breaking news
Hindustan Motor
-
ఒక్క మాటతో ఆ కంపెనీ షేర్లు ఎక్కడికో దూసుకు పోయాయి!
షేర్ మార్కెట్ అదొక అర్థం కాని మయాజాలం. గ్రాఫులు , లెక్కలు, విశ్లేషణలు, మార్కెట్ పండితులు ఇలా ఎందరు ఎన్ని చెప్పినా అంచనాలు క్షణాల్లో పట్టు తప్పుతుంటాయ్. పదేళ్ల డేటాతో చేసిన విశ్లేషణ కంటే కూడా సెంటిమెంట్ పవర్ ఎక్కువ మార్కెట్లో. చాన్నాళ్ల తర్వాత మార్కెట్‌కి సెంటిమెంట్ రుచి చూపించి ఇన్వెస్టర్లకు రూపాయికి రూపాయి లాభం అది రెండు వారాల వ్యవధిలోనే అందించింది ఓ బ్రాండ్. ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై రారాజులా వెలిగింది అంబాసిడర్ కారు. బిర్లాలకు చెందిన హిందూస్థాన్ మోటార్స్ సంస్థ ఈ కారును మార్కెట్లోకి తెచ్చింది. మార్కెట్లోకి రావడం ఆలస్యం ట్యాక్సీ డ్రైవర్ నుంచి సెలబ్రిటీల వరకు అందరి మనసును దోచుకుంది. 90వ దశకం వరకు సినిమాల్లో ఈ కారే కనిపించేది. అంబాసిడర్ అంటే స్టేటస్ సింబల్‌గా వెలిగిపోయింది. విదేశీ కార్లు ఇండియాలోకి వచ్చినా రాజకీయ నేతలు చాన్నాళ్ల పాటు అంబాసిడర్‌ని వదల్లేక పోయారు. అయితే ఆధునికతను సంతరించుకోక క్రమంగా అంబాసిడరే కనుమరుగై పోయింది. అంబాసిడర్ సెంటిమెంట్ పాత అంబాసిడర్‌కు కొత్తగా ఎలక్ట్రిక్ హంగులు అద్ది మార్కెట్లోకి తెస్తామంటూ హిందూస్థాన్ మోటార్స్ సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు విదేశీ కంపెనీతో సంప్రదింపులు కూడా పూర్తయినట్టు వెల్లడించింది. రాబోయే ఎలక్ట్రిక్ అంబాసిడర్ కారు ప్రొటోటైప్ ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో హోరెత్తిపోయాయి. పాత కాలం అంబాసిడర్‌ను కొత్త లుక్‌లో చూసేందుకు దేశం యావత్తు ఆసక్తి చూపించింది. అంబాసిడర్ మీద ఓ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. షేర్ల ధరకు రెక్కలు గడిచిన ఐదేళ్లుగా హిందూస్తాన్ మోటార్స్ షేరు రూ. 7 నుంచి రూ 10 దగ్గరే తిరుగాడుతోంది. కేవలం రెండు సార్లు మాత్రమే స్వల్ప కాలం పాటు రూ.15 గరిష్టాలను అందుకుంది. అంబాసిడర్ సరికొత్త రూపంలో మార్కెట్లోకి రాబోతుందన్న వార్త వచ్చిన తర్వాత హిందూస్థాన్ మోటార్స్ షేర్లకు రెక్కలు వచ్చాయి. లాభాలే లాభాలు మే 24న హిందూస్థాన్ మోటార్స్ ఒక్క షేరు ధర రూ. 10.80 దగ్గర ఉండగా జూన్ 8న షేరు ధర రూ.22.05కి చేరుకుంది. కేవలం రెండు వారాల వ్యవధిలో షేరు ధర రెట్టింపు అయ్యింది. మే 24న ఎలక్ట్రిక్ అంబాసిడర్ వార్త విని లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి రెండు వారాలు తిరిగే సరికి మరో లక్ష లాభం కళ్ల చూడగలిగారు. ఇక ఎప్పటి నుంచో ఈ షేర్లను అట్టిపెట్టుకున్న వారు ఒక్క వార్తతో బూరెల బుట్టలో పడ్డట్టు అయ్యింది. చాలా కాలం పాలు లాభాలు అందివ్వని హిందూస్థాన్ మోటార్స్ షేర్లు ఒక్క వార్తతో తారా జువ్వలా లాభాల్లోకి దూసుకుపోయాయి. చదవండి: Ambassador Electric Car: ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా? -
పది వేలకే బజాజ్ చేతక్ ... ఎప్పుడంటే ..
హెడ్డింగ్ చూసి నమ్మలేకపోతున్నారా ? కానీ ఇది నిజం ! ఒక్క బజాజే కాదు రాయల్ ఎన్ఫీల్డ్, రాజ్‌దూత్, షెవర్లెట్, అంబాసిడర్ అన్ని కార్ల ధరలు అగ్గువే !?. బైకులైతే పది వేలకు అటు ఇటు కార్లయితే ఇరవై నుంచి ముప్పే వేల రూపాయలు. అయితే ఈ ధరలన్నీ ఇప్పటి కావు. ఆర్థిక సంస్కరణలు దేశంలో అడుగు పెట్టడానికి ముందు స్వాతంత్రం తర్వాత కాలానికి చెందినవి. ఆ రోజుల్లో వాహనాల ధరలు ఎలా ఉన్నాయి. వాటిని ఆయా కంపెనీలు ఎలా ప్రమోట్ చేశాయి, అప్పటి పన్నుల వివరాలు సరదాగా ఓ సారి చూద్దాం. సాక్షి, వెబ్‌డెస్క్: ఆటోమొబైల్ ఇండస్ట్రీలో బజాజ్‌ది ప్రత్యేక స్థానం. నైన్టీస్లో బజాజ్ అమ్మకాల్లో చేతక్ స్కూటరే నంబర్ వన్. అయితే బైక్‌ల క్రేజ్ పెరగడంతో క్రమంగా స్కూటర్ల మార్కెట్ డౌన్ అయ్యింది. చేతక్ కూడా వెనుకపడి పోయింది. అయితే ఇప్పుడు కొంగొత్తగా బజాల్ చేతక్ ఈవీ అంటూ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. అయితే 1987లో బజాజ్ చేతక్ మార్కెటోకి వచ్చినప్పుడు దాని ధర రూ. 10,652 మాత్రమే. స్కూటర్ ధర తక్కువగా చూపించేందుకు పన్ను తక్కువగా ఉండే పాండిచ్చేరి ఎక్స్‌షోరూం ధరను పేర్కొంది బజాజ్. బజాజ్ వెస్పా స్కూటర్ అన్ని పన్నులతో కలుపుకుని కేవలం 2,129 మనకు వచ్చేది. ఆ ధరకు కొనాలంటే మనం టైం మిషన్‌లో 1961కి వెళ్లాలి. ఇక ఇదే స్కూటర్‌కి వెనుక సీటు, స్పేర్ వీల్ , ట్యూబ్ కావాలంటే అదనంగా మరో రూ. 114 చెల్లిస్తే సరి. ఇప్పుడంటే డౌన్‌పేమెంట్ కట్టి ఈఎంఐలకి వెళ్లడం సాధారణ విషయంగా మారింది. కానీ 80ల్లో అదేంతో కష్టమైన పని. 80వ దశకంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా వచ్చిన రాజ్‌దూత్ తన అమ్మకాలు పెంచుకునేందుకు ఈఎంఐని ప్రవేశపెట్టింది. కేవలం రూ. 3,500 కడితే చాలు బండి మీ సొంతం అంటూ ప్రకటనలు గుప్పించింది. మైలేజీ రావాలంటే 100 సీసీ నుంచి 125 సీసీ, పవర్ కావాలంటే 150 సీసీ నుంచి 350 సీసీ బైకులు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. కానీ 1963లోనే ఏకంగా 750 సీసీ ఇంజన్‌తో బైకును మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్ సెప్టార్ పేరుతో వచ్చిన బైక్ ఆ రోజుల్లో ఓ సంచలనం. దేశీ వాహన తయారీ కంపెనీల్లో మహీంద్రా అండ్ మహీంద్రాని ప్రత్యేక స్థానం. పదిహేనేళ్ల కిందటి వరకు కూడా రూరల్ ఇండియా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో మహీంద్రా జీపులది ప్రత్యేక స్థానం. అయితే 1960 మహీంద్రా జీపు ధర కేవలం రూ. 12,421 మాత్రమే. అంతేకాదు ఆ రోజుల్లో అమ్మకాలు పెంచేందుకు రూ. 200 డిస్కౌంట్ కూడా ప్రకటించింది. జనరల్ మోటార్స్ వారి షెవర్లేట్ కారుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అందరికీ సుపరిచితమైన బ్రాండ్. స్వాతంత్రానికి పూర్వం షెవర్లెట్ కారును కలిగి ఉండటం స్టేటస్ సింబల్‌గా ఉండేది. ఈ రోజుల్లో రచయితలు తమ కథనాయకుడు, నాయికల ఎంత ధనవంతులో వర్ణించేందుకు షెవర్లెట్ పేరును తరచుగా ఉపయోగించేవారు. 1936లో షెవర్లెట్ కారు ధర రూ.3,675. ఈ ధరకు ఇప్పుడు కారు టైరు కూడా రావడం లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు అత్యధికంగా ఉపయోగించిన కారు అంబాసిడర్. ఆ తర్వాత పద్మినీ ప్రీమియర్, స్టాండర్డ్ హెరాల్డ్‌లు. ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ మోటార్స్ తయారు చేసిన ఈ కార్లు ఇంచుమించు 2000 వరకు ఇండియా రోడ్లపై తమ ఆధిపత్యం చూపించాయి. 1972లో ఆ కార్ల ధరలు ఎలా ఉన్నాయో ఈ లుక్కేయ్యండి. కార్లకు ఇప్పుడైతే ఎక్సైజ్ డ్యూటీ కారు ఇంజన్ కెపాసిటీని బట్టి 12.50 శాతం నుంచి 30 శాతం వరకు వసూలు చేస్తున్నారు. 1963లో స్టాండర్డ్ కంపానియన్ కారు ధర రూ. 12,635 అయితే ఎక్సైజ్ డ్యూటీ కేవలం రూ. 333 మాత్రమే. ఇప్పుడీ పాత జ్ఙాపకాలన్నీ ఎందుకు తెరపైకి వచ్చాయంటే.... ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఫియట్ కారుకు సంబంధించిన పేపర్ యాడ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ యాడ్‌లో ఫియట్ కారు ధర రూ.9,800లుగా ఉంది. ఆహ్ ! ద గుడ్ ఓల్డ్ డేస్ అంటూ కామెంట్ పెట్టారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు చాలా మంది నెటిజన్లు స్పందించారు. తమ అనుభవాలను కూడా షేర్ చేసుకున్నారు. Ah the good old days… pic.twitter.com/SNH3Cwirki — anand mahindra (@anandmahindra) July 14, 2021 -
ప్యుగోట్ చేతికి అంబాసిడర్ బ్రాండ్
కోల్‌కతా: దేశీయంగా కార్ల విపణిలో ఓ వెలుగు వెలిగిన అంబాసిడర్ బ్రాండ్.. తాజాగా ఫ్రాన్స్ కి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ప్యుగోట్ చేతికి చేరింది. దాదాపు రూ. 80 కోట్లకు దీన్ని విక్రయించేందుకు సీకే బిర్లా గ్రూప్ సారథ్యంలోని హిందుస్తాన్ మోటార్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, తమకు చెల్లించాల్సిన బకాయిల వివాదం ఇంకా పరిష్కారం కాకుండానే.. యాజమాన్యం అంబాసిడర్ బ్రాండ్ విక్రయించడం సరికాదని కంపెనీ కార్మిక నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 1957లో అంబాసిడర్ కార్ల తయారీ ప్రారంభం కాగా... కాలక్రమంలో ప్రాభవం కోల్పోయిన నేపథ్యంలో 2014 మేలో హిందుస్తాన్ మోటార్స్ వీటి తయారీ నిలిపివేసింది. అంబాసిడర్ బ్రాండ్‌ను వినియోగించుకుని దేశీయంగా కార్ల ఉత్పత్తి పెంచుకోవాలని ప్యుగోట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇరు కంపెనీలు స్పష్టత ఇవ్వలేదు. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం త్వరలోనే ప్యుగోట్ దేశీయంగా ఏడాదికి లక్ష కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.