మోస్ట్‌ వాంటెడ్‌ విక్కీ ఖతం

Nabha Jail Escapee Punjab Most Wanted Killed - Sakshi

ఛండీగఢ్‌ : మోస్ట్‌ వాంటెడ్‌​ గ్యాంగ్‌స్టర్‌ విక్కీ గౌండర్‌ ఎట్టకేలకు హతమైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి రాజస్థాన్‌ పోలీసులు అతన్ని ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఘటనలో విక్కీ ప్రధాన అనుచరుడు, నభా జైలుదాడి సూత్రధారి ప్రేమ లహోరియా కూడా మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే చిన్నతనం నుంచే నేరప్రవృత్తిని అలవర్చుకున్న విక్కీ.. తక్కువ సమయంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌గా మారిన పరిణామం అంశం ఓసారి పరిశీలిస్తే... 

విక్కీ‌ ఓ సంచలనం...  
విక్కీ గౌండర్‌ అలియాస్‌ జిందర్‌.. అసలు పేరు హర్జిందర్‌ భుల్లార్‌. విక్కీది స్వగ్రామం టర్ఫ్‌ లంబిలోని సరవాన్‌ బొద్లా. చిన్నతనంలో జేబు దొంగలకు సహయకుడిగా వ్యవహరించేవాడు. ఆ పై బ్లేడు దొంగగా మారి క్రమక్రమంగా గ్యాంగ్‌స్టర్‌ గా మారిపోయాడు. సుపారీలు తీసుకుని స్థానిక నేతలను హత్య చేయటం.. అక్రమ ఆయుధాల సరఫరా.. ఉగ్రవాదులకు సాయం... ఇలా మొత్తం 83 కేసులు అతని మీద ఉన్నాయి. పలువురు రాజకీయ నాయకుల అండతోనే అతను అలా చెలరేగిపోయేవాడని.. పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా అతనికి సహకరించేవారన్న ఆరోపణలు ఉండేవి.

ఇక గౌండర్‌ ఫేస్‌ బుక్‌లో ఎప్పుడూ క్రియాశీలకంగా ఉంటాడు.  పోలీసులు తనపై కేసులు నమోదు చేసినప్పుడల్లా వారికి చిక్కకుండా.. ఫేస్‌బుక్‌ ద్వారానే వాటిని ఖండిస్తుంటాడు. అయితే జైలుకెళ్లాక అక్కడి నుంచి కూడా అతను ఫేస్‌బుక్‌లో అప్‌డేట్లు చేయటం విమర్శలకు దారితీయగా.. ఇద్దరు అధికారులు సస్పెండ్‌కు గురయ్యారు కూడా. ఇక్కడ సంచలన విషయం ఏంటంటే.. నభా జైలుపై దాడి జరిగింది ఉగ్రవాదులను విడిపించేందుకు కాదు. విక్కీ కోసమే. 

అయితే దాడి గురించి ముందుగా తెలుసుకున్న ఉగ్రవాదులు.. విక్కీతో డీల్‌ కుదుర్చుకోవటంతో వారిని కూడా తప్పించారు. ఈ విషయాన్ని దాడి ప్రధాన సూత్రధారి పర్విందర్‌ సింగ్‌ పిందా విచారణలో వెల్లడించటంతో పోలీస్‌ శాఖ ఉలిక్కి పడింది. 

నభా జైలు దాడి... 
పటియాలాలోని నభా జైలుపై 2016 నవంబర్‌ చివరి వారంలో 10మంది సాయుధులు పోలీసు దుస్తుల్లో వచ్చి దాడి చేసి.. ఖలీస్థాన్‌ లిబరేషన్‌ ఫోర్స్‌ చీఫ్‌ హర్మిందర్‌ సింగ్‌, ఉగ్రవాది కశ్మీరా సింగ్ తోపాటు మరో నలుగురు గ్యాంగ్‌స్టర్లను విడిపించుకెళ్లారు. వారి పేర్లు విక్కీ గోండ్రా, గుర్‌ప్రీత్‌ సింగ్‌, నితిన్‌ డియోల్‌, విక్రమ్‌జీత్‌ సింగ్‌. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

మింటూ... పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ నుంచి థాయ్‌లాండ్‌లో శిక్షణ పొందిన హర్మిందర్‌ సింగ్‌ అలియాస్‌ మింటూ పంజాబ్‌లో వేర్పాటువాద చిచ్చును రగిల్చేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని 2014 నవంబర్‌లో ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. నభా జైలు ఘటనలో అతను తప్పించుకోవటంతో అతన్ని పట్టుకునేందుకు పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆపై పది రోజుల్లోనే మింటూను ఢిల్లీ సరిహద్దులో అరెస్ట్‌ చేశారు.

ఇక జైలు నుంచి నలుగురు గ్యాంగ్‌స్టర్లలో ఇద్దరిని గతేడాది అదుపులోకి తీసుకోగా.. విక్కీతోపాటు మరొకరు ఇంతకాలం పరారీలో ఉన్నారు. ఉగ్రవాది కశ్మీరా సింగ్‌ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎట్టకేలకు విక్కీ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top