breaking news
Dhiraj Sachdev
-
ఆసియా కప్ ఆర్చరీకి ధీరజ్
విజయవాడ స్పోర్ట్స్: వచ్చే నెలలో చైనీస్ తైపీలో జరిగే ఆసియా కప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నమెంట్లో పాల్గొనే భారత పురుషుల రికర్వ్ జట్టులో విజయవాడ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఎంపికయ్యాడు. చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ విద్యార్థి అయిన ధీరజ్ హరియాణాలో జరిగిన జాతీయ సెలక్షన్ ట్రయల్స్‌లో రెండో స్థానంలో నిలిచి భారత జట్టులో స్థానాన్ని సంపాదించాడు. దేశవ్యాప్తంగా 30 మంది ఆర్చర్లు ఈ ట్రయల్స్‌లో పాల్గొన్నారు. నాలుగున్నరేళ్ల వయస్సులో దివంగత కోచ్ చెరుకూరి లెనిన్ వద్ద శిక్షణ ప్రారంభించిన ధీరజ్ జాతీయ అండర్–19 స్కూల్ గేమ్స్‌లో విజేతగా కూడా నిలిచాడు. ఓల్గా అకాడమీకి చెందిన మరో ఆర్చర్ తేళ్ల రవిచంద్ర భారత జట్టులో స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. -
ఈ ఐదు రంగాల్లో ‘మెరుపులు’!
ఇది బుల్‌మార్కెట్ 2.0 ► జాబితాలో పీఎస్‌యూ బ్యాంకింగ్, మెటల్స్, ఫార్మా, విద్యుత్, ఎన్బీఎఫ్సీలు ► స్టాక్ మార్కెట్ నిపుణుల అంచనా... స్టాక్ మార్కెట్ కదం తొక్కుతోంది. గత ఏడాది 15 శాతం లాభపడిన సెన్సెక్స్ ఈ ఏడాది ఇప్పటికే 10 శాతం వరకూ ఎగసింది. బుల్‌మార్కెట్ మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడు ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడమనేది చాలా చిక్కు ప్రశ్న. అయితే, ఈ ఏడాది ఐదు రంగాలు మంచి వృద్ధిని సాధిస్తాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, లోహ, విద్యుత్, ఫార్మా, ఎన్బీఎఫ్సీ రంగాలు మంచి రాబడులనిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘సెన్సెక్స్ ప్రస్తుతం అధిక స్థాయిల్లోనే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతమున్న స్థాయి నుంచి మరింత పైకి దూసుకుపోవాలంటే కొన్ని సానుకూల అంశాలు కలసిరావాలి. కంపెనీల ఆర్థిక ఫలితాలు బావుండాలి. ప్రపంచ స్థితిగతులు నిలకడగా ఉండాలి. కమోడిటీ ధరలు స్థిరంగా ఉండాలి. అయితే ఇవి అటూ, ఇటూగా ఉన్నా సరే, భారత్‌లో బుల్‌మార్కెట్ జోరు కొనసాగుతుంది’ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది బుల్‌మార్కెట్ 2.0: స్టాక్ మార్కెట్‌కు ప్రస్తుతమున్న అధిక స్థాయిలు సమంజసమేనని హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ సచ్దేవ్ అభిప్రాయపడ్డారు. ఇది బుల్‌మార్కెట్ 2.0 అని ఆయన అభివర్ణిస్తున్నారు. 2003 నుంచి 2007లో వచ్చిన బుల్ మార్కెట్ కంటే కూడా ఇది మెరుగైనదని, ఏడాది–ఏడాదిన్నర తర్వాత మనం ఖచ్చితంగా ఇప్పటికంటే మంచి స్థితిలోనే ఉంటామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ స్టాక్ మార్కెట్లతో పోల్చితే భారత స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో నెలలోనూ మంచి పనితీరు కనబరుస్తోందని క్రెడిట్ సూసీ తన తాజా నివేదికలో వెల్లడించింది. పీఎస్‌యూ బ్యాంకుల్లో తిరుగులేని ర్యాలీ.. ఈ ఏడాది ఇప్పటికే పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు మంచి లాభాలను సాధించాయి. గత ఏడాదికాలంలో ఈ షేర్లు 85 శాతం వరకూ ర్యాలీ జరిపాయి. ఈ షేర్లలో ఎంత రిస్క్ తీసుకుంటే అంతగా లాభాలు వస్తాయి. ఇటీవలే ఎస్బీఐలో అనుబంధ బ్యాంకులు విలీనమైన విషయం తెలిసిందే. మరిన్ని విలీనాలు జరిగే అవకాశముంది. ఆర్బీఐ ‘ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్’ మార్గదర్శకాలు పీఎస్‌యూ బ్యాంక్ షేర్లను మరింతగా పరుగులు పెట్టించొచ్చు. కొన్ని చిన్న బ్యాంక్‌ల షేర్లు కొన్ని నెలల్లోనే 2–3 రెట్లు పెరిగే అవకాశాలున్నాయని జేఎమ్ ఫైనాన్షియల్ టెక్నికల్ ఎనలిస్ట్ గౌతమ్ షా పేర్కొన్నారు. ఎన్‌బీఎఫ్‌సీల జోరు... పెద్ద నోట్ల రద్దు తర్వాత కుదుపునకు గురైన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీ)లు ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చాయని హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ సచ్దేవ్ చెప్పారు. ఎన్బీఎఫ్సీలు, ప్రైవేట్ బ్యాంక్‌లు జోరుగా పెరుగుతాయన్నారు. ‘పలు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణ నాణ్యత స్థిరంగా ఉండే అవకాశాలున్నాయి. ఈ సంస్థల నిధుల సమీకరణ వ్యయాలు తక్కువగా ఉండడం, ఇతర కారణాల వల్ల నికర వడ్డీ మార్జిన్లు పెరుగుతాయి’ అని వివరించారు. ఫార్మా రంగంలో అవకాశాలు అపారం.. అమెరికా ఎఫ్‌డీఏ కఠిన నిబంధనలు, రూపాయి బలపడడం వంటి ప్రతికూలతలతో గత 12–18 నెలలుగా ఫార్మా షేర్లు తీవ్రఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రెండేళ్లలో అమెరికా ఎఫ్‌డీఏ తలనొప్పులన్నీ తగ్గిపోతాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మనీశ్ గున్వాణి అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో భారత కంపెనీలకున్న సానుకూలతల కారణంగా ఫార్మా షేర్లు రాణించే అవకాశాలు అపారంగా ఉన్నాయన్నారు. అత్యున్నత ప్రమాణాలున్న మేనేజ్మెంట్స్, కంపెనీల కారణంగా అమెరికా జనరిక్స్ మార్కెట్లోనే కాకుండా ఇతర ప్రపంచ మార్కెట్లలలోనూ మన ఫార్మా కంపెనీలు దూసుకుపోతాయని ఆయన వివరించారు. విద్యుత్ రంగ వెలుగులు.. ఈ రంగం మట్టిలో మాణిక్యం లాంటిది. గత ఏడాది కాలంలో ఈ రంగ షేర్లు మంచి లాభాలనే ఇచ్చాయి. సీఈఎస్ఈ 76 శాతం, పవర్ గ్రిడ్ 44 శాతం, క్రాంప్టన్ గ్రీవ్స్ 44 శాతం, జీఎమ్ఆర్ ఇన్ఫ్రా 33 శాతం చొప్పున లాభపడ్డాయి. దాదాపు ఏడేళ్ల చీకటికాలం తర్వాత విద్యుత్ రంగ షేర్లు వెలుగులు విరజిమ్ముతున్నాయి. గత నెల కాలంలోనే పలు విద్యుత్ షేర్లు 15–20 శాతం రేంజ్లో లాభపడ్డాయి. విద్యుత్ షేర్లలో ర్యాలీ ఇప్పుడే మొదలైంది. ఈ ఏడాదిలో ఈ రంగం షేర్లు కనీసం 40–50 శాతం రాబడులనివ్వవచ్చని గౌతమ్ షా అంటున్నారు. తగ్గినప్పుడల్లా లోహ షేర్లు కొనండి గత ఏడాది కాలంలో సెన్సెక్స్ కంటే అధికంగానే పలు లోహ షేర్లు లాభపడ్డాయి. కోల్ ఇండియా, వెల్స్పన్ కార్పొ, ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కంపెనీ.. వాటిల్లో కొన్ని. గత ఆర్నెళ్లుగా లోహ షేర్లు మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. కానీ గత పది ట్రేడింగ్ సెషన్లలో వీటిపై ఒత్తిడి కనిపిస్తోంది. అయినప్పటికీ, లోహ షేర్లు పడినప్పుడల్లా కొనుగోలు చేయడం మంచిదని గౌతమ్ షా సూచిస్తున్నారు. ఈ ఏడాది అంతా లోహ షేర్ల ర్యాలీ కొనసాగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. మధ్య మధ్యలో ఈ షేర్లు పతనమైనా, 3–4 శాతం మించి నష్టం ఉండదని పేర్కొన్నారు.