breaking news
Derivative Investing
-
మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే కఠిన నిబంధనలు
ముంబై: ఇండెక్స్ డెరివేటివ్స్‌లో ఎక్స్పైరీ రోజున మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత నారాయణ్ తెలిపారు. డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని అధ్యయనంలో తేలిన మీదట గతేడాది అక్టోబర్‌లో చర్యలు ప్రకటించినట్లు ఆయన చెప్పారు.కనీస కాంట్రాక్టు పరిమాణాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 30 లక్షలకు దశలవారీగా పెంచడం, ప్రీమియంను ముందుగా వసూలు చేయడం తదితర చర్యలను సెబీ ప్రకటించింది. ముందుగా క్యాష్ మార్కెట్‌ను అభివృద్ధి చేసి, ఆ తర్వాత డెరివేటివ్స్‌పై కసరత్తు చేయాలని స్టాక్ ఎక్స్చేంజీలకు సూచించారు. మరోవైపు, పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివరాలను సెబీ బోర్డు సభ్యులందరూ ప్రజలకు వెల్లడించడాన్ని తప్పనిసరి చేసేలా నిబంధనలను రూపొందిస్తామని సెబీ కొత్త చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు.విశ్వసనీయతను, పారదర్శకతను పెంపొందించడానికి ఇది ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ఓవైపు నియంత్రణ సంస్థ అధిపతిగా, మరోవైపు నియంత్రిత సంస్థల్లో భాగస్వామిగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పని చేశారంటూ సెబీ మాజీ చీఫ్ మాధవి పురి బుచ్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాండే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెబీ విచారణ ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ సంస్థ సహ–ఇన్వెస్టరుగా ఉన్న ఫండ్‌లో ఆమె పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
డెరివేటివ్ ఇన్వెస్టింగ్ లాభదాయకమా?
స్టాక్‌మార్కెట్‌పై అవగాహన ఉన్నవారికి డెరివేటివ్స్ గురించి తెలిసే ఉంటుంది. క్యాష్ మార్కెట్లో స్టాక్స్‌ను కొంటే అవి రెండు రోజుల్లో మన డీమ్యాట్ ఖాతాలోకి వచ్చి చేరుతాయి. కానీ డెరివేటివ్స్‌లో అలా కాదు. ఇక్కడ డైరెక్ట్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయం. కాంట్రాక్ట్స్ నడుస్తాయి. వీటికి నిర్ణీత (నెల, త్రైమాసికం) గడువు ఉం టుంది. డెరివేటివ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారి పెట్టుబడుల విలువ అసెట్ ధరపై ఆధారపడి ఉం టుంది. ఇక్కడ అసెట్ అనేది స్టాక్, కమోడిటీ, కరెన్సీ కావొచ్చు. కాగా డెరివేటివ్స్‌లో ఫ్యూ చర్స్, ఆప్షన్స్ అనే రెండు విభాగాలుంటాయి. భవిష్యత్‌లో నిర్ణీత సమయంలో పలానా ధరలకు ఒక అసెట్ కొనుగోలు/అమ్మకానికి సంబంధించి రెండు పార్టీల మధ్య కుదిరే ఒప్పందాన్నే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే కాంట్రాక్ట్‌ను కొన్నామంటే.. ఆ అసెట్ ధరను నిర్దేశించుకున్న సమయంలో విక్రయదారుడికి చెల్లించేయాలి. అదే కాంట్రాక్ట్‌ను అమ్మితే.. ఆ అసెట్‌ను కొనుగోలుదారుడికి నిర్దేశించుకున్న కాలంలోగా ఇచ్చేయాలి. స్టాక్ ధర సాధారణంగా స్పాట్ మార్కెట్లో కన్నా ఫ్యూచర్స్ మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌కు మార్జిన్‌ను చెల్లించడం ద్వారా కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ అవుతాం. అసెట్ విలువ మార్పుపై మార్జిన్ చెల్లింపు ఆధారపడి ఉంటుంది. ఇక ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఇక్కడ మార్జిన్ చెల్లింపులు ఉండవు. ప్రీమియం చెల్లించడం ద్వారా ఆప్షన్‌ను సొంతం చేసుకుంటాం. పోర్ట్‌ఫోలియో హెడ్జింగ్ కోసం డెరివేటివ్స్ వైపు వెళ్లాలి. అంతేకానీ లాభాల కోసం ఆలోచించకూడదు. మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులలో ఉన్నప్పుడు రిస్క్‌ను మేనేజ్ చేయడానికి డెరివేటివ్స్‌ను ఉపయోగించుకోవాలి. లాభాల కోసం వెళితే అసలుకే ముప్పు రావొచ్చు. డెరివేటివ్స్‌లో ఏ మేర లాభాలు వస్తాయో.. అదే స్థాయిలో నష్టాలు కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.