breaking news
Former CM daughter Gurkanwal Kaur
-
మళ్లీ ప్లేట్ ఫిరాయించిన మాజీ సీఎం కూతురు!
న్యూఢిల్లీ: ఎన్నికలు దగ్గర పడుతుండగా ఆయా పార్టీల అధినేతలలో కంగారు మొదలైంది. పార్టీ కీలక వ్యక్తులు ఎప్పుడు వేరే పార్టీకి జంప్ జిలానీ అవుతారో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. పంజాబ్లో కాంగ్రెస్కు షాకిస్తూ కాషాయతీర్థం పుచ్చుకున్న మాజీ సీఎం బియాంత్ సింగ్ కూతురు గుర్కన్వాల్ కౌర్ తిరిగి హస్తం పార్టీనే నమ్ముకున్నారు. కేవలం మూడు రోజుల్లోనే ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సీఎం అమరిందర్ కేబినెట్లో మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించిన గుర్కన్వాల్ బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ నేతలు కాస్త టెన్షన్ పడ్డారు. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్లో చేరిక కూడా గుర్కన్వాల్ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. (చదవండి: కాంగ్రెస్కు షాక్..!) బీజేపీలో ఆమెకు అనుకూల వాతావరణం కల్పించుకునేందుకు సమయంలేదో.. లేక ఎప్పటినుంచో తాను నమ్ముకున్న పార్టీని ఈ సమయంలో వీడటం సరికాదని భావించారో గానీ మాజీ సీఎం తనయ కాంగ్రెస్ గూటికి మళ్లీ వచ్చేశారని జాతీయ మీడియా ఏఎన్ఐ ఓ ప్రకటనలో తెలిపింది. పంజాబ్ అభివృద్ధి కోసం తన తండ్రి రక్తం ధారపోశారని, అయినా కాంగ్రెస్ పార్టీకి తమ కుటుంబంపై ఎలాంటి సానుభూతి చూపించడం లేదని బీజేపీలో చేరిక సందర్భంలో గుర్కన్వాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. గుర్కన్వాల్కు ఏదో విధంగా నచ్చజెప్పి పార్టీలోకి తిరిగి తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. తమ పార్టీ కీలకనేతలను వదులుకునేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదని ఇతర పార్టీలకు పంజాబ్ కాంగ్రెస్ సంకేతాలు పంపింది. -
కాంగ్రెస్కు షాక్..!
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ పంజాబ్లో కాంగ్రెస్కు ఊహించని షాక్! దశాబ్ధాలుగా రాష్ట్ర కాంగ్రెస్లో కీలక నాయకురాలిగా వ్యవహరించిన గుర్కన్వాల్ కౌర్ బీజేపీలో చేరారు. పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ కూతురైన గుర్కన్వాల్.. అమరీందర్ కేబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. ఢిల్లీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు అవినాశ్ రాయ్ ఖన్నా, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు విజయ్ సంప్లాల సమక్షంలో ఆమె శనివారం కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ‘పంజాబ్ అభ్యున్నతి కోసం మా నాన్న రక్తం ధారపోశారు. కానీ కాంగ్రెస్కు మా కుటుంబం పట్లకానీ, ప్రజల పట్లకానీ ఎలాంటి సానుభూతి చూపించడంలేదు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశా. ప్రధాని మోదీ విధానాలు నచ్చడంతో బీజేపీలో చేరా’అని గుర్కన్వాల్ మీడియాకు వివరించారు. కాగా, గుర్కన్వాల్ మునిగిపోతున్న పడవ ఎక్కారని పంజాబ్ కాంగ్రెస్ విమర్శించింది.


