బాలయ్య ‘షో’ ఫ్లాప్ టాక్!
హిందూపురం మునిసిపాలిటీ, న్యూస్‌లైన్ : నందమూరి నట సింహానికి ఓటమి భయం పట్టుకుంది. తాను పోటీ చేస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా గెలవాలన్న తాపత్రయంతో హైటెక్ స్కెచ్‌కు తెరలేపారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో
ఇప్పుడు వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో ఓటర్లు, నేతలకు తాయిలాల ఎర వేస్తున్నారు. బాలయ్య కుటుంబమంతా ప్రచారం చేసినా జనం నుంచి స్పందన లేకపోవడంతో చివరి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని గల్లీ లీడర్లు, గ్రామీణ ప్రాంత నేతలకు ఓ వైపు వెలకడుతూనే.. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. రెండ్రోజులుగా నియోకవర్గవ్యాప్తంగా ఎంత డబ్బు పంపిణీ చేయాలన్న దానిపై ఓ సర్వే చేసి దాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓ పార్శిల్ సర్వీస్ నుంచి రూ.7 కోట్లను ఓ మిల్లుకు చెందిన సరుకు రవాణా చేసే వాహనాల్లో ఇక్కడికి తరలించినట్లు తెలిసింది. పాల వ్యాన్ల ద్వారా కూడా డబ్బు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని వార్డుల వారీగా పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్న వారికి చేరుస్తున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి వార్డుల్లో ప్రత్యేకంగా బూత్ స్థాయి కమిటీలకు ఓ ఇన్చార్జ్ని నియమించి డబ్బు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది.
టీడీపీకి మద్దతుగా ఉన్న వారికే నియోజకవర్గంలో భారీగా మద్యం దుకాణాలు ఉండడంతో ముందస్తుగా మద్యం నిల్వ చేయించారు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలించిన నకిలీ మద్యాన్ని స్థానికంగా ఉన్న కొన్ని స్థావరాలకు చేర్చేసినట్లు సమాచారం.
పోలింగ్‌కు ముందు రోజు నుంచి విచ్చలవిడిగా పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా అధికారులతో లోపాయికారి ఒప్పందాలతో ఎక్కడికక్కడ పనులను చెక్కబెట్టుకునేందుకు కొందరు నాయకులు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఇందులో భాగంగా మహిళా సంఘాలకు నాయకులు డబ్బు ఆశ చూపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలంటూ వారిని పిలిపించి ఒక్కో గ్రూపునకు కొంత నగదు ముట్టజెబుతున్నారు. నాలుగు రోజులుగా ఈ తంతు కొనసాగుతున్నట్లు సమాచారం.
కాగా, శుక్రవారం రాత్రి ఓ టీడీపీ నేత ‘సార్.. ఇంత డబ్బు పంచుతున్నాం.. అయితే అందరూ మన వద్ద డబ్బు ఉత్సాహంగా తీసుకుంటున్నారు కానీ ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకే వేసేట్టున్నారు.. ఏం చేయమంటారు’ అని బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ‘అలాగైతే ఎలా.. గట్టిగా చెప్పండి.. డబ్బు తీసుకుని వేయకపోతే ఊరుకుంటామా ఏంటి..’ అంటూ బాలయ్య గుడ్లురిమారట. ఉన్న విషయం చెబితే ఆయన నాపై చిందులేస్తున్నారు.. ఏమవుతుందో 16వ తేదీ ఆయనకే తెలుస్తుందిలే’ అని ఆ నేత బయటికొచ్చి కార్యకర్తలతో వాపోయారట.