Female prisoner
-
ఏలూరు జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా జైలులో ఒక రిమాండ్ మహిళా ఖైదీ ఆత్మహత్య చేసుకుంది. వారం రోజుల కిందటే జైలుకు వచ్చిన ఆమె ఆదివారం ఉదయం చున్నీతో బ్యారక్‌లోని కిటికీకి ఉరి వేసుకుని మృతిచెందడం కలకలం సృష్టించింది. వివరాలు... ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటాకులగూడేనికి చెందిన గంధం బోసు (31)తో తెలంగాణలోని అశ్వారావుపేట ప్రాంతానికి చెందిన శాంతికుమారి(29)కి 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. బోసుపై మార్చి 18న గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు.ఖమ్మం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 19న మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. శాంతికుమారి తన ప్రియుడు సొంగా గోపాల్‌తో కలిసి భర్త బోస్ హత్యకు కుట్ర చేసిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆమెను మార్చి 24న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, జడ్జి రిమాండ్ విధించారు. మరోవైపు తన భర్తను చంపేస్తామని కొంతమంది రాజకీయ నాయకులు హెచ్చరించారని, ఆయనపై దాడి జరిగిన రోజే శాంతికుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త మృతికి, తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా పోలీసులు తనను కేసులో ఇరికించారని శాంతికుమారి బాధపడుతున్నట్లు ఆమె బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం జైలు బ్యారక్‌లో కిటికీకి తన చున్నీతో ఉరి వేసుకుంది. వెంటనే జైలు సిబ్బంది ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించగా, వైద్యులు మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌లోని మార్చురీలో ఉంచారు. ఏలూరు జిల్లా జైలు అధికారుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, శాంతికుమారి ఆత్మహత్య నేపథ్యంలో మహిళా బ్యారెక్ వద్ద విధులు నిర్వహించిన హెడ్ వార్డర్ ఎల్.వరలక్ష్మి, వార్డర్ నాగమణిలను సస్పెండ్ చేస్తూ జైలు సూపరింటెండెంట్ సీహెచ్ఆర్వీ స్వామి ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. -
చికిత్సపొందుతూ మహిళా ఖైదీ మృతి
సాక్షి, హైదరాబాద్: గుండె నొప్పితో బాధపడుతున్న ఓ మహిళ ఖైదీ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. చంచల్‌గూడ మహిళ జైలు సూపరింటెండెంట్ బషీరా బేగం తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా అంకిల్లా గ్రామానికి చెందిన పండ్ల నాగమ్మ(45) ఓ మహిళను హత్య చేసిన కేసులో దోషిగా తేలింది. దీంతో 2011 లో కోర్టు ఆమెకు జీవిత ఖైదు శిక్ష విధించింది. అప్పటి నుంచి ఆమె హైదరాబాద్ చంచల్గూడలోని మహిళ జైల్లో శిక్ష అనుభవిస్తుంది. గతంలో ఆమె టీబీ వ్యాధికి గురై 8 నెలల పాటు చికిత్స పొంది ఆరోగ్యంగానే ఉంది. తాజాగా ఆదివారం ఉదయం నాగమ్మకు అకస్మాత్తుగా చాతీలో నొప్పి రాగా జైలు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గంట తరువాత ఖైదీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని సూపరింటెండెంట్ తెలిపారు. మృతురాలి బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. -
మహిళా ఖైదీలకు అవస్థలే
ఎన్సీఆర్బీ గణాంకాల్లో వెల్లడి ఢిల్లీ: మహిళా ఖైదీలకు జైళ్లలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా మొత్తం జైళ్లలో మహిళా ఖైదీల కోసం 2 శాతం మాత్రమే జైళ్లను కేటాయించారు. ఆయా జైళ్లలో 18 శాతం మహిళలకు ఎలాంటి సౌకర్యాలు లేవని నేషనల్ క్రైమ్ బ్యూరో(ఎన్సీఆర్బీ) తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం...దేశవ్యాప్తంగా ఉన్న 1,394 జైళ్లలో 20 మహిళా జైళ్లు ఉండగా అందులో 3,200 మంది మహిళా ఖైదీలు శిక్షలు అనుభవిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా మొత్తం మహిళా ఖైదీల సంఖ్య మాత్రం 16,951గా ఉండటం గమనార్హం. మరోవైపు మహిళా ఖైదీల సంఖ్యతో పోలిస్తే మహిళా పోలీసు సిబ్బంది సంఖ్య 25 శాతంకన్నా తక్కువగా ఉంది. 2012 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా 3,935 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. ప్రతి 245 మంది మహిళా ఖై దీలకు ఒక సైకాలజిస్ట్ లేదా కౌన్సెలర్ మాత్రమే ఉన్నారు. అదేవిధంగా 105 మందికి ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారు. 2012లో 55 మంది మహిళా ఖైదీలు మృతిచెందగా వీరిలో 47 మంది సహజ మరణం పొందారు. ఐదుగురు ఆత్మహత్యలు చేసుకోగా, ముగ్గురు బయటి వ్యక్తుల దాడిలో మృతిచెందారు. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడు, కేరళలలో మూడేసి మహిళా జైళ్లు ఉండగా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లలో రెండు చొప్పున మహిళా జైళ్లు ఉన్నాయి. అదేవిధంగా బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు ఒక్క మహిళా జైలు మాత్రమే ఉంది.