బాబొచ్చే.. జాబు పోయే...
* ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిపై
* వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం నోటీసు
* తిరస్కరించిన స్పీకర్ కోడెల.. ప్రశ్నోత్తరాలకు శ్రీకారం
* సభ మధ్యలోకి వెళ్లి నినాదాలతో హోరెత్తించిన విపక్ష సభ్యులు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై బుధవారం అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఈ అంశంపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులిచ్చిన వాయిదా తీర్మానం నోటీసును స్పీకర్ తిరస్కరించడంతో సభ నిరసనలతో హోరెత్తింది. విపక్ష సభ్యుల నినాదాలు, అరుపులు, వాద ప్రతివాదాలతో దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో సభ ప్రారంభమైన 18 నిమిషాలకే వాయిదా పడింది. తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై చర్చించేందుకు పట్టుపడుతూ.. వైఎస్సార్సీపీ సభ్యులు జి.శ్రీకాంత్‌రెడ్డి తదితరులు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు.
దీనిని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ప్రశ్నోత్తరాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నిలబడి.. తమ తీర్మానాన్ని తిరస్కరించడం తగదన్నారు. వెంట తెచ్చుకున్న ప్లకార్డులను ప్రదర్శించారు. ‘బాబు వచ్చే- జాబు పోయే’, ‘నిరుద్యోగ భృతి చెల్లించాలి’, ‘కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించాలి’ అని రాసున్న ప్లకార్డులను చేతబట్టి సభ మధ్యలోకి వెళ్లి నిరసన తెలిపారు.
దీనికి స్పీకర్ కోడెల అభ్యంతరం తెలుపుతూ ఇలా వ్యవహరించడం సంప్రదాయం కాదన్నారు. ఏదైనా ఒక సందర్భంలో ప్లకార్డులు సభలోకి తెచ్చుకుంటే బాగుంటుందేమోకానీ ప్రతిసారీ ఇలా చేయడం తగదని చెప్పారు. వాయిదా తీర్మానం ప్రతిపాదనను తిరస్కరించినందున సరైన రూపంలో తీసుకొచ్చి రోజువారీ ఎజెండాలోకి తెస్తే చర్చించవచ్చన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తూ మహిళాభివృద్ధిశాఖ మంత్రి పి.సుజాతను మాట్లాడాలని కోరారు. దీంతో ఆమె మాట్లాడడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరి నినాదాలతో హోరెత్తించారు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు జోక్యం చేసుకుంటూ విపక్షం తీరు సరిగా లేదని విమర్శలకు దిగారు. రోజూ ఏదో ఒక తీర్మానంతో వచ్చి సభ లో గందరగోళం సృష్టించడం తగదన్నారు. అదే సమయంలో స్పీకర్ విన్నవిస్తూ.. తమ సభ్యులను వెనక్కుపిలిపించాలని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని కోరారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుంటూ.. సభ చేపట్టాల్సిన ఎజెండాను ఏకరువు పెట్టారు. ఏపీ శాసనసభ బాగా జరుగుతోందని అందరూ అనుకుంటున్నారన్నారు. ఆ వెంటనే స్పీకర్ కోడెల ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
ఆగని నిరసనలు..
స్పీకర్ ఒకవైపు ప్రశ్నోత్తరాలను చేపట్టగా.. మరోవైపు విపక్ష సభ్యులు నినాదాలతో మార్మోగించారు. గందరగోళం మధ్యనే మంత్రి పి.సుజాత తొలిప్రశ్నకు జవాబు చెప్పారు. అయితే సభలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వైఎస్సార్సీపీ సభ్యులు నెహ్రూ, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు స్పీకర్‌తో ఏదో మాట్లాడినప్పటికీ ఆయన అంగీకరించలేదు. సభ్యులు నినాదాలు ఆపలేదు. పెద్ద పెట్టున వీరు నినాదాలు చేస్తుండగానే విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మరో ప్రశ్నకు జవాబిచ్చారు. మరోవైపు పోడియం వద్ద గుమికూడిన సభ్యులు స్పీకర్‌తో వాదనకు దిగి.. తమ తీర్మానాన్ని చర్చకు అనుమతించాలని కోరడం, సభాధ్యక్షుడ్ని ఆదేశించాలని చూడొద్దని స్పీకర్ హెచ్చరికలు చేయడం వంటివి మైకులో వినపడుతుండగానే వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంకో ప్రశ్నకు జవాబు చెప్పారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులందరూ సభ మధ్యలోకి చేరి బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్య స్పీకర్ కోడెల 9.18 గంటల ప్రాంతంలో సభను ఐదు నిమిషాలపాటు వాయిదా వేశారు. తర్వాత 9.50 ప్రాంతంలో సభ తిరిగి ప్రారంభమవుతూనే జీరో అవర్‌ను చేపట్టింది.