EMI method
-
నో కాస్ట్లో అసలు కాస్ట్ ఎంత..?
‘రూ.1.20 లక్షలు ఖరీదు చేసే యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్.. ఒకేసారి అంత పెట్టి కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాదు. 6–9–12–18–24 నెలల సులభ వాయిదాల్లో, నో కాస్ట్ ఈఎంఐపై కొనుగోలు చేసుకోవచ్చన్న ఆఫర్ ఇస్తే.. చాలా మందికి ముందుకు వస్తారు. రూ.1.20 లక్షల ల్యాప్‌టాప్ నెలకు రూ.5,000తో చేతికి వస్తుంటే ఎవరు కాదనుకుంటారు చెప్పండి? కానీ, ఈ ఆఫర్ల వెనుక వాస్తవ అంశాలను ప్రతి కస్టమర్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నిజంగానే ఎలాంటి వ్యయాలు ఉండవా? బయటకు చెప్పని చార్జీలేవైనా ఉంటాయా? అసలు ఈ ఆఫర్లు ఎలా పనిచేస్తాయి? అని ప్రశ్నించుకోవాలి. వడ్డీ ఉండదా? 🔸 నో కాస్ట్ ఈఎంఐ అంటే ఎంపిక చేసుకున్నన్ని నెలల పాటు సమాన వాయిదాల్లో చెల్లించాలి. దీనిపై వడ్డీ పడుతుంది. 🔸 ప్రతీ నెల వాయిదాపై బ్యాంక్ వడ్డీ విధిస్తుంది. 🔸 కాకపోతే ఈఎంఐ స్కీమ్ కాల వ్యవధిలో పడేంత వడ్డీని కొనుగోలు సమయంలోనే తగ్గింపు లభిస్తుంది. 🔸 కనుక కొనుగోలుదారులపై వడ్డీ భారం పడదు. 🔸 ముందే డిస్కౌంట్ ఇచ్చేయడంతో ప్రతి నెలా అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. చార్జీలూ ఉంటాయ్.. 🔸 నిజానికి వడ్డీ ఒక్కటే ఉండదు. మిగిలిన చార్జీలు యథావిధిగా చెల్లించుకోవాల్సిందే. 🔸 ప్రతీ వాయిదాపై 18 శాతం జీఎస్టీ ఉంటుంది. 🔸 ఈఎంఐ లావాదేవీపై ప్రాసెసింగ్ చార్జీ కూడా పడుతుంది. లావాదేవీ విలువ ఆధారంగా ఈ మొత్తం రూ.200–999 మధ్య ఉంటుంది. దీనిపై మరో 18 శాతం జీఎస్టీ కూడా చెల్లించుకోవాలి. 🔸 ఈఎంఐలన్నింటినీ ముందే చెల్లించేస్తానంటే అందుకు అదనంగా కొంత సమర్పించుకోవాలి. ఒకవేళ 9 నెలల ఈఎంఐని మూడు నెలలకే ముగించేద్దామనుకుంటే బ్యాలన్స్ ఈఎంఐలపై 2–3 శాతం అదనంగా చెల్లించాల్సి రావచ్చు. ఉదాహరణ.. 🔸 రూ.50,000 ఖరీదు చేసే వస్తువు కొన్నారు. ఆరు నెలల ఈఎంఐ పెట్టుకున్నారు. 🔸 దీనిపై వడ్డీ సుమారుగా రూ.2,296 అనుకుందాం. ఇంత మేర కొనుగోలులో తగ్గుతుంది. దీంతో నికర కొనుగోలు ధర రూ.47,704 అవుతుంది. 🔸 తగ్గించిన రూ.2,296 మేర ప్రతి నెలా ఈఎంఐలో మళ్లీ ఆరు నెలల పాటు కలుస్తుంది. రూ.2,296 వడ్డీపై 18 శాతం జీఎస్టీ కింద మరో రూ.413 చార్జీ కూడా పడుతుంది. 🔸 ప్రాసెసింగ్ చార్జీ రూ.300 అనుకుంటే.. దీనికి 18 శాతం జీఎస్టీతో కలిపి రూ.354 చెల్లించాలి.క్రెడిట్ లిమిట్‌పై ప్రభావం..🔸 ఈఎంఐపై కొనుగోలు చేసిన వెంటనే అంత మేర కార్డు క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుందని తెలుసుకోవాలి. 🔸 ఉదాహరణకు మీ కార్డుపై రూ.1,00,000 లిమిట్ ఉందనుకుందాం. 🔸 రూ.60,000 ల్యాప్‌టాప్ లేదా ఫోన్ కొనుగోలుతో లిమిట్ రూ.40,000కు తగ్గిపోతుంది. 🔸 అక్కడి నుంచి ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఆరు నెలల ఈఎంఐ చెల్లించాలి. మొదటి నెల రూ.10,000 చెల్లించిన వెంటనే లిమిట్ అంత మేర పెరిగి రూ.50,000కు చేరుతుంది. రెండో నెలలో రూ.10,000 ఈఎంఐ చెల్లించిన తర్వాత లిమిట్ రూ.60,000కు పెరుగుతుంది. 🔸 క్రెడిట్ లిమిట్లో వడ్డీకి సరిపడా కూడా లాక్ అవుతుంది. అది కూడా ప్రతి నెలా ఈఎంఐ చెల్లించిన వెంటనే క్రమంగా విడుదలవుతూ వెళుతుంది. డిస్కౌంట్ ఎవరి ఆఫర్? 🔸 ముందు చెప్పుకున్నట్టు ఈఎంఐ వాయిదాతోపాటు బ్యాంక్‌లు వడ్డీని కూడా వసూలు చేస్తాయి. 🔸 ఈ వడ్డీని ఎక్కువ సందర్భాల్లో బ్రాండ్ (ఉదాహరణకు శామ్సంగ్ లేదా యాపిల్), రిటైలర్ భరిస్తారు. 🔸 కొన్ని సందర్భాల్లో బ్యాంక్ సైతం మర్చంట్ టైఅప్‌లలో భాగంగా కొంత మేర భరిస్తుంది. 🔸 అందుకే ఆరంభంలో అంత మేర డిస్కౌంట్ లభిస్తుంది. 🔸 ఈ ఆఫర్‌తో బ్రాండ్లు, వర్తకులు విక్రయాలు పెంచుకుంటారు. 🔸 క్రెడిట్ కార్డు సంస్థలకు కొత్త కస్టమర్లు పెరుగుతారు. 🔸అందుకే ఈ తరహా ఆఫర్లను ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు. క్రెడిట్ స్కోరుపైనా ప్రభావం? 🔸 ఈఎంఐపై కొనుగోలుతో క్రెడిట్ స్కోరుపై సానుకూల, ప్రతికూల ప్రభావాలకూ చాన్స్ ఉంటుంది. 🔸 ప్రతి నెలా ఈఎంఐని సకాలంలో చెల్లించిన విషయాన్ని బ్యాంక్‌లు సిబిల్, ఎక్స్పీరియన్ తదితర క్రెడిట్ బ్యూరో సంస్థలకు తెలియజేస్తాయి. ఇది క్రెడిట్ స్కోరును పెంచుతుంది. 🔸 రుణాల సమతుల్యతకు సాయపడుతుంది. క్రెడిట్ కార్డు స్వైప్నకే పరిమితం కాకుండా, రుణం తీసుకుని చెల్లించడం రుణ పరపతిని పెంచుతుంది. 🔸 విజయవంతంగా ఒక రుణాన్ని ముగించినట్టు మీ రిపోర్ట్‌లో నమోదు కావడం కూడా స్కోర్‌ను అధికం చేస్తుంది. 🔸 ఈఎంఐపై కొనుగోలు చేసే ముందు మీ లిమిట్‌ను ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే సాధారణంగా క్రెడిట్ లిమిట్లో 30–40 శాతం మించి ఖర్చు చేయకుండా చూసుకోవాలి. లిమిట్లో వినియోగం 60 శాతం మించితే అది క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావానికి దారితీస్తుంది. 🔸 ఒక్క ఈఎంఐ చెల్లించడంలో విఫలమైనా అప్పుడు ఆలస్యపు రుసుం, దానిపై అదనపు వడ్డీ రేటు (36–48 శాతం) చెల్లించుకోవాల్సి వస్తుంది. దాంతో నో కాస్ట్ బదులు కాస్ట్ ఈఎంఐగా మారిపోయే ప్రమాదం ఉంది. 🔸 అంతేకాదు రుణ చెల్లింపుల్లో విఫలమైతే అది క్రెడిట్ స్కోరును బలహీనపరుస్తుంది. ఇవి తెలుసుకోండి.. 🔸 తమ వద్ద కొనుగోలుకు సరిపడా మొత్తం ఉన్నప్పటికీ.. జీరో కాస్ట్ ఉందని చెప్పి ఆఫర్‌పై కొనుగోలు చేయడం మంచి నిర్ణయమేమీ కాదు. 🔸 నో కాస్ట్ ఈఎంఐ కాకుండా స్పాట్ పేమెంట్‌పైనా బ్రాండ్లు, వర్తకులు భారీ డిస్కౌంట్‌ను ఫెస్టివల్, ప్రత్యేక సేల్స్ కార్యక్రమాల్లో భాగంగా ఆఫర్ చేస్తుంటారు. 🔸 ఉదాహరణకు రూ.50,000 కొనుగోలుపై 10 శాతం కార్డు డిస్కౌంట్ కింద రూ.5,000 తగ్గింపు పొందొచ్చు. అప్పుడు నో కాస్ట్ ఈఎంఐ కంటే స్పాట్ పేమెంట్ నయం. 🔸 అంతేకాదు మార్కెట్లో విచారిస్తే ఇంత కంటే తక్కువ మొత్తానికి నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ లేదా కార్డు పేమెంట్‌పై మరింత డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉండొచ్చు. -
ఈఎంఐతో ఐఫోన్.. కనిపించని ఆర్థిక నిజాలు!
ఒకప్పుడు భారతదేశంలో యాపిల్ ఐఫోన్ కొనడం అంటే.. డబ్బున్నవారికి మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. బ్యాంకులు & ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫార్మ్లు ఇచ్చే సులభమైన ఈఎంఐ ఆప్షన్స్ వల్ల చాలా మంది ఖరీదైన స్మార్ట్ఫోన్లను సులభంగా కొనుగోలు చేస్తున్నారు. రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్‌ను కూడా నెలకు చిన్న చిన్న చెల్లింపులుగా చెల్లిస్తూ కొనడం ఇప్పుడు సాధారణంగా మారింది.ఎలక్ట్రానిక్స్ షాపుల్లోకి వెళ్లినా లేదా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు చూసినా ఖరీదైన ఫోన్లు, ముఖ్యంగా ఐఫోన్లకు చాలా డిమాండ్‌లో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ వల్ల ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల చాలా మంది దీనిని కొనడానికి సిద్దపడుతున్నారు. ఈఎంఐ సౌకర్యం అనేది మీకు తెలియని ఆర్ధిక భారం మోపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.నెలవారీ ఖర్చులుఇప్పటికే చాలామంది యువ ఉద్యోగులు కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బకాయిల కోసం ఈఎంఐలు చెల్లిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఫోన్ కోసం మరో ఈఎంఐ తీసుకుంటే వారి నెలవారీ ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి ఈఎంఐ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.ఒక వ్యక్తి మొత్తం అప్పులు తన ఆదాయంతో పోలిస్తే ఎంత ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మన నెలవారీ ఆదాయంలో 30% కంటే ఎక్కువ భాగం ఈఎంఐలకు వెళ్ళకూడదు. 40% దాటితే అది ప్రమాదకరంగా మారుతుంది. 50% కంటే ఎక్కువైతే అది అప్పుల బారిన పడే పరిస్థితికి దారితీయవచ్చు. అంతే కాకుండా.. ప్రతి వ్యక్తి వద్ద కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఉద్యోగం కోల్పోయినా లేదా ఇతర సమస్యలు వచ్చినా ఈఎంఐలు చెల్లించడానికి ఇది ఉపయోగపడుతుంది.ఎక్కువ సంపాదిస్తేరూ.1,34,900 ధర ఉన్న ఒక ఐఫోన్‌ను 12 నెలల నో కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేస్తే.. ప్రతి నెల సుమారు రూ.11,242 చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి నెలకు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తే ఈ ఈఎంఐ అతని ఆదాయంలో సుమారు 11% మాత్రమే అవుతుంది. అప్పుడు ఇది కొంతవరకు ఆర్థికంగా సౌకర్యంగా ఉంటుంది. కానీ తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది భారంగా మారే అవకాశం ఉంది.చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. ఈఎంఐ మొత్తం చిన్నదిగా కనిపిస్తే చాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ వారు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఈఎంఐ చెల్లిచడానికి పెట్టే డబ్బును.. పెట్టుబడిగా పెట్టితే భవిష్యత్తులో ఎక్కువ సంపాదించవచ్చు. కానీ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలక్రమేణా విలువ కోల్పోతాయి. ఇంకో విషయం ఏమిటంటే.. ఈఎంఐ కొనుగోళ్లలో ప్రాసెసింగ్ ఫీజులు వంటి అదనపు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది.వన్ మంత్ రూల్ఆర్థిక నిపుణులు ఒక సాధారణ నియమాన్ని సూచిస్తున్నారు. దాన్ని వన్ మంత్ రూల్ అంటారు. అంటే మనం కొనబోయే ఫోన్ ధర మన నెల జీతాన్ని మించకూడదు. మరొకటి ట్వైస్ ఓవర్ రూల్. అంటే మన వద్ద ఆ ఫోన్‌ను రెండు సార్లు కొనగలిగేంత లిక్విడ్ క్యాష్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఖరీదైన ఫోన్ కొనవచ్చు.మొత్తం మీద ఈఎంఐతో ఐఫోన్ కొనడం తప్పు కాదు. కానీ అది మన పొదుపులు, పెట్టుబడులు & భవిష్యత్తు ఆర్థిక భద్రతపై ప్రభావం చూపకూడదు. అందుకే ఖరీదైన ఫోన్ కొనుగోలు చేయడానికి ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: 2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక -
క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు... వాయిదా రూట్లో వెళితే జాగ్రత్త!!
కిషోర్, సురేష్... ఇద్దరూ మంచి స్నేహితులు. సహోద్యోగులు కూడా. కాకపోతే ఖర్చుల విషయంలో ఇద్దరూ భిన్నధ్రువాలు. కిషోర్ కాస్తంత పొదుపరి. అవసరమైన ఖర్చులు మాత్రమే పెడతాడు. సురేష్ అలాకాదు. ముందూ వెనకా చూడకుండా ఖర్చు చేసేసి... తరవాత తీరిగ్గా బాధపడతాడు. ఇద్దరికీ క్రెడిట్ కార్డులున్నాయి. కార్డు చెల్లింపుల్లోనూ ఇద్దరివీ రెండుదారులు. కిషోర్ ప్రతినెలా తను ఖర్చు చేసిన మొత్తం బిల్లును గడువు తేదీ లోపల ఠంచనుగా చెల్లించేస్తుంటాడు. సురేష్ మాత్రం కాస్త పెద్ద బిల్లుల్ని ఈఎంఐ కింద మార్చేసు కుంటూ ఉంటాడు. ఇలా చేయటం వల్ల కార్డు తీసుకుని రెండేళ్లు తిరిగేసరికి కిషోర్ ఎప్పట్లానే ఉన్నా... సురేష్‌కు మాత్రం ఈఎంఐ పెరిగి పోయింది. ప్రతినెలా వాడే బిల్లు... దానికితోడు అప్పటికే చెల్లించాల్సిన ఈఎంఐలు... ఇవన్నీ కలిసి భారమయ్యాయి. అసలు సురేష్‌లా చెయ్యటం మంచిదేనా? ఇలా క్రెడిట్ కార్డు బిల్లుల్ని ఈఎంఐలుగా మార్చుకోవటం లాభమా? నష్టమా? వడ్డీ తక్కువే ఉంటుంది కనక లాభమనుకోవచ్చా? ఇవన్నీ వివరించేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం... - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం చెల్లించ గలిగితే ఒకేసారి చెల్లించటమే బెటర్ # ఆ సామర్థ్యం లేనప్పుడే ఈఎంఐ మార్గం # ఎంచుకునే ముందు వడ్డీ, గడువు చూడాల్సిందే # వీలైనంత తక్కువ గడువు ఎంచుకుంటే బెటర్ # గడువు పెరిగే కొద్దీ వడ్డీ కూడా ఎగువ ముఖమే # ఈఎంఐ అవకాశం కూడా కొందరికే ఇస్తున్న బ్యాంకులు # దీనిక్కూడా కస్టమర్ల క్రెడిట్ హిస్టరీనే ఆధారం క్రెడిట్ కార్డు కస్టమర్లు బిల్లు మొత్తం ఒకేసారి కట్టకుండా ఈఎంఐ పద్ధతిలో చెల్లించేలా వారిని ప్రోత్సహించటం బ్యాంకుల వ్యాపారం. కార్డు స్వైప్ చేసిన ప్రతిసారీ... కావాలంటే ఈ బిల్లును మీరు ఈఎంఐలోకి మార్చుకోవచ్చని సూచిస్తూ కస్టమర్లకు ఓ ఎస్ఎంఎస్ రావటం అందరికీ తెలిసిందే. కాకపోతే మరీ చిన్నచిన్న బిల్లుల్ని కాకుండా... కాస్త పెద్ద మొత్తంలో బిల్లులకే బ్యాంకులు ఈ ఆఫర్ ఇస్తుంటాయి. ఈ మొత్తం బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. ఈ మధ్య పలు బ్యాంకులు ఈ మొత్తాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఎస్బీఐ ప్రస్తుతం రూ.2,500 బిల్లును కూడా ఈఎంఐకి మార్చుకునే అవకాశమిస్తోంది. ఒకరకంగా ఇది కస్టమర్లకు, బ్యాంకులకు ఇద్దరికీ మంచిదే. గడువు తేదీలోపు మొత్తం బిల్లు కట్టలేని కస్టమర్లకు ఇలా మార్చుకోవటం వల్ల వడ్డీ భారం తగ్గుతుంది. బ్యాంకులకు కూడా డిఫాల్ట్‌లు తగ్గి అదనపు వడ్డీ వస్తుంటుంది. కాకపోతే ఈ అవకాశాన్ని ఆచితూచి వాడుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘బిల్లును ఒకేసారి కట్టలేని సందర్భాల్లో మాత్రమే ఈఎంఐ ఎంచుకోవాలి. లేకపోతే ఇది భారంగా మారుతుంది’’ అనేది వారి సూచన. ఈ రెండూ గుర్తుంచుకోండి... ‘‘ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునేటపుడు ప్రధానంగా ఎన్ని నెలల్లో చెల్లించాలి? వడ్డీ రేటెంత? అనే రెండు అంశాలూ తెలుసుకోవాలి. ఎందుకంటే వడ్డీ రేటు స్థిరంగా ఉండేది కాదు. కస్టమర్‌ను బట్టి, బ్యాంకును బట్టి మారుతుంటుంది. ఒకే కస్టమర్‌కు ఒకోసారి 14 శాతం వడ్డీకే ఈఎంఐ మార్గాన్ని ఎంచుకోవటానికి ఛాన్సిచ్చే బ్యాంకులు... ఒకోసారి అంతకన్నా ఎక్కువ వడ్డీరేటు వేస్తుంటాయి. అందుకని చూసి ఎంచుకోవాలి’’ అని ఎస్బీఐ కార్డ్స్ సీఈఓ విజయ్ జసుజ చెప్పారు. చెల్లించని మొత్తంపై వడ్డీ మిగులుతుంది... మామూలుగా కూడా క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం ఉండదు. కనీస బిల్లుగా పేర్కొనే మొత్తాన్ని చెల్లిస్తే చాలు. ఇది సహజంగా వాడినదాంట్లో 5 శాతంగా ఉంటుంది. కాకపోతే మిగిలిపోయే మొత్తంపై 30-40 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈఎంఐ మార్గాన్ని ఎంచుకుంటే... వడ్డీ రేటు పర్సనల్ లోన్ కన్నా కాస్త ఎక్కువ ఉంటుంది. ఈ లెక్కన చూస్తే వడ్డీ మిగులుతున్నట్టే కదా!!. పెపైచ్చు పర్సనల్ లోన్ మాదిరి డాక్యుమెంట్లు సమర్పించటం వంటి తతంగం ఉండదు. వడ్డీ రేటెంత? మామూలుగా ఈఎంఐ మొత్తంపై 12-20 శాతం వరకూ వడ్డీ ఉంటుంది. చెల్లించాల్సిన గడువు కూడా మూడు నెలల నుంచి కొన్ని సందర్భాల్లో మూడేళ్ల వరకూ కూడా ఉంటుంది. అయితే ఎక్కువ కాలం ఎంచుకుంటే ఎక్కువ వడ్డీ పడుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. మీ చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి... సాధ్యమైనంత వరకు తక్కువ గడువును ఎంచుకుంటే మంచిదన్నది నిపుణుల సూచన. ఈఎంఐ మార్గం వల్ల మరో ప్రయోజనమేంటంటే డీల్స్, ప్రమోషన్ల ఖర్చును ఆయా వస్తువుల తయారీ కంపెనీలు భరిస్తాయి. దీంతో వడ్డీ మరికాస్త తగ్గుతుంది. ఈఎంఐ పనిచేసేదిలా... ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.50వేలు. మీరు ఓ నెలలో ఒకే లావాదేవీలో రూ.15వేల బిల్లు చేశారు. దాన్ని మీరు వడ్డీతో కలిపి ఆరు నెలల పాటు నెలకు రూ.3వేల చొప్పున చెల్లించాలనుకున్నారు. తదుపరి బిల్లింగ్ గడువు వచ్చేసరికి మీ క్రెడిట్ లిమిట్ రూ.35వేలే ఉంటుంది. కాకపోతే ఒక వాయిదా చెల్లించాక దాన్లో వడ్డీపోను అసలుగా ఎంత చెల్లించారో అది మీ లిమిట్‌కు కలుస్తుంది. ఆ తరవాత మీ లావాదేవీల బిల్లు ఎప్పటికప్పుడు కట్టాల్సిందే. క్రెడిట్ లిమిట్ దాటడానికి కూడా వీలుండదు. ఒకవేళ దాటితే లావాదేవీ చెల్లకపోవచ్చు. కొన్ని బ్యాంకులు ఒకోసారి అనుమతిస్తాయి కానీ... ఓవర్ లిమిట్ ఛార్జీలు బాగానే వడ్డిస్తాయి. నిజానికి ఈఎంఐ ఆప్షన్ అన్ని బ్యాంకుల దగ్గరా ఉంటుంది. కాకపోతే అందరు కస్టమర్లకూ ఇవ్వరు. వారి క్రెడిట్ హిస్టరీ చూసి... కస్టమర్‌ను బట్టి బ్యాంకులు ఈ ఆఫర్ ఇస్తుంటాయి. ఒకవేళ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుని కూడా గడువులోపు చెల్లించకపోతే మామూలుగా కార్డుపై వడ్డీ రేట్లెంత ఉంటాయో అవే వర్తిస్తాయి. అదనంగా రీపేమెంట్ ఫెయిల్యూర్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.


