breaking news
inquiries
-
‘విద్యుత్’కమిషన్ దూకుడు!
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపేలా రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన 9 వేర్వేరు పిటిషన్లపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సోమవారం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు బహిరంగ విచారణలు నిర్వహించనుంది. మండలి చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్యల ఐదేళ్ల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుండగా, ఈలోపే ఆయా పిటిషన్లపై ఈఆర్సీ కీలక నిర్ణయాలను తీసుకోనుంది. నిర్దేశిత గడువుకి చాలా ఆలస్యంగా విద్యుత్ సంస్థలు పిటిషన్లు చేయడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. నిబంధనల ప్రకారం గతేడాది నవంబర్‌లోపే విద్యుత్ సంస్థలు పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉండగా, గత నెలలో దాఖలు చేశాయి.ఒకేసారి పెద్ద సంఖ్యలో దాఖలైన పిటిషన్లను చదివి రాతపూర్వకంగా అభ్యంతరాలను సమర్పించడానికి సమయం సరిపోదని, గడువు పొడిగించాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ)తో పాటు విద్యుత్ రంగ నిపుణులు ఎం.వేణుగోపాల్ రావు తదితరులు చేసిన విజ్ఞప్తులను ఈఆర్సీ తోసిపుచ్చింది. సోమవారం నుంచి ఈ నెల 25 వరకు వరుసగా ఐదు రోజుల పాటు హైదరాబాద్, నిజామాబాద్, సిరిసిల్లలో బహిరంగ విచారణలు నిర్వహించనుంది. ఆ తర్వాత 4 రోజుల పదవీకాలం మిగిలి ఉండగా కీలక ఉత్తర్వులు జారీ చేయనుంది. అయితే గడువులోగానే విద్యుత్ రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాలు, సాధారణ వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున రాతపూర్వక అభ్యంతరాలు ఈఆర్సీకి అందాయి. కాగా ఈఆర్సీ తీసుకోనున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి.. జెన్కో ట్రూఅప్ చార్జీల భారం రూ.963 కోట్లు తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.963.18 కోట్ల ట్రూఅప్ చార్జీల పిటిషన్‌తో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన మల్టీ ఇయర్ టారిఫ్ (ఎంవైటీ) పిటిషన్‌ను గత నెల 21న దాఖలు చేసింది. వీటిపై సోమవారం ఈఆర్సీ బహిరంగ విచారణ జరపనుంది. జీటీఎస్ కాలనీలోని విద్యుత్ నియంత్రణ్ భవన్లో ఉదయం 10.30 గంటలకు ఇది ప్రారంభం కానుంది. ఈఆర్సీ ఆమోదించిన విద్యుత్ ధరలు/చార్జీలతో పోల్చితే వాస్తవ ఆదాయంలో వ్యత్యాసాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో విద్యుత్ సంస్థలు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.ఒక వేళ ఆదాయ లోటు ఉంటే భర్తీ చేసుకోవడానికి ఎంత మేరకు ట్రూఅప్ చార్జీలను వసూలు చేయాలో ఈఆర్సీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. జెన్కో విద్యుత్ కేంద్రాల నుంచి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ కొనుగోలు చేసి తమ వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెన్కో ప్రతిపాదించిన రూ.963.18 కోట్ల ట్రూఅప్ చార్జీలను డిస్కంల నుంచి వసూలు చేసుకోవడానికి జెన్కో అనుమతి కోరింది. విద్యుత్ చార్జీలను పెంచడం ద్వారా ఈ ట్రూప్ చార్జీల భారాన్ని డిస్కంలు విద్యుత్ వినియోగదారులపై మోపుతాయి. ఐదేళ్లలో రూ.16,346 కోట్ల ఆదాయ అవసరాలు తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) దాఖలు చేసిన 2024–29 మధ్యకాలానికి సంబంధించిన రెండు ఎంవైటీ పిటిషన్లపై మంగళవారం ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.16,346.1 కోట్ల ఆదాయ అవసరాలున్నట్టు ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఇక సిరిసిల్ల జిల్లాకు విద్యుత్ సరఫరా చేసే కోఆపరేటివ్ ఎలక్రి్టక్ సప్లై లిమిటెడ్ (సెస్) పరిధిలో రూ.5 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు ప్రతిపాదిస్తూ దాఖలు చేసిన ఏఆర్ఆర్ 2024–25, 2024–29 ఎంవైటీ పటిషన్‌పై ఈ నెల 25న సిరిసిల్లలో విచారణ జరగనుంది. నవంబర్ 1 నుంచి పెరగనున్న చార్జీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రాష్ట్రంలో రూ.1,200 కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎనీ్పడీసీఎల్) దాఖలు చేసిన రెండు వేర్వేరు ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్) పిటిషన్లతో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన మరో రెండు ఎంవైటీ పిటిషన్లపై బుధవారం హైదరాబాద్‌లో, గురువారం నిజామాబాద్‌లో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. రాష్ట్రంలో హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీ విద్యుత్ చార్జీల పెంపు, లోటెన్షన్ (ఎల్టీ) కేటగిరీలో కూడా నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించే వారికి ఫిక్స్డ్ చార్జీ (డిమాండ్ చార్జీ)ల పెంపును డిస్కంలు ప్రతిపాదించాయి. హెచ్‌టీ కేటగిరీకి చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్డ్ చార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి రూ.800 కోట్లు భారం పడనుంది. మరో రూ.400 కోట్లను ఎల్టీ వినియోగదారుల నుంచి ఫిక్స్డ్ చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని డిస్కంలు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. నవంబర్ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
బంగారం కొంటాం.. రూ.2 వేల నోట్లు తీసుకుంటారా?
రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన వెంటనే జువెలరీ షాపులకు ఎంక్వైరీలు వెల్లువెత్తాయి. బంగారం కొనుగోలుకు రూ.2 వేల నోట్లు స్వీకరిస్తారా అని కస్టమర్లు దేశవ్యాప్తంగా పలు జువెలరీ దుకాణాల్లో ఆరా తీస్తున్నారు. అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు అయితే 2016లో నోట్ల రద్దు సమయంలో కనిపించిన ఉధృత పరిస్థితి ఇప్పుడు లేదని జువెలర్స్ బాడీ జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) తెలిపింది. వాస్తవానికి రూ.2 వేల నోట్ల మార్పిడి, కఠిన కేవైసీ నిబంధనల నేపథ్యంలో గత రెండు రోజులుగా బంగారం కొనుగోళ్లు మందగించాయి. 10 శాతం వరకు అధిక ధర! రూ.2 వేల నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో కొంతమంది బంగారు వ్యాపారులు కస్టమర్ల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. బంగారం కొనుగోలు కోసం రూ.2 వేలు నోట్లు ఇచ్చే కస్టమర్ల నుంచి 5 నుంచి 10 శాతం అదనంగా తీసుకున్నట్లు తెలిసింది. 10 గ్రాముల గ్రాముల బంగారాన్ని రూ. 66,000 వరకు అమ్మినట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో బంగారం ధర తులం రూ.60,200 మేర ఉంది. కాగా రూ. 2 లక్షల లోపు బంగారం, వెండి ఆభరణాలు, రత్నాల కొనుగోలు కోసం పాన్, ఆధార్ వంటి డాక్యుమెంట్లను కస్టమర్లు సమర్పిచాల్సిన అవసరం లేదు. ‘రూ. 2,000 నోట్లతో బంగారం లేదా వెండిని కొనుగోలు చేసేందుకు కస్టమర్ల నుంచి జువెలరీ షాపులకు అధిక సంఖ్యలో ఎంక్వైరీలు వచ్చాయి. అయితే కఠినమైన కేవైసీ నిబంధనల కారణంగా వాస్తవ కొనుగోళ్లు తక్కువగా ఉన్నాయి’ అని జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయమ్ మెహ్రా పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు మే 19న ప్రకటించింది. ఆ నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి, బ్యాంకుల్లో మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. మరోవైపు రూ.2000 నోట్ల చలామణిని తక్షణమే నిలిపివేయాలని బ్యాంకులను కోరింది. ఇదీ చదవండి: RS 2000 Note: ముగిసిన రూ.2 వేల నోటు శకం.. ఆరేళ్ల ప్రస్థానం.. -
ఎంపీ అర్వింద్‌కు లోక్‌సభ స్పీకర్ ఫోన్
సుభాష్‌నగర్ (నిజామాబాద్): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఆర్మూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఇటీవల దాడి చేసిన ఘటనపై లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా శుక్రవారం నేరుగా ఫోన్ చేసి ఆయనను ఆరా తీశారు. దాడి ఎలా జరిగింది? నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వ్యవహరించిన తీరు గురించి అర్వింద్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తనపై పోలీసుల సహకారంతో హత్యాయత్నానికి పాల్పడిందని ఎంపీ వివరించగా..వెంటనే ఢిల్లీకి రావాలని స్పీకర్ సూచించారు. దాడి ఘటనను బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. దాడి ఘటనపై రెండ్రోజుల్లో ఢిల్లీకి వెళ్లి స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు అర్వింద్ తెలిపారు. -
ముగ్గురు వీఆర్వోల సస్పెన్షన్
నందిపేట : పంట నష్ట పోయిన రైతుల జాబితాలో అనర్హులకు చోటు కల్పించిన కుద్వాన్పూర్ వీఆర్వో భూమన్న, వీఆర్ఏ లక్ష్మణ్, వెల్మల్ వీఆర్వో రవిలతో పాటు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బాద్గుణ వీఆర్వో పద్మను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిపై ఆరోపణలు రావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు సదరు వీఆర్వోలు అక్రమాలకు పాల్పడినట్లు నివేదిక అందజేశారని, వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు తహసీల్దార్ ఉమాకాంత్ తెలిపారు.