రాష్ట్రంలో టర్నోవర్ 1.30 లక్షల కోట్లు: ఎస్బీఐ
ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ విభాగం వ్యాపార టర్నోవర్ 1.30లక్షల కోట్లకు చేరినట్లు బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ సీఆర్ శశికుమార్ వెల్లడించారు. వీటిలో అడ్వాన్స్‌ల రూపంలో రూ. 61వేల కోట్లు,వ్యవసాయ రుణాలు రూ.25వేల కోట్లు, వ్యక్తిగత రుణాల విభాగంలో కార్లు, ద్విచక్రవాహన తదితర రుణాల కింద రూ.20వేల కోట్లు ఇచ్చామని తెలిపారు.
విశాఖలోని బ్యాంకు ప్రధాన బ్రాంచ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన ఉద్యమాల వలన కొన్ని ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో సీమాంధ్రలో బ్యాంకింగ్ వ్యాపారం మరింత పెరగగలదని అంచనా వేస్తున్నట్లు శశికుమార్ వివరించారు. ప్రస్తుతం బ్రాంచ్‌ల సంఖ్య 3,400 ఉండగా, రానున్న ఆర్థికసంవత్సరంలో అదనంగా మరో 100 ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే మరో 600 ఏటీఏం కేంద్రాలను కూడా నెలకొల్పనున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా క్యాష్‌డిపాజిట్ యంత్రాలు70 ఉండగా, వీటి సంఖ్యను 90కి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆరు ఈ-లాబీలు కూడా ప్రారంభిస్తామని శశి కుమార్ చెప్పారు. ఏటీఏం కేంద్రాల్లో అదనపు భద్రత అంశంపై ఉన్నతస్థాయి చర్చలు జరుగుతున్నాయన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాలపై ఈ ఏడాది రూ.11కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.
మార్కెట్లోకి బీఎండబ్ల్యూ దేశీ గ్రాన్ టూరిజ్మో
చెన్నై: భారత్‌లో తయారు చేసిన 3 సిరీస్ గ్రాన్ టూరిజ్మో కారును బీఎండబ్ల్యూ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 42.75 లక్షలు (ఆల్ ఇండియా ఎక్స్ షోరూం ధర). గంటకు 226 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగే గ్రాన్ టూరిజ్మో.. డీజిల్ వెర్షన్లో లభ్యమవుతుంది. చెన్నైకి దగ్గర్లోని మహీంద్రా వరల్డ్ సిటీలో ఉన్న తమ ప్లాంటులో ఈ కారును తయారు చేసినట్లు బీఎండబ్ల్యూ తెలిపింది.