breaking news
Domain name
-
రూ .300 లకు కొన్న 2 అక్షరాలు.. ఇప్పుడు రూ .634 కోట్లు
అక్షరాలకు అదృష్టం వరించడమంటే ఇదోనేమో. మూడు దశాబ్దాల క్రితం కేవలం రూ.300కి కొనుగోలు చేసిన ఏఐ.కామ్ (AI.com) అనే రెండు అక్షరాల డొమైన్ నేమ్ నేడు సుమారు రూ.634 కోట్ల విలువైన డిజిటల్ ఆస్తిగా మారింది. కృత్రిమ మేధస్సు (AI) విప్లవం సాధారణ వందల రూపాయల పెట్టుబడిని వందల కోట్ల మహా సంపదగా ఎలా మార్చగలదో ఈ స్టోరీ తెలియజేస్తోంది.1993లో అర్సయాన్ ఇస్మాయిల్ అనే ఎంటర్ప్రెన్యూర్ ఈ డొమైన్‌ను సుమారు రూ.300కి రిజిస్టర్ చేశారు. ఆ సమయంలో ఇంటర్నెట్ ప్రారంభ దశలో ఉండగా, కృత్రిమ మేధస్సు ప్రధానంగా విద్యా పరిశోధనలకే పరిమితమైంది. రెండు అక్షరాల డొమైన్ పేర్లకు అప్పట్లో పెద్దగా వాణిజ్య విలువ లేకపోవడంతో, AI.com సంవత్సరాల పాటు నిశ్శబ్దంగానే ఉంది.ఏఐ బూమ్‌తో పెరిగిన విలువగత కొన్నేళ్లలో జనరేటివ్ AI, మెషిన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లు, వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన AI సాధనాల పెరుగుదలతో “AI” అనే పదానికి అపారమైన ప్రాధాన్యం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించే టెక్నాలజీ పదాల్లో ఇది ఒకటిగా మారింది. దీంతో చిన్నగా, సులభంగా గుర్తుపట్టే డొమైన్ పేర్లు పరిమిత డిజిటల్ ఆస్తులుగా మారాయి. AI.com కూడా ఈ ట్రెండ్‌తో క్రమంగా భారీ విలువను సంపాదించింది.రూ.634 కోట్ల డీల్2025 నాటికి AI.com అమ్మకం సుమారు రూ.634 కోట్లకు పూర్తయింది. దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి క్రిస్ మర్స్జలెక్ (Kris Marszalek). ఆయన ఈ డొమైన్‌ను కేవలం పెట్టుబడిగా కాకుండా వినియోగదారుల కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత ప్లాట్‌ఫారమ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డొమైన్ పేర్లు ఇప్పుడు కేవలం వెబ్ చిరునామాలు కాదు.. అవి వ్యూహాత్మక డిజిటల్ ఆస్తులు. రెండు అక్షరాల డొమైన్లను అత్యంత అరుదైనవిగా పరిగణిస్తారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలతో అనుసంధానమైతే, అవి తక్షణ బ్రాండ్ గుర్తింపు, విశ్వసనీయతను అందిస్తాయి. ఏఐ రంగంలో స్టార్టప్‌లు, పెద్ద సంస్థలు పోటీ పడుతున్న నేపథ్యంలో, సరళమైన, ప్రభావవంతమైన వెబ్ చిరునామాల యాజమాన్యం ఇప్పుడు దీర్ఘకాలిక బ్రాండింగ్ వ్యూహంగా మారింది. -
గూగుల్ కొత్త డొమైన్.. కొనాలంటే రూ. కోటి ఉండాల్సిందే.. ఎందుకింత ఖరీదు!
Google New Domain: టెక్ దిగ్గజం గూగుల్ ఆన్లైన్ వెబ్సైట్లను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ఓ కొత్త డొమైన్ '.ing' ప్రారంభించింది. ఈ డొమైన్ అనే సింగిల్ వర్డ్ వెబ్సైట్లను క్రియేట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. mak.ing నుంచి draw.ing వరకు వినియోగదారులు సులభంగా గుర్తించడానికి డొమైన్ క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ అధికారిక బ్లాగ్ పోస్ట్ ప్రకారం. .ing డొమైన్ రిజిస్టర్ చేసుకోవడానికి వన్-టైమ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. చార్జీలు డిసెంబర్ 05 వరకు ప్రతి రోజూ తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సంస్థ అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ధరలు ఏదైనా కొత్త వెబ్‌సైట్‌ను డిజైన్ చేసుకోవడానికి ఇప్పుడు .ing అందుబాటులో ఉంటుంది. డొమైన్ స్టార్టింగ్ యాక్సిస్ కోటి రూపాయలు కావడం గమనార్హం. ఎందుకంటే ప్రస్తుతం ing ముగింపుతో వచ్చే పదాలు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. think.ing రిజిస్టర్ చేసుకోవడానికి రూ. 3249999, buy.ing రిజిస్టర్ చేసుకోవడానికి రూ. 10833332.50 ఖర్చు చేయాల్సి ఉంటుంది. kin.ing, Dye.ing కోసం సంవత్సరానికి వరుసగా రూ.16249.17, రూ. 324999 చెల్లించాల్సి ఉంటుంది. ఎలా చూసుకున్న సాధారణ డొమైన్స్ కంటే కూడా ఇవి చాలా ఖరీదైనవని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: 18 ఏళ్ల అనుభవం.. అయినా వదలని కంపెనీ - కష్టంలో టెక్ ఉద్యోగి .ing డొమైన్‌ను పొందటం ఎలా? GoDaddy, Namecheap లేదా Google Domains వంటి డొమైన్ రిజిస్ట్రార్‌కి వెళ్లి, మీకు కావలసిన .ing డొమైన్ కోసం సర్చ్ చేయాలి. మీరు సర్చ్ చేసే డొమైన్ అందుబాటులో ఉంటే డబ్బు చెల్లించి రిజిస్టర్ చేసుకోవచ్చు. డొమైన్ రిజిస్టర్ చేసిన తరువాత దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టవచ్చు. ప్రస్తుతం .ing డొమైన్ ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉంది. ఈ అవకాశం డిసెంబెర్ 5 వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది. -
కాసుల పేరు
టెక్నాలజీతో పరుగులు పెడుతున్న జనాన్ని అందుకోవడానికి బడాచోటా వ్యాపార సంస్థలు కూడా ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నాయి. ఆన్లైన్లో దూసుకుపోతూ బిజినెస్ పెంచుకుంటున్నాయి. చెప్పుల నుంచి కేశతైలం వరకు అన్ని వస్తువులు సింగిల్ క్లిక్‌తో కస్టమర్లకు చేరుస్తున్నాయి. ప్రత్యేకంగా పోర్టల్స్ క్రియేట్ చేసుకుని మరీ ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాయి. వెబ్‌లోకంలో వ్యాపారం చేయాలంటే పోర్టల్‌కు క్యాచీ నేమ్ ఉండాలి. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కొందరు ముందుగానే డొమైన్ నేమ్స్‌ను బ్లాక్ చేసి అట్టే పెట్టుకుంటున్నారు. పలు వ్యాపార సంస్థలు, సెలబ్రిటీలు, ట్రెండీ పేర్లతో డొమైన్‌నేమ్స్ రిజిస్టర్ చేసుకుని బిజినెస్ చేసుకుంటున్నారు. సదరు డొమైన్‌నేమ్స్ అవసరం అయిన వారికి లక్షలు చెల్లిస్తే గానీ రైట్స్ ఇవ్వడం లేదు. సిటీలో ఈ తరహా నవతరం బిజినెస్ ఇపుడు ఊపందుకుంది. హైదరాబాద్ పేరుతో ఓ వెబ్ పోర్టల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా..? దానికి డొమైన్‌నేమ్ ‘హైదరాబాద్.కామ్’అని పెట్టాలని మీరు ఫిక్సయితే మాత్రం కష్టమేనండోయ్. ఇదే డొమైన్ నేమ్‌తో మీరు వెబ్‌పేజ్ క్రియేట్ చేయాలంటే మాత్రం అక్షరాలా ఐదు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదేంటి డొమైన్‌నేమ్ రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చు రూ.500 మించి ఉండదంటారా..! ఆ పేరుకున్న క్రేజ్ అలాంటిది మరి. ఎప్పుడో పదేళ్ల కిందట రిజిస్టర్ అయిన ఈ డొమైన్‌నేమ్ మీకు రూ.500కు దొరుకుతుందనుకుంటే పొరపాటే మరి. ఇదొక్కటే కాదు డొమైన్‌నేమ్స్ పేరిట కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తోంది. ఇటీవల నగరంలో ‘డొమైన్‌నేమ్ ఓనర్స్ అసోసియేషన్’ రెండు సార్లు సమావేశమైంది కూడా. ముందుచూపు ఉన్న వాడే మనిషోయ్! అని ఎవరన్నారో కానీ, ఫ్యూచర్ సెన్స్‌తో కోట్లు ఆర్జిస్తున్న వారు ఎందరో ఉన్నారు. సినిమా పేర్లు, రాజకీయ పార్టీల పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టే.. కొందరు కాస్త వెరైటీ పేర్లను డొమైన్నేమ్స్గా రిజిస్టర్ చేసుకుని పెట్టుకుంటున్నారు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న పేరు ఎవరికైనా అవసరం వచ్చిందనుకోండి.. వారి పంట పండినట్టే. వెబ్సైట్ నిర్మాణం మొదలైనప్పుడే ఈ డొమైన్‌నేమ్స్ వ్యాపారం పురుడు పోసుకుంది. మన దేశంలో ఓ పదేళ్ల నుంచి డొమైన్‌నేమ్ బిజినెస్ ఊపందుకుంది. నగరాలు, ప్రముఖ వ్యక్తుల పేర్లతో కొందరు బోలెడన్ని డొమైన్‌నేమ్స్ రిజిస్టర్ చేసేశారు. ‘చిరంజీవి.కామ్’ ఇలా రిజిస్టర్ అయ్యిందే. ఆ పేరుని చిరంజీవికి ఇవ్వడానికి సదరు డొమైన్‌నేమ్ రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్టు చెబుతారు. సిటీలో డొమైన్‌నేమ్ బిజినెస్ చేసే వాళ్లు నగరాలు, ప్రముఖుల పేర్లే కాదు పత్రికల పేర్లు, పాపులర్ పదాలనూ వదలడం లేదు. ఇంతైతే ఓకే.. డొమైన్‌నేమ్స్ క్యాష్ చేసుకుంటున్న వ్యక్తులు సిటీలో ఓ వంద మందికిపైగానే ఉన్నారు. వీరొక్కక్కరూ వందల్లో డొమైన్‌నేమ్స్ రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. విదేశాలకు వెళ్లిన టెకీలు బుర్రకు పదనుపెట్టి మరీ డొమైన్‌నేమ్స్ బుక్ చేసుకుంటున్నారు. మన దేశంలో ఉన్న వ్యాపారాలు, వ్యవహారాలను అప్డేట్ చేసుకుంటూ డొమైన్‌నేమ్స్ తయారు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ పేర్లు కావాల్సిన వారికి చుక్కలు చూపెడుతున్నారు. ఎదుటివారి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో పాఠశాలలకు సంబంధించి ఓ వెబ్సైట్ పెట్టి బిజినెస్ చేయాలనుకున్న ఓ వ్యక్తి ‘స్కూల్ల్యాబ్. కామ్’ అనే వెబ్‌సైట్‌ని రిజిస్టర్ చేసుకుందామని ప్రయత్నించగా.. అది రెండేళ్ల కిందటే బుక్ అయిపోయినట్టు తెలుసుకున్నాడు. ఆరా తీస్తే అమెరికాలోని ఓ తెలుగాయన ఆ పేరు రిజిస్టర్ చేసుకున్నట్టు తెలుసుకున్నాడు. ఏం చేస్తాడు.. ఆ అమెరికా బుల్లోడికి రూ.35 వేలు సమర్పించుకుని ఆ డొమైన్‌నేమ్ సొంతం చేసుకున్నాడు. జై తెలంగాణ.. తెలంగాణ వచ్చాక ఆ పేరుకు ఎంత డిమాండ్ ఉంటుందో ముందో ఊహించిన కొందరు నాలుగైదేళ్ల కిందటే రకరకాల పేర్లతో డొమైన్‌నేమ్స్ రిజిస్టర్ చేసుకుని పెట్టుకున్నారు. తెలంగాణస్టేట్.కామ్, తెలంగాణఫుడీస్.కామ్, తెలంగాణ.జువెలరీస్.కామ్.. ఇలా ఓ పాతిక, యాభై పేర్లను బుక్ చేసేశారు. ఏ బడాబాబుకైనా వాటి అవసరం పడితే ఆ డొమైన్‌నేమ్ ఓనర్ పంట పండినట్టే. నేమ్ అండ్ డొమైన్‌నేమ్.. ఈ ట్రెండ్ గురించి డొమైన్‌నేమ్ అండ్ వెబ్సైట్ బిజినెస్ చేస్తున్న బ్రియోఫ్యాక్టర్స్ ఎండీ రాజశేఖర్ ఏమంటారంటే.. ‘గత ఐదేళ్లతో పోలిస్తే ఇప్పుడు మన నగరంలో డొమైన్నేమ్ల యజమానుల సంఖ్య బాగా వేగంగా పెరుగుతోంది. ఎంతలా అంటే.. బిడ్డకు పేరు పెట్టిన వెంటనే ఆ పేరుతో డొమైన్నేమ్లు క్రియేట్ చేసుకుంటున్నారు కొందరు. అదేంటంటే.. ఏమో ఏం చెప్పగలం వీడు పెద్దయ్యాక సెలెబ్రిటీ అయితే వాడి పేరుతో వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలంటే ఎలా? అంటున్నారు కొందరు తల్లిదండ్రులు. నిజానికి ఇది మంచి పరిణామమే. మన సెలిబ్రెటీలలో చాలామందికి వారి పేరుతో వారివద్ద డొమైన్‌నేమ్స్ లేవు. అలాగే ప్రస్తుతం ప్రతి వ్యాపారానికి వెబ్సైట్ కంపల్సరీ. అందుకే కొందరు ముందుగానే ఊహించి కొన్ని రకాల డొమైన్‌నేమ్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటున్నారు’ అని చెప్పారు. ఇంకెందుకాలస్యం.. మీరు కూడా డొమైన్‌నేమ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లోకి వెళ్లి మీకు తోచిన నాలుగు క్రియేటివ్ పదాలతో డొమైన్నేమ్లు రిజిస్టర్ చేసుకుని పెట్టుకోండి. డొమైన్‌నేమ్స్ రూపంలో మీ అదృష్టం మీ తలుపు తట్టొచ్చు.. ధనలక్ష్మి మీ నట్టింట్లో తిష్టవేయొచ్చు. - భువనేశ్వరి


