breaking news
Female lecturer
-
ప్రాణదానం చేసి.. ప్రాణాలు విడిచింది
బొమ్మనహళ్లి: ఓ మహిళ సామాజిక సేవలో ముందుంటారు. ఎవరికి కష్టం వచ్చినా సహాయంగా నిలుస్తారు. అదే మాదిరిగా బంధువుకు కాలేయం పాడైపోతే, సదరు మహిళ తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసి గొప్ప మనసును చాటుకుంది. కానీ ఆరోగ్యం విషమించి ఆమే ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక సంఘటన బెంగళూరులో జరిగింది. మృతురాలు అర్చనా కామత్ (34).బంధువుకు బాగా లేదంటే..వివరాలు.. ఉడుపికి చెందిన అర్చనా కామత్ మంగళూరులో ఓ మేనేజ్మెంట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవారు. తమ బంధువైన వృద్ధురాలు (69)కి కాలేయం పాడైపోయి ఆస్పత్రిలో చేరింది. ఆరోగ్యకర వ్యక్తి నుంచి కొంత కాలేయ భాగం తీసి అమర్చితే కోలుకోవచ్చని వైద్యులు సూచించారు. అనేకమందికి రక్త పరీక్షలు చేసినా సరిపోలేదు. అర్చన బ్లడ్ గ్రూప్‌తో సరిపోయింది. దీంతో అర్చన కాలేయ దానానికి ముందుకొచ్చింది. 12 రోజుల క్రితం బెంగళూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అర్చనకు శస్త్రచికిత్స చేసి లివర్ భాగాన్ని తీసి వృద్ధురాలికి అమర్చారు. మూడురోజుల తరువాత అర్చన డిశ్చార్జ్ అయింది. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అర్చనకు రెండురోజుల కిందట ఆకస్మాత్తుగా ఆరోగ్యం విషమించడంతో వెంటనే బెంగళూరులో ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక కన్నుమూసింది. ఆమెకు భర్త చేతన్ కామత్ తో పాటు నాలుగేళ్ల తనయుడు ఉన్నారు. ఆమె లివర్‌ను పొందిన వృద్ధురాలు మాత్రం ఆరోగ్యంగా ఉండడం విశేషం. -
మహిళా లెక్చరర్ ఆత్మహత్య
అద్దంకి (సంతమాగులూరు) : ఓ మహిళా లెక్చరర్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఫిజిక్స్ ల్యాబ్‌లో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. కె.అంజనీదేవి(33) అనే మహిళ స్థానిక ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఈమె స్వగ్రామం చీమకుర్తి. మూడేళ్ల క్రితం ఒంగోలుకు చెందిన దామా గోపీతో వివాహమైంది. ఏడాది నుంచి ఒంగోలు నుంచి రోజూ కళాశాలకు వచ్చి వెళ్లేవారు. ఈ నేపథ్యంలో భర్తతో విభేదాలు వచ్చాయి. ఆరు నెలల నుంచి పుట్టిల్లు చీమకుర్తి నుంచి రోజూ అద్దంకి వచ్చి వెళ్తున్నారు. పది రోజుల క్రితం కళాశాల యాజమాన్యాన్ని కలిసి తాను రోజూ చీమకుర్తి నుంచి వచ్చి వెళ్లడం ఇబ్బందిగా ఉందని, పట్టణంలో వసతి చూసుకునేంత వరకూ రాత్రి వేళల్లో కళాశాలలోనే ఉంటానని కోరారు. అందుకు యాజమాన్యం అంగీకరించింది. అప్పటి నుంచి అంజనీదేవి ఫిజిక్స్ ల్యాబ్‌లోని ఓ గదిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నివాసం ఉంటున్న గది మంగళవారం తెరుచుకోలేదు. కళాశాల సిబ్బందికి అనుమానం వచ్చి గదిని బలవంతంగా తెరిచి చూడగా ఆమె ఫ్యాన్‌కు నిర్జీవంగా వేలాడుతూ కనిపించారు. కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఇన్చార్జి ఎస్సై శివకుమార్‌లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరకున్నారు. ఆమె మృతదేహాన్ని కిందికి దించి వివరాలు సేకరించారు. అంజనీదేవి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6.20 గంటలకు ఆమె తన తండ్రితో మాట్లాడినట్లు రికార్డయి ఉంది. లెక్చరర్ ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.