'నాలాగా ఎవరూ చనిపోవద్దు'
పాటియాల: హాస్టల్ ఖర్చు భరించలేకపోతున్నానని పేర్కొంటూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసి ఓ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ ప్లేయర్ ప్రాణాలు విడిచింది. తాను ఉంటున్న వసతి గృహంలోనే ఆత్మహత్య చేసుకుంది. తనలాంటి పరిస్థితి మరెవరికి రాకుండా చూడాలని ప్రధానికి ఆమె రాసిన ఆత్మహత్య లేఖలో పేర్కొంది. పూజా అనే విద్యార్థిని ఖాల్సా కాలేజీలో చదువుతోంది.
ఆమె జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ ప్లేయర్. అయితే, వారిది పేదరికంతో బాధపడుతున్న కుటుంబం. తండ్రి తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతుంటాడు. ఈ కారణంగా ఆమెకు హాస్టల్ ఫీజు కట్టడం కష్టంగా మారింది. కాలేజీ యాజమాన్యం ఉచితంగా హాస్టల్ వసతిని ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కలత చెందిన పూజా ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసింది. తనలాంటి పేద విద్యార్థినులకు ఉచిత విద్య అందించాలని కోరింది. తన చావుకు తనను హాస్టల్ ఉండొద్దని హెచ్చరించిన ఓ ప్రొఫెసర్ కూడా కారణం అని ఆమె పేర్కొంది.