నో కాస్ట్‌లో అసలు కాస్ట్‌ ఎంత..? | The Hidden Cost of No-Cost EMI Is It Really Zero | Sakshi
Sakshi News home page

నో కాస్ట్‌లో అసలు కాస్ట్‌ ఎంత..?

Apr 27 2026 7:55 AM | Updated on Apr 27 2026 9:34 AM

The Hidden Cost of No-Cost EMI Is It Really Zero

జీరో ఈఎంఐ మాయలో కస్టమర్‌ విలవిల

వడ్డీ ఒక్కటే తగ్గింపు

18 శాతం జీఎస్‌టీ తప్పనిసరి

ప్రాసెసింగ్‌ చార్జీ తప్పదు

దీనిపైనా మరో 18 శాతం పన్ను అదనం 

క్రెడిట్‌ లిమిట్‌లో కోత

ముందస్తు చెల్లింపులపై అదనపు బాదుడు

‘రూ.1.20 లక్షలు ఖరీదు చేసే యాపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ల్యాప్‌టాప్‌.. ఒకేసారి అంత పెట్టి కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాదు. 6–9–12–18–24 నెలల సులభ వాయిదాల్లో, నో కాస్ట్‌ ఈఎంఐపై కొనుగోలు చేసుకోవచ్చన్న ఆఫర్‌ ఇస్తే.. చాలా మందికి ముందుకు వస్తారు. రూ.1.20 లక్షల ల్యాప్‌టాప్‌ నెలకు రూ.5,000తో చేతికి వస్తుంటే ఎవరు కాదనుకుంటారు చెప్పండి? కానీ, ఈ ఆఫర్ల వెనుక వాస్తవ అంశాలను ప్రతి కస్టమర్‌ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నిజంగానే ఎలాంటి వ్యయాలు ఉండవా? బయటకు చెప్పని చార్జీలేవైనా ఉంటాయా? అసలు ఈ ఆఫర్లు ఎలా పనిచేస్తాయి? అని ప్రశ్నించుకోవాలి.  

వడ్డీ ఉండదా? 
🔸    నో కాస్ట్‌ ఈఎంఐ అంటే ఎంపిక చేసుకున్నన్ని నెలల పాటు సమాన వాయిదాల్లో చెల్లించాలి. దీనిపై వడ్డీ పడుతుంది. 
🔸    ప్రతీ నెల వాయిదాపై బ్యాంక్‌ వడ్డీ విధిస్తుంది.  
🔸    కాకపోతే ఈఎంఐ స్కీమ్‌ కాల వ్యవధిలో పడేంత వడ్డీని కొనుగోలు సమయంలోనే తగ్గింపు లభిస్తుంది. 
🔸    కనుక కొనుగోలుదారులపై వడ్డీ భారం పడదు.  
🔸    ముందే డిస్కౌంట్‌ ఇచ్చేయడంతో ప్రతి నెలా అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.  

చార్జీలూ ఉంటాయ్‌.. 
🔸    నిజానికి వడ్డీ ఒక్కటే ఉండదు. మిగిలిన చార్జీలు యథావిధిగా చెల్లించుకోవాల్సిందే. 
🔸    ప్రతీ వాయిదాపై 18 శాతం జీఎస్‌టీ ఉంటుంది. 
🔸    ఈఎంఐ లావాదేవీపై ప్రాసెసింగ్‌ చార్జీ కూడా పడుతుంది. లావాదేవీ విలువ ఆధారంగా ఈ మొత్తం రూ.200–999 మధ్య ఉంటుంది. దీనిపై మరో 18 శాతం జీఎస్‌టీ కూడా చెల్లించుకోవాలి. 
 🔸   ఈఎంఐలన్నింటినీ ముందే చెల్లించేస్తానంటే అందుకు అదనంగా కొంత సమర్పించుకోవాలి. ఒకవేళ 9 నెలల ఈఎంఐని మూడు నెలలకే ముగించేద్దామనుకుంటే బ్యాలన్స్‌ ఈఎంఐలపై 2–3 శాతం అదనంగా చెల్లించాల్సి రావచ్చు.  

ఉదాహరణ.. 
🔸    రూ.50,000 ఖరీదు చేసే వస్తువు కొన్నారు. ఆరు నెలల ఈఎంఐ పెట్టుకున్నారు.    
 🔸   దీనిపై వడ్డీ సుమారుగా రూ.2,296 అనుకుందాం. ఇంత మేర కొనుగోలులో తగ్గుతుంది. దీంతో నికర కొనుగోలు ధర రూ.47,704 అవుతుంది.  
🔸    తగ్గించిన రూ.2,296 మేర ప్రతి నెలా ఈఎంఐలో మళ్లీ ఆరు నెలల పాటు కలుస్తుంది. రూ.2,296 వడ్డీపై 18 శాతం జీఎస్‌టీ కింద మరో రూ.413 చార్జీ కూడా పడుతుంది.  
🔸    ప్రాసెసింగ్‌ చార్జీ రూ.300 అనుకుంటే.. దీనికి 18 శాతం జీఎస్‌టీతో కలిపి రూ.354 చెల్లించాలి.

క్రెడిట్‌ లిమిట్‌పై ప్రభావం..
🔸    ఈఎంఐపై కొనుగోలు చేసిన వెంటనే అంత మేర కార్డు క్రెడిట్‌ లిమిట్‌ తగ్గిపోతుందని తెలుసుకోవాలి.  
🔸    ఉదాహరణకు మీ కార్డుపై రూ.1,00,000 లిమిట్‌ ఉందనుకుందాం. 
🔸    రూ.60,000 ల్యాప్‌టాప్‌ లేదా ఫోన్‌ కొనుగోలుతో లిమిట్‌ రూ.40,000కు తగ్గిపోతుంది.  
🔸    అక్కడి నుంచి ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఆరు నెలల ఈఎంఐ చెల్లించాలి. మొదటి నెల రూ.10,000 చెల్లించిన వెంటనే లిమిట్‌ అంత మేర పెరిగి రూ.50,000కు చేరుతుంది. రెండో నెలలో రూ.10,000 ఈఎంఐ చెల్లించిన తర్వాత లిమిట్‌ రూ.60,000కు పెరుగుతుంది. 
🔸    క్రెడిట్‌ లిమిట్‌లో వడ్డీకి సరిపడా కూడా లాక్‌ అవుతుంది. అది కూడా ప్రతి నెలా ఈఎంఐ చెల్లించిన వెంటనే క్రమంగా విడుదలవుతూ వెళుతుంది.  

డిస్కౌంట్‌ ఎవరి ఆఫర్‌? 
 🔸   ముందు చెప్పుకున్నట్టు ఈఎంఐ వాయిదాతోపాటు బ్యాంక్‌లు వడ్డీని కూడా వసూలు చేస్తాయి.  
  🔸  ఈ వడ్డీని ఎక్కువ సందర్భాల్లో బ్రాండ్‌ (ఉదాహరణకు శామ్‌సంగ్‌ లేదా యాపిల్‌), రిటైలర్‌ భరిస్తారు.  
🔸 కొన్ని సందర్భాల్లో బ్యాంక్‌ సైతం మర్చంట్‌ టైఅప్‌లలో భాగంగా కొంత మేర భరిస్తుంది.  
🔸    అందుకే ఆరంభంలో అంత మేర డిస్కౌంట్‌ లభిస్తుంది.  
 🔸   ఈ ఆఫర్‌తో బ్రాండ్లు, వర్తకులు విక్రయాలు పెంచుకుంటారు. 
 🔸   క్రెడిట్‌ కార్డు సంస్థలకు కొత్త కస్టమర్లు పెరుగుతారు. 
🔸అందుకే ఈ తరహా ఆఫర్లను ఎక్కువగా ప్రమోట్‌ చేస్తుంటారు.  

క్రెడిట్‌ స్కోరుపైనా ప్రభావం? 
🔸    ఈఎంఐపై కొనుగోలుతో క్రెడిట్‌ స్కోరుపై సానుకూల, ప్రతికూల ప్రభావాలకూ చాన్స్‌ ఉంటుంది. 
🔸    ప్రతి నెలా ఈఎంఐని సకాలంలో చెల్లించిన విషయాన్ని బ్యాంక్‌లు సిబిల్, ఎక్స్‌పీరియన్‌ తదితర క్రెడిట్‌ బ్యూరో సంస్థలకు తెలియజేస్తాయి. ఇది క్రెడిట్‌ స్కోరును పెంచుతుంది. 
🔸    రుణాల సమతుల్యతకు సాయపడుతుంది. క్రెడిట్‌ కార్డు స్వైప్‌నకే పరిమితం కాకుండా, రుణం తీసుకుని చెల్లించడం రుణ పరపతిని పెంచుతుంది. 
🔸    విజయవంతంగా ఒక రుణాన్ని ముగించినట్టు మీ రిపోర్ట్‌లో నమోదు కావడం కూడా స్కోర్‌ను అధికం చేస్తుంది.  
🔸    ఈఎంఐపై కొనుగోలు చేసే ముందు మీ లిమిట్‌ను ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే సాధారణంగా క్రెడిట్‌ లిమిట్‌లో 30–40 శాతం మించి ఖర్చు చేయకుండా చూసుకోవాలి. లిమిట్‌లో వినియోగం 60 శాతం మించితే అది క్రెడిట్‌ స్కోర్‌పై ప్రతికూల ప్రభావానికి దారితీస్తుంది.  
🔸    ఒక్క ఈఎంఐ చెల్లించడంలో విఫలమైనా అప్పుడు ఆలస్యపు రుసుం, దానిపై అదనపు వడ్డీ రేటు (36–48 శాతం) చెల్లించుకోవాల్సి వస్తుంది. దాంతో నో కాస్ట్‌ బదులు కాస్ట్‌ ఈఎంఐగా మారిపోయే ప్రమాదం ఉంది.  
🔸    అంతేకాదు రుణ చెల్లింపుల్లో విఫలమైతే అది క్రెడిట్‌ స్కోరును బలహీనపరుస్తుంది.  

ఇవి తెలుసుకోండి.. 
🔸    తమ వద్ద కొనుగోలుకు సరిపడా మొత్తం ఉన్నప్పటికీ.. జీరో కాస్ట్‌ ఉందని చెప్పి ఆఫర్‌పై కొనుగోలు చేయడం మంచి నిర్ణయమేమీ కాదు. 
 🔸   నో కాస్ట్‌ ఈఎంఐ కాకుండా స్పాట్‌ పేమెంట్‌పైనా బ్రాండ్లు, వర్తకులు భారీ డిస్కౌంట్‌ను ఫెస్టివల్, ప్రత్యేక సేల్స్‌ కార్యక్రమాల్లో భాగంగా ఆఫర్‌ చేస్తుంటారు. 
🔸  ఉదాహరణకు రూ.50,000 కొనుగోలుపై 10 శాతం కార్డు డిస్కౌంట్‌ కింద రూ.5,000 తగ్గింపు పొందొచ్చు. అప్పుడు నో కాస్ట్‌ ఈఎంఐ కంటే స్పాట్‌ పేమెంట్‌ నయం.  
🔸    అంతేకాదు మార్కెట్లో విచారిస్తే ఇంత కంటే తక్కువ మొత్తానికి నోకాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌ లేదా కార్డు పేమెంట్‌పై మరింత డిస్కౌంట్‌ ఆఫర్లు కూడా ఉండొచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement