వీకెండ్ ఇల్లు.. రూ.10 కోట్లయినా పర్లేదు..!
సాక్షి, సిటీబ్యూరో: వీకెండ్ వస్తే చాలు పబ్కో.. సినిమాలు, షికార్లకో వెళ్లే నగరవాసులు.. క్రమంగా ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే ఈ ఇళ్లు కాస్త ప్రత్యేకమైనవండోయ్! కాలుష్యం, రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రశాంతమైన పచ్చని వాతావరణంలో ఉంటే వీకెండ్ లేదా హాలిడే హోమ్స్‌కు పరుగులు పెడుతున్నారు. ఎంచక్కా కుటుంబంతో కలిసి వారాంతాన్ని అక్కడే గడిపేస్తున్నారు. కరోనాతో వీకెండ్ హోమ్స్‌కు ఆదరణ పెరిగింది.పెట్టుబడులు పెరిగాయి.. 29 శాతం మంది హెచ్ఎన్ఐలు హాలిడే హోమ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. లగ్జరీ హాలిడే హోమ్‌కు రూ.5–10 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాలని 71 శాతం మంది భావిస్తున్నారని లగ్జరీ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ఇండియా సోథెబీ ఇంటర్నేషనల్ రియల్టీ ఒక నివేదిక విడుదల చేసింది. 29 శాతం మంది రూ.10 కోట్ల పైన ధర ఉన్నా పర్వాలేదని చెప్పారు. లగ్జరీ అపార్ట్మెంట్ లేదా విల్లా అయితే రూ.10–25 కోట్ల వరకు పెట్టుబడికి సుముఖంగా ఉన్నట్లు 69 శాతం మంది చెప్పారు. 21 శాతం మంది రూ.5–10 కోట్ల బడ్జెట్లో, మిగిలిన 10 శాతం మంది రూ.25 కోట్లకు పైగా బడ్జెట్లో ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నారు.వచ్చే రెండేళ్లలో రెట్టింపు.. 200 హెచ్ఎన్ఐల అభిప్రాయాల ఆధారంగా దేశంలోని 8 ప్రధాన పట్టణాల్లో(హైదరాబాద్ సహా) రియల్ ఎస్టేట్ ధోరణులపై ఈ సంస్థ నివేదిక రూపొందించింది. సంపన్నుల్లో రియల్ ఎస్టేట్ పట్ల ధోరణి మారిందనడానికి ఈ ఫలితాలే నిదర్శమని పేర్కొంది. వచ్చే రెండేళ్లలో కొనుగోళ్లకు సముఖంగా ఉన్నామని చెప్పిన 75 శాతం మంది ప్రాధాన్యతలు గమనిస్తే.. 89 శాతం మంది ఖరీదైన ఇళ్లు(సిటీ అపార్ట్మెంట్లు, బంగళాలు, హాలిడే హోమ్స్)పట్ల ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది ఖరీదైన వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్నారు.ముఖ్యంగా గడిచిన 18 నెలల్లో ఇల్లు కొనుగోలు చేసినట్లు 26% మంది చెప్పారు. వారి జీవనశైలిని మెరుగుపరుచుకోవడం, మంచి పెట్టుబడులను సొంతం చేసుకునే ఆలోచనతోనే వారు కొన్నారు. రెండు మూడేళ్లలో హెచ్ఎన్ఐలు, అల్ట్రా హెచ్ఎన్ఐలు ఖరీదైన ఇళ్లను సొంత వినియోగానికే కొనుగోలు చేశారు. మంచి పెట్టుబడి అవకాశం కోసం కొనుగోలు చేయడం అంటే అది బుల్లిష్ ధోరణికి సంకేతమని ఓ సంస్థ తెలిపింది.