breaking news
Dubashi Shankar
-
మావోయిస్టు నేత దుబాసి శంకర్ ఆరోగ్యం విషమం!
కుషాయిగూడ, జూన్ 29: భువనేశ్వర్ సెంట్రల్ జైలులో ఉన్న సీపీఐ (మావోయిస్టు) కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడు దుబాసి శంకర్ అలియాస్ రమేశ్ అలియాస్ మహేందర్ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు సమాచారం. కుడి కాలుకు తీవ్ర ఇన్ఫెక్షన్తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సోమవారం ఆయనను జైలు అధికారులు భువనేశ్వర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన దుబాసి శంకర్ దాదాపు 45 ఏళ్లపాటు అజ్ఞాత జీవితాన్ని గడిపి, మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. 2021లో ఒడిశాలో అరెస్టైన ఆయన అప్పటి నుంచి భువనేశ్వర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గత రెండేళ్లుగా కుడి కాలుకు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న శంకర్‌కు జైలులోనే చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది.ఇటీవల ఆహారం తీసుకోలేకపోవడం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. శంకర్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించాలని ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు ప్రభుత్వాలను కోరుతున్నాయి.అలాగే, శంకర్‌పై ఉన్న కేసులను ఉపసంహరించుకుని మానవతా దృక్పథంతో విడుదల చేయాలని హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నాయి. శంకర్ ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వాలదే బాధ్యత అని హెచ్చరిస్తున్నాయి.గమనిక: ఈ కథనంలో ఆరోగ్య పరిస్థితి, కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల డిమాండ్లకు సంబంధించిన వివరాలు, వారి వాదనలు ప్రకటనల ఆధారంగా ఇచ్చాం. సంబంధిత ప్రభుత్వ లేదా జైలు అధికారుల అధికారిక స్పందన రావాల్సి ఉంది. -
మావోయిస్టు నేత దుబాసి శంకర్ అరెస్ట్
-
మావోయిస్టు నేత దుబాసి శంకర్ అరెస్ట్
చర్ల/దుబ్బాకటౌన్: మావోయిస్టు పార్టీ కీలకనేత, మిలటరీ కమిషన్ మెంబర్, కేంద్ర కమిటీ సభ్యుడు దుబాసి శంకర్ అలియాస్ రమేశ్‌ను ఒడిశా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కోరాపూట్ జిల్లా ఎస్పీ గుంటుపల్లి వరుణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రా– ఒడిశా సరిహద్దులో ఉన్న బోయిపారాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెటగూడ, నోయిరా గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీవీఎఫ్, ఎస్‌వోజీ, బీఎస్ఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అనుమానాస్పదంగా కనిపించిన దుబాసి శంకర్‌ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతడి వద్ద ఒక రైఫిల్, 10 రౌండ్ల తూటాలు, మొబైల్, రేడియో, రూ.35 వేల నగదు లభించాయి. 35 ఏళ్లుగా అజ్ఞాతవాసం: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెట్లనర్సంపల్లికి చెందిన శంకర్ 1987 నుంచి మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ అజ్ఞాతజీవితం గడుపుతున్నారు. 2004లో ఆంధ్రా– ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా, ఆ తర్వాత స్టేట్ మిలటరీ కమీషన్ మెంబర్‌గా పదోన్నతి పొందారు. ఆయన పలు ఎదురుకాల్పుల్లోంచి తప్పించుకున్నారు. మొత్తం 25 మంది జవాన్లను హతమార్చిన ఘటనల్లో పాల్గొన్నారని, ఆయనపై 3 రాష్ట్రాల్లో 72 కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. తిరుపతిలోని అలిపిరి వద్ద అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై జరిపిన మందుపాతర దాడి ఘటనలో శంకర్ పాత్ర ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. శంకర్ భార్య భారతక్క నాలుగేళ్ల క్రితం ఎన్కౌంటర్లో చనిపోయింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. -
‘మావోయిస్టు’ తల్లికి ఎమ్మెల్యే ‘ఆసరా’
దుబ్బాక: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన దుబాషి శంకర్ తల్లి నర్సమ్మ(80)కు మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ‘ఆసరా’గా నిలిచారు. సమగ్ర కుటుంబ సర్వే ఫలితంగా.. దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన దుబాషి నర్సమ్మకు అధికారులు పింఛన్ తొలగించారు. కొన్ని సంవత్సరాలుగా పింఛన్ తీసుకుంటున్న నర్సమ్మ ఇటీవల వెల్లడించిన పింఛన్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఎమ్మెల్యే ఎదుట గోడు వెలుబుచ్చింది. దీంతో చలించిన ఆయన ఆదివారం కలెక్టర్ రాహుల్‌బొజ్జాతో ఫోన్లో మాట్లాడుతూ పింఛన్ మంజూరు చేయాలని కోరారు. నర్సమ్మకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు శంకర్ 30 ఏళ్ల కింద అజ్ఞాతంలోకి వెళ్లాడు. యాదయ్యకు వ్యవసాయ ట్రాక్టర్ ఉండడం వల్ల నర్సమ్మకు అధికారులు పింఛన్ తొలగించారు.


