breaking news
Electronics market
-
ఎలక్ట్రానిక్స్ రంగం @ రూ.14.4 లక్షల కోట్లు!
ముంబై: ఎల్రక్టానిక్స్ తయారీ సేవల (ఈఎంఎస్) రంగం వచ్చే ఐదేళ్లలో భారీగా విస్తరించనుంది. 2030 నాటికి మూడు రెట్లకు పైగా పెరిగి 150 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.14.4 లక్షల కోట్లు) ఈఎంఎస్ మార్కెట్ చేరుకుంటుందని కేపీఎంజీ ఇండియా నివేదిక అంచనా వేసింది. దేశీ డిమాండ్‌కు తోడు ప్రభుత్వపరమైన ప్రోత్సాహకాలు. చైనాకు ప్రత్యామ్నాయంగా విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థల కోసం అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తుండడం (చైనా ప్లస్ వన్ విధానం) ఈ మార్కెట్ విస్తరణకు దన్నుగా నిలవనున్నట్టు తెలిపింది. 2025లో ఈఎంఎస్ మార్కెట్ పరిమాణం 40–45 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు పేర్కొంది. అయితే ఈ రంగం వృద్ధి విస్తృతంగా కాకుండా పరిమితంగా ఉండడాన్ని ఎత్తి చూపించింది. అధిక విలువను తీసుకొచ్చే డిజైన్, విడిభాగాలు, మేధో హక్కుల (ఐపీ) పరంగా దేశీ సంస్థల పాత్ర పరిమితంగానే ఉన్నట్టు తెలిపింది. అదే సమయంలో మొబైల్, అధికంగా అమ్ముడుపోయే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అసెంబ్లింగ్‌కే భారత కంపెనీలు ఎక్కువగా పరిమితమైనట్టు వివరించింది. దీని స్థానంలో డిజైన్, తయారీ, ఐపీ, వ్యాల్యూ చైన్‌తో కూడిన సమగ్రమైన ఎల్రక్టానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ అవతరించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. వృద్ధికి అపార అవకాశాలు.. అంతర్జాతీయ ఈఎంఎస్ మార్కెట్ 2025లో 640–650 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు పెరగనున్నట్టు కేపీఎంజీ నివేదిక అంచనా వేసింది. అనుసంధానత, ఎలక్ట్రిఫికేషన్, ఓఈఎం అవుట్సోర్సింగ్ ఈ మార్కెట్ విస్తరణకు దోహదం చేయనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ రంగం కేవలం ఖర్చులను నియంత్రించుకోవడం కంటే, నమ్మకమైన ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు పేర్కొంది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో భారత్ వాటా 5–6 శాతంగానే ఉండగా, ఇక్కడి నుంచి భారీ వృద్ధి సాధించడానికి బలమైన అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. ఈ చర్యలు అవసరం.. ఎలక్ట్రానిక్స్ తయారీకి అవసరమైన కీలక విడిభాగాల కోసం భారత్ ఇప్పటికీ 80–95 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడి ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. దీనివల్ల ఇక్కడి కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గిపోతున్నాయని.. దీన్ని అధిగమించడం అత్యంత ముఖ్యమని ఈ నివేదిక సూచించింది. సాధారణ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ ద్వారా మార్కెట్ పరిమాణం పెరిగినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం క్లిష్టమైన సాంకేతికత కలిగిన ఆటోమోటివ్, ఇండస్ట్రియల్, ఏరోస్పేస్ రంగాలపై ఎక్కువగా దృష్టి సారించాలని పేర్కొంది. ఈ రంగాల్లో అధిక విలువ సృష్టికి అవకాశాలున్నట్టు వివరించింది. ఎల్రక్టానిక్స్ తయారీలో తక్కువ వ్యయాలతో అంతర్జాతీయంగా భారత్ పోటీపడేందుకు కేవలం సామర్థ్య ఆధారితం కాకుండా నైపుణ్య ఆధారితంగా ఎదగాల్సి ఉందని పేర్కొంది. ‘‘ఇందుకోసం ప్రభుత్వం, తయారీ సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. దేశీయంగా విడి భాగాల తయారీని పెంచడంతోపాటు కారి్మకుల్లో నైపుణ్యాలను పెంచాలి. ఇంజనీరింగ్–డిజైన్‌పై పెట్టుబడులు పెట్టడం, అంతర్జాతీయ విలువ ఆధారిత వ్యవస్థతో అనుసంధానం కావడంపై దృష్టి సారించాలి’’అని ఈ నివేదిక సూచించింది. -
ట్యాబ్లెట్ల టార్గెట్ పిల్లలే..!
దేశీ మార్కెట్లో 10% ఈ సెగ్మెంటే వినోద, విజ్ఞాన యాప్‌లతో ఆకర్ష.. కంటెంట్ కోసం ఒప్పందాలు రూ.10 వేల లోపు ధరలతో ప్రచారం రెండేళ్ల కిందట ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ట్యాబ్లెట్ల హవా మామూలుగా లేదు. బీభత్సమైన మోడళ్లతో కంపెనీలు మార్కెట్‌ను ముంచెత్తాయి. కానీ తక్కువ ధరకే పెద్ద స్క్రీన్లను అందించే ఫోన్లు రంగంలోకి రావటంతో పరిస్థితి మారిపోయింది. ట్యాబ్లెట్ల అమ్మకాలు ఆశించినంతగా పెరగలేదు. దీంతో భవిష్యత్ అంచనాలను కూడా సవరించాల్సి వస్తోంది. మరేం చేయాలి? కంపెనీల ఆలోచన ఇదే. బాగా ఆలోచించాక ఇపుడు ట్యాబ్లెట్ కంపెనీలన్నీ పిల్లలపై గురిపెట్టాయి. వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందించే ట్యాబ్లెట్లతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా ట్యాబ్లెట్ పీసీల మార్కెట్ ఏడాదికి 40 లక్షల యూనిట్ల మేర ఉంటోందని అంచనా. ఇందులో పిల్లల విభాగం ట్యాబ్లెట్ పీసీల వాటా 8-10 శాతం మేర అంటే దాదాపు 4 లక్షల యూనిట్ల మేర ఉంటోంది. అందుకే కంపెనీలు ఈ వాటా కోసం పోటీ పడుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం భారత్‌లో పిల్లలు రోజులో సగటున రెండు గంటలు టీవీని చూస్తుండగా... అంతకు మించి ఎక్కువ సమయాన్ని తమ తల్లిదండ్రుల స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లలో గేమ్స్ ఆడుతూ గడుపుతున్నారు. మరోవంక టెక్నాలజీని అందిపుచ్చుకునే మధ్యతరగతి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఈ గణాంకాల్లో దాగి ఉన్న వ్యాపారావకాశాలపై ట్యాబ్లెట్స్ కంపెనీలు కన్నేశాయి. దేశీయంగా ప్రస్తుతం మిటాషీ ఎడ్యుటైన్మెంట్, స్వైప్ టెలికం, ఫ్యూజన్ డైనమిక్స్ వంటి సంస్థలు కిడ్స్ ట్యాబ్లెట్స్ను తయారు చేస్తున్నాయి. మెటిస్ లెర్నింగ్ సంస్థ... చిప్ తయారీ సంస్థ ఇంటెల్‌తో కలిసి ఏడీ పేరుతో ట్యాబ్లెట్స్ తయారు చేస్తోంది. మూడేళ్లు పైబడిన పిల్లల కోసం చోటా భీమ్ పేరిట ఫ్యూజన్ డైనమిక్స్ ట్యాబ్లెట్స్ను అందిస్తోంది. పలు కంపెనీలు ఈ మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నాయి. కంటెంట్‌పై కసరత్తు... పిల్లలను ఆకట్టుకుకోవటంతో పాటు వాటిని తప్పకుండా కొనాలని పెద్దలక్కూడా అనిపించేలా ఆకర్షణీయమైన కంటెంట్‌ను అందించేందుకు కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. మెటిస్ లెర్నింగ్ సంస్థ తమ ఏడీ ట్యాబ్లెట్స్‌లో ప్రముఖ విద్యావేత్తలు సూచించినట్లు... రెండేళ్ల నుంచి పదేళ్ల లోపు పిల్లలు నేర్చుకోతగిన 160 పైచిలుకు లెర్నింగ్ యాప్స్‌ను పొందుపర్చింది. వినో దం, విద్య సంబంధ అంశాలను మరింతగా జోడిం చేందుకు మిటాషీ, స్వైప్ సంస్థలు ఎడ్యుకేషన్ యాప్స్ డెవలపర్లతో కలిసి పనిచేస్తున్నాయి. అలాగే వినోదపరమైన కంటెంట్ కోసం డిస్నీ, వార్నర్ బ్రద ర్స్ వంటి సంస్థలతో మిటాషీ చర్చలు జరుపుతోంది. ఆన్లైన్లో విక్రయాలు: చాలా మటుకు ట్యాబ్లెట్స్ విక్రయాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఆన్లైన్ సంస్థల ద్వారానే జరుగుతున్నాయి. స్వైప్‌కు చెందిన జూనియర్ ట్యాబ్లెట్ పీసీ రేటు రూ.5,749గా ఉంది. చోటా భీమ్ ట్యాబ్లెట్లు రూ.8,499 స్థాయిలో, మిటాషీ స్కై ట్యాబ్-2 రూ.5,999 నుంచి, మెటిస్-ఇంటెల్‌కి చెందిన ఏడీ ట్యాబ్లెట్ పీసీల రేట్లు రూ.9,999 స్థాయిలో ఉన్నాయి. అమ్మకాలు 23.45 కోట్లు! ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) అంచనాల ప్రకారం పర్సనల్ కంప్యూటర్ల అమ్మకాలు తగ్గుతుండగా ఆ స్థానాన్ని ట్యాబ్లెట్లతో పాటు ఫోన్లు, ఫ్యాబ్లెట్లు ఆక్రమిస్తున్నాయి. విండోస్ ప్లాట్‌ఫామ్ ద్వారా తనకున్న అనుకూలతను ఆసరా చేసుకుని ట్యాబ్లెట్ రంగంలో మైక్రోసాఫ్ట్ దూసుకెళుతుందని కూడా ఇది అంచనా వేసింది. ప్రస్తుతం 5.1 శాతంగా ఉన్న మైక్రోసాఫ్ట్ ట్యాబ్లెట్ల వాటా అంతర్జాతీయంగా 2019 నాటికి 14 శాతానికి చేరుతుందని ఐడీసీ పేర్కొంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా 2015లో 23.45 కోట్ల ట్యాబ్లెట్లు అమ్ముడవుతాయి. 2014తో పోలిస్తే ఇది 2.1 శాతం ఎక్కువ. 2019 నాటికి అమ్మకాలు 26.9 కోట్లకు చేరుతాయి. - సాక్షి బిజినెస్ విభాగం


