బక్రీద్ అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది ‘ఖుర్బానీ’ లేదా త్యాగం. కానీ ఆ త్యాగం కేవలం జంతువు వరకే పరిమితమై ఉండదు. నిజమైన త్యాగం అంటే మనలోని అహంకారాన్ని వదిలేయడం, స్వార్థాన్ని త్యజించడం. మనకు ఉన్నదాంట్లో కొంత అవసరమైన వారికి పంచడం. మన ఇష్టాల కంటే దేవుని ఆజ్ఞకు, మానవత్వానికి ప్రాధాన్యమివ్వడం. బక్రీద్ మనిషికి నేర్పే అసలు పాఠం ఇదే.
సాధారణంగా పండుగ అంటేనే ఆనందం, కొత్తబట్టలు, పిండివంటలు అనుకుంటాం. కానీ, బక్రీద్ పర్వదినం వెనుక ఒక గొప్ప సామాజిక సందేశం దాగి ఉంది. దైవాజ్ఞను శిరసావహిస్తూ ప్రాణసమానమైన కుమారుడిని సైతం త్యాగం చేయడానికి సిద్ధపడిన హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం మనకు కేవలం భక్తిని మాత్రమే కాదు, సమాజం కోసం స్వార్థాన్ని వదులుకోవాలనే గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.
పంపిణీలో సమానత్వం
పండుగ రోజున చేసే ఖుర్బానీ, దానధర్మాల వెనుక ఉన్న అసలైన పరమార్థం సామాజిక సమానత్వమే. ఖుర్బానీ మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి... ఒక భాగం పేదలకు, ఒక భాగం బంధుమిత్రులకు, మరొక భాగం తమ కుటుంబానికి కేటాయించే సాంప్రదాయం ఇందులో ఉంది. సంపాదన ఉన్నవారు, లేనివారు అనే తేడా లేకుండా సమాజంలో ప్రతి ఒక్కరికీ పండుగ ఆనందం అందాలనే ఉద్దేశంతోనే ఈ పంపిణీ వ్యవస్థ ఏర్పాటయింది. ఇందులో ఎక్కడా కులాల, మతాల ప్రస్తావన ఉండదు, కేవలం మానవత్వం మాత్రమే ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
మన భారతదేశం ఎప్పుడూ గంగా – జమున తహజీబ్‌కు, అంటే భిన్నత్వంలో ఏకత్వానికి నిలువుటద్దంగా ఉంది. ఒకరి పండుగను మరొకరు గౌరవించుకుంటూ, ఒకరి సంతోషంలో మరొకరు భాగస్వాములు కావడం ఇక్కడి సంస్కృతి. హిందూ ముస్లింసోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ప్రేమాభిమానాలను పంచుకోవడం మన సమాజానికి ఉన్న అసలైన బలం.
అపోహలు వీడాలి – సామరస్యం పెరగాలి
ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత పండుగల సందర్భాలలో అనవసరమైన విమర్శలు, అపోహలు ప్రచారంలోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో విజ్ఞత గల సమాజంగా మనం మరింత బాధ్యతగా వ్యవహరించాలి. పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక, నైతిక కోణాలను అర్థం చేసుకోకుండా కేవలం బాహ్య ఆచారాలను మాత్రమే విమర్శించడం సరికాదు. ప్రతి మతంలోనూ మానవ కళ్యాణాన్ని ఆకాంక్షించే సంప్రదాయాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని, గౌరవించినప్పుడే పరమత సహనం అనే పునాదిపై మన సమాజం మరింత బలంగా నిలబడుతుంది. ముఖ్యంగా యువత ఇరువర్గాల సంస్కృతులను అర్థం చేసుకుంటూ, డిజిటల్ ప్రపంచంలో సైతం శాంతిని, సామరస్యాన్ని పెంపొందించేలా సానుకూల సందేశాలను వ్యాప్తి చేయాలి.
కులమతాల పట్టింపులను పక్కన పెట్టి, మానవులంతా ఒక్కటే అనే సత్యాన్ని గ్రహించి, ద్వేషాలను వీడి స్నేహ హస్తాలను చాచుకుంటూ ముందుకు సాగడమే ఈ బక్రీద్ పర్వదినం మనకు అందించే అసలైన సందేశం. ఈ పర్వదినం అందరి జీవితాల్లో సుఖసంతోషాలను నింపి, సమాజంలో సరికొత్త సామరస్యానికి బాటలు వేయాలని ఆకాంక్షిద్దాం.
పండుగ జరుపుకోవడంలో సామాజిక బాధ్యత
మారుతున్న కాలంతోపాటు పండుగలు జరుపుకునే విధానంలో సామాజిక బాధ్యత కూడా మరింత పెరగాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని కాపాడుకుంటూ, ఇరుగు΄÷రుగు వారి భావోద్వేగాలను గౌరవిస్తూ, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కూడా ఒకరకమైన సామాజిక త్యాగమే అవుతుంది. ఒకరికొకరు ఇబ్బంది కలగకుండా శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకున్నప్పుడే ఆ పండుగకు పరిపూర్ణత లభిస్తుంది.
– మదీహా అర్జుమంద్


