breaking news
former labour
-
Yashoda Lodhi: పల్లెటూరోళ్లు ఇంగ్లిష్ మాట్లాడొద్దా?
యూ ట్యూబ్ తెరుస్తున్న కొత్త ద్వారాలు చూస్తూనే ఉన్నాం. మన దగ్గర ఒక బర్రెలక్క ఉన్నట్టుగానే ఉత్తర ప్రదేశ్‌లో ఒక టీచరక్క ఉంది. ఇంటర్ మాత్రమే చదివిన వ్యవసాయ కూలీ యశోదా లోధి ఇంగ్లిష్ మీద ఆసక్తితో నేర్చుకుంది. ‘నాలాగే పల్లెటూరి ఆడవాళ్లు ఇంగ్లిష్ మాట్లాడాలి’ అనుకుని ఒకరోజు పొలం పని చేస్తూ, ఇంగ్లిష్ పాఠం వీడియో విడుదల చేసింది. ఇవాళ దాదాపు మూడు లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఆమె ఇంగ్లిష్ పాఠాలను నేర్చుకుంటున్నారు. యశోదా లోధి సక్సెస్ స్టోరీ. ‘కట్ టు ద చేజ్’ అంటే ఏమిటి? ‘బై ఆల్ మీన్స్’ అని ఎప్పుడు ఉపయోగించాలి? ‘అకేషనల్లీకి సమ్టైమ్స్కి తేడా ఏమిటి?’... ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచి మంచినీళ్లు తాగినంత సులభంగా ఇంగ్లిష్ మాట్లాడటం ఎలాగో నేర్పుతోంది ఒక పల్లెటూరి పంతులమ్మ. ఆశ్చర్యం ఏమిటంటే తాను ఒకవైపు నేర్చుకుంటూ మరో వైపు నేర్పుతూ. చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే. అది కూడా హిందీ మీడియమ్‌లో. కాని యశోదా లోధి వీడియోలు చూస్తే ఆమె అంత చక్కగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నప్పుడు మనమెందుకు మాట్లాడకూడదు అనిపిస్తుంది. అలా అనిపించేలా చేయడమే ఆమె సక్సెస్. ఆమె యూట్యూబ్ చానల్ సక్సెస్. ఇంగ్లిష్ విత్ దేహాతీ మేడమ్ ‘దెహాత్’ అంటే పల్లెటూరు అని అర్థం. యశోదా లోధి ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో సిరాతు నగర్ అనే చిన్న పల్లెటూళ్లో ఉంటోంది. అందుకే తన యూట్యూబ్ చానల్‌కు ‘ఇంగ్లిష్ విత్ దెహాతి మేడమ్’ అనే పేరు పెట్టుకుంది. ఆమె ఇంగ్లిష్ పాఠాలకు ఇప్పటికి రెండున్నర కోట్ల వ్యూస్ వచ్చాయి. మూడు లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. అంతే కాదు... ఆమెను చూసిన ధైర్యంతో చాలామంది గృహిణులు ఇంగ్లిష్ ఎంతో కొంత నేర్చుకుని ఆమెతో లైవ్‌లో ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ మురిసిపోతుంటారు. ఇంగ్లిష్ మన భాష కాదు, మనం మాట్లాడలేము అనుకునే పల్లెటూరి స్త్రీలకు, గృహిణులకు యశోద గొప్ప ఇన్స్పిరేషన్గా ఉంది. 300 రూపాయల రోజు కూలి యశోద కుటుంబం నిరుపేదది. చిన్నప్పటి నుంచి యశోదకు బాగా చదువుకోవాలని ఉండేది. కాని డబ్బులేక అతి కష్టమ్మీద ఇంటర్ వరకు చదివింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. భర్త ఎనిమిది వరకు చదివారు. ఆడపడుచులు స్కూలు ముఖం చూడలేదు. అలాంటి ఇంటికి కోడలైంది యశోద. పల్లెలో భర్తతో పాటు బంగాళదుంప చేలలో కూలి పనికి వెళితే రోజుకు రూ. 300 కూలి ఇచ్చేవారు. మరోవైపు భర్తకు ప్రమాదం జరిగి కూలి పని చేయలేని స్థితికి వచ్చాడు. అలాంటి స్థితిలో ఏం చేయాలా... కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలా... అని తీవ్రంగా ఆలోచించేది యశోద. ఒంటి గంట నుంచి మూడు వరకు పల్లెలో ఇంటి పని, పొలం పని చేసుకుంటూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు వరకు దొరికే ఖాళీలో మాత్రమే యశోద వీడియోలు చేస్తుంది. ‘మా ప్రాంతంలో నెలంతా సంపాదిస్తే 9 వేలు వస్తాయి. చాలామంది పిల్లలకు మంచి చదువు లేదు. నేను యూట్యూబ్‌లో బాగా సంపాదించి అందరికీ సాయం చేయాలని, మంచి స్కూల్ నడపాలని కోరిక’ అంటుంది యశోద. పల్లెటూరి వనితగా ఎప్పుడూ తల మీద చీర కొంగును కప్పుకుని వీడియోలు చేసే యశోదకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆమె ఆదాయం కూడా చాలా బాగా ఉంది. ఇది నేటి పల్లెటూరి విజయగాథ. గతి మార్చిన స్మార్ట్‌ఫోన్ ‘2021లో స్మార్ట్‌ఫోన్ కొనడంతో నా జీవితమే మారిపోయింది. అప్పటి వరకూ నాకు ఈమెయిల్ క్రియేట్ చేయడం తెలియదు, యూట్యూబ్ చూడటం తెలియదు. కాని ఫోన్ నుంచి అన్నీ తెలుసుకున్నాను. యూట్యూబ్‌లో మోటివేషనల్ స్పీచ్‌లు వినేదాన్ని. నాకు అలా మోటివేషనల్ స్పీకర్ కావాలని ఉండేది. కాని నా మాతృభాషలో చెప్తే ఎవరు వింటారు? అదీగాక నా మాతృభాష కొద్దిమందికే. అదే ఇంగ్లిష్ నేర్చుకుంటే ప్రపంచంలో ఎవరినైనా చేరవచ్చు అనుకున్నాను. అలా ఇంగ్లిష్ నేర్చుకోవాలని ఇంగ్లిష్ నేర్పించే చానల్స్ చూడసాగాను. నేర్చుకుంటూ వెళ్లాను. అలా నేర్చుకుంటున్నప్పుడే నాకు ఆలోచన వచ్చింది. నాలాగా ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకునే పేద మహిళలు, పెద్దగా చదువుకోని మహిళలు ఉంటారు... వారి కోసం ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలి అని. నేను ఆశించేదీ, అందరు మహిళలు చేయాలని కోరుకునేదీ ఒక్కటే... భయం లేకుండా ఇంగ్లిష్ మాట్లాడటం. అది కష్టం కాదు. నేను నేర్చుకున్నాను అంటే అందరికీ వస్తుందనే అర్థం’ అంటుంది యశోద. -
ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం
గుంటూరు ఎడ్యుకేషన్ : రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్న రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిపై న్యాయ పోరాటం చేయాలని రాజధాని ప్రాంత రైతు, రైతు కూలీల పరిరక్షణ వేదిక తీర్మానించింది. ఈ పోరాటంలో జాతీయస్థాయిలో మేధావులు, సామాజిక ఉద్యమకారులు, న్యాయ నిపుణుల సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించింది. రాజధాని ప్రాంత రైతు, రైతు కూలీలల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో స్థానిక అరండల్‌పేట 2వ లైనులోని వైన్ డీలర్స్ కల్యాణ మండపంలో రాజకీయ పార్టీలు, రైతు, రైతు కూలీ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులతో గురువారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర కన్వీనర్ వి. లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి (ఆర్కే), డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, సీపీఎం నాయకురాలు పుతుంబాక భారతి తదితరులు హాజరై రైతు ప్రయోజనాల పరిరక్షణ, ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించాల్సిన అంశాలపై ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో ఇంతటి దారుణం చూడలేదు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నడూ ఇటువంటి దారుణ పరిస్థితులను చూడలేదు. రైతు వ్యతిరేకి అనే బ్రాండ్‌ను చంద్రబాబు కొనసాగిస్తున్నారు. అధికార బలంతో బాబు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం ద్వారానే గట్టిగా గుణపాఠం చెప్పాలి. తమకు దిక్కెవరూ లేరని దీనంగా భూములు అప్పగించిన రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి న్యాయ పోరాటం చేయాలి -మక్కెన మల్లికార్జునరావు,డీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వమే దోపిడీదారులా వ్యవహరిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి సాధారణంగా కష్టం వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోరతాం. అదే ప్రభుత్వమే దోపిడీదారుగా వ్యవహరిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. రైతుల తరపున పోరాడితే రాజకీయాలను ఆపాదించడం ప్రభుత్వానికి తగదు. రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న దారుణాన్ని మేధావుల దృష్టికి తీసుకెళ్లి న్యాయ పోరాటానికి దిగుతాం. -కొరివి వినయ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్‌కు సాటిరాని సింగపూర్ సింగపూర్ పేరు చెప్పి గొప్పలు పోతున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు సింగపూర్ ఏ విషయంలోనూ సాటిరాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. భూములు ఇచ్చిన రైతులకు 10 ఏళ్లు హామీతో బాండ్లు ఇస్తామంటున్నారు. అసలు పదేళ్ల పాటు అధికారంలో ఉంటామని చంద్రబాబుకు అంత నమ్మకం ఉందా. తరతరాలుగా సాగులో ఉన్న భూములను బలవంతంగా లాక్కొని తిరిగి వారికే భిక్ష వేసినట్లుగా గజాలు చొప్పున స్థలం ఇస్తామంటున్నారు. -పుతుంబాక భారతి, సీపీఎం మహిళా నాయకురాలు రాజధానిని 2,500 ఎకరాల్లో నిర్మించవచ్చు 2500 ఎకరాల్లో నిర్మించగలిగే రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని ఏ నిపుణుల కమిటీ చెప్పింది. పర్యాటకులపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న సింగపూర్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. భూములు ఇవ్వని వారిని సైతం కలుపుకుని మాస్టర్‌ప్లాన్‌లో పొందుపర్చడం చూస్తుంటే భవిష్యత్‌లో వారి నుంచి భూములను బలవంతంగా లాక్కోవాలనే ఆలోచన చేస్తున్నట్లు అనిపిస్తోంది. -ప్రొఫెసర్ శ్రీరామచంద్రయ్య, సెంటర్ ఫర్ ఎకనామిక్స్, హైదరాబాద్ రైతుల భూములు అమ్మి రాజధాని నిర్మాణం రాజధాని నిర్మాణానికి అవసరమున్నా లేకపోయినా రైతుల నుంచి ఇష్టారాజ్యంగా భూములను సేకరించింది. తిరిగి వాటిని విక్రయించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ధోరణి కనిపిస్తోంది. ప్రతి కట్టడంలో కొంత చొప్పున మిగుల్చుకుని ధనార్జన చేయనున్నారు. ఇదే రాజధానిని పంట పొలాల్లో కాకుండా ప్రభుత్వ భూముల్లో ఎందుకు కట్టకూడదో చెప్పాలి. -కె.విజయ్‌కుమార్, సీపీఐ (ఎంఎల్) నాయకులు ప్రతిపక్ష నేత మాట్లాడితే వ్యక్తిగత విషయాలను ఆపాదిస్తున్నారు రాష్ట్రంలో సీఎం పదవి అనుభవిస్తున్న చంద్రబాబు తెలంగాణ వెళ్లి అక్కడ ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిలదీస్తున్న ప్రతిపక్షనేతపై వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మాట్లాడడం ఎంత వరకూ సమంజసం. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వకపోతే బలవంతంగా లాక్కుంటారా. రాజ్యాంగాన్ని విస్మరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. -చిట్టిపాటి వెంకటేశ్వర్లు సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రైతులు భయపడాల్సిన పనిలేదు తుళ్ళూరులో రాజధాని నిర్మాణం పేరుతో సారవంతమైన భూములను సమీకరించే ప్రక్రియలో ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది. సొంత అజెండాతో వ్యవహరిస్తోంది. రాజధాని నిర్మాణానికి రైతులను భయపెట్టి జరిపిన భూ సమీకరణ రాజ్యాంగ బద్ధం కాదు. రైతులు ఆందోళణ పడవద్దు. ఇది ఏ దశలోనైనా ఆగిపోవచ్చు. రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి రైతుల పక్షాన న్యాయ పోరాటం చేయాలి. -జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి పంట పొలాల్లో రాజధాని నిర్మాణం తగదు బలవంతపు భూ సమీకరణ ద్వారా సమీకరించిన భూములను తిరిగి శ్రామిక రైతులకే అప్పగించాలి. వ్యవసాయ యోగ్యం కాని భూముల్లోనే రాజధాని నిర్మాణం చేయాలి. 2013 భూ సేకరణ చట్టానికి తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలి. బహుళ పంటల భూములను రాజధాని పరిధి నుంచి తప్పించాలి. -వి.లక్ష్మణ రెడ్డి, కన్వీనర్, రాజధాని ప్రాంత రైతు, కూలీల పరిరక్షణ వేదిక రైతుల పక్షాన న్యాయ పోరాటం రాజధాని నిర్మాణానికి ఇష్టారాజ్యంగా భూములు సమీకరించిన ప్రభుత్వం అసెంబ్లీలో సైతం ఏకపక్షంగా వ్యవహరించే ప్రమాదముంది. పార్లమెంటులో బీజేపీ బలంతో భూ సమీకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే, రాజ్యసభలో అడ్డుకునేందుకు సభ్యులు కృషి చేయాలి. రైతుల హక్కుల పరిరక్షించేందుకు న్యాయ పోరాటం చేస్తాం. -ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే అండగా నిలబడితే రాజకీయం చేస్తున్నామన్నారు. పంట భూములను కోల్పోతున్న రైతులకు అండగా నిలబడితే రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి ఎమర్జెన్సీని తలపిస్తోంది. భూములు ఇస్తే సరి, లేకుంటే మేమే తీసుకుంటామంటూ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారు. పచ్చటి పంట పొలాలను బీడు భూములుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. -మర్రి రాజశేఖర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మేధావులు, న్యాయనిపుణులను కూడగట్టుకోవాలి ప్రభుత్వ నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా జాతీయస్థాయిలో మేధావులు, న్యాయ నిపుణులను కూడగట్టుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ విస్మయం వ్యక్తం చేశారు. రాజధానికి భూములను అప్పగించిన రైతులను ఏప్రిల్ నుంచి పంటలు వేసుకోవద్దనడం దారుణం. రాజధాని నిర్మాణం చేపట్టేవరకు పంట వేసుకోకుండా నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదు. -అంబటి రాంబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి