breaking news
Internet access service
-
ఇంటింటా ఇంటర్నెట్!
ఇంటర్నెట్... పేరు చెబితేనే ఐటీ ఉద్యోగులు, కంప్యూటర్లు కళ్లముందు కదులుతాయి. కానీ ఇది ఒకప్పటి పరిస్థితి మాత్రమే. ఈకాలంలో కూలికెళ్లే వ్యక్తి కూడా ఎంచక్కా తన స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం పొందుతున్నాడు. వినోదంతోపాటు, ఉపాధి అవకాశాలనూ మెరుగుపరుచుకుంటున్నాడు. భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం పదేళ్లలోనే దాదాపు మూడు రెట్లు ఎక్కువైందంటేనే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం మొత్తమ్మీద ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న దేశాల్లో భారత్ రెండోస్థానానికి చేరింది. దేశ జనాభా 147 కోట్ల పైచిలుకైతే తాజా లెక్కల ప్రకారం దేశంలో క్రియాశీలంగా ఉన్న మొబైల్‌ఫోన్ కనెక్షన్లు ఏకంగా వందకోట్ల ఆరు లక్షలు. ఇందులో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య మూడు నుంచి ఆరు లక్షల వరకూ తక్కువ ఉండవచ్చు. అంతే. పదేళ్ల క్రితం అంటే 2015లో ఈ సంఖ్య 35 కోట్లు మించకపోవడం గమనార్హం. అలాగని ఈ టెక్నాలజీ కేవలం నగరాలకే పరిమితం కాలేదు. తాజా గణాంకాల ప్రకారం పల్లె ప్రాంతాల్లో నెట్ వినియోగదారుల సంఖ్య సుమారు 48 కోట్లు ఉంటే పట్టణ/నగర ప్రాంతాల్లో 40 కోట్ల మంది మాత్రమే నెట్ వాడుతున్నారు. గంటన్నర కాలం... దేశంలో రోజుకు కనీసం 90 నిమిషాల సమయం ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో సగటు నెట్ వినియోగం కేవలం నాలుగు శాతం మాత్రమే ఉండటం గమనార్హం. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కాంతార్ అనే మార్కెటింగ్ సంస్థలు గత ఏడాది సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని తెలియజేస్తోంది. మహారాష్ట్ర, కేరళ, గోవా రాష్ట్రాల్లో ఇంటర్నెట్ డెబ్భై శాతం కంటే ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటే యూపీ, బిహార్, జార్ఖండ్‌లలో 43– 50 శాతం ప్రాంతాల్లో మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా... ఏం చేస్తున్నారు...? ఇంటర్నెట్ వినియోగదారుల్లో అత్యధిక శాతం వినోదం కోసమే ఉపయోగిస్తున్నారు. ఓటీటీల కోసం నెట్ వాడుతున్న వారు సుమారు 83 శాతం. అలాగే వాట్సప్ వంటి కమ్యూనికేషన్ అప్లికేషన్లు (75 శాతం), ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్ వంటి సోషల్ మీడియా కోసం (74 శాతం) నెట్ వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ చదువులు తరువాతి స్థానాల్లో నిలిచాయి. పీఎంజీదిశ వంటి డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాల పుణ్యమా అని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోంది. ఇంటర్నెట్ ఉన్న కారణంగా స్విగ్గీ, జొమాటో, రాపిడో, ఊబర్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా లక్షలాది మంది గిగ్ వర్కర్లకు ఉపాధి లభిస్తోంది. వాట్సప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటివి ప్రాథమికంగా వినోదం కోసం ఉద్దేశించినవే అయినప్పటికీ వీటి ద్వారా సామాజిక సంబంధాలు నెరుపుతూండటం గమనార్హం. సాధ్యమైంది ఇలా... పదేళ్లలో నెట్ వినియోగం మూడు రెట్ల పెరగడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. చౌక స్మార్ట్ఫోన్లు, దేశం మారుమూల ప్రాంతాలకూ మొబైల్‌ఫోన్ సేవలు విస్తరించడం వంటివి నెట్ వినియోగం ఈ స్థాయిలో పెరిగేందుకు కారణాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ స్పష్టం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత చౌక మొబైల్ డేటా ప్లాన్లు అందుబాటులో ఉండటమూ నెట్ విస్తృతికి తోడైంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన భారత్‌నెట్ కార్యక్రమం తన వంతు పాత్ర పోషించింది. ఆధార్, యూపీఐ వంటి సేవల లభ్యతతో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్, ఈ– కామర్స్ ఊపందుకున్నట్లు అర్థమవుతోంది. అంతరాలు తగ్గాలిదేశంలో వందకోట్లకుపైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నప్పటికీ కొన్ని వ్యవస్థీకృత సవాళ్లు మిగిలే ఉన్నాయి. ఇంటర్నెట్ అందుబాటు విషయంలో నగర ప్రాంతాలు ముందున్నాయి. చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఓ మోస్తరు వేగంతో పనిచేసే బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులో లేదు. మహిళల నెట్ వినియోగం పురుషులతో పోలిస్తే చాలా తక్కువ. మొబైల్ డేటా చౌకగా దొరుకుతున్నప్పటికీ ఇప్పటికీ స్మార్ట్ఫోన్లు దిగువ తరగతి కుటుంబాలకు ఖరీదైనవే. డిజిటల్ టెక్నాలజీల సామర్థ్యం గ్రామీణ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో చేరడం లేదు. తగిన అవగాహన లేకపోవడం వల్ల కొన్ని చోట్ల సైబర్ ఫ్రాడ్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వర్క్ ఫ్రమ్ హోం ఇంకాస్త కొత్తగా..
సాక్షి, అమరావతి: వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్ట్ (ఇంటి నుంచే పనిచేసే విధానం) బలోపేతం దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా గ్రామాలకు మంచి సామర్ధ్యం కలిగిన ఇంటర్నెట్ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసి హై స్పీడ్ క్వాలిటీ ఇంటర్నెట్ సౌకర్యంతో కంప్యూటర్లను సమకూర్చాలని స్పష్టం చేశారు. దీనివల్ల అక్కడి నుంచే పని చేసుకునే సదుపాయంతో పాటు విద్యార్థులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. మొదటి విడతలో 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణాన్ని చేపట్టి ఆగస్టు 15న భవనాల నిర్మాణ పనులు ప్రారంభించాలని, ఆలోగా స్థలాలను గుర్తించి స్వాధీనం చేయాలని ఆదేశించారు. ఐటీ, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలపై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులకు మేలు జరిగేలా... ప్రాథమిక, మాథ్యమిక విద్యతోపాటు డిగ్రీ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. డిజిటల్ లైబ్రరీల్లో కామన్ ఎంట్రన్స్ టెస్టులతోపాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు నిరంతర ఇంటర్నెట్ సదుపాయం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మార్చి నాటికి డిజిటల్ లైబ్రరీలు ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని, దీనివల్ల అక్కడ నుంచే పని చేసుకునే సదుపాయం కలుగుతుందని సీఎం పేర్కొన్నారు. వచ్చే మార్చి నాటికి డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. హై క్వాలిటీ ఇంటర్నెట్.. డిజిటల్ లైబ్రరీల భవనాల్లో కనీస సదుపాయాలతో పాటు మూడు డెస్క్‌టాప్‌లు, యూపీఎస్, డెస్క్‌టాప్ బార్కోడ్ ప్రింటర్, స్కానర్, లేజర్ ప్రింటర్, సాఫ్ట్వేర్, యాంటీ వైరస్ సాఫ్ట్వేర్, హై క్వాలిటీతో అన్ లిమిలెడ్ బ్యాండ్‌విడ్త్ ఇంటర్నెట్, స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్ల నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులో తేవాలని సీఎం జగన్ ఆదేశించారు. మౌలిక సదుపాయాల్లో భాగంగా 3 డెస్క్‌టాప్ టేబుళ్లు, సిస్టం చెయిర్స్, విజిటర్ చెయిర్స్, ట్యూబులైట్స్, ఫ్యాన్లు, ఐరన్ ర్యాక్స్, వార్తా పత్రికలు, మేగజైన్స్ డిజిటల్ లైబ్రరీల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. తొలి విడతలో 4,530 డిజిటల్ లైబ్రరీల్లో కనీస సదుపాయాలు, కంప్యూటర్ ఉపకరణాల కోసం దాదాపు రూ.140 కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు చేయనుంది. హాజరైన మంత్రి మేకపాటి, ఉన్నతాధికారులు.. సమీక్షలో పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఎం.మధుసూదన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ ఎం.నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల్లో సదుపాయాలిలా.. ► మూడు డెస్క్‌టాప్‌లు ► యూపీఎస్ ► డెస్క్‌టాప్ బార్కోడ్ ప్రింటర్ ► స్కానర్ ► లేజర్ ప్రింటర్ ► సాఫ్ట్వేర్ ► యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ► హై క్వాలిటీతో అన్ లిమిలెడ్ బ్యాండ్‌విడ్త్ ఇంటర్నెట్ ► స్టోరేజీ కోసం డేటా సెంటర్లు ► టేబుళ్లు, కుర్చీలు తదితరాలతో మౌలిక వసతులు


