breaking news
Domestic car market
-
సీఎన్జీ.. సూపర్ క్రేజ్!
దేశీ కార్ల మార్కెట్లో ఇంధన ప్రాధాన్యతల ట్రెండ్ మారుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల సెగకు తోడు కాలుష్య నిబంధనల్లో నెలకొన్న అనిశ్చితితో కారు ప్రియులు ఇప్పుడు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో నడిచే కార్లకు సై అంటున్నారు. అధిక మైలేజీ.. తక్కువ మెయింటెనెన్స్.. పెట్రోల్ ఆప్షన్ కూడా ఉండటంతో సీఎన్జీ కార్లు మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నాయి. గతంలో అరకొరగా ఉన్న బంకులు ఇప్పుడు శరవేగంగా విస్తరిస్తుండటం కూడా దీనికి మరో ప్రధాన కారణం. మొత్తంమీద డీజిల్‌ను ఓవర్టేక్ చేసి సీఎన్జీ కార్లు అమ్మకాల్లో టాప్–2 ప్లేస్‌లో దూసుకెళ్తున్నాయి.మన రోడ్లపై ఇప్పటికీ పెట్రోల్ కార్లదే హవా. అయితే, గత రెండు మూడేళ్లుగా కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మరింత ఫోకస్ చేస్తున్నారు. దీంతో కార్ల విక్రయాల్లో సీఎన్జీ వరుసగా రెండో ఏడాది కూడా దేశంలో రెండో అత్యంత ప్రాధాన్య ఇంధనంగా నిలిచింది. 2025–26లో అమ్ముడైన మొత్తం కార్లలో సీఎన్జీ వాటా దాదాపు 22 శాతానికి ఎగబాకింది. అంటే 10 లక్షలకు పైగా సీఎన్జీ కార్లు రోడ్డెక్కాయన్నమాట! 2024–25లో సీఎన్జీ కార్ల వాటా 19.6 శాతంగా ఉంది. మూడేళ్ల క్రితం 12–13 శాతం వాటా ఉండగా.. ఇప్పుడు ఏకంగా రెట్టింపైంది. మరోపక్క, గతేడాదే డీజిల్ కార్లను దాటేసిన సీఎన్జీ కార్ల జోరు అంతకంతకూ పెరుగుతుండటం విశేషం. 2025–26లో డీజిల్ కార్ల వాటా 18.23 శాతం నుంచి 2026–27లో 18.08 శాతానికి తగ్గింది. పెట్రోల్ కార్లదీ ఇదే బాట. తొలిసారిగా 2025–26లో వాటి వాటా 50 శాతం దిగువకు పడిపోవడం గమనార్హం. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), హైబ్రిడ్ కార్ల విక్రయాలు కూడా రయ్ అంటున్నాయి. గతేడాది ఈవీల వాటా 2.61% నుంచి 4.25 శాతానికి ఎగబాకడం దీనికి నిదర్శనం. జూన్‌లోనూ జూమ్... ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్జీ, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు ఈ ఏడాది జూన్‌లో కూడా దుమ్మురేపాయి. రిటైల్ సేల్స్‌లో తొలిసారి వీటి వాటా 40 శాతాన్ని అధిగమించింది. 2025 జూన్‌లో ఇది 33.3 శాతమే. అలాగే ఈ ఏడాది మేలో 38 శాతంగా ఉంది. మరోపక్క, పెట్రోల్, డీజిల్ కార్ల వాటా 60 శాతం దిగువకు పడిపోయింది. ఇక సీఎన్జీ కార్లు తగ్గేదేలే అంటూ టాప్‌గేర్‌లో అమ్ముడయ్యాయి. జూన్ అమ్మకాల్లో సీఎన్జీ వాటా 24.3 శాతానికి ఎగసింది. హైబ్రిడ్ 8.3%, ఈవీలు 7.8% వాటా (31,823 కార్లతో ఆల్‌టైమ్ గరిష్టం) దక్కించుకున్నాయి.ఎందుకీ డిమాండ్..→ కారు కొనుగోలుదారులు సీఎన్జీకి జై కొట్టడానికి అధిక మైలేజీ, తక్కువ నిర్వహణ వ్యయమే ప్రధాన కారణం. పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్జీ కార్లకు ఒక్కో కిలోమీటర్ జర్నీకి అయ్యే ఖర్చు 40–50 శాతం తక్కువ. → నేరుగా కంపెనీలు విడుదల చేస్తున్న సీఎస్జీ వేరియంట్ల రేటు పెట్రోల్ కంటే రూ.80,000–1,00,000 ఎక్కువగా ఉంటోంది. అంటే, ఏటా సుమారు 15,000–20,000 కిలోమీటర్లు తిరిగేవారికి ఈ అదనపు వ్యయం 18 నెలల్లోనే రికవరీ అయిపోతుంది. అవసరమైతే పెట్రోలు ఆప్షన్ ఉండనే ఉంటుంది. ఈ వెసులుబాటు, ఇంధన ఆదానే ఇప్పుడు మాస్ మార్కెట్లో సీఎస్జీ కార్లకు కిర్రాక్ క్రేజ్ తెచ్చిపెడుతోంది. → సీఎన్జీ బంకులు శరవేగంగా విస్తరిస్తుండం కూడా ఈ కార్ల వైపు కస్టమర్లు మరింతగా మొగ్గుచూపుతున్నారు. ఏడాది క్రితం సిటీ గ్యాస్ డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్ 300 నగరాలు, పట్టణాల్లో ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 600కు చేరింది. → ఇదంతా ఒకెత్తయితే.. పశ్చిమాసియా సంక్షోభం దెబ్బతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడం కూడా ఎక్కువ మంది సీఎన్జీని నమ్ముకుంటున్నారు. ఆటోమొబైల్ డీలర్ల సంఘాల ఫెడరేషన్ (ఫాడా) సర్వే ప్రకారం ఇంధన ధరల పెరుగుదల, తక్కువ నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో సీఎన్జీ, ఈవీలే బెటర్ అని 56.9% మంది కస్టమర్లు భావిస్తున్నారట! → కాలుష్య నిబంధనలను కఠినతరం చేస్తుండటం వల్ల కూడా డీజిల్ కార్ల నుంచి సీఎన్జీ, ఇతరత్రా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లేలా చేస్తోంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో డీజిల్ వాహనాల కాలపరిమితిని పదేళ్లకు తగ్గించడం, మరిన్ని నగరాలూ ఇదే బాటలో నడుస్తాయన్న ఆందోళనలు, పాలసీ అనిశ్చితి డీజిల్ కార్ల డిమాండ్‌కు కోత పెడుతోంది. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే సీఎన్జీ వల్ల కాలుష్యం చాలా తక్కువ. → గతంలో ఎంట్రీ స్థాయి మోడళ్లలోనే అందుబాటులో ఉన్న సీఎన్జీ వేరియంట్లను ఆటోమొబైల్ దిగ్గజాలు ఇప్పుడు అన్ని మోడళ్లకూ విస్తరించాయి. మారుతీ సుజుకీ దాదాపు తన మొత్తం కార్ల రేంజ్లో ఫ్యాక్టరీ ఫిటెడ్ సీఎన్జీ ఆప్షన్లను అందిస్తోంది. ఇక టాటా మోటార్స్ సైతం జోరు పెంచింది. నెక్సాన్, పంచ్, టియాగో, ఆల్ట్రోజ్తో పాటు టాప్ ఎండ్ మోడళ్లలో సైతం సీఎన్జీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. హ్యుందాయ్ సైతం ఇదే బాటలో పయనిస్తోంది. జూన్‌లో 2–3 శాతం మేర ధరలు పెరిగినా, సీఎన్జీ కార్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదన్నది డీలర్ల మాట.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారత్‌లో విక్రయాలకు జీఎం గుడ్‌బై!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో ‘షవర్లే’ కార్ల విక్రయాలకు స్వస్తి చెప్పనుంది. రెండు దశాబ్దాలుగా దేశీయ ప్రయాణికుల కార్ల మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ సంస్థ వాటా ఒక్క శాతంలోపే ఉండిపోవడంతో, చివరికి విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించింది. దేశీయ కార్ల మార్కెట్‌ను దాదాపుగా జపాన్ కంపెనీలే గణనీయమైన వాటాతో శాసిస్తున్న నేపథ్యంలో జీఎం నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. సమగ్ర సమీక్ష అనంతరం, ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాల పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని జీఎం ప్రకటించింది. అలాగే, రష్యా, యూరోప్ సహా నాలుగు ఇతర మార్కెట్ల నుంచి కూడా వైదొలిగింది. ఇకపై ‘జీఎం మోటార్స్ ఇండియా’ భారత్ నుంచి ఎగుమతులకే పరిమితం కానుంది. కంపెనీకి మహారాష్ట్రలోని తాలెగాన్, గుజరాత్‌లోని హాలోల్‌లో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. హాలోల్ ప్లాంట్‌లో ఉత్పత్తిని గత నెలలోనే జీఎం నిలిపివేసింది. ఈ ప్లాంట్‌ను తన చైనా భాగస్వామి ఎస్ఏఐసీ మోటార్‌కు విక్రయించేందుకు చర్చలు జరుపుతోంది. తాలేగాన్ ప్లాంట్‌ను మాత్రం ఎగుమతుల కోసం వినియోగించుకుంటుంది. జీఎం కార్ల విక్రయాలు గత ఆర్థిక సంవత్సరంలో 21% క్షీణించి 25,823కు పరిమితం కాగా, అదే సమయంలో కంపెనీ ఉత్పత్తి చేసిన కార్ల సంఖ్య 83,368. వీటిలో ఎక్కువ భాగాన్ని కంపెనీ ఎగుమతి చేసింది. రేసులో గెలవలేక... భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకుగాను బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు జీఎం 2015లో ప్రకటించింది. భారత మార్కెట్లో స్థానికంగానే తయారు చేసిన 10 మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలిపింది. అయితే, ఇక్కడి మార్కెట్లో కంపెనీ అమ్మకాలు పుంజుకోకపోవడంతో తన ప్రణాళికలను పక్కన పెట్టేసింది. ‘‘ఈ నిర్ణయానికి రావడం కష్టంగానే అనిపించినా, మా ప్రపంచవ్యాప్త విధానానికి మద్దతుగా నిలిచేందుకు, మా వాటాదారులకు తగినంత లాభాలను అందించేందుకు ఇది సరైన నిర్ణయమే అవుతుంది’’అని జీఎం మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్టీఫన్జాకొబి పేర్కొన్నారు. ఎన్నో అవకాశాలను పరిశీలించిన అనంతరం భారత్‌లో పెట్టుబడులు పెంచుకోవడం వల్ల ఆశించిన మేర రాబడులు రావని గుర్తించినట్టు చెప్పారు. కాగా, ఈ నిర్ణయాన్ని జీఎం భారత్‌లోని తన ఉద్యోగులకు కూడా తెలియజేసింది. అయితే, ఎంత మందిపై ఇది ప్రభావం చూపేది కంపెనీ స్పష్టం చేయలేదు. కనీసం 200 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోవచ్చని విశ్వసనీయ సమాచారం. ఇకపై ఎగుమతులే తమకు ముఖ్యమని జీఎం ఇండియా ప్రెసిడెంట్, ఎండీ కహెర్ కాజెమ్ తెలిపారు. ఇటీవల విడుదల చేసిన షవర్లే బీట్ హచ్బ్యాక్ను మెక్సికో, సెంట్రల్, దక్షిణా్రíఫికా మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నామని... ఈ మార్కెట్ల కోసం షవర్లే బీట్ సెడాన్‌ను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. -
దేశీ మార్కెట్లో చిన్న కార్ల జోరు
న్యూఢిల్లీ: కష్టకాలాన్ని ఎదుర్కొంటూ వచ్చిన దేశీ కార్ల మార్కెట్‌కు ప్రస్తుతం చిన్న కార్లు ఊతమిస్తున్నాయి. ఇరుకు రోడ్లు, పార్కింగ్ సమస్యల కారణంగా కొనుగోలుదారులు ఎక్కువగా వీటివైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణం. దీంతో పరిమాణంలో చిన్నగా ఉన్నా, కొనుగోలుదారు పెట్టే ధరకు గరిష్ట స్థాయిలో లగ్జరీ సదుపాయాలను కూడా ఆటోమొబైల్ కంపెనీలు వీటిలో కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రూ. 5,00,000- రూ. 9,00,000 శ్రేణిలో మినీ సెడాన్లు, రూ. 6,00,000 నుంచి రూ. 12,00,000 దాకా ఖరీదు చేసే స్పోర్ట్స్ యుటి లిటీ వాహనాలు(ఎస్యూవీ), మల్టీ యుటిలిటీ వాహనాలు(ఎంయూవీ) మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. మిగతా సెగ్మెంట్లతో పోలిస్తే ఈ సెగ్మెంట్ మెరుగ్గా 15-16 శాతం స్థాయిలో వృద్ధి చెందుతోందని అంచనా. నాలుగు మీటర్ల లోపు పొడవుండే కార్లపై తక్కువ స్థాయిలో ఎనిమిది శాతం ఎక్సైజ్ సుంకం విధించాలన్న గత యూపీఏ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం.. చిన్న కార్ల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. సెడాన్లపై 20 శాతం, ఎస్‌యూవీలపై 24 శాతం ఎక్సైజ్ సుంకాలు ఉండాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చే విధంగా ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం కూడా ఇదే విధానం కొనసాగించాలని నిర్ణయించడం చిన్న కార్ల మార్కెట్‌కు తోడ్పడుతోంది. లగ్జరీ ఫీచర్లు.. లోపల విశాలంగా ఉండటం, లగ్జరీ ఫీచర్లు, తక్కువ ధర, చూడముచ్చటి ఆకారం, అన్నింటికన్నా ముఖ్యంగా మెరుగైన మైలేజీ, ట్రాఫిక్‌లో సైతం సులువుగా వెళ్లేందుకు అనువుగా ఉండటం చిన్న కార్లకు ప్లస్ పాయింటు. టచ్స్క్రీన్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, పార్కింగ్ సెన్సార్లు, డే-టైమ్ ల్యాంప్‌లు, సీడీ ప్లేయర్లు మొదలైన ఫీచర్లు కొన్నాళ్ల క్రితం దాకా కాస్త పై స్థాయి కార్లకు మాత్రమే పరిమితం అయ్యేవి. ప్రస్తుతం టెక్నాలజీ అభిరుచి కలిగిన యువ కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతుండటంతో కంపెనీలు చిన్న కార్లలో కూడా ఇలాంటి ఫీచర్లను పొందుపరుస్తున్నాయి. స్టీరింగ్ వీల్‌పైనే బ్లూటూత్ కనెక్టివిటీ, ఆడియో కంట్రోల్స్ కూడా ఉండాలని చాలా మంది కొనుగోలుదారులు కోరుకుంటున్నట్లు ఆటోమొబైల్ రంగ నిపుణుడు టుటు ధవన్ తెలిపారు. ఇతరులను అనుకరించడం కాకుండా తమ అవసరాలకు అనుగుణమైన కార్లను ఎంచుకోవడంలో దేశీ కొనుగోలుదారులు ప్రస్తుతం వాస్తవిక దృక్ప థంతో వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 4 మీటర్ల లోపు పొడవుండే కార్లలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హోండా అమేజ్, మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్ వాహనాలు పాపులర్‌గా ఉన్నాయి. అలాగే రెనో డస్టర్, నిస్సాన్ టెరానో, మారుతీ సుజుకీ ఎర్టిగా, హోండా మొబీలియో కార్లు మార్కెట్లో పెను మార్పులు తెచ్చాయి. ఈ సెగ్మెంట్ ఊతంతోనే రెనో, ఫోర్డ్ వంటి కంపెనీలు నిలదొక్కుకున్నాయి. భారత మార్కెట్లో లేటుగా ప్రవేశించినప్పటికీ 2012 జూలైలో ప్రవేశపెట్టిన డస్టర్ ఎస్‌యూవీతో రెనో సంస్థ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక, రెండు దశాబ్దాల పైగా భారత్‌లో ఉన్న పెద్దగా విజయవంతం కాలేకపోయిన ఫోర్డ్ సైతం.. ఎకోస్పోర్ట్ మినీ ఎస్‌యూవీని ప్రవేశపెట్టడం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. 17 రోజుల వ్యవధిలో ఏకంగా 40,000 బుకింగ్స్ వచ్చాయి. ఇప్పటికీ వీటికోసం నాలుగు నుంచి ఎనిమిది నెలల దాకా వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. ఈ విభాగం కార్లు ఇంత ప్రజాదరణ పొందుతుండటంతో రాబోయే ఆరు నెలల్లో మారుతీ, టాటా, హ్యుందాయ్, మహీంద్రా, ఫియట్, షెవర్లె, ఫోక్స్‌వ్యాగన్ తదితర కంపెనీలు మరిన్ని మినీ-సెడాన్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నాయి.


