బ్యాలెట్ల వరద..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల నాలుగో సాధారణ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఆదివారం స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. తొలి విడతలో 35 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, 504 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నిక నిర్వహించారు.
తొలి విడత ఎన్నికలో 79.13 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా గద్వాల మండలంలో 86.86 శాతం, అత్యల్పంగా అమ్రాబాద్ మండలంలో 71.24 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 15.87శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎండ తీవ్రత మూలంగా మధ్యాహ్నం సమయంలో పోలింగ్ మందకొడిగా కొనసాగింది.
వాహనాల్లో వలస ఓటర్లు
ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను పార్టీలు, అభ్యర్థులు వాహనాలు సమకూర్చి పోలింగ్ కేంద్రాలకు తరలించారు. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో ఓటర్లు తరలిరావడంతో షాద్‌నగర్ జీఎంఆర్ టోల్‌ప్లాజా వద్ద కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలింగ్ కేంద్రాల వద్ద గుమికూడిన ఓటర్లను చెదరగొట్టే క్రమంలో పోలీసులు వ్యవ హరించిన తీరు ఉద్రిక్తతలకు దారి తీసింది.
పోలీసులు అత్యుత్సాహంతో లాఠీలు ఝలిపించడంతో పలు చోట్ల నిరసన వ్యక్తమైంది. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు లేకపోవడం, అరకొర సౌకర్యాలతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారంటూ శనివారం రాత్రి నుంచే పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తనిఖీలు ముమ్మరం చేశారు.
డబ్బులు పంచుతున్నారనే వదంతులతో పలు చోట్ల తోపులాటలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గిరిజాశంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.అమల్దకల్ మండలం శేషంపేటలో జయన్న అనే వ్యక్తి ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో పోలింగ్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు.
అనంతరం పురుగు మందు తాగాడు. అయితే పోలీసులు లాఠీలతో కొట్టడంతోనే మనస్తాపానికి గురైన జయన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని బంధువులు ఆరోపించారు. పోలీసుల చర్యను నిరసిస్తూ గ్రామస్తులు శవంతో బైఠాయించడం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు ఈ ఆరోపణను ఖండించారు.
అఆలంపూర్ మండలం భైరాపూర్‌లో తన భర్తపై ఎదుటి వర్గం దాడి చేసిందంటూ ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే పోలీసు కేసు నమోదు కాలేదు. ఆసుపత్రిలో మహిళ కోలుకుంటున్నట్లు సమాచారం.
అబల్మూరు మండలం అనంతవరంలో సీపీఎం, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సీపీఎం జడ్పీటీసీ అభ్యర్థితో పాటు అయిదుగురికి గాయాలు కాగా, అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.
అగ్రామ అభివృధ్దిని నేతలు పట్టించుకోవడం లేదంటూ నాగర్‌కర్నూలు మండలం రాంరెడ్డిపల్లి తండా వాసులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఆర్డీఓ జోక్యంతో తిరిగి పోలింగ్‌లో పాల్గొన్నారు.
అగోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్లో పోలింగ్ కేంద్రం వద్ద గొడవ మూలంగా అరగంట పాటు పోలింగ్ నిలిచిపోయింది.
అవనపర్తి మండలం కడుకుంట్లలో పోలింగ్ కేంద్రం సమీపంలో పోలీసులు లాఠీచార్జి చేయడంతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేసి ఎస్ఐపై దాడికి ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది.
అగద్వాల మండలం శెట్టి ఆత్మకూరులో కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు.
అఅమ్రాబాద్ మండలం సార్లపల్లిలో ఉదయం పది గంటల వరకు బ్యాలెట్లు చేరకపోవడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
అపెద్దకొత్తపల్లి మండలం కాచాపూర్, కల్వకుర్తి మండలం మార్చాలలో ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు చెదరగొట్టారు.
అగోపాల్పేటలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు తోపులాటకు దిగడంతో ఎంపీడీఓ చంద్రశేఖర్ తలకు గాయమైంది. కోడేరు మండలం మైలారం, నర్సాయపల్లిలో ఓటర్లు తోపులాటకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దారు.
అతెల్కపల్లి మండలం నడిగడ్డలో ఉప సర్పంచ్ ఏజెంట్‌గా కూర్చోవడం ఉద్రిక్తత నెలకొని అరగంట పాటు పోలింగ్ వాయిదా పడింది.
అమానవపాడు మండలం పుల్లూరు, ఐజలో పోలింగ్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
అఅమ్రాబాద్ మండలం తార్లపల్లిలో అధికారులకు వేరే ప్రాంత ఓటర్ల జాబితా అందజేయడంతో అక్కడ పోలింగు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది.