breaking news
Eamcet exam centers
-
ఎంసెట్ నిర్వహణపై మంత్రి గంటా సమీక్ష
విజయవాడ: ఎంసెట్ నిర్వహణపై సోమవారం అధికారులతో ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 29న ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నామనీ, వచ్చే నెల 9న పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. అయితే వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లోనే అన్ని సెట్ల నిర్వహణ ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు. తెలంగాణలోనూ ఎంసెట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని గంటా చెప్పారు. -
ఎంసెట్ ఫీజు పెంపు ?
పరిశీలిస్తున్న ఎంసెట్ కమిటీ పరీక్ష కేంద్రాలు కూడా పెంపు ఖరారు కానున్న రీ వ్యాల్యుయేషన్ ఫీజులు వచ్చే నెల 4న జరిగే సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎంసెట్ దరఖాస్తు ఫీజు పెరిగే అవకాశం ఉంది. నిర్వహణ ఖర్చులు పెరిగినందున ఈ ఫీజు పెంపు తప్పకపోవచ్చని ఎంసెట్ కమిటీ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎంసెట్‌లో రూ. 250 వసూలు చేసిన దరఖాస్తు ఫీజును ఈసారి రూ. 300 చేసే అంశాన్ని ఎంసెట్ కమిటీ, ఉన్నత విద్యాశాఖ వర్గాలు పరిశీలిస్తున్నాయి. అయితే ఫీజును ఎంత పెంచాలి? అసలు పెంచాలా? వద్దా? పెంపు నుంచి రిజర్వేషన్లకు చెందిన విద్యార్థులను మినహాయించాలా? వద్దా? అనే అంశాలపై వచ్చే నెల 4న జరిగే ఎంసెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఎంసెట్‌లో క్వాలిఫయింగ్ మార్కులు, ర్యాంకింగ్ విధానం వంటి అంశాలపై చర్చించి అధికారిక నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ సమావేశంలో తీసుకోబోయే మరిన్ని నిర్ణయాలివీ.. ఈసారి ఎంసెట్‌కు 4.20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని ఎంసెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్ పరీక్ష కేంద్రాలను కూడా పెంచాలనే నిర్ణయానికి వచ్చారు. గత ఏడాది ఎంసెట్‌కు 3.90 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా అందులో ఇంజనీరింగ్ కోసం రాసే పరీక్ష కేంద్రాలు 575 ఉండగా, ఈసారి వాటిని 600కు పైగా చేయనున్నారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ విద్యార్థులకు గత ఏడాది 125 కేంద్రాలను కేటాయించగా వాటిని 140కి పైగా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది హైదరాబాద్‌ను నాలుగు జోన్లుగా విభజించి విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించగా ఈసారి 8 జోన్లుగా విభజించి కేటాయించనున్నారు. తద్వారా విద్యార్థులకు సమీపంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించేలా, రవాణా పరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రీవ్యాల్యుయేషన్ ఫీజును కూడా ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఎంసెట్ ఓఎంఆర్ జవాబు పత్రాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని ఇటీవల ప్రాథమికంగా నిర్ణయించారు. సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఓఎంఆర్ రీవ్యాల్యుయేషన్‌కు ఎస్సీ, ఎస్టీలకు రూ. 200, ఇతరులకు రూ. 500 వసూలు చేయాలని భావిస్తున్నారు. అలాగే రీ వ్యాల్యుయేషన్ అండ్ జిరాక్స్ కాపీ ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీలకు రూ. 400, ఇతరులకు రూ. 1,000 వసూలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆన్లైన్ అయితే జిరాక్స్ కాపీకి అదనంగా వసూలు చేయాల్సిన అవసరం ఉండదని, కేవలం రీవ్యాల్యుయేషన్‌కు మాత్రమే ఫీజు వసూలు చేయాలనే భావన అధికారుల్లో ఉంది. ఎంసెట్ కమిటీ సమావేశంలో వీటిపైనా నిర్ణయం వెలువడనుంది.


