breaking news
daadishetty raja
-
రాష్ట్రంలో దోపిడీ పాలన
తొండంగి (తుని): రాష్ట్రంలో కాదేదీ దోపిడీకి అనర్హం అంటూ తిరుపతి వెంకన్న ఆస్తులను కూడా వదలకుండా దిగమింగుతూ అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కార్‌కు త్వరలోనే చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తెలిపారు. బూత్ కమిటీల కన్వీనర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పరాకాష్టకు చేరుకుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల పింఛన్ల నుంచి ఇసుక, చెరువులు అక్రమ తవ్వకాలతో పాటు మరుగుదొడ్లు, ఇతర అన్ని ప్రభుత్వ పథకాల్లోనూ అధికార పార్టీ నేతలు కోట్లు దండుకుంటూ ప్రశ్నించిన వారిని దాడులు, కేసులతో వేధిస్తూ అరాచకపాలన సాగిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని దీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ ప్రభుత్వం అమలు చేసే నవరత్నాల పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు గ్రామాల్లో ప్రత్యేకంగా సెక్రటేరియట్ ద్వారా కృషి చేస్తారన్నారు. పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. అవినీతి పాలన సాగిస్తూ ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లును చీల్చడం ద్వారా మళ్లీ అధికారంలో వచ్చేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఈ సారి ప్రజలు మోసపోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరన్నారు. పార్టీ నాయకుడు కొయ్యా శ్రీనుబాబు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను కేబినెట్లో మంత్రిగా చూసేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు చౌదరి, నాయకులు మద్దుకూరి వీరవెంకట సత్యనారాయణ చౌదరి(పెద్దబ్బు) మద్దుకూరి అప్పారావు చౌదరి, మేరుగు ఆనందహరి, వైఎస్సార్సీపీ రైతు విభాగం మండల కన్వీనర్ పప్పల సీతారాముడు, తొండంగి సొసైటీ ఉపాధ్యక్షుడు వనపర్తి సూర్యనాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యుడు నాగం గంగబాబు, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ విభాగం జిల్లా కన్వీనర్ శివకోటి ప్రకాష్, గాబురాజు, సర్పంచులు ములికి రామకృష్ణ, ఎంపీటీసీలు చవలం సత్యనారాయణ, బూసాల వెంకటరమణ, సాపిశెట్టి చిన్న, కోనాల రాముడు, సాపిశెట్టి చిన్న, పెండ్యాల బాబీ, అన్ని గ్రామాలకు చెందిన బూత్ కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు. -
గన్ లాక్కునేందుకు ప్రయత్నించారు
కాకినాడ: అక్రమంగా ఇసుక తరలించేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ శ్రేణుల టాక్టర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై దాడి చేశారని ఆయన గన్‌మెన్ చెప్పారు. ఆ దాడిని అడ్డుకునేందుకు వెళితే తనపై దాడి చేశారని, చేతిలో గన్ తీసుకునేందుకు ప్రయత్నించారని, తన చొక్కాను కూడా చింపేశారని చెప్పారు. ఒక ఎమ్మెల్యేపై దాడి చేస్తుంటే అడ్డుకోవడం తప్పా అని గన్ మెన్ ప్రశ్నించారు. ప్రస్తుతం స్వల్పంగా గాయపడిన ఎమ్మల్యే దాడిశెట్టి రాజా, గన్‌మెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వారిని మరో వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ పరామర్శించారు. టీడీపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబునాయుడు ప్రోద్బలం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, అక్రమ ఇసుక తవ్వకాల్లో కూడా ఆయన ప్రమేయం ఉందని ఆరోపించారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గన్‌మెన్‌పై దాడి
కాకినాడ: తుని నియోజకవర్గం డీ పోలవరంలో తెలుగు తమ్ముళ్లు అక్రమాలకు పాల్పడ్డారు. తాండవనది ఒడ్డున రైతుల భూముల్లో అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడటమే కాకుండా ఇద్దరు రైతులకుపై దాడికి చేశారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా వారి అన్యాయాన్ని అడ్డుకున్నారు. వారు చేస్తున్న తప్పుపట్ల నిలదీశారు. ఇసుకను తరలించేందుకు వచ్చిన 20 ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే గన్‌మెన్‌పై తెలుగు తమ్ముళ్లు దాడికి పాల్పడ్డారు. దీంతో గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. ఎమ్మెల్యేకు రక్షణగా వెళ్లిన సమయంలోనే గన్ మ్యాన్ పై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో పాటుతన వద్దనున్న తుపాకీ కూడా లాక్కునేందుకు యత్నించినట్లు దాడిశెట్టి రాజా తెలిపారు.తనపై దాడికి యనమల రామకృష్ణుడు,ఆయన సోదరుడు బాధ్యత వహించాలని రాజా పేర్కొన్నారు.ఇసుకు అక్రమ తవ్వకాల వెనుక వారి హస్తం ఉన్నట్లు రాజా ఆరోపించారు. తాండవ నదిలో ఇసుక తవ్వకూడదని కోర్టు స్టే ఇచ్చిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.