breaking news
destoryed
-
సమ్మర్ లేని సంవత్సరం గురించి మీకు తెలుసా?
ఆల్రెడీ ఎండలు మొదలయ్యాయి.. ఈసారి హాట్‌హాట్‌గానే ఉండబోతోందని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. అవునూ.. ఎండాకాలమంటే గుర్తొచ్చింది.. అసలు సమ్మరే లేని సంవత్సరం ఒకటుంది.. దాని గురించి మీకు తెలుసా? ఆ ఏడాది ఎండాకాలంలో మంచు కురిసింది! ఇంకా చాలాచాలా జరిగాయి.. వీటన్నిటికీ కారణం తంబోరా అనే అగ్నిపర్వతం.. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే.. చలోఇండోనేషియా.. పేలడంలో ప్రపంచ రికార్డు.. 1816 ఏప్రిల్ 5న ఇండోనేషియాలోని మౌంట్ తంబోరా అగ్నిపర్వతం బద్దలైంది. ఏకంగా ఐదారు కిలోమీటర్ల ఎత్తున లావాను వెదజల్లింది. భారీ ఎత్తున వాయువులు, దుమ్ము, ధూళిని వాతావరణంలోకి వదిలింది. ఈ పేలుడుతో సుంబావా దీవిలో నివసిస్తున్న 10వేల మందిలో దాదాపు అందరూ చనిపోయారు. అగ్నిపర్వతం పేలుడుతో ఏర్పడిన ప్రకంపనలు, సముద్రంలో పడ్డ లావా వల్ల సునామీ ఏర్పడింది, వ్యాధులూ విజృంభించాయి. వీటితో చుట్టూ ఉన్న దీవుల్లో మరో 80– 90వేల మంది మరణించారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన దుమ్ము, ధూళి, వాయువులు వాతావరణంలో కొన్నికిలోమీటర్ల ఎత్తుకు (స్ట్రాటోస్ఫియర్ పొర వరకు) చేరాయి. వేల కిలోమీటర్ల మేర విస్తరించి.. కొద్దినెలల పాటు ఉండిపోయాయి. భూమిపై గత పది వేల ఏళ్లలో జరిగిన అతిపెద్ద అగ్నిపర్వత విస్ఫోటనం అదే కావడం గమనార్హం. బ్రిటన్‌కు చెందిన ఎడిన్బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై విస్తృతమైన పరిశోధన చేసి రిపోర్టు రూపొందించారు. 1816 బీభత్సానికి కారణమైన మౌంట్ తంబోరా అగ్నిపర్వతం ఇదే. నాటి పేలుడు ధాటికి.. అగ్ని పర్వతంపై ఏకంగా అర కిలోమీటర్ లోతు, తొమ్మిది కిలోమీటర్ల వెడల్పున బిలం ఏర్పడింది. సమ్మర్లో వింటర్.. మొత్తమ్మీద ఈ పేలుడు ఎఫెక్ట్‌కు ఆకాశంలో దుమ్ము, ధూళి, నల్లని వాయువుల కారణంగా సూర్య కిరణాలు భూమిని చేరడం తగ్గిపోయింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మూడు డిగ్రీల మేర సగటు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆ ఏడాది ఎండాకాలమే లేకుండా పోయింది. యూరప్, ఉత్తర అమెరికాలలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వేసవి ఉంటుంది. కానీ 1816లో జూన్ నుంచి సెప్టెంబర్ దాకా.. ఆ తర్వాత కూడా మంచు కురుస్తూనే ఉంది. భూమ్మీద ఉష్ణోగ్రతలను అధికారికంగా రికార్డు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా 1816వ సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం. సమ్మర్ లేక.. సమస్యల రాక.. ఆ ఏడాది ఎండల్లేక పోవడంతో దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఉత్తర అమెరికా, యూరప్ దేశాలు, ఉత్తర ఆసియా దేశాల్లో నిత్యం మంచు కురుస్తూనే ఉండటంతో ఉన్న పంటలన్నీదెబ్బతిన్నాయి. మళ్లీ పంటలు వేసే పరిస్థితే లేకుండా పోయింది. చాలా దేశాల్లో తీవ్రమైన కరువు తలెత్తింది. దాంతో జనం గొర్రెలు, మేకలు, ఇతర పశువుల మాంసం తిని బతకాల్సి వచ్చింది. భారత్, చైనా దేశాల్లో రుతుపవనాలు అస్తవ్యస్తమయ్యాయి. ఎండాకాలంలోనూ కుండపోత వానలు కురిసి.. భారీ ఎత్తున వరదలు వచ్చాయి. చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. 1816లో ఏర్పడిన కరువుతో ఆహారం లేక, చలికారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయినట్టు అంచనా. ఈ పరిస్థితి భారీ ఎత్తున వలసలకు కారణమైందని, వాతావరణం స్థిరంగా ఉండే ప్రాంతాలకు జనం తరలివెళ్లారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. అప్పట్లో ప్రధాన రవాణా సాధనమైన గుర్రాలకూ ఆ ఏడాది మేత కరువైంది. మనుషులు, సరుకు రవాణాకు చార్జీలూ పెరిగిపోయాయి. ఈ పరిస్థితులే.. కార్ల్ డ్రెయిస్ అనే జర్మన్ శాస్త్రవేత్త 1817 సంవత్సరంలో సైకిల్‌ను తయారు చేయడానికి ప్రధాన కారణమని చెబుతారు. తర్వాత ఇరవై ఏళ్లకు మాక్మిలన్ దానిని మరింత అభివృద్ధి చేసి.. ఇప్పుడున్న మోడల్ సైకిల్‌ను రూపొందించాడు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం
యాలాల, న్యూస్‌లైన్:ప్రమాదవశాత్తు మంటలంటుకొని ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని జుంటుపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. యాలాల మాజీ ఎంపీపీ సుమిత్రాదేవికి చెందిన ఇంట్లో మూడేళ్లుగా అదే గ్రామానికి చెందిన గడ్డమీది ఆశమ్మ నివసిస్తోంది. రోజూ మాదిరిగానే సోమవారం ఆశమ్మ ఇంట్లో దేవుడి పటం ఎదుట దీపం వెలిగించి బయటకు వెళ్లింది. ప్రమాదవశాత్తు దీపం కింద పడటంతో ఇంట్లోని వస్తువులకు మధ్యాహ్నం సమయంలో నిప్పంటుకుంది. ఇంట్లోంచి పెద్ద ఎత్తున పొగ రావడాన్ని గమనించిన స్థానికులు విషయాన్ని సుమిత్రాదేవి కుటు ంబ సభ్యులతో పాటు తాండూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులు, దుస్తులు కాలిబూడిదయ్యాయి. అంతేకాకుండా స్థానిక ఆంధ్రాబ్యాంకు నుంచి పంట రుణం కింద తీసుకున్న రూ. 60 వేలతో పాటు రెండు తులాల నాను, భూమికి సంబంధించిన పాసు బుక్కు, విద్యా సంబంధిత సర్టిఫికెట్లు కూడా అగ్నికి ఆహూతయ్యాయని ఆశమ్మ కన్నీటి పర్యంతమైంది. మంటలు వంట గదిలోకి కూడా పాకడంతో సిలిండర్‌కు నిప్పంటుకుంది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సిలిండర్‌ను బయటకు తీసుకొచ్చి మంట లర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 2.5 లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.