breaking news
factions
-
ఎంజీఆర్.. జయ.. పళని.. అది షరా మామూలే!
సాక్షి, చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేలో చీలిక ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్‌కు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు 24 మంది మద్దతు ప్రకటించడం.. రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చేసింది. ఈ తరుణంలో వాళ్లను కీలక పదవుల నుంచి తొలగిస్తూ పార్టీ జనరల్ సెక్రటరీ పళనిస్వామి నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఆ పార్టీలో ‘చీలిక’ కొత్తేమీకాదు. కాంగ్రెస్ పాలనకు చరమ గీతం పాడేందుకు అన్నాదురై నేతృత్వంలో డీఎంకే పేరిట తమళనాట తొలి ప్రాంతీయ ద్రావిడ పార్టీ ఆవిర్భవించిన కాలం నుంచి చీలిక పర్వం సాగుతున్నది. డీఎంకే దివంగత అధ్యక్షుడు కరుణానిధితో పొడసూపిన విభేదాల కారణంగా సినీ నటుడు ఎంజీఆర్ చేతుల మీదుగా పురుడు పోసుకున్న పార్టీ అన్నాడీఎంకే. ఎంజీఆర్ జీవించి ఉన్నంత కాలం సైన్యం తరహాలో కదిలిన ఈ పార్టీ ఆయన మరణానంతరం తదుపరి చీలికను ఎదుర్కొంది. 1972లో పార్టీ స్థాపించిన నాటినుంచి నేటి వరకు అనేకసార్లు వర్గ పోరును ఎదుర్కొంది. ఈ సమయంలో రెండుసార్లు అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ స్తంభింపచేసింది. ఆ చీలిక పర్వం సాగిందిలా.. ∙1972 అక్టోబర్ 18న డీఎంకే నుంచి బహిష్కరణకు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) పార్టీని స్థాపించారు. ∙1987 డిసెంబర్ 24న ఎంజీఆర్ మరణంతో ఆయన సతీమణి జానకీ రామచంద్రన్, పార్టీ ప్రచార కార్యదర్శి జయలలిత మధ్య తలెత్తిన విభేదాలు అన్నాడీఎంకే చీలికకు దారి తీసింది. 1988లో నాటి ఎంజీఆర్ విశ్వాసపాత్రుడు ఆర్ఎం వీరప్పన్ 98 మంది ఎమ్మెల్యేలతో జానకి వర్గానికి మద్దతు ఇచ్చారు. అసెంబ్లీలో హింసాత్మక ఘటనలు జరగడంతో అప్పట్లో రాష్ట్రపతి పాలన విధించారు. ∙1989 ఎన్నికలలో జయలలిత వర్గం 27 సీట్లు గెలవగా.. జానకి వర్గం 1 సీటుకే పరిమితమైంది. ఆ సమయంలో అన్నాడీఎంకే రెండాకుల గుర్తును ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా స్తంభింపచేసింది. దీంతో జానకి రాజకీయాల నుంచి తప్పుకోగా పార్టీ జయలలిత నాయకత్వం గుప్పెట్లోకి చేరింది. ∙1990లో పార్టీ సీనియర్ నేత తిరునావుక్కరసు తిరుగుబాటుతో జయలలిత ఆయనను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. తన రాజకీయ గురువు పేరిట ఆయన ‘ఎంజీఆర్ ఏడీఎంకే’ను స్థాపించారు. ∙1995లో జయలలితతో విభేదాల నేపథ్యంలో ఆర్ఎం వీరప్పన్ పార్టీ నుంచి విడిపోయి ‘ఎంజీఆర్ కళగం’ఏర్పాటు చేశారు. ఆ తరువాత అన్నాడీఎంకే పూర్తిగా జయలలిత వశమైంది. ∙2011 ఎన్నికలలో గెలుపొందిన అన్నాడీఎంకే 2016 ఎన్నికలలో మరోసారి గెలిచి చరిత్ర సృష్టించిన జయలలిత నిష్క్రమణతో అన్నాడీఎంకేలో మళ్లీ చీలిక మొదలైంది. ∙2016 డిసెంబర్ 5న జయలలిత మరణం పార్టీలో చీకటి రోజుగా మిగిలింది. జయలలిత జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన సమయంలో ఆమె నమ్మిన బంటు సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీరు సెల్వం ఆమె మరణంతో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ∙జయలలిత మరణానంతర పరిణామాలతో 2017 ఫిబ్రవరిలో ఆమె నెచ్చెలి శశికళ సీఎం కావాలనుకోవడంతో పన్నీరు సెల్వం ధర్మయుద్ధం చేశారు. దీంతో పార్టీలో చీలిక అనివార్యమైంది. అనంతరం అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లగా.. కూవత్తూరులో జరిగిన రాజకీయ క్యాంప్‌తో పళణిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జయలలిత మరణం నేపథ్యంలో చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం మరోమారు స్తంభింపబడింది. ∙2017 ఆగస్టులో సీఎం పళణిస్వామి , పన్నీరు సెల్వం ఏకమయ్యారు. వీరి కలయికతో అదే ఏడాది మరోసారి పారీ్టలో చీలిక తప్పలేదు. శశికళ ప్రతినిధి దినకరన్‌ను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించడంతో ఈ చీలిక నెలకొంది. ఆ తరువాత అన్నాడీఎంకే నుంచి ఆవిర్భవించినదే అమ్మమక్కల్ మున్నేట్ర కళగం. ∙2021 అసెంబ్లీ ఎన్నికల తరువాత మరోసారి అన్నాడీఎంకేలో చీలిక తప్పలేదు. పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య ఏకనాయకత్వం విషయంలో తలెత్తిన వివాదం ఇందుకు కారణం. పన్నీరు సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పరిరక్షణ కోసం ఇయక్కం పేరిట శిబిరంతో రాజకీయాన్ని సాగించారు. ∙2022–23 మధ్యకాలంలో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత పళణి స్వామి పార్టీపై పూర్తి పట్టు సాధించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా చక్రం తిప్పారు. పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకుని లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్నా డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇదే వరుసలో తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థలు, నగర పాలక సంస్థలు, ఉప ఎన్నికలలోనూ అన్నాడీఎంకేకు ఓటమి తప్పలేదు. ∙ఎన్నికల్లో వరుస ఓటముల నేపథ్యంలో.. 2026లో పళనిస్వామి నాయకత్వం బలహీనపడింది. ఇదే సమయంలో పార్టీలో కీలక నేతగా ఉన్న ఎస్పీ షణ్ముగం నాయకత్వంలో 24 మంది ఎమ్మెల్యేలు విడిపోవడంతో పార్టీ భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. బుధవారం అసెంబ్లీ వేదికగా పళణిస్వామి ఆజ్ఞను ఆ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు ధిక్కరించారు. టీవీకే చీఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అంతే కాదు, పార్టీని సైతం కైవశం చేసుకునే దిశగా సర్వసభ్య సమావేశానికి ఈ ఎమ్మెల్యేల శిబిరం పిలుపునివ్వడం కొసమెరుపు. -
నువ్వెవరు.. ఇక్కడ పెత్తనం మాది!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. చంద్రబాబు చేసిన ప్రయోగం వికటించి... కమ్మ, కాపు నేతలు రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎదుటే ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకుని వీరంగం సృష్టించారు. హనుమాన్‌జంక్షన్‌లోని టీడీపీ కార్యాలయంలో గురువారం టీడీపీ నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు హాజరైన ఈ సమావేశం ప్రారంభంలోనే రసాభాసగా మారింది.నియోజకవర్గ పరిశీలకుడు హరిబాబు నాయుడుపై గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఖర్చు మాది... మేం లోకల్.. నువ్వు నాన్‌లోకల్. మామీద నీ పెత్తనం ఏమిటీ. నాకు నేరుగా చంద్రబాబుతోనే సంబంధాలు ఉన్నాయి. నువ్వెంత. ఇక్కడ మాదే పెత్తనం...’ అంటూ జాస్తి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. హరిబాబు నాయుడుపై జాస్తి వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు నాయకులు దాడి చేసేందుకు దూసుకెళ్లారు. దీంతో హరిబాబు నాయుడు సైతం తీవ్రంగా స్పందించడంతో సమావేశంలో పాల్గొన్న నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కమ్మ, కాపు నేతలు రెండు వైపులకు చేరి ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. హరిబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉంగుటూరు మండల టీడీపీ అధ్యక్షుడిని సైతం స్థానిక నేతలు రెచ్చగొట్టారు. దీంతో గొడవ తారాస్థాయికి చేరింది. ఈ సమయంలో కొనకళ్ల నారాయణరావు జోక్యం చేసుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఇరువర్గాలు వినకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. వికటించిన చంద్రబాబు ప్రయోగం... టీడీపీ గన్నవరం నియోజకవర్గ పరిశీలకుడిగా గుంటూరు జిల్లాకు చెందిన కాపు నేత వడ్రాం హరిబాబు నాయుడును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించాడు. నియోజకవర్గంలోని కాపులను సమన్వయం చేస్తారనే ఉద్దేశంతో ఆయనకు పరిశీలకుడి బాధ్యతలు అప్పగించారు. అయితే, హరిబాబు నియామకం తొలి నుంచి ఇక్కడ కొందరు నాయకులకు నచ్చలేదు. ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమా అనుచరులుగా ఉంటూ మట్టిదోపిడీ, సెటిల్మెంట్లు చేసినవారికి హరిబాబు నియామకం మింగుడు పడలేదు. దీంతో ఆధిపత్యం కోసం పోరు జరుగుతూనే ఉంది. ఇటీవల నిర్వహించిన ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ బస్సుయాత్రలో హరిబాబు నాయుడు యాక్టివ్‌గా వ్యవహరించడాన్ని స్థానిక నేతలు జీర్జించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారమే గురువారం జాస్తి వెంకటేశ్వరరావు గొడవకు దిగడంతోపాటు ఆ తర్వాత ఉంగుటూరు మండల అధ్యక్షుడు కూడా నిరసన తెలియజేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీలో కొందరు నేతల ఆధిపత్య, అహంకారపూరిత ధోరణి వల్లే ఈ గొడవ జరిగిందని, వీరి వైఖరి వల్ల అన్ని సామాజికవర్గాలు పార్టీకి దూరమవుతున్నాయని కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం. -
కర్నూలు జిల్లాలో పడగవిప్పిన ఫ్యాక్షన్.. ఇద్దరి హత్య
కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ భూతం పడగ విప్పింది. పాతకక్షలకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బలవగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పరి మండలం హలిగిరి గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఈ ముగ్గురు ఆదోని కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.


