Girish Mahajan
-
వైరల్: పాము ఆట కట్టించి ఔరా అనిపించిన మాజీ మంత్రి
ముంబై: నిత్యం వివాదాస్పద చర్యలతో వార్తల్లో ఉండే బీజేపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి గిరీశ్ మహాజన్ పాము ఆట కట్టించి ఔరా అనిపించారు. ప్రజల మధ్యకు వచ్చిన పామును స్వయంగా చేతితో పట్టి బయటకు వదిలేశాడు. ఈ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని జమ్నీర్ పట్టణంలో మంగళవారం సాయంత్రం జనబాహుళ్యంలోకి అకస్మాత్తుగా పాము ప్రత్యక్షమైంది. గుడి వెనుకాల పాము కనపడడంతో కలకలం రేపింది. భయంతో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడి ఉన్నారు. పామును పట్టుకుంటున్న మాజీ మంత్రి గిరీశ్ మహాజన్ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి గిరీశ్ మహాజన్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అందరినీ పక్కకు జరిపి పాము వద్దకు ఆయన వెళ్లారు. అమాంతం ఐదడుగుల పామును స్వయంగా చేతితో పట్టుకున్నారు. తమ నాయకుడు పామును చాకచక్యంగా పట్టుకోవడంతో అక్కడ ఉన్నవారంతా కేరింతలు కొట్టారు. ఆయన సాహసాన్ని అందరూ మెచ్చుకున్నారు. పామును పట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన పాములకు స్నేహితుడు. పాములను పట్టుకుంటూ వాటిని ఆట పట్టిస్తూ ఉంటాడు. గతంలో ఎన్నో పాములు పట్టుకున్నారు. అయితే తాజాగా జన బాహుళ్యంలో నాయకుడి తెగువను చూసి నెటిజన్లు అభినందిస్తున్నారు. గిరీశ్ మహాజన్ మహారాష్ట్రలో కీలక నేత. బీజేపీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. అతడిపై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. जळगाव: भाजपा नेते, माजी मंत्री गिरीष महाजनांनी पकडला साप. @girishdmahajan #girishmahajan @BJP4Maharashtra #Jalgaonhttps://t.co/CbvSFUjpi9 pic.twitter.com/DuAvEuYNOy — Lokmat (@MiLOKMAT) July 20, 2021 -
పరామర్శించడానికా.. ఎంజాయ్ చేయడానికా!..
సాక్షి, ముంబై: వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి గిరీష్ మహాజన్ సెల్ఫీ వీడియోల వ్యవహారం వివాదాస్పదమైంది. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ఆ రాష్ట్రంలో సాంగ్లీ, కొల్హాపూర్ జిల్లాలో అధిక భాగం ముంపుకు గురైంది. ఈ నేపథ్యంలో గురువారం బాధితులను పరామర్శించటానికి మంత్రి అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో తీసిన రెండు వీడియోలు బయటకొచ్చాయి. ఒక దానిలో ఆయన నవ్వుతూ, చేతులూపుతుండగా, మరో వీడియోలో రోడ్డు మీద నిలబడి ముంపు ప్రాంతాలను చూస్తున్నట్టు ఉంది. దీంతో నువ్వు బాధితులను పరామర్శించడానికి వెళ్లావా? లేక టూర్ ఎంజాయ్ చేయడానికి వెళ్లావా? అంటూ ప్రతిపక్ష ఎన్సీపీ నేత ధనుంజయ్ ముండే మండిపడ్డారు. అంతేకాక, ఇలాంటి చర్యకు పాల్పడిన మంత్రిని క్యాబినెట్ నుంచి తొలగించి, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆయన డిమాండ్ చేశారు. కాగా, పశ్చిమ మహారాష్ట్రలో ఉన్న ఈ రెండు జిల్లాల్లో వరదల వల్ల ఇప్పటికే దాదాపు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. -
‘25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు’
ముంబై : కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన కనీసం 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని మహారాష్ట్ర జలవనరుల మంత్రి గిరీష్ మహాజన్ శనివారం ముంబైలో చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు విపక్షానికి భారీ ఎదురుదెబ్బ తగలనుందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు పలువురు తనతో టచ్‌లో ఉన్నారని, కొందరు తనను వ్యక్తిగతంగా కలిశారని, కొందరు ఫోన్ చేశారని వెల్లడించారు. మరికొందరు మూడో వ్యక్తి ద్వారా బీజేపీలో చేరేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశారని చెప్పారు. తనచుట్టూ ఉన్నవారు త్వరలోనే ఏదో ఒక సమయంలో పార్టీ మారవచ్చనే సంగతి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్‌కు తెలియదన్నారు. ఎవరైనా బేషరతుగానే చేరాలి స్వయంగా ముఖ్యమంత్రే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలను మహాజన్ ఖండించారు. పార్టీలో బేషరతుగానే చేరాలన్న విషయం కొత్తగా వచ్చేవారికి బీజేపీ స్పష్టం చేసిందన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత రాధాకృష్ణ విఖే తమ పార్టీలో చేరవచ్చని అన్నారు. -
మహారాష్ట్రలో బీజేపీ విజయకేతనం
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని జామ్నర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 25 కార్పొరేషన్లలోనూ అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన రాష్ట్ర జలవనరులు, వైద్యశాఖ మంత్రి గిరీశ్ మహాజన్ భార్య సాధనా మహాజన్ ఎన్సీపీ అభ్యర్థి అంజలి పవార్‌పై 8400 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గిరీశ్ మహాజన్.. అన్నాహజారే దీక్ష, మహా రైతుల ర్యాలీ సమయంలో ఏర్పడిన సవాళ్లను ఎదుర్కోవడంలో ఫడ్నవిస్‌కు సలహాలు ఇవ్వడం ద్వారా ట్రబుల్ షూటర్‌గా పేరు పొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన భార్య గెలుపొందడం ద్వారా మహా రాజకీయాల్లో పట్టు సాధించడం ఆయనకు మరింత సులభంగా మారింది. సొంత పార్టీలోనే శత్రువుగా భావించే ఏక్నాథ్ ఖడ్సేపై పై చేయి సాధించినట్టయింది. ఇది ప్రజా విజయం : గిరీశ్ మహాజన్ జామ్నర్ మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై గిరీశ్ మాట్లాడుతూ.. జామ్నర్లో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారన్నారు. ఎన్సీపీ నాయకుల కుల రాజకీయాలు ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయని ఎద్దేవా చేశారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇక ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. ఓటుకు 5 వేల రూపాయలు ఇచ్చారు : ఎన్సీపీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీ డబ్బు వెదజల్లిందని ఎన్సీపీ నాయకులు ఆరోపించారు. గిరీశ్ మహాజన్ ఇంటింటికీ తిరిగి ఓటుకు 5 వేల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. ఓడిపోతామనే భయంతోనే దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. -
గన్‌తో వేటాడుతూ బుక్ అయిన మంత్రి
-
గన్‌తో వేటాడుతూ బుక్ అయిన మంత్రి
సాక్షి, ముంబై : సోషల్ మీడియాలో ఇప్పుడు మహారాష్ట్ర మంత్రి గిరీశ్ దత్తాత్రేయ మహాజన్ చేసిన పని వైరల్ అవుతోంది. పిస్టోల్‌తో ఓ చిరుతను ఆయన వేటాడుతున్న దృశ్యాలవి. సోమవారం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆయన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. జలగావ్ జిల్లా ఛలీస్గావ్లో గత కొన్ని రోజులుగా ఓ చిరుత సంచారం స్థానికుల్లో భయాందోళనలు రేపుతోంది. వరుసగా మనుషులు, పశువులను బలి తీసుకుండటంతో దానిని వేటాడేందుకు అటవీ శాఖ కూడా వేటగాళ్లకు అనుమతి ఇచ్చింది. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా ఎవరూ ఇంత వరకు దాని అంతు చూడలేకపోయారు. ఆ గ్రామం తన నియోజకవర్గం కిందకే రావటంతో స్వయానా మహాజనే రంగంలోకి దిగారు. సోమవారం అటుగా వెళ్తున్న ఆయన కాన్వాయ్ ఆపించి మరీ తన లైసెన్స్ రివాల్వర్‌తో చిరుతను వేటాడేందుకు యత్నించారు. అయితే అది వారికి చిక్కలేదు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజా సంక్షేమం మాట పక్కనపెట్టి.. తనకు అవసరం లేకపోయినా మంత్రి ఇలా తుపాకీతో వేటాడం సరికాదన్న విమర్శలను కాంగ్రెస్ పార్టీనేతలు సహా పలువురు వినిపిస్తున్నారు. అయితే మంత్రి మాత్రం తన పనిని సమర్థించుకుంటున్నారు. కాగా, మహాజన్‌కు వివాదాలు కొత్తేం కాదు. మద్యం బ్రాండ్లకు మహిళల పేర్లు పెడితే అమ్మకాలు భారీగా పెరుగుతాయని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది ఈయనగారే. అంతేకాదు గతంలో ఓ వివాహ వేడకకు గన్‌తో దర్శనమిచ్చి కలకలమే రేపాయాయన. -
మద్యం బ్రాండ్లకు మహిళల పేర్లు పెట్టండి
ముంబై: మద్యం బ్రాండ్లకు మహిళల పేర్లు పెడితే అమ్మకాలు భారీగా పెరుగుతాయని మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ వ్యాఖ్యానించారు. గత శనివారం మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో ఓ చెక్కర మిల్లులో జరిగిన కార్యక్రమంలో గిరీశ్ మాట్లాడారు. ‘మద్యం లేదా ఇతర ఉత్పత్తుల విక్రయాలు పెరగాలంటే మహిళల పేర్లు పెట్టండి. ఇక చూసుకోండి డిమాండ్ ఎలా ఉంటుందో’ అని అన్నారు. సంబంధిత వీడియో యూట్యూబ్‌లో అప్లోడ్ అవడంతో విషయం బయటికొచ్చింది. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో గిరీశ్ వెంటనే క్షమాపణలు కోరారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై చందుర్బార్ జిల్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు మంత్రి గిరీశ్‌ను ఆహ్వానించిన సదరు చెక్కర మిల్లు యాజమాన్యం ‘మహారాజ’ పేరుతో మద్యం ఉత్పత్తులను విక్రయిస్తోంది. -
దావూద్ బంధువు పెళ్లి: చిక్కుల్లో మంత్రి, పోలీసులు
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బంధువు పెళ్లికి హాజరైన రాష్ట్ర మంత్రి , నాసిక్ మేయర్, పోలీసు ఉన్నతాధికారులు ఇబ్బందుల్లో పడ్డారు. ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రధాన అనుచరుడు , వైద్య విద్యాశాఖమంత్రి గిరీష్ మహాజన్ గాంగ్స్టర్ దావూధ్ బంధువుల వివాహానికి హాజరు కావడం దుమారాన్ని రేపింది. అసిస్టెంట్ పోలీసు కమిషనర్, ఇద్దరు సీనియర్ ఇన్స్పెక్టర్లతో సహా ఎనిమిది మంది పోలీసు అధికారులు ఈ వివాహానికి హాజరయ్యారు. దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మహారాష్ట్రలోని నాసిక్‌లోని దావూద్ ఇబ్రహీం బంధువు జగ్గి కొంకణి కుమార్తె వివాహం ఆధ్యాత్మిక గురువు ఖతిబ్ కుమారుడితో మే 19న జరిగింది. దావూద్ భార్య ,వధువు తల్లి తోబుట్టువులని నాసిక్ పోలీస్ కమీషనర్ రవీంద్ర సింఘాల్ నిర్ధారించారు. నాసిక్ మేయర్ రంజనా భనసి, డిప్యూటీ మేయర్ ప్రథమేష్ గైట్, బిజెపి శాసనసభ్యులు దేవని ఫరాండే, బాలసాహెబ్ సనాప్, సీమా హిరా, స్థానిక మునిసిపల్ కౌన్సిలర్లు తదితరులు ఈ పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు. దీంతో ఈ వివాహానికి హాజరైన పోలీసు అధికారులపై రవీంద్ర సింఘాల్ అంతర్గత విచారణ చేపట్టామన్నారు. వీరి స్టేట్మెంట్లను నమోదు చేసినట్టు చెప్పారు. అలాగే సెలవులో ఉన్న కొంతమంది అధికారులపై అంతర్గత విచారణ పూర్తిచేయడానికి మరో రెండు రోజులు పడుతుందని పోలీసు కమిషనర్ చెప్పారు. అభ్యంతరకరమైన, తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నట్లయితే సంబంధిత నివేదికను కోసం మా ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. ముస్లిం మత పెద్దల ద్వారా ఈ ఆహ్వానాలు ఎంఎల్ఏలకు, పోలీసు అధికారులకు, మరికొంతమంది కార్పొరేటర్లకు అందాయని ఆయన చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో మంత్రులను ప్రశ్నించలేమని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వివాహాలు, సామాజిక కార్యక్రమాలకు హాజరు కావద్దని తాము ఎవరినీ అడ్డుకోలేమన్నారు.అయితే పెళ్లికి హాజరయ్యేంతవరకు ఇది దావూద్ బంధువుల వివాహమని తనకు తెలియదని మంత్రి మహాజన్ చెప్పడం విశేషం. -
మంత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్
ముంబై: సాధారణంగా రోడ్లపై ట్రాఫిక్ ఏర్పడితే ఎప్పుడు క్లియర్ అవుతుందా అని అందరూ అలాగే చూస్తుండిపోతారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నియంత్రిస్తుంటారు. అయితే రాష్ట్ర మంత్రి చేసిన పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా హల్ చల్ చేస్తోంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్థానిక జల్గావ్లో మార్గంమధ్యలో ట్రాఫిక్ జామ్ కావడంతో వెంటనే స్పందించిన మంత్రి గిరీశ్ మహాజన్ తన కారు నుంచి దిగి భారీ ట్రక్కు వద్దకు పరుగులు తీశారు. మంత్రిగారు ఎందుకు పరుగెడుతున్నారో తెలియక అధికారులు అయన భద్రత దృష్ట్యా కంగారు పడ్డారు. రోడ్డుపై అడ్డంగా నిలిపి ఉన్న 14 చక్రాల భారీ వాహనాన్ని ఎక్కి రాష్ట్ర జలవనరులు, వైద్యశాఖల మంత్రి గిరీశ్ డ్రైవర్ అవతారం ఎత్తారు. రోడ్డుపై అడ్డంగా ఉండి ట్రాఫిక్ జామ్‌కు కారణమైన ట్రక్కును క్షణాల్లో నడిపి పక్కకు తీసుకెళ్లి ఆపేశారు. దీంతో అందరూ ఆయన చేసిన పనిని ప్రశంసించారు. తన భద్రత విషయాన్ని పక్కనపెట్టి వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేయడం అక్కడ చర్చనీయాంశమైంది. మద్యంమత్తులో ఉన్న డ్రైవర్ పోలీసులు పట్టుకుంటారని భయపడి ట్రక్కును రోడ్డుపై నిలిపి పారిపోయాడు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మంత్రి చర్య వల్ల ట్రాఫిక్ నిమిషాల్లో క్లియరైంది. అనంతరం ట్రక్కు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
మంత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్
-
‘ఛనాఖా-కొరట’ నిర్మాణానికి ఓకే
రాష్ట్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం లేఖ సాక్షి, హైదరాబాద్: గోదావరి ఉపనది అయిన పెన్‌గంగపై డ్యామ్ దిగువన ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ నిర్మించతలపెట్టిన ఛనాఖా-కొరట బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. నిర్ణీత కాల వ్యవధిలో బ్యారేజీ విషయమై రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు తమ అంగీకారాన్ని శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ పీజీ మందాడే, తెలంగాణ ప్రభుత్వానికి లేఖద్వారా తెలియజేశారు. బ్యారేజీ నిర్మాణంపై తాము తీసుకున్న నిర్ణయాలను మినిట్స్ రూపంలో రాష్ట్ర అధికారులకు పంపారు. పెన్‌గంగ నీటిని వినియోగంలోకి తెచ్చేందుకు ఛనాకా, కొరటల మధ్య 1.5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులను ఆరంభించేందుకు వీలుగా గత నెల 22న రాష్ట్ర ప్రభుత్వం రూ.368 కోట్ల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అనంతరం ఈ పనులకు అంగీకారం కోరుతూ రాష్ట్ర మంత్రుల బృందం గత నెల 24న ముంబై వెళ్లి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఆ చర్చల ఆధారంగా తాము తీసుకున్న నిర్ణయాలను రాష్ర్ట ప్రభుత్వానికి మహారాష్ట్ర తెలియజేసింది. మహారాష్ట్ర ప్రధాన నిర్ణయాలు ఇవీ.. ► వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోవాలి. ► ఛనాఖా-కొరట బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి అన్ని క్లియరెన్స్‌లను తెలంగాణ చూసుకోవాలి. ► ఈ బ్యారేజీ నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయం, మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు సంబంధించి పునరావాసం, భూసేకరణకు అయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరించాలి. ► ఛనాఖా - కొరట బ్యారేజీ నీటిలో గతంలో నిర్ణయించిన మేరకు తెలంగాణ, మహారాష్ట్రలకు 80ః20 నిష్పత్తిలో వాటా ఉండాలి. ► మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదం తీసుకున్న తర్వాత అంతర్రాష్ట్ర ఒప్పందం జరుగుతుంది. హరీశ్‌రావు హర్షం మహారాష్ట్ర తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం తెలిపినందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆ రాష్ట్ర జల వనరుల మంత్రి గిరీశ్ మహాజన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం తెలిపిన దృష్ట్యా, వచ్చేవారం టెండర్ల ప్రక్రియను ఆరంభించేందుకు సమాయత్తం కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. జనవరిలో ప్రాజెక్టు నిర్మాణపనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.