breaking news
government ministers
-
రోజ్‌గార్ మేళాల ద్వారా 1.47 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: రోజ్‌గార్ మేళాల కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వతంత్య్ర సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో కొత్తగా 1.47 లక్షల మందిని నియమిస్తూ నియామకపత్రాలు అందజేశామని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. ఇంకా భర్తీకాని పోస్టులకుగాను నియామక ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంచేశారు. 2020–21 కాలానికిగాను దేశంలో నిరుద్యోగిత 4.2 శాతంగా నమోదైందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అదే కాలానికి దేశంలోని మొత్తం జనాభాలో ఏదైనా ఒక వృత్తిలో నిమగ్నమైన జనాభా(వర్కర్ పాపులేషన్ రేషన్–డబ్లూపీఆర్) 52.6 శాతంగా నమోదైందని తెలిపారు. కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు, కోవిడ్ సంక్షోభం నుంచి దేశార్థికాన్ని ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద కేంద్రప్రభుత్వం రూ.27 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని అమలుచేసిందన్నారు. ఈ పథకం కింద లబ్దిపొందాలనుకునే సంస్థల రిజిస్ట్రేషన్ గడువు ఈ ఏడాది మార్చి 31నాడే ముగిసిందన్నారు. 60 లక్షల ఉద్యోగాల సృష్టి కోసం రూ.1.97 లక్షల కోట్లతో ఉత్పత్తి ప్రోత్సాహక రాయితీ పథకం తెచ్చామని మంత్రి చెప్పారు. -
ఇదేం ఖర్మండీ బాబూ!
జన చైతన్య యాత్రల్లో పాల్గొనాలంటూ మంత్రుల ఒత్తిళ్లు నోరు మెదిపే ధైర్యం లేక సతమతమవుతున్న అధికారులు తొలిరోజు వివిధ జిల్లాల్లో మండల స్థాయి అధికారుల హాజరు సాక్షి, విజయవాడ అధికార టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రల్లో పాల్గొనాలంటూ పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యేకంగా ఫోన్లు చేస్తున్నారు. 'ఏం జరిగినా మేం చూసుకుంటాం' అని భరోసా ఇస్తున్నారు. ఏం చెప్పినా నేతలు వినరన్న భావనతో మండల స్థాయిలో పనిచేసే చాలామంది అధికారులు మంగళవారం జన చైతన్య యాత్రలకు హాజరయ్యారు. 'ఇదేం ఖర్మండీ బాబూ... ప్రశాంతంగా ఆఫీస్ పనులు చేసుకోలే కపోతున్నాం. ఇలాగైతే ఉద్యోగాలెలా చేయాలి' అని కృష్ణా జిల్లాలోని పలువురు మండల అధికారులు ఒకరికొకరు ఫోన్లు చేసుకొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులు, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు తాము పాల్గొనే మండలాలకు చెందిన ఎంపీడీఓ, తహసీల్దార్, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈలు, వ్యవసాయ శాఖ ఏఓలకు ఫోన్లు చేశారు. జన చైతన్య యాత్రలకు రావాలని రెండ్రోజుల ముందే చెప్పారు. కాదంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయంతో కొందరు అధికారులు మంగళవారం నాటి యాత్రలకు హాజరయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కరగ్రహారం, చినకరగ్రహారం గ్రామాల్లో జరిగిన చైతన్య యాత్రలో ఎంపీడీఓ, పంచాయతీరాజ్ ఏఈలు కూడా పాల్గొన్నారు. పెనమలూరు, మైలవరం, నూజివీడు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లాలోనూ అధికారులకు ఈ బాధ తప్పలేదు. జిల్లాకు చెందిన ఓ మంత్రి పదేపదే చెప్పడంతో అమరావతి మండలం లేమల్లె, యండ్రాయి గ్రామాల్లో జరిగిన సభలకు తహసీల్దార్, ఎంపీడీఓ, ఏఓ హాజరయ్యారు. విశాఖ జిల్లాలోని తగరపువలస, అనకాపల్లి, భీమిలి, చోడవరం, యలమంచిలి మండలాల్లో కొందరు అధికారులు జన చైతన్య యాత్రలకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరులో జరిగిన కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ కొన్ని మండలాల్లో అధికారులు జన చైతన్య యాత్రలకు హాజరైనట్లు సమాచారం. ప్రతి సోమవారం నరకమే: ప్రతి సోమవారం జరిగే కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లతో నరకం అనుభవించాల్సి వస్తోందని పలువురు మండల అధికారులు గగ్గోలు పెడుతున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా సాగే వీడియో కాన్ఫరెన్స్ వల్ల విలువైన సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.