breaking news
Iran team
-
ఒకవైపు యుద్ధం... మరోవైపు సాకర్ సమరం
అంటాల్యా (టర్కీ): ఒకవైపు దేశంలో యుద్ధంతో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని క్లిష్ట పరిస్థితులు నెలకొని ఉన్నా... ఇరాన్ జట్టు మాత్రం ‘ఫిఫా’ ప్రపంచకప్ బరిలోకి దిగి సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్‌కప్‌లో ఇరాన్ జట్టు గ్రూప్ ‘జి’ నుంచి పోటీ పడనుంది. ఈ నెల 16న తమ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనున్న ఇరాన్... ఆ తర్వాత 22న బెల్జియం, 27న ఈజిప్‌్టతో మ్యాచ్‌లు ఆడనుంది. ప్రస్తుతం మెగాటోర్నీ కోసం టర్కీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో ఇరాన్ ప్లేయర్లు ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులపై ప్లేయర్లు స్పందిస్తూ... ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచకప్ ఆడటం అంత సులువైన విషయం కాదని అన్నారు. 2018, 2022 ప్రపంచకప్‌లలో ఇరాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మిడ్‌ఫీల్డర్ సయీద్ ఎజటొలాహి మాట్లాడుతూ... ‘ఇది నాకు మూడో ప్రపంచకప్. అంతర్జాతీయ స్థాయిలో చాలా మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్నప్పటికీ ఇది చాలా కష్టంగా ఉంది.ఒకవైపు ప్రాక్టీస్‌పై దృష్టి పెడుతూనే... మరోవైపు దేశ పరిస్థితులు తెలుసుకుంటున్నాం. అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. సహజంగానే ఇలాంటి అంశాలు ప్లేయర్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి’ అని అన్నాడు. వరల్డ్‌కప్‌లో ఇరాన్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందనే అంశాన్ని పక్కన పెడితే... వారు ఇక్కడి వరకు రావడానికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారనేది వాస్తవం. గత రెండు వారాలుగు పలువురు ఇరాన్ ప్లేయర్లు టర్కీలోని అంటల్యాలో సాధన చేయగా... మరికొందరు వీసా దరఖాస్తుల పనిలో నిమగ్నమయ్యారు. ఇరాన్ జట్టు ప్రపంచకప్ సన్నాహాలకు సంబంధించి మీడియా ప్రవేశంపై కూడా పరిమితులు విధించారు. దీంతో వారికి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయింది. అంకారాలోని మెక్సికన్ రాయబార కార్యాలయం నుంచి వీసాలు లభించిన అనంతరం... ఇరాన్ జట్టు ఈ వారాంతంలో మెక్సికోకు బయలుదేరనుంది. ప్లేయర్లందరికీ ప్రవేశ అనుమతులు లభించినట్లు ఇరాన్ జట్టు గురువారం వెల్లడించింది. వీసా సమస్యల కారణంగా ఇరాన్ వరల్డ్‌కప్ శిక్షణ శిబిరాన్ని అరిజోనాలోని టక్సన్ నుంచి కాలిఫోర్నియా మెక్సికో సరిహద్దులో ఉన్న టిజువానాకు మార్చారు. ఇరాన్ తొలి రెండు మ్యాచ్‌లను లాస్ ఏంజెలిస్‌లో ఆడనుంది. ఆ ప్రాంతంలో ఇరానీయుల జనాభా అధికం. ‘మా ఆట చూసేందుకు పెద్ద ఎత్తను మా దేశ ప్రజలు వస్తారని ఆశిస్తున్నాం. ఇలాంటి తరుణంలో మాపై విపరీతమైన అంచనాలు ఉంటాయి. వాటిని అందుకునేందుకు మా శాయశక్తులు కృషి చేస్తాం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవడానికైనా మేం సిద్ధంగా ఉన్నామని నిరూపిస్తాం’ అని ఇరాన్ ప్లేయర్ మహమ్మద్ గుర్బానీ తెలిపాడు. ‘పరిస్థితులు అనుకూలంగా లేవు అని అందరికీ తెలుసు. అయినా ఓ ఆటగాడిగా ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నమెంట్లలో సత్తాచాటడం ముఖ్యం అందుకే సాధనపై దృష్టి పెట్టా. మా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్లకు మా ఆటతో, మా ప్రదర్శనతో మద్దతుగా నిలవాలని అనుకుంటున్నాం. వారి మొఖాలపై చిరునవ్వులు చూడాలి’ అని మరో ప్లేయర్ పేర్కొన్నాడు. ‘దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్పది ఏముంటుంది. ప్రస్తుతం మా కర్తవ్యం అదే. మెగాటోర్నీలో మంచి ప్రదర్శన చేసి ప్రజలకు ఆనందాన్ని పంచుతాం’ అని ప్లేయర్లంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. -
ఇరాన్ చేతిలో భారత్ ఓటమి
బెంగళూరు : ఫుట్‌బాల్ ప్రపంచకప్-2018 క్వాలిఫయింగ్ పోటీల్లో భారత్‌కు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. ఇరాన్ జట్టుతో మంగళవారం స్థానిక కంఠీరవ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో భారత్ 0-3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. అంతర్జాతీయస్థాయిలో తగినంత అనుభవం లేకపోవడం, ఆటతీరు పరంగా ప్రత్యర్థికంటే మెరుగ్గా లేకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. రక్షణ పంక్తిలో ఆర్నబ్ మోండల్, సందేశ్‌లు రాణించడంతో తొలి అర్ధభాగంలో భారత్ ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకుంది. అయితే రెండో అర్ధభాగంలో ఇరాన్ నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించింది. 29వ నిమిషంలో సర్దార్ అజ్మౌన్ గోల్‌తో ఖాతా తెరిచిన ఇరాన్‌కు అంద్రానిక్ (47వ నిమిషంలో), మెహదీ తరోమి (51వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఇంతకుముందు ఒమన్, గ్వామ్ జట్ల చేతిలో భారత్ ఓడింది.


