breaking news
Encouraged
-
చిన్నారుల భవిష్యత్తుకు సైబరాబాద్ పోలీసుల భరోసా
హైదరాబాద్: చిన్నారుల చిరునవ్వుల వెనుక దాగున్న విషాదాన్ని దూరం చేసి, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు ముందడుగు వేశారు. మహాత్మా గాంధీ వంటి మహనీయుల వేషధారణను భిక్షాటనకు ముసుగుగా వాడుకుంటూ, పసిపిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న తీరుపై సైబరాబాద్ పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.ఇటీవల ఐదుగురు బాలలు సైబర్ టవర్ జంక్షన్ వద్ద ఇదే రీతిలో భిక్షాటన చేయిస్తుండగా సైబరాబాద్ పోలీసులు వారిని క్షేమంగా రక్షించారు. పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి వారిని పదే పదే భిక్షాటనకు ప్రేరేపించిన తల్లిదండ్రులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, వారిని జైలుకు పంపారు. రక్షించిన పిల్లలకు బాలల సంరక్షణ సంస్థల సహకారంతో పునరావాసం కల్పించి, వారికి కొత్త జీవితాన్ని అందించామని సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం తెలిపారు.ట్రాఫిక్ సిగ్నల్స్, రద్దీగా ఉండే రోడ్డు జంక్షన్ల వద్ద చిన్నారులకు మహాత్మా గాంధీ వేషం వేసి, ఒళ్లంతా రంగులు పూసి వారిని భిక్షాటన చేయిస్తున్నా ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చాయన్నారు. కేవలం డబ్బు సంపాదన కోసం కన్నవారే తమ పిల్లల హక్కులను కాలరాస్తూ, వాహనాల మధ్య వారిని ప్రమాదంలోకి నెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు.‘చిన్నారులతో భిక్షాటనకు చేయించచడం చట్టరీత్యా నేరం. అది తల్లిదండ్రులైనా, సంరక్షకులైనా సరే.. చట్టం నుండి తప్పించుకోలేరని డీసీపీ స్పష్టం చేశారు. రంగుల వల్ల కలిగే శారీరక ఇబ్బందులు, రద్దీ ప్రాంతాల్లో ఉండే ప్రాణాపాయం పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీస్తాయని’ ఆమె పేర్కొన్నారు."పిల్లలు బడిలో ఉండాలి.. భిక్షాటనలో కాదు" అనే నినాదంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మీ కంటపడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు గానీ లేదా చైల్డ్ లైన్ నెంబర్ 1098 కు గానీ సమాచారం అందించాలని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
‘2028లో పసిడి సాధించాలి’
భువనేశ్వర్: వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన భారత హాకీ జట్టు 2028 లాస్ ఏంజెలెస్ విశ్వక్రీడల్లో పసిడి పతకం నెగ్గాలని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆకాంక్షించారు. పారిస్ క్రీడల్లో కాంస్యం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన హాకీ జట్టును బుధవారం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించగా.. గురువారం మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలువురు ప్లేయర్లను సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు రావడం ఆనందంగా ఉంది. ఇదే ఆటతీరు కొనసాగిస్తూ లాస్ ఏంజెలెస్‌లో స్వర్ణం సాధించాలి’ అని ఆకాంక్షించారు. 2018 నుంచి భారత హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా... హాకీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయడంలో నవీన్ పట్నాయక్ పాత్ర ఎంతో ఉందని ప్లేయర్లు కొనియాడారు.ఆటగాళ్ల అవసరాలను తీర్చుతూ అత్యుత్తమ సదుపాయాలు అందుబాటులోకి తేవడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని సుమిత్ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుమిత్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.


