వివాహిత అనుమానాస్పద మృతి
చీమకుర్తి, న్యూస్‌లైన్ : రెండేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన చీమకుర్తి అంబేద్కర్‌నగర్‌లో బుధవారం రాత్రి జరిగింది. ఎసై్స, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక అంబేద్కర్‌నగర్‌కు చెందిన చావబత్తిన బ్రహ్మయ్య కుమార్తె చావబత్తిన సౌజన్య (25) రెండేళ్ల క్రితం చీమకుర్తికి చెందిన వరకాల ఆంజనేయులు అలియాస్ అనిల్‌ను ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. ప్రస్తుతం వారికి 8 నెలల కుమార్తె ఉంది. బుధవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ఆంజనేయులు రాత్రి 11 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చాడు.
ఆ సమయంలో ఇంటి పైకప్పుగా వేసిన రేకుల కింద ఉన్న ఇనుప రాడ్డుకు చున్నీతో ఉరివేసుకుని ఉన్న సౌజన్యను చూసి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. వెంటనే పక్కింటి వారికి చెప్పి వారి సాయంతో సౌజన్యను కిందకు దించాడు. ఆమెకు వెక్కిళ్లువస్తూ కొన ఊపిరితో ఉండటంతో హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అక్కడ చికిత్స చేస్తుండగా సౌజన్య మృతిచెందింది.
సౌజన్యను వివాహం చేసుకోవడం ఆంజనేయులు తల్లికి ఇష్టం లేదని, అందువల్ల తరచూ ఆమెను హింసిస్తుంటుందని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక ఎసై్స ఫిరోజ్ గురువారం అంబేద్కర్‌నగర్ చేరుకుని సౌజన్య మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె తల్లిదండ్రులు, స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సౌజన్య తండ్రి బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై్స తెలిపారు.