breaking news
Institutional lease
-
రియల్టీలోకి 14 శాతం పెరిగిన పెట్టుబడులు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్లో ఇనిస్టిట్యూషన్స్ పెట్టుబడులు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 14 శాతం పెరిగి 2.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కార్యాలయం, రిటైల్ విభాగాలు ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ వివరాలను కొలియర్స్ ఇండియా తాజా నివేదికలో పేర్కొంది. ► ఆఫీస్ స్పేస్ విభాగం 1,277 మిలిలియన్ డాలర్లను 2022 జనవరి–జూన్ మధ్య ఆకర్షించాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన పెట్టుబడులు 1,068 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► రిటైల్ రియల్ ఎస్టేట్ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు 492 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన 77 మిలియన్ డాలర్లతో పోలిస్తే ఆరు రెట్లకు పైగా వృద్ధి కనిపిస్తోంది. ► డేటా కేంద్రాలు తదితర ప్రత్యామ్నాయ ప్రాపర్టీల విభాగంలోకి ఇనిస్టిట్యూషన్స్ పెట్టుబడులు 53 శాతం పెరిగి 370 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ విభాగంలోకి 241 మిలియన్ డాలర్లు వచ్చాయి. ► మిశ్రమ వినియోగ ప్రాపర్టీల విభాగంలోకి 230 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో అసలు ఏ మాత్రం పెట్టుబడులు రాలేదు. ► ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ అసెట్స్ విభాగంలో మాత్రం ఇనిస్టిట్యూషన్స్ నుంచి పెట్టుబడులు 77 శాతం తగ్గి 180 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► నివాస ప్రాపర్టీల విభాగంలోకి సైతం 45 శాతం తగ్గి 86 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► దేశీ ఇన్వెస్టర్ల వాటా క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఉన్న 13 శాతం నుంచి ఈ ఏడాది జూన్ నాటికి 38 శాతానికి పెరిగింది. ► అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్ 35 శాతం పెట్టుబడులను ఇనిస్టిట్యూషన్స్ నుంచి ఆకర్షించింది. ముంబై 11 శాతం, చెన్నై 10 శాతం సంపాదించాయి. -
కథ మారింది..!
దుర్గగుడి భూములకు అద్దె పెంచేందుకు సిద్ధార్థ యాజమాన్యం అంగీకారం లీజు పొడిగించేందుకు ప్రభుత్వం సుముఖం త్వరలోనే సమస్య పరిష్కారం.. విజయవాడ : సిద్ధార్థ అకాడమీ ఆధీనంలో ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం భూముల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండటంతో ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు అకాడమీ యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం కూడా ఇటు దేవస్థానానికి, అటు సిద్ధార్థ యాజమాన్యానికి ఇబ్బంది లేని విధంగా సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నట్లు సమాచారం. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి చెందిన 8.22 ఎకరాల స్థలంలో సిద్ధార్థ మహిళా కళాశాల, 5.98 ఎకరాల స్థలంలో సిద్ధార్థ అర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కొంత భాగం ఉన్నాయి. ఈ రెండు స్థలాలను సిద్ధార్థ సంస్థలకు 50 ఏళ్లు లీజుకు ఇచ్చిన ఉత్తర్వులను 2006లో అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. అయినప్పటికీ ఆ స్థలాలను ఖాళీ చేయకపోవడంతో దేవస్థానం అధికారులు ఎండోమెంట్ డెప్యూటీ కమిషనర్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ దేవస్థానానికి అనుకూలంగా తీర్పు రావడంతో సిద్ధార్థ విద్యాసంస్థల యాజమాన్యం హైకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా వారికి చుక్కెదురు కావడంతో 2013 ఆగస్టులో సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు ‘యథాతథ స్థితి’ని కొనసాగించాలని ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పిటీషన్ దాఖలు చేయగా, ప్రభుత్వం తన వాదనలను వినిపిస్తూ పిటీషన్ దాఖలు చేయాల్సి ఉంది. కేసుల పరిష్కారం కోసం కమిటీ సిద్ధార్థ సంస్థల ఆధీనంలో ఉన్న భూములకు చెల్లిస్తున్న అద్దెలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఇక్కడ ఉన్న అద్దెలకు, సిద్ధార్థ యాజ మాన్యం చెల్లిస్తున్న మొత్తానికి చాలా వ్యత్యాసం ఉంది. సిద్ధార్థ యాజమాన్యం స్థలాన్ని అద్దెకు తీసుకునే సమయంలో ఏడాదికి ఎకరాకు రూ.5వేలు చొప్పున చెల్లిస్తామని, ఆ తర్వాత ప్రతి ఏడాది రూ.500 చొప్పున పెంచేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే, లీజును రద్దు చేయడం, కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండటంతో అద్దె వసూలు చేయడం లేదని దేవస్థాన అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సిద్ధార్థ యాజమాన్యం భూముల అద్దెలను పెంచేందుకు ముందుకువచ్చినట్లు తెలిసింది. దీంతో అద్దెలను పెంచి తిరిగి ఆ విద్యాసంస్థల లీజును కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు ‘సాక్షి’కి తెలిపారు. ఇటీవల ఆయన నగరానికి వచ్చినప్పుడు ఆక్రమణల చెరలో ఉన్న దేవాలయాల భూముల గురించి ప్రస్తావించగా.. న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్న భూముల సమస్యలను పరిష్కరించేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు, లీగల్ సెక్రటరీలతో కమిటీలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ కమిటీ దేవాలయాల ఆస్తుల కేసులను త్వరగా పరిష్కరించి స్వాధీనం చేసుకునేలా సూచనలు చేస్తుందని తెలిపారు. సిద్ధార్థ అకాడమీ ఆధీనంలో ఉన్న భూముల విషయంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అద్దె పెంచాలని భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే, ఎంత శాతం పెంచాలనే విషయంపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీనిపై కూడా ఒక కమిటీ వేస్తామని, ప్రస్తుతం అక్కడ ఉన్న భూముల అద్దెలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు.