్కీ కోసమే. అయితే దాడి గురించి ముందుగా తెలుసుకున్న ఉగ్రవాదులు.. విక్కీతో డీల్ కుదుర్చుకోవటంతో వారిని కూడా తప్పించారు. ఈ విషయాన్ని దాడి ప్రధాన సూత్రధారి పర్విందర్ సింగ్ పిందా విచారణలో వెల్లడించటంతో పోలీస్ శాఖ ఉలిక్కి పడింది. నభా జైలు దాడి... పటియాలాలోని నభా జైలుపై 2016 నవంబర్ చివరి వారంలో 10మంది సాయుధులు పోలీసు దుస్తుల్లో వచ్చి దాడి చేసి.. ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్, ఉగ్రవాది కశ్మీరా సింగ్ తోపాటు మరో నలుగురు గ్యాంగ్స్టర్లను విడిపించుకెళ్లారు. వారి పేర్లు విక్కీ గోండ్రా, గుర్ప్రీత్ సింగ్, నితిన్ డియోల్, విక్రమ్‌జీత్ సింగ్. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మింటూ... పాకిస్థాన్ ఐఎస్ఐ నుంచి థాయ్‌లాండ్‌లో శిక్షణ పొందిన హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూ పంజాబ్‌లో వేర్పాటువాద చిచ్చును రగిల్చేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని 2014 నవంబర్‌లో ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. నభా జైలు ఘటనలో అతను తప్పించుకోవటంతో అతన్ని పట్టుకునేందుకు పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆపై పది రోజుల్లోనే మింటూను ఢిల్లీ సరిహద్దులో అరెస్ట్ చేశారు. ఇక జైలు నుంచి నలుగురు గ్యాంగ్స్టర్లలో ఇద్దరిని గతేడాది అదుపులోకి తీసుకోగా.. విక్కీతోపాటు మరొకరు ఇంతకాలం పరారీలో ఉన్నారు. ఉగ్రవాది కశ్మీరా సింగ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎట్టకేలకు విక్కీ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. -
కఠిన చర్యలు తీసుకుంటాం: డిప్యూటీ సీఎం
అమృత్సర్: నభా జైలుపై సాయుధులు దాడి చేసి.. ఖలీస్థాన్ ఉగ్రవాది హర్మిందర్ సింగ్ మింటూను విడిపించుకొని వెళ్లిన ఘటనతో పంజాబ్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. మింటూతో పాటు మరో నలుగురు క్రిమినల్స్ సైతం జైలు నుంచి పారిపోయిన ఈ ఘటనను ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వీరిని పట్టుకునేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ, హరియాణాల్లో సైతం అధికారులు అప్రమత్తమయ్యారు. జైలుపై దాడి, నేరస్తుల పరారీ ఘటనపై ఏడీజీపీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాదల్ తెలిపారు. జైళ్ల శాఖ డీజీని సస్పెండ్ చేసినట్లు సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు. -
‘టెన్షన్.. హరియాణా.. ఢిల్లీలో అలర్ట్’
పంజాబ్: పంజాబ్‌లో ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూతోపాటు నలుగురు తప్పించుకున్న నేపథ్యంలో పంజాబ్ జైళ్ల శాఖ డీజీపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతరం పంజాబ్‌లో హై అలర్ట్ విధించారు. పోలీసులు అప్రమత్తమయ్యారు. జైలు నుంచి సుమారు 50 కిలో మీటర్ల దూరంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఖైదీల పరారీ నేపథ్యంలో ఢిల్లీ, హరియాణాలోనూ హై అలర్ట్ విధించారు. పంజాబ్‌లో ఆదివారం ఉదయం పోలీసు దుస్తుల్లో వచ్చిన సాయుధులు జైలుపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని నభా జైలుపై 10మంది సాయుధులు దాడి చేసి.. ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూతోపాటు మరో నలుగురిని విడిపించుకొని తీసుకెళ్లారు. మింటూతోపాటు పరారైన నలుగురు కూడా గ్యాంగ్‌స్టర్లే కావడం గమనార్హం.