Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Jana Sena May Get Important Portfolios In Chandrababu Cabinet
కొనసాగుతున్న లీక్స్‌.. ఏపీలో ఎవరికి ఏ శాఖ అంటే..?

విజయవాడ, సాక్షి: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు కోసం కసరత్తులు ముగిశాయా? లేదంటే ఇంకా చర్చించాల్సి ఉందా? అసలు కూటమి పార్టీలు ఏ శాఖల కోసం పట్టుబట్టాయి? కీలక శాఖలను టీడీపీనే దక్కించుకోబోతోందా? త్యాగాల జనసేన శాఖల విషయంలో పంతం నెగ్గించుకుంటుందా? ఫలానా వాళ్లకు ఫలానా మంత్రిత్వ శాఖ అని లీకులు ఇస్తోంది ఎవరు?.. ఏపీలో కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారనేదానిపై ఈ సాయంత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సచివాలయంలో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించాక.. ఈ ప్రకటన ఉండనున్నట్లు అధికారిక సమాచారం. మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారని చెబుతున్నప్పటికీ.. మరోసారి పునఃసమీక్షిస్తారా? అనే చర్చా మొదలైంది.గురువారం ఆయన తిరుపతి, ఎన్టీఆర్‌ జిల్లాల పర్యటనలు ముగించుకున్నాక అమరావతికి తిరిగి రానున్నారు. సాయంత్రం సచివాలయం వెళ్లి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల ఫైల్స్‌పైనా సంతకాలు చేస్తారని ఇప్పటికే సమాచారం అందింది. అయితే.. ఆ తర్వాతే ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారట. ఈ క్రమంలో గత రెండు రోజులుగా శాఖల కేటాయింపులపై లీకులు అందుతున్నాయి. ఇటు టీడీపీ శ్రేణులు.. అటు జనసేన.. ఇంకోవైపు ఎల్లో మీడియా సంస్థలు.. మంత్రిత్వ శాఖలపై గత రెండురోజులుగా వరుసబెట్టి కథనాలు ఇస్తున్నాయి. అందులో మొదటిది పవన్‌ కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రి అవుతారని. అయితే నిన్న మంత్రిగానే పవన్‌ కల్యాణ్‌ ప్రమాణం చేసినప్పటికీ.. అధికారికంగా డిప్యూటీ సీఎం అని ఎక్కడా ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఆయన సోదరుడు చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా ఉప ముఖ్యమంత్రి అనే లీక్‌ ఇచ్చేశారు. ఇక.. జనసేనకు మూడూ కీలక శాఖలే ఉంటాయని టీడీపీ అనుకూల ప్రధాన మీడియా కథనం ఇచ్చింది. అందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు పేర్కొంది. అయితే.. పవన్‌ హోం శాఖ కోసం కూడా పట్టుబడుతున్నారంటూ జనసేన శ్రేణులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. మరోవైపు నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు లీకులు అందుతున్నాయి. ఇక టీడీపీ శ్రేణులేమో.. ఐటీ శాఖ మరోసారి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ బాబుకే వెళ్లొచ్చని చెబుతున్నాయి. గతంలో.. 2014 టైంలో ఎమ్మెల్సీగా నారా లోకేష్‌ ఈ శాఖను చేపట్టారు. అయితే టీడీపీలోనే మరో వర్గం లోకేష్‌కు ఈసారి ఇంకా ప్రాధాన్యం ఎక్కువ ఉన్న మంత్రిత్వ శాఖ దక్కుతుందని చెప్పుకుంటోంది. సీఎం చంద్రబాబు బాధ్యతను స్వీకరించిన తర్వాత రాత్రికి అధికారిక ప్రకటన. ఇలా ఏ వర్గానికి ఆ వర్గం ఫలానా మంత్రిత్వ శాఖ దక్కుతుందనే ప్రచారంలో ఉంటే.. మరో మిత్రపక్షం బీజేపీ మాత్రం ఒక్క మంత్రి పదవి పోస్ట్‌ మీద ఎలాంటి వ్యాఖ్యా చేయకపోవడం గమనార్హం.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. చిత్రంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి,  మిథున్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, రఘునాథరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబూరావు, గురుమూర్తి, తనూజరాణి
యథేచ్ఛగా హింసాకాండ.. ఇదేమి రాజ్యం?: వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజు లుగా అరాచక శక్తులు సాగిస్తున్న హింసాకాండను చూస్తుంటే టీడీపీ కార్యకర్తలా? గూండాలా? అన్న ప్రశ్న తలెత్తుతోందని వైఎస్సార్‌ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేయడంతోపాటు ఇళ్లు, ఆస్తుల విధ్వంసాలకు పాల్ప డటం ఆటవిక చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఇలాంటి దారుణాలు జరిగాయంటే రాబోయే ఐదేళ్లు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చన్నారు. టీడీపీ గూండాల దాడులపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, ఎన్‌హెచ్‌ఆర్సీ కార్యాలయాల్లో బుధవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందచేసిన అనంతరం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు, రఘునాధరెడ్డి, బాబూరావు, తనూజరాణి, గురుమూర్తిలతో కలిసి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ మూకల దాడులకు సంబంధించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఏమన్నారంటే..చంద్రబాబుది ఆటవిక పాలనటీడీపీ అధినేత చంద్రబాబుది ఆటవిక పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. టీడీపీ గూండాల అకృత్యాలను రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రంలో చట్టాలు, స్వేచ్ఛ, న్యాయ పాలన లేదు. అన్యాయం రాజ్యమేలుతోంది. కనీసం ఫిర్యాదు తీసుకునేందుకు కూడా అధికారులు జంకడం చంద్రబాబు పాలన ఎలా ఉంటుందో బోధపడుతుంది. ప్రమాణ స్వీకారం కంటే ముందే రాష్ట్రాన్ని అత్యంత భయానక వాతావరణంలోకి నెట్టారు. ఇప్పటి వరకూ ఎన్నో ఎన్నికలు జరిగాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లాయి కానీ ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు నాంది పలికింది చంద్రబాబే.ముందే దాడులకు పురిగొల్పి..ఎన్నికల కోడ్‌ వచ్చిన నాటి నుంచి మొదలైన దాడులు ఫలితాల తర్వాత తీవ్రరూపం దాల్చాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారుల ప్రాణాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని టీడీపీ గూండాలు స్వైర విహారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అంటేనే గూండాగిరీ అని రుజువు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే దాడులకు పురిగొల్పి చంద్రబాబు బాధ్యత నుంచి తప్పించుకునే ఎత్తుగడ వేశారు. వీటిని అరికట్టాల్సిన పోలీసు వ్యవస్థ నీరుగారిపోయింది. బాధితుల ఆక్రందనలు తమ కుటుంబ సభ్యులివిగానే భావించి ఈ రక్త చరిత్రను అరికట్టాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది.మూడుసార్లూ బీజేపీతో అండతో పీఠం1999, 2014, 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మూడుసార్లూ బీజేపీ సహకారం వల్లే పీఠం దక్కించుకున్నారు. హింసాకాండకు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. భావితరాలకు హింసా సంస్కృతిని నేర్పడం ఎవరూ హర్షించరు. అధికారం అంటే బాధ్యత అని గుర్తుంచుకోవాలి. అధికారం అంటే రౌడీయిజం గూండాయిజం కాదు. బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదలపై టీడీపీ సాగిస్తున్న దౌర్జన్యకాండ సభ్య సమాజం తలదించుకొనేలా ఉంది. యూనివర్సిటీలు, వీసీలపై దాడులు తగవు. అమానవీయ ఘటనలకు పాల్పడడమే కాకుండా సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్ట్‌ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. మంగళగిరిలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త రాజ్‌కుమార్‌పై లోకేష్‌ మనుషులు చేసిన దాడిని సోషల్‌ మీడియాలో అందరూ చూశారు. బంగారం లాంటి రాష్టం తగలడుతుంటే బాధగా ఉంది. ఏపీలో ఘటనలకు కేంద్రం కూడా తలవంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మీడియాపైనా అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. టీవీ 9, ఎన్‌టీవీ, సాక్షి తదితర చానెళ్లను ఎంఎస్‌వోల నుంచి తొలగిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందన్న భావన కలుగుతోంది. ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిని మరోసారి నేరుగా కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై ఫిర్యాదు చేస్తాం.రాష్ట్రం, దేశ ప్రయోజనాలే లక్ష్యంపార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు సంబంధించి రాష్ట్రం, దేశ ప్రయోజనాలే పరమావధిగా వైఎస్సార్‌సీపీ వ్యవహరిస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గతంలోనూ అదే రీతిలో బిల్లులకు మద్దతు ఇచ్చామని మీడియా ప్రశ్నలకు సమాధానంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉభయ సభల్లో టీడీపీకి 16 మంది ఎంపీలుండగా వైఎస్సార్‌ సీపీకి 15 మంది సభ్యులున్నారని చెప్పారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే ఎన్డీఏ ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి అటు టీడీపీ, ఇటు వైఎస్సార్‌సీపీ అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీదే బలమెక్కువ అని తెలిపారు. ఎన్డీఏ కూటమా? ఇండియా కూటమా? అనేది కాకుండా రాష్ట్రం, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా బిల్లులకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఎన్డీఏ సంఖ్యాబలం ఆధారంగా కొద్ది మెజారిటీతోనైనా లోక్‌సభ స్పీకర్‌ ఎంపిక జరిగిపోతుందని చెప్పారు. ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫైడ్‌ సివిల్‌ కోడ్‌)కి తాము మద్దతు ఇవ్వబోమన్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నికలపై తమ పార్టీ అధినేత సూచనలు తీసుకొని ముందుకెళ్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపడతామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్‌ఎస్‌.. ఇలా దేశంలో అన్ని పార్టీలతోనూ జత కట్టిన మహానాయకుడు చంద్రబాబు మినహా మరెవరూ లేరని వ్యాఖ్యానించారు. నూతన ప్రభుత్వానిదే బాధ్యత: ఎంపీ మిథున్‌రెడ్డి రాష్ట్రంలో కొద్ది రోజులుగా చెలరేగుతున్న హింసాత్మక ఘటనలకు నూతన ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఎన్నికల తర్వాత కూడా రాజకీయాలు చేయడం సరికాదు. ప్రజాతీర్పును గౌరవిస్తూ హామీలను నెరవేర్చి చిత్తశుద్ధి చాటుకోవాలి. వైఎస్సార్‌సీపీకి 40 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. కొత్త ప్రభుత్వం అందరినీ సమాన దృష్టితో చూడాలి.న్యాయ పోరాటం: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతల దారుణ వైఫల్యంపై రాష్ట్రపతి, ప్రధాని, హోంశాఖ, ఎన్‌హెచ్‌ఆర్సీలకు ఫిర్యాదు చేశాం. తగిన స్పందన లేకుంటే న్యాయ పోరాటం చేస్తాం. టీడీపీ గూండాయిజం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు నెలకొన్నాయి. కుట్రపూరితంగా ప్రమాణ స్వీకారం కంటే ముందే కార్యకర్తల్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఉసిగొల్పారు. మా కార్యకర్తల్ని కాపాడుకుంటాం. బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటాం. అల్లరి మూకలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నందున కేంద్రం తక్షణమే స్పందించి శాంతి భద్రతలు పరిరక్షించాలి. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలను పార్లమెంట్‌ దృష్టికి తెస్తాం.

Kuwait Fire: Mos MEA Kirti Vardhan Leaves for Kuwait going there to See the Situation
Kuwait: భారతీయ మృతులపై నో క్లారిటీ: విదేశాంగ శాఖ

దుబాయ్‌: కువైట్‌ ఘోర అగ్నిప్రమాదం మృతుల లెక్కపై స్పష్టత రావాల్సి ఉంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 49 మంది చనిపోతే, అందులో 41 మంది భారతీయులే ఉన్నారు. అయితే మృతుల సంఖ్యపై కచ్చితత్వం.. అందులో భారతీయులు ఎందరు?.. వాళ్ల పేర్లు, స్వస్థలం .. ఇతర వివరాలు ఏంటి? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ మేరకు అగ్ని ప్రమాద సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షించడానికి విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్దన్‌ సింగ్‌ కువైట్‌ బయల్దేరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు తాను అక్కడికి వెళ్తున్నానంటూ కువైట్‌కు బయలుదేరే ముందు కీర్తివర్ధన్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.#WATCH | Kuwait fire incident | Delhi: Before leaving for Kuwait from Delhi Airport, MoS MEA Kirti Vardhan Singh says, "We had a meeting last evening with the PM... The situation will be cleared the moment we reach there... The situation is that the victims are mostly burn… pic.twitter.com/ijqW3QQADM— ANI (@ANI) June 13, 2024‘కువైట్‌ ప్రమాదంపై ప్రధాని మోదీతో బుధవారం సాయంత్రం సమావేశం అయ్యాం. అక్కడి చేరుకోగానే అక్కడ నెలకొన్న పరిస్థితులపై స్పష్టత వస్తుంది. ప్రమాదంలో చాలా మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. మృతదేహాలను గుర్తుపట్టడానికి డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌ విమానం కూడా సిద్ధంగా ఉంది. మృతదేహాలను గుర్తించిన వెంటనే ఎయిర్‌ పోర్స్‌ విమానంలో మృతదేహాలను భారత్‌కు తరలిస్తాం. ఇప్పటివరకు అందినసమాచారం మేరకు 49 మంది మృతి చెందారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు’ అని అన్నారు.గల్ఫ్‌ దేశం కువైట్‌లో బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుక్ను ఘటనలో ఏకంగా 49 మంది మరణించారు. వీరిలో ఏకంగా 40 నుంచి 42 మంది భారతీయులేనని సమాచారం. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాధితుల్లో ఎక్కువమంది కేరళకు చెందినవారని సమాచారం. తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఉపాధి కోసం వలస వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర విషాదానికి గురిచేసింది. కువైట్‌ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్‌ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తొలుత వంటగది నుంచి మంటలు వ్యాపించినట్లు తెలియజేశారు. ఈ భవనంలో 200 మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు నివసిస్తున్నారు.వివిధ దేశాల నుంచి వలస వచ్చిన వీరంతా ఎన్‌బీటీసీ గ్రూప్‌ అనే నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. కార్మికుల వసతి కోసం ఈ సంస్థ సదరు భవనాన్ని అద్దెకు తీసుకుంది. మృతులు 20 నుంచి 50 ఏళ్ల లోపు వారేనని అరబ్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కార్మికులు నిద్రలో ఉన్నారు. దట్టమైన పొగ వ్యాపించింది. దాన్ని పీల్చడం వల్లే ఎక్కువ మంది మరణించారు.అగ్నిప్రమాదంలో చాలామంది భారతీయులు మరణించడంపై కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ +965–65505246 ఏర్పాటు చేసింది. సహాయం, సమాచారం అవసరమైన వారు తమను సంప్రదించాలని సూచించింది. బాధితులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించింది.కువైట్‌ మొత్తం జనాభాలో భారతీయులు 21 శాతం(10 లక్షలు) ఉంటారు. కువైట్‌లోని మొత్తం కార్మికుల్లో 30 శాతం మంది(దాదాపు 9 లక్షలు) భారతీయులే కావడం విశేషం. అగ్నిప్రమాదంలో మరణించినవారికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మాంగాఫ్‌ ప్రాంతంలోని ఘటనా స్థలాన్ని భారత రాయబారి ఆదర్శ్‌ స్వాయికా సందర్శించారు. గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భారతీయులను పరామర్శించారు. తగిన సాయం అందిస్తామని భరోసా కల్పిచారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో కువైట్‌ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. బాధితుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా, మరికొందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరించారు. మాంగాఫ్‌ భవన యజమానిని తక్షణమే అరెస్టు చేయాలని కువైట్‌ ఉప ప్రధానమంత్రి షేక్‌ ఫహద్‌ అల్‌–యూసుఫ్‌ అల్‌–సబా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు తగిన భద్రత కల్పించని భవన నిర్మాణ కంపెనీ యజమానికి సైతం అరెస్టు చేయాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కంపెనీ యాజమాన్యంతోపాటు భవన యజమాని దురాశ వల్ల అమాయకులు బలయ్యారని ఆయన విమర్శించారు. ఒకే భవనంలో పెద్ద సంఖ్యలో కార్మికులు నివసించడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అగ్నిప్రమాదానికి బాధ్యులుగా గుర్తించి పలువురు అధికారులను కువైట్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

T20 WC 2024 Ind vs USA: Rohit Sharma Lauds Surya Dube It Was Not Easy
ఇక్కడ గెలవడం అంత సులువు కాదు.. క్రెడిట్‌ వాళ్లకే: రోహిత్‌ శర్మ

టీ20 ప్రపంచకప్‌-2024 లీగ్‌ దశలో తమకు ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా సూపర్‌-8లో అడుగుపెట్టింది. ఆతిథ్య అమెరికా జట్టుపై బుధవారం నాటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది తదుపరి దశకు అర్హత సాధించింది.అయితే, పసికూనే అయినా అమెరికాపై రోహిత్‌ సేనకు ఈ విజయం అంత సులువుగా రాలేదు. 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలో తడబడిన భారత జట్టు సూర్యకుమార్‌ యాదవ్‌(50), శివం దూబే(31) అద్భుత అజేయ ఇన్నింగ్స్‌ కారణంగా గట్టెక్కింది.బ్యాటింగ్‌ అనుకూలించని పిచ్‌పై వీరిద్దరు మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సూర్య, దూబేలపై ప్రశంసలు కురిపించాడు.గెలుపు అంత తేలికగా రాదని తెలుసుఅదే విధంగా.. అమెరికాపై విజయంలో బౌలర్ల పాత్ర కూడా ఎంతో కీలకమని పేర్కొన్నాడు. ‘‘ఈ మ్యాచ్‌లో గెలుపు అంత తేలికగా రాదని తెలుసు. మా వాళ్ల మెరుగైన భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది.బౌలర్లు కూడాసూర్య, దూబే ఆద్యంతం పట్టుదలగా నిలబడి పరిణతితో కూడిన ఇన్నింగ్స్‌ ఆడారు. అందుకు వాళ్లకు క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. ఇక మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు.ముఖ్యంగా అర్ష్‌దీప్‌. దూబే రూపంలో మాకు మరో ఆప్షన్‌ ఉంది కాబట్టి.. ఈ మ్యాచ్‌లో ప్రయత్నించి చూశాం. ఎందుకంటే ఈరోజు పిచ్‌ సీమర్లకు ఎక్కువగా అనుకూలించింది. కాబట్టి అతడి సేవలను వాడుకున్నాం. అతిపెద్ద ఊరటఇక సూపర్‌-8కు క్వాలిఫై అవటం అనేది అతిపెద్ద ఊరట. ఇలాంటి పిచ్‌లపై విజయాలు అంత సులువేమీ కాదు. ప్రతి మ్యాచ్‌ను చాలెంజింగ్‌గా తీసుకున్నాం.మూడింట మూడు విజయాలు సాధించాం. ఫలితంగా మా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. సూర్యకుమార్‌ యాదవ్‌ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి నుంచి మేము ఏం ఆశిస్తామో.. ఈరోజు అదే అతడు చేసి చూపించాడు.కఠినమైన పిచ్‌పై తనదైన శైలిలో రాణించి విజయాన్ని అందించాడు’’ అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు. సమిష్టి కృషితో సూపర్‌-8కు అర్హత సాధించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్‌-2024: ఇండియా వర్సెస్‌ యూఎస్‌ఏ స్కోర్లు👉వేదిక: న్యూయార్క్‌👉టాస్‌: ఇండియా బౌలింగ్‌👉యూఎస్‌ఏ స్కోరు- 110/8 (20)👉ఇండియా స్కోరు- 111/3 (18.2)👉ఫలితం- ఏడు వికెట్ల తేడాతో యూఎస్‌ఏపై ఇండియా విజయం👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అర్ష్‌దీప్‌ సింగ్‌(4/9).చదవండి: రూ. 250 కోట్లు.. బ్యాటర్లకు చుక్కలే! కూల్చేయనున్న ఐసీసీ? View this post on Instagram A post shared by ICC (@icc)

PM Narendra Modi to travel to Italy for G7 summit
నేడు ఇటలీకి మోదీ.. జీ–7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని

న్యూఢిల్లీ: జీ7 అత్యాధునిక ఆర్థిక వ్యవస్థల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం జీ7 సదస్సుకు ఆతిథ్యమిస్తున్న ఇటలీకి గురువారం ప్రధాని మోదీ బయల్దేరనున్నారు. మూడోసారి ప్రధానిగా పగ్గాలు స్వీకరించాక మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదేకావడం విశేషం. గత ఏడాది భారత సారథ్యంలో ముగిసిన జీ20 శిఖరాగ్ర సమావేశాల తర్వాత జరుగుతున్న సదస్సు కావడంతో ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇటలీలోని అపూలియో ప్రాంతంలోని విలాసవంత బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు జూన్‌ 13వ తేదీ నుంచి 15వ తేదీదాకా జరగనుంది. ఉక్రెయిన్‌ యుద్ధంతోపాటు ఇజ్రాయెల్‌ దాడులతో శిథిలమవుతున్న గాజా స్ట్రిప్‌ను ఆదుకునేందుకు, యుద్ధాలను ఆపేందుకు అధినేతలు సమాలోచనలు జరపనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలానీ తదితర అగ్రనేతలు ఈ భేటీకి హాజరవుతున్నారు. రష్యా భీకర దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ సైతం ఒక సెషన్‌లో పాల్గొని రష్యాపై విమర్శల వర్షం కురిపించనున్నారు. మోదీ విదేశీ పర్యటన వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ ఖ్వాత్రా వెల్లడించారు. ‘‘ చర్చలు, సంప్రతింపుల ప్రక్రియ ద్వారా ఉక్రెయిన్, హమాస్‌–ఇజ్రాయెల్‌ యుద్ధాలకు ముగింపు పలికేందుకు భారత్‌ ఎప్పటిలాగే సదా సిద్ధంగా ఉంది’ అని ఖ్వాత్రా చెప్పారు. స్విట్జర్లాండ్‌లో జరగబోయే శాంతి సదస్సులోనూ భారత్‌ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. అయితే భారత్‌ తరఫున ఎవరు హాజరవుతారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. గాందీజీ ప్రతిమ వద్ద ఖలిస్తానీ రాతలు ఇటలీలో మోదీ గురువారం పర్యటన మొదలుకానున్న ఒక్క రోజు ముందే అక్కడి గాంధీజీ ప్రతిమ వద్ద ఖలిస్తానీ మద్దతుదారులు వేర్పాటువాద రాతలు రాశారు. కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ వేర్పాటువాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అనుకూల నినాదాలనూ ప్రతిమ పీఠం వద్ద నలుపురంగుతో రాశారు. ప్రతిమను ఆవిష్కరించిన కొద్దిసేపటికే వేర్పాటువాదులు ఈ చర్యలకు తెగబడ్డారు. వేర్పాటువాదుల దుశ్చర్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. తగిన చర్యలు తీసుకోవాలని ఇటలీ అధికారులకు సూచించామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ ఖ్వాత్రా చెప్పారు. వెంటనే స్థానిక యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని ఖలిస్తానీ రాతలను తుడిచేసింది.

Bangalore Court Bail Issued To Actress Hema
నటి హేమకు బెయిలు మంజూరు చేసిన కోర్టు

బెంగళూరు డ్రగ్స్‌ కేసులో నటి హేమకు తాజాగా బెయిల్‌ లభించింది. కొద్దిరోజుల క్రితం బెంగళూరు నగర శివార్లలో జరిగిన రేవ్‌పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెను బెంగళూరు నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు విచారించారు. ఈ క్రమంలో హేమకు స్థానిక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.నటి హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది కోర్టులో తెలిపారు. అంతేకాకుండా హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. అయితే, హేమ రేవ్‌ పార్టీలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Kannada Actor Darshan and Pavithra Arrested In Renuka Swamy Murder Case
బెల్ట్‌తో కొట్టి.. చితకబాది... పొట్టన పెట్టుకున్నాడు!

బెంగళూరు: కర్నాటకలో సంచలనం సృష్టించిన ఫార్మసీ ఉద్యోగి రేణుస్వామి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం కన్నడ నటుడు దర్శన్, అతని అభిమానులు రేణుస్వామిని దారుణంగా కొట్టి చంపారు! రేణుస్వామికి తగిన ‘బుద్ధి’ చెప్పాలంటూ నటి పవిత్ర దర్శన్‌ను ఉసిగొలి్పందని తెలుస్తోంది. తన అభిమాన సంఘాల సమన్వయకర్త రాఘవేంద్రను ఈ పనికి దర్శన్‌ పురమాయించారు. రాఘవేంద్ర తన భర్తను ఇంటి సమీపంలో వాహనం ఎక్కించుకుని తీసుకెళ్లాడని రేణుస్వామి భార్య చెప్పారు. అతన్ని బెంగళూరు సమీపంలో ఒక షెడ్డులో దర్శన్‌ బెల్ట్‌తో చితకబాదారు. అభిమానులు కర్రలతో కొట్టారు. ఎముకలు విరిగి, సున్నిత ప్రాంతాల్లో అంతర్గత గాయాలై రేణుస్వామి అక్కడిక్కడే మరణించారు. మృతదేహాన్ని మురికికాలువలో పడేశారు. దాన్ని వీధి కుక్కలు తినడం చూసి ఫుడ్‌ డెలివరీ బాయ్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారందరినీ బుధవారం ఘటనా స్థలికి తీసుకెళ్లి సీన్‌ రీ కన్‌స్ట్రక్ట్‌ చేశారు.

TDP And JDU Are Demanding For The Speaker Position In The Loksabha
స్పీకర్‌ పదవి.. బీజేపీ రిస్క్‌ చేస్తుందా?

హోరాహోరీ సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. అంతా ఊహించినట్టే నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. మోదీ 3.0 మంత్రివర్గమూ కొలువుదీరింది. కానీ గత రెండు ఎన్నికల మాదిరిగా సొంతంగా మెజారిటీ సాధించడంలో బీజేపీ ఈసారి విఫలమైంది. దాంతో ఎన్డీఏ సంకీర్ణ సర్కారు మనుగడలో భాగస్వామ్య పక్షాల పాత్ర కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ అతి కీలకమైన లోక్‌సభ స్పీకర్‌ పదవిపైనే నెలకొన్నాయి. ఎన్డీఏ కీలక భాగస్వామి టీడీపీ ఆ పదవిపై ఆసక్తిగా ఉందంటూ ముందునుంచీ వార్తలొస్తున్నాయి. తాజాగా జేడీ(యూ) పేరూ విని్పస్తోంది. అవి నాలుగైదు కేబినెట్‌ బెర్తులు కోరినా ఎన్డీఏ పెద్దన్న బీజేపీ మాత్రం చెరో రెండింటితో సరిపెట్టింది. కనుక స్పీకర్‌ పోస్టుపై ఆ పార్టీలు పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు. కానీ అపారమైన విచక్షణాధికారాలుండే స్పీకర్‌ పాత్ర కీలక సమయాల్లో అత్యంత నిర్ణాయకంగా మారుతుంటుంది. మరీ ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల్లో లోక్‌సభ స్పీకర్‌ పాత్రకుండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పైగా గతంలో టీడీపీకి స్పీకర్‌ పోస్టు ఇచ్చి సర్కారును కుప్పకూల్చుకున్న అనుభవమూ బీజేపీకి ఉంది. ఈ నేపథ్యంలో కీలక పదవిని మిత్రపక్షాల చేతిలో పెట్టే రిస్క్‌కు బీజేపీ పెద్దలు మరోసారి సిద్ధపడతారా అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది...అది 1999. రాజకీయ అస్థిరతకు చెక్‌ పెట్టే ఉద్దేశంతో వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లోక్‌సభలో బలపరీక్షకు సిద్ధపడింది. మద్దతిస్తామన్న పలు ఇతర పారీ్టలు తీరా అసలు సమయానికి అడ్డం తిరగడంతో ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కుప్పకూలింది. నాడు స్పీకర్‌గా ఉన్న టీడీపీ నేత జీఎంసీ బాలయోగి తీసుకున్న నిర్ణయమే అందుకు కారణంగా మారడం విశేషం! అంతకు కొద్ది రోజుల ముందే ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్‌ ఎంపీ గిరిధర్‌ గమాంగ్‌ను ఓటింగ్‌కు అనుమతించాలా, లేదా అన్న ధర్మసందేహం తలెత్తింది. స్పీకర్‌గా తన విచక్షణాధికారాలను ఉపయోగించి గమాంగ్‌ను ఓటింగ్‌కు అనుమతిస్తూ బాలయోగి నిర్ణయం తీసుకున్నారు. చివరికి విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా వ్యతిరేకంగా 270 వచ్చాయి. అలా గమాంగ్‌ వేసిన ఒక్క ఓటు ప్రభుత్వాన్ని పడ గొట్టింది. ఎన్డీఏ సర్కారుకు బయటినుంచి మద్దతిచి్చన టీడీపీ అధినేత చంద్రబాబు కోరిక మేరకు స్పీకర్‌ పదవిని ఆ పారీ్టకిస్తూ నాటి ప్రధాని వాజ్‌పేయి నిర్ణయం తీసుకున్నారు. పాతికేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు బాబు మరోసారి టీడీపీకి స్పీకర్‌ పదవి కోరుతున్నట్టు వార్తలొస్తుండటం విశేషం! జిస్కా స్పీకర్, ఉస్కీ సర్కార్‌! మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరినా బీజేపీకి సొంతంగా మెజారిటీ రాని విషయం తెలిసిందే. లోక్‌సభలో మెజారిటీ మార్కు 272 కాగా బీజేపీకి 240 మంది ఎంపీలే ఉన్నారు. ఎన్డీఏ భాగస్వాముల్లో 16 ఎంపీలున్న టీడీపీ, 12 మంది ఉన్న జేడీ(యూ) ప్రభుత్వ మనుగడకు కీలకంగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వాల మనుగడలో స్పీకర్‌ పదవి ఎంత కీలకమో 1999 నాటి వాజ్‌పేయి ప్రభుత్వ ఉదంతం నిరూపించింది. పైగా ‘జిస్కా స్పీకర్, ఉస్కీ సర్కార్‌ (స్పీకర్‌ పదవి దక్కిన వారిదే సర్కారు)’ అన్న నానుడి హస్తిన రాజకీయ వర్గాల్లో బాగా ఫేమస్‌ కూడా. అలాంటి కీలకమైన స్పీకర్‌ పదవిని ఈసారి టీడీపీ కోరుతోంది. మోదీ అందుకు అంగీకరించే సాహసం చేస్తారా అన్నదానిపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2014, 2019ల్లో బీజేపీ సొంతగానే మెజారిటీ సాధించడంతో ఆయనకు ఇలాంటి పరీక్ష ఎదురవలేదు. అయితే మంత్రివర్గ కూర్పులో భాగస్వాముల డిమాండ్లకు మోదీ పెద్దగా తలొగ్గలేదు. టీడీపీ ఐదారు, జేడీ(యూ) నాలుగైదు బెర్తులు అడిగినా వాటికి చెరో రెండు పదవులతో సరిపెట్టారు. పైగా కీలకమైన శాఖలన్నింటినీ బీజేపీకే కేటాయించారు. కనుక స్పీకర్‌ పదవిని కూడా బీజేపీయే అట్టిపెట్టుకోవచ్చన్న అభిప్రాయం విని్పస్తోంది. పవర్స్‌ అన్నీ ఇన్నీ కావులోక్‌సభ స్పీకర్‌కు సాధారణ అధికారాలతో పాటు అత్యంత కీలకమైన విచక్షణాధికారాలు కూడా ఉంటాయి. సభా నిబంధనలను తన విచక్షణ మేరకు నిర్వచించగలుగుతారు. అందుకే స్పీకర్‌ పదవిని పాలక పక్ష బలానికి, ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తుంటారు. లోక్‌సభను అజమాయిషీ చేస్తూ కార్యకలాపాలను సజావుగా నడిపించేది స్పీకరే. కనుక ఆ పదవి దక్కే పార్టీ సహజంగానే లోక్‌సభ కార్యకలాపాల అజెండా తదితరాలను ప్రభావితం చేయగలుగుతుంది. నిర్ణాయక సందర్భాల్లో ఇది కీలకంగా మారుతుంది. సభలో ప్రవేశపెట్టే బిల్లులు ద్రవ్య బిల్లా, సాధారణ బిల్లా అన్నది స్పీకరే నిర్ధారిస్తారు. సభా సంఘాలను ఏర్పాటు చేస్తారు. వాటి చైర్‌పర్సన్లు, సభ్యులను నియమిస్తారు. సభ్యుల సస్పెన్షన్‌ వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది స్పీకరే. పార్లమెంటు సంయుక్త సమావేశాలకు సారథ్యం వహిస్తారు. అన్నింటికీ మించి ఏ అంశంపై అయినా సభలో ఓటింగ్‌ జరిగి రెండు పక్షాలకూ సమానంగా ఓట్లొస్తే స్పీకర్‌ పాత్ర మరింత కీలకంగా మారుతుంది. ఆయన నిర్ణాయక ఓటు ఎవరికి వేస్తే వారే నెగ్గుతారు!– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Sakshi Guest Coolumn On CISF Constable Attack On Kangana Ranaut
ఎంపీని కానిస్టేబుల్‌ కొట్టడం దేనికి సంకేతం?

హిమాచల్‌ ప్రదేశ్‌ మండీ లోక్‌ సభ స్థానం నుండి నూతనంగా ఎన్నికైన ప్రముఖ సినీ తార కంగనా రనౌత్‌ను చండీగఢ్‌ విమానాశ్రయంలో సెక్యూరిటీ విధులను నిర్వహిస్తున్న కుల్విందర్‌ కౌర్‌ అనే సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ చెంప మీద కొట్టడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎందుకు కొట్టావు అని సదరు ఎంపీ అడిగినప్పుడు రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు ఈ చెంప దెబ్బ అని దురుసుగా సమాధానం చెప్పడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఆ కానిస్టేబుల్‌ సోదరుడు కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండడం, ఆమ్‌ ఆద్మీ సపోర్టుగా ఉండడం బట్టి చూస్తే– కంగనా రనౌత్‌పై దాడి యాదృచ్చికంగా జరిగింది కాదనీ, ఇది ఒక ప్రణాళికా బద్ధంగానే జరిగిందనే భావన కలుగక మానదు. నూతనంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సమగ్రమైన విచారణ జరిపి, దేశ ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రైతు వ్యతిరేక చట్టాల ఉద్యమం పేరుతో రైతుల ముసుగులో ఖలిస్థాన్‌ వేర్పాటు వాదుల మద్దతుదారులు రిపబ్లిక్‌ డే రోజున ఎర్రకోటపై ఖలిస్థాన్‌ జెండాను ఎగరవేయడం, శాంతి భద్రతలను పరిరక్షించడానికి వచ్చిన అనేకమంది పోలీసుల తలలు పగలగొట్టడం వంటి దృశ్యాలు దేశ ప్రజల స్మృతి పథంలో ఇప్పటికీ స్థిరంగానే ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రతిపక్షాలు తమ రాజకీయ స్వార్థం కోసం రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమకారులను రెచ్చగొడుతున్నాయనీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో అనేక చోట్ల హింస చెలరేగి శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందనీ నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు సందర్భోచితంగా సంయమనం పాటించారు. దీంతో దేశానికి పెద్ద ముప్పే తప్పింది.ప్రభుత్వ విధానాలపైనా, దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలూ, ఉద్యమాలపైనా అనేకమంది వ్యతిరేకంగా, అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాగే ఒక పౌరురాలిగా కంగనా కూడా రైతు ఉద్యమంపై వ్యాఖ్య చేశారు. ఈ చెంప దెబ్బ ఆ వ్యాఖ్యలు చేసినందుకే కొట్టానని కౌర్‌ చెప్పిన సమాధానం నమ్మశక్యంగా లేదు. సిక్కు తీవ్రవాద భావాలు కుల్విందర్‌ కౌర్‌ మనసులో ఎవరైనా నాటి ఉండవచ్చునేమో! ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు? 1984 అక్టోబర్‌ 31న భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని కాల్చి చంపిన ఆమె అంగరక్షకులైన సత్వంత్‌ సింగ్, బియాంత్‌ సింగ్‌లు సిక్కులు అనే విషయం మరవకూడదు. నాడు వారు ‘ఖలిస్థాన్‌’ వేర్పాటు వాద భావజాలాన్ని తలకెక్కించుకుని ఆ ఘాతుకానికి ఒడిగట్టారు.సిక్కు వేర్పాటు వాద నాయకుడు హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ 2023 జూన్‌ 18న కెనడాలో హత్యకు గురైన తర్వాత, కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలలో ఖలిస్థాన్‌ వేర్పాటు వాదుల మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో... నిజర్‌ హత్య వెనుక భారత ప్రభుత్వ నిఘా వర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా అమెరికా దౌత్యవేత్తలు మాట్లాడడం, భారత ప్రభుత్వం ఇందుకు ఆధారాలు చూపించాలని కౌంటర్‌ వేయడం వంటి వాటి నేపథ్యంలో ఈ సంఘటనను పరిశీలించాలి. ఉల్లి బాల రంగయ్య వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు

Horoscope Today: Rasi Phalalu On 13-06-2024 In Telugu
Horoscope Today: ఈ రాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.సప్తమి రా.8.51 వరకు, తదుపరి అష్టమినక్షత్రం: పుబ్బ తె.4.46 వరకు(తెల్లవారితే శుక్రవారం), తదుపరి ఉత్తర, వర్జ్యం: ఉ.11.21 నుండి 1.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.49 నుండి 10.41 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.54 వరకు, అమృతఘడియలు: రా.9.54 నుండి 11.40 వరకు. మేషం: శ్రమ మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచన లు స్థిరంగా ఉండవు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. కళాకారులకు సన్మానాలు.వృషభం: కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలలో మార్పులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు మరింత శ్రమపడాలి.మిథునం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో ఆదరణ. అరుదైన సన్మానాలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దైవదర్శనాలు. ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు. విందువినోదాలు.కర్కాటకం: పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఇంటాబయటా చికాకులు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. బంధువులతో అకారణంగా తగాదాలు.సింహం: నూతన వ్యక్తుల పరిచయం. విద్య, ఉద్యోగావకాశాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. విందువినోదాలు.కన్య: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ధన వ్యయం. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు ఉంటాయి..తుల: పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి.వృశ్చికం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన విద్యావకాశాలు.ధనుస్సు: అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా లేనిపోని సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.మకరం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాల కోసం యత్నాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం.కుంభం: కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. కొత్త విషయాలు తెలుస్తాయి. దైవచింతన.మీనం: ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. విద్యార్థుల యత్నాలు సఫలం.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement