breaking news
handloom profession
-
పోచంపల్లిలో అమెరికన్ల సందడి
భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : పోచంపల్లిలో మంగళవారం అమెరికా దేశానికి చెందిన ఆరుగురు పర్యాటకులు సందడి చేశారు. గ్రామీణ ప్రజల జీవన విధానం, చేతివృత్తులను అధ్యయనం చేసేందుకు రెండు వారాల పాటు ఇండియా పర్యటనకు వచ్చిన వీరు పోచంపల్లిలోని చేనేత గృహాలను సందర్శించి చేనేత వస్త్ర తయారీని పరిశీలించారు. మగ్గాలపై తయారవుతున్న వస్త్రాలను చూసి కార్మికుల పనితనాన్ని కొనియాడారు. అనంతరం తట్టలు అల్లడం, కార్పెంటర్ తదితర చేతివృత్తులను పరిశీలించారు. పోచంపల్లి ప్యూపిల్స్ స్కూల్‌ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇక్కడ అమలవుతున్న విద్యావిధానంపై ఆరా తీశారు. పిండి వంటల రుచి చూశారు. సంస్కృతి, సంప్రదాయాలకు ఇండియా పెట్టింది పేరని, అందులో పోచంపల్లిని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందని అమెరికన్లు పేర్కొన్నారు. ఇలాంటి చేనేత, చేతివృత్తులాంటి ప్రాచీన కళ ఇక్కడే చూస్తున్నామని, అమెరికాలో లేవన్నారు. ఇప్పటికే ఆగ్రా, ఢిల్లీ, పాట్నా, జైపూర్ తదితర పర్యాటక కేంద్రాల్లో పర్యటించామని తెలిపారు. వీరికి నోయల్ మార్గదర్శకం చేశారు. విదేశీయులలో పేడ్, మేరినో, క్రిస్టిన్ తదితరులు ఉన్నారు. -
చేనేత వృత్తిని కాపాడాలి
నల్లగొండ రూరల్ : దేశంలో వ్యవసాయరంగం తర్వాత రెండవ స్థానంలో ఉన్న అతిపెద్ద చేనేత రంగాన్ని కాపాడి ఆత్మహత్యలను నివారించాలని పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల యాదగిరి, పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నల్లగొండలోని రాంనగర్లో గాంధీ విగ్రహానికి చేనేత నూలు మాలను వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆత్మహత్యలు, వలసల నివారణ కోసం చేనేత కార్మికులకు వడ్డీలేని రుణం, రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. నగదు రహిత వైద్యాన్ని కార్పొరేట్ ఆస్పత్రిలో చేయించాలని, కేజీ టూ పీజీ విద్యను వర్తింపజేయాలని, కళ్యాణలక్ష్మీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పదవుల్లో జనాభా ప్రాతిపదికన చేనేతకు స్థానం కల్పించాలన్నారు. నేతన్న సలాం పేరుతో గంజీ శ్రీనివాస్ రూపొందించిన సీడీని ఆవిష్కరించారు. అంతకుముందు హ్యాండ్లూమ్ వాక్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నేత, శ్రీశైలం, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుడు సుధీర్ నారాయణ, వెంకన్న, సురేష్, వెంకటయ్య, గిరీష్, నీలయ్య, యాదగిరి, అంజయ్య, శ్రీనివాస్, పున్న వీరేశం తదితరులు పాల్గొన్నారు.