breaking news
dany
-
సమ సమాజమా? సంక్షేమ రాజ్యమా?
సామ్యవాద సమాజాన్ని నిర్మించడానికి ఇండియా కమ్యూనిస్టు పార్టీలు రెండు మార్గాలను ఎంచుకున్నాయి. మొదటిది– సాయుధ పోరాటం. రెండోది– పార్లమెంటరీ ఎన్నికలు. ఆయా పార్టీల నాయకులు అభిమానులు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోనూవచ్చు గానీ, అవి ఎంచుకున్న రెండు మార్గాలూ ఇప్పుడు దాదాపు మూసుకునిపోయాయి. ‘‘దేశాలు స్వాతంత్య్రాన్ని, జాతులు విముక్తిని, ప్రజలు విప్లవాన్ని కోరుకుంటున్నారు’’ అంటూ కమ్యూనిస్టు పార్టీలు ఓ యాభై ఏళ్ళ క్రితం చాలా గట్టిగా మాట్లా డేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉద్యమాల్లో పాతవాళ్ళు తగ్గిపోతున్నారు; కొత్తవాళ్ళు రావడం లేదు. ఇది నేటి వాస్తవ స్థితి. దీనికి కారణం ఆ యా పార్టీలు అనుసరించిన విధానాలా? మరొకటా? అనే చర్చల వల్ల ఇప్పుడు ప్రయో జనం లేదు. చరిత్రలో జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిందేమిటీ? అనేదే చర్చనీయాంశం కావాలి. ప్రత్యామ్నాయ మార్గాలుసోషలిస్టు కలను సాకారం చేసుకోవడానికి అభిమా నులు వందేళ్ళు ఎదురుచూడటమే మహత్తర విషయం. దీర్ఘకాల పోరాటం కనుక ఇంకో వందేళ్ళు ఆగాలి అని ఎవరయినా చెప్పవచ్చు. వందేళ్ళు గడిచిపోయాయి కనుక సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది. సమ సమాజం కుదరకపోతే దానికి దగ్గరి ప్రత్యామ్నాయాలు ఏమిటీ? అనేది. దానికి వెంటనే స్ఫురించే సమాధానం సంక్షేమ రాజ్యం. నార్డిక్ దేశాలయిన స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ సంక్షేమ దేశాలని చాలామందికి తెలుసు. పశ్చిమ యూరప్‌లో జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, స్విట్జర్లాండ్ కూడా తమవైన పద్ధతుల్లో సంక్షేమ రాజ్యాలని బయటికి అంత తెలీదు. వీటిల్లో జర్మనీ రాజకీ యార్థిక పరిణామాలతో ఇండియాకు పోలికలున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 1919 నుండి 1933 వరకు జర్మనీలో కొనసాగిన ‘వైమర్ రిపబ్లిక్’ను స్థూలంగా ప్రజాస్వామ్యయుత పాలన అనవచ్చు. 1933 నుండి 1945 వరకు అడాల్ఫ్ హిట్లర్ ‘నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ’ పేరిట ‘నాజీ’ పాలన సాగించాడు. కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వానికి గరిష్ఠ రూపం... నాజీజం. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓడిపోయిన తరువాత జర్మనీ ‘మిత్రరాజ్యాల’ అధీనంలో వలస దేశంగా మారిపోయింది. ఆ దేశాన్ని నాలుగు ముక్కలు చేసి యూకే, ఫ్రాన్స్, అమెరికా, రష్యాలు తలో భాగాన్ని తమ అధీనంలోనికి తీసుకున్నాయి. ఓ నాలుగేళ్ళు ప్రత్యక్ష వలస పాలన సాగాక జర్మనీ రెండుగా విడిపోయింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ల ప్రాబ ల్యంలోని పశ్చిమ ప్రాంతం 1949 మే 23న ‘ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ’ (ఎఫ్ఆర్జీ)గా అవతరించింది. అదే ఏడాది అక్టోబరు 7న రష్యా ప్రాబల్యంలోని తూర్పు ప్రాంతం ‘జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్’గా ఏర్పడింది. అప్పట్లో పశ్చిమ జర్మనీని పెట్టుబడిదారీ దేశంగానూ, తూర్పు జర్మనీని సోషలిస్టు దేశంగానూ చెప్పు కునేవారు. కారణాలు ఏమైనాగానీ, తూర్పు జర్మనీవాళ్ళకు పశ్చిమ జర్మనీ మీద గొప్ప మోజు వుండేది. వాళ్ళు పెద్ద ఎత్తున పశ్చిమ జర్మనీకి వలస పోయేవారు. దీనిని అరికట్టడానికి బెర్లిన్ నగరాన్ని రెండు ముక్కలు చేసి 1961 ఆగస్టు నెలలో అడ్డంగా భారీ గోడ కట్టింది తూర్పు జర్మనీ. దీనికి ‘ఫాసిస్టు వ్యతిరేక రక్షణ గోడ’ అని గొప్ప పేరు పెట్టారు. అయినా జీడీఆర్ నుండి వలసలు ఆగలేదు.హంగేరీ, జకోస్లోవేకియాల మీదుగా పశ్చిమ జర్మనీకి చేరు కోవడం మొదలెట్టారు. 1980ల చివర్లో తూర్పు జర్మనీతో పాటు పోలాండ్, హంగేరి, చెకోస్లావియా, రొమేనియా, బల్గేరియా తదితర తూర్పు యూరోప్ దేశాల్లోనూ సోష లిస్టు పాలకులకు వ్యతిరేకంగా నిరసనలు మొదల య్యాయి. ఇవి ముదిరి 1989 నవంబరు 9న బెర్లిన్ గోడను కూల్చేశారు. ఆ తరువాత ఆరు దేశాలు సంయుక్తంగా చర్చించి 1990 అక్టోబరు 3న తూర్పు జర్మనీని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీలో విలీనం చేశాయి. జర్మనీ, ఇండియాల సామ్యం...రెండు జర్మనీల విలీనం అంటే విధానపరంగా పెట్టుబడిదారీ, సోషలిస్టు సమాజాల సంకీర్ణం అని అర్థం. ఇప్పటి జర్మనీలో ఈ రెండు ధోరణులేగాక ఉదారవాదం, మతవాదం తదితర అనేక ధోరణులు కనిపిస్తాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మితవాదులు పుంజుకున్న ప్పటికీ మధ్యేవాదులకు అధికారం దక్కింది. మనలాగే ప్రజాస్వామిక, నాజీయిస్టు, వలస, సోషలిస్టు, పెట్టుబడి దారీ దశలన్నింటినీ చవిచూసిన జర్మనీ ఇప్పుడు పశ్చిమ యూరప్‌లో ఒక మెరుగయిన సంక్షేమ రాజ్యంగా కొనసాగుతోంది. ఇండియా, జర్మనీ స్థూల జాతీయోత్ప త్తులు కూడా దాదాపు సమానం. ఇప్పటి ఇండియా ప్రభుత్వ స్వభావం మీద ఫాసిస్టా? కొత్త ఫాసిస్టా? సగం ఫాసిస్టా? అంటూ చర్చ సాగుతోంది. మన దేశంలో కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం కొన సాగుతోందనే అభిప్రాయం బలపడుతోంది. దేశంలోని సహజ వనరుల్ని, మౌలికరంగాలను ఎలాగూ కార్పొరేట్ల పరం చేసేస్తారు. మనం గతంలో ఎన్నడూ ఊహించనంతటి భీకర విస్తాపన సాగుతుంది. దానిని ఇప్పట్లో ఎవరూ ఆపలేరు. సోషలిజం సాధించగల సత్తాగల పార్టీ ఒక్కటీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆచరణాత్మకంగా ఒక సంక్షేమ రాజ్యాన్ని ఆశించడం ఒక్కటే సమంజసంగా ఉంటుంది. మనం ఆ దిశగా ఆలోచించాలి. దానికోసం ప్రయత్నించాలి.డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు ‘ 90107 57776 -
అస్తిత్వవాద కథంటే?
ఇది అస్తిత్వవాద యుగం. ఆదివాసులు, దళితులు, వెనుకబడిన కులాలు, మత అల్పసంఖ్యాకవర్గాలు, స్త్రీలు, కార్మికులు మాత్రమేగాక, భాషా, ప్రాంత, వర్ణ తదితర కారణాల వల్ల అణచివేతకు గురవుతున్న అసంఖ్యాక శ్రేణులు తమ విముక్తికోసం ఆరాటపడుతున్నాయి. తమతమ స్థాయుల్లో తమదైన శైలుల్లో పోరాడుతున్నాయి. సాహిత్యం చాలా పనులు చేస్తుంది కానీ, వాటన్నింటిలో మహత్తరమైనది అది అణగారిన శ్రేణులకు అండగా నిలబడడమే. కష్టాల్లో ఉన్నవాళ్ల పక్షాన నిలబడాలనుకునే కవులు, రచయితలకు తెలుగునాట కొదవలేదు. తెలుగు సాహిత్యా నికి ఇది చాలా గొప్ప పార్శ్వం. అయితే, ఆశయం వేరు. గమనం వేరు. గమ్యం వేరు. చాలామంది రచయితలకు అస్తిత్వ శ్రేణుల మీద అపార అభిమానమున్నా వాళ్ల కథలు చాలా సందర్భాల్లో ప్రకటిత లక్ష్యాలను సాధించడంలేదు. దానికి కారణం ఏమంటే చాలామంది రచయితలు రచన నిర్మితిని అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్నారు. రచనకు మౌలికంగా సందర్భం, సంఘర్షణ, పరిష్కారం (Setup, the Confrontation and the Resolution) అనే మూడు అంకాలు (three-act structure) వుంటాయనేది అందరికీ తెలిసిన అంశమే. అస్తిత్వవాద రచయితలు ఈ సంఘర్షణ అంకాన్ని మరింత లోతుగా అభ్యాసం చేయాల్సిన అవసరం వుంది. ఒక అమ్మాయికి కష్టం వస్తే అది ఒక అమ్మాయి కథ అవుతుందిగానీ స్త్రీవాద కథో, పురుషాధిక్య కథో అవ్వదు. ఘర్షణ చట్రంలో ఆ అమ్మాయితోపాటూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒక పురుషుడు ఉండాలి. ఆమె మీద పురుషాధిక్య అణచివేత కొనసాగిందనే నిరూపణ అయినప్పుడే అది స్త్రీవాద కథ అవుతుంది. ఆమె సాగించే పోరాటం విస్తృతమయితే మొత్తం స్త్రీజాతి విముక్తి చెందుతుందనే నమ్మకాన్ని పాఠకులకు కలిగిస్తే ఆ కథకు సార్వజనీనత కూడా సమకూరుతుంది. ఇదే సూత్రం ముస్లింవాద, దళితవాద, తెలంగాణవాద తదితర రచయితలకూ వర్తిస్తుంది. కథలో పాత్రలన్నీ దళితులయినంత మాత్రాన అది దళిత కథ కానట్టే, కథలో పాత్రలన్నీ ముస్లింలు అయినంతమాత్రాన ఆ కథ ముస్లింవాద కథ కాదు. ఛార్లెస్ డికెన్స్ రచనల్లోని పాత్రలన్నీ దాదాపుగా క్రైస్తవులే. అంతమాత్రాన వాటిని క్రైస్తవవాద రచనలు అనలేం. సిరిసిల్లలో ఒక సాలె అతను పేదరికంతో చనిపోతే అది తెలంగాణ కథ అవుతుంది కానీ తెలంగాణవాద కథ కాదు. ఎందుకంటే సిరిసిల్లలో సాలెవాళ్ళు పేదరికంతో చనిపోతున్నట్టే, ఆంధ్రాలో భట్టిప్రోలు, జాండ్రపేటల్లోనూ సాలెవాళ్ళు పేదరికంతో చనిపోతుంటారు. సిరిసిల్ల కథను తెలంగాణవాద కథగా మార్చాలంటే ఆ సాలెవాని చావుకు ఆంధ్రా ప్రాంతీయుల పాలన కారణమనే ఉపపత్తిని నిరూపించాల్సి ఉంటుంది. ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్నప్పుడు ఇలాంటి రచనలన్నీ ఉద్యమ సాహిత్యంగా చలామణి అయిపోతుంటాయి. వీటిల్లో తప్పును ఎత్తిచూపడానికి కూడా సాహిత్య విమర్శకులు సాహసించరు. ఘర్షణ చట్రంలోనికి పరస్పర విరుద్ధ శక్తుల్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రవేశపెట్టినప్పుడే అది అస్తిత్వవాద రచన అవుతుంది. జ్ఞానం అనేది ఆధిపత్య కులాల సొంత ఆస్తి కాదని చెప్పడానికి ‘జాగీరు’ కథలో పసునూరి రవీందర్ దళిత యువకుడ్ని ఏకంగా ఆధిపత్య కులస్తుడి ఇంట్లో ప్రవేశపెడతాడు. స.వెం. రమేశ్ కథ ‘పాంచాలమ్మ పాట’లో సునందత్త పాత్ర తనను మొగుడు చీట్లపేకాటలో ఫణంగా పెట్టి ఓడిపోయాడనీ, వాడికి మొగుడుతనం పోయిందనీ, తను ముండమోసాననీ తనే ఊర్లో డప్పుకొట్టి మరీ చాటి చెపుతుంది. ఇలాంటి ముఖాముఖి ఘర్షణ అస్తిత్వవాద రచనలకు వన్నె తెస్తుంది. పీవీ సునీల్ కుమార్ కథ ‘థూ’, వేంపల్లె షరీఫ్ ‘తలుగు’ కథల్లో మనం ఇలాంటి ఘర్షణను చూస్తాం. ఘర్షణ చట్రంలోనికి పరస్పర విరుద్ధ శక్తుల్ని ప్రవేశపెట్టాలనే సూత్రం తెలిసిన రచయితలు సమర్థమైన అస్తిత్వవాద రచనలు చేస్తారు. ఆ సూత్రం తెలియనివాళ్ళు గాల్లో కలాలను ఝుళిపిస్తారు. అంతే తేడా. రచయితలకు లక్ష్యం వుంటే సరిపోదు లక్ష్యాన్ని సాధించే మెళకువలూ తెలియాలి. అస్తిత్వవాద రచయితలు ఉద్యమ నాయకుల్లా ఆలోచించాలి; ఉద్యమ అనుచరుల్లా కాదు. - ఉషా ఎస్ డానీ రచయిత, విమర్శకుడు (‘ప్రాతినిధ్య కథ-2014’ ఆవిష్కరణ ప్రసంగంలో ఒక భాగం)