breaking news
Hazrat ibrahim Alai Salam
-
బక్రీద్ అహంకార త్యాగం... స్నేహోత్సవం
బక్రీద్ అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది ‘ఖుర్బానీ’ లేదా త్యాగం. కానీ ఆ త్యాగం కేవలం జంతువు వరకే పరిమితమై ఉండదు. నిజమైన త్యాగం అంటే మనలోని అహంకారాన్ని వదిలేయడం, స్వార్థాన్ని త్యజించడం. మనకు ఉన్నదాంట్లో కొంత అవసరమైన వారికి పంచడం. మన ఇష్టాల కంటే దేవుని ఆజ్ఞకు, మానవత్వానికి ప్రాధాన్యమివ్వడం. బక్రీద్ మనిషికి నేర్పే అసలు పాఠం ఇదే.సాధారణంగా పండుగ అంటేనే ఆనందం, కొత్తబట్టలు, పిండివంటలు అనుకుంటాం. కానీ, బక్రీద్ పర్వదినం వెనుక ఒక గొప్ప సామాజిక సందేశం దాగి ఉంది. దైవాజ్ఞను శిరసావహిస్తూ ప్రాణసమానమైన కుమారుడిని సైతం త్యాగం చేయడానికి సిద్ధపడిన హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం మనకు కేవలం భక్తిని మాత్రమే కాదు, సమాజం కోసం స్వార్థాన్ని వదులుకోవాలనే గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.పంపిణీలో సమానత్వంపండుగ రోజున చేసే ఖుర్బానీ, దానధర్మాల వెనుక ఉన్న అసలైన పరమార్థం సామాజిక సమానత్వమే. ఖుర్బానీ మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి... ఒక భాగం పేదలకు, ఒక భాగం బంధుమిత్రులకు, మరొక భాగం తమ కుటుంబానికి కేటాయించే సాంప్రదాయం ఇందులో ఉంది. సంపాదన ఉన్నవారు, లేనివారు అనే తేడా లేకుండా సమాజంలో ప్రతి ఒక్కరికీ పండుగ ఆనందం అందాలనే ఉద్దేశంతోనే ఈ పంపిణీ వ్యవస్థ ఏర్పాటయింది. ఇందులో ఎక్కడా కులాల, మతాల ప్రస్తావన ఉండదు, కేవలం మానవత్వం మాత్రమే ప్రాధాన్యత సంతరించుకుంటుంది.మన భారతదేశం ఎప్పుడూ గంగా – జమున తహజీబ్‌కు, అంటే భిన్నత్వంలో ఏకత్వానికి నిలువుటద్దంగా ఉంది. ఒకరి పండుగను మరొకరు గౌరవించుకుంటూ, ఒకరి సంతోషంలో మరొకరు భాగస్వాములు కావడం ఇక్కడి సంస్కృతి. హిందూ ముస్లింసోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ప్రేమాభిమానాలను పంచుకోవడం మన సమాజానికి ఉన్న అసలైన బలం.అపోహలు వీడాలి – సామరస్యం పెరగాలిప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత పండుగల సందర్భాలలో అనవసరమైన విమర్శలు, అపోహలు ప్రచారంలోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో విజ్ఞత గల సమాజంగా మనం మరింత బాధ్యతగా వ్యవహరించాలి. పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక, నైతిక కోణాలను అర్థం చేసుకోకుండా కేవలం బాహ్య ఆచారాలను మాత్రమే విమర్శించడం సరికాదు. ప్రతి మతంలోనూ మానవ కళ్యాణాన్ని ఆకాంక్షించే సంప్రదాయాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని, గౌరవించినప్పుడే పరమత సహనం అనే పునాదిపై మన సమాజం మరింత బలంగా నిలబడుతుంది. ముఖ్యంగా యువత ఇరువర్గాల సంస్కృతులను అర్థం చేసుకుంటూ, డిజిటల్ ప్రపంచంలో సైతం శాంతిని, సామరస్యాన్ని పెంపొందించేలా సానుకూల సందేశాలను వ్యాప్తి చేయాలి.కులమతాల పట్టింపులను పక్కన పెట్టి, మానవులంతా ఒక్కటే అనే సత్యాన్ని గ్రహించి, ద్వేషాలను వీడి స్నేహ హస్తాలను చాచుకుంటూ ముందుకు సాగడమే ఈ బక్రీద్ పర్వదినం మనకు అందించే అసలైన సందేశం. ఈ పర్వదినం అందరి జీవితాల్లో సుఖసంతోషాలను నింపి, సమాజంలో సరికొత్త సామరస్యానికి బాటలు వేయాలని ఆకాంక్షిద్దాం.పండుగ జరుపుకోవడంలో సామాజిక బాధ్యతమారుతున్న కాలంతోపాటు పండుగలు జరుపుకునే విధానంలో సామాజిక బాధ్యత కూడా మరింత పెరగాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని కాపాడుకుంటూ, ఇరుగు΄÷రుగు వారి భావోద్వేగాలను గౌరవిస్తూ, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కూడా ఒకరకమైన సామాజిక త్యాగమే అవుతుంది. ఒకరికొకరు ఇబ్బంది కలగకుండా శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకున్నప్పుడే ఆ పండుగకు పరిపూర్ణత లభిస్తుంది. – మదీహా అర్జుమంద్ -
త్యాగనిరతిని చాటిచెప్పే బక్రీద్
బాన్సువాడ/బిచ్కుంద/నిజామాబాద్ కల్చరల్ : త్యాగనిరతిని చాటి చెప్పే బక్రీద్(ఈద్-ఉల్-జుహా) పండుగను జిల్లావ్యాప్తంగా సోమవారం ముస్లింలు ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాలతో పాటు జిల్లావ్యాప్తంగా ఈద్గా్హ లలో ప్రార్థనలు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పండుగ నేపథ్యం ప్రవక్త హజ్రత్ ఇబ్రాహిం అలై సలాంకు మూడురోజుల పాటు అల్లాహ్ కలలో ప్రత్యక్షమై ‘నా కోసం నీకు ఇష్టమైన వస్తువును త్యాగం (ఖుర్బాన్)’ చేయాలని ఆజ్ఞాపిస్తారు. తనకు ఇష్టమైనది తన కుమారుడైన ఇస్మాయిలేనని, అల్లాహ్ కోసం దేనికైనా సిద్ధమని ఇబ్రాహిం(స) చెబుతారు. ఇస్మాయిల్‌ను తీసుకుని మక్కా షరీఫ్ నుంచి మదీనాకు ఒంటెపై తీసుకెళ్తుంటారు. అప్పుడు మార్గమధ్యలో వారి మనసును మార్చేందుకు మూడు సార్లు షైతాన్ అడ్డుపడుతుంది. హజ్రత్ ఇబ్రాహిం(స) తన మనసును మార్చకుండా షైతాన్ను రాళ్లతో కొట్టి తరిమివేస్తారు. అనంతరం మదీనాలోని మీనా వద్ద దైవనామ స్మరణ చేస్తూ ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్ (కోయడం) చేయడానికి సిద్ధమవుతారు. అప్పుడే అల్లాహ్ దూత అయిన హజ్రత్ జిబ్రాయిల్ అలైసలాం, స్వర్గం నుంచి తెచ్చిన పొట్టెలును ఇస్మాయిల్ స్థానంలో ఉంచుతారు. ప్రవక్త చేయదల్చిన త్యాగంతో అల్లాహ్ ప్రసన్నడవుతారు. ‘కేవలం కలలో చూసిన దాన్ని నిజం చేసి చూపించావు. ఈ పరీక్షలో నువ్వు గెలిచావు. ఇక భౌతిక చర్యగా మిగిలిపోయిన బలితో నాకు నిమిత్తమేమి లేదు. ఈ శుభసమయంలో మీ త్యాగనిరతికి గుర్తింపుగా ఈ పొట్టెలును పంపించాను’ అని ప్రసన్నులవుతారు. అప్పటి నుంచి ముస్లింలు ప్రతీ ఏడాది అదే బక్రీద్ రోజు పొట్టేలు, మేకలను అల్లాహ్ కోసం ఖుర్బాన్ (త్యాగం) చేస్తారు. ఈద్గాహ్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు సోమవారం ఈద్గాహ్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. జిల్లాకేంద్రంలోని ఖిల్లా, గాంధీచౌక్, ధర్మపురిహీల్స్ వద్ద గల ఈద్గాహ్ల్లో ఇప్పటికే ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. వీటిని ఆదివారం నగర మేయర్ ఆకుల సుజాత, డిప్యూటీ మేయర్ ఫయిమ్, కార్పొరేటర్ అజీజ్, మున్సిపల్ అధికారులు స్థానిక ఖిల్లా ఈద్గాహ్ను సందర్శించారు.


