breaking news
Contrary
-
మాఫియాగా ‘రియల్టర్లు’
♦ నిజామాబాద్-హైదరాబాద్ హైవే చుట్టూ లే అవుట్లు ♦ భిక్కనూర్ శివారులో ‘చుక్క’లు చూపుతున్నారు ♦ దోమకొండ, సదాశివనగర్ ఏరియాలో అక్రమం ♦ పంటపొలాల్లో వెలుస్తున్న వెంచర్లు ♦ అక్రమ లేఅవుట్లపై కదలని యంత్రాంగం ♦ రూ.కోట్లలో సర్కారు ఆదాయానికి గండి ♦ మాఫియాగా ‘రియల్టర్లు’ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఎప్పటి నుంచో కాచుకుని ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొత్త జిల్లాల ఏర్పాటు వరంగా మారింది. కామారెడ్డి చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ప్లాట్ల వ్యాపారం జోరందుకుంది. నాగపూర్ - హైదరాబాద్ జాతీయ రహదారి చుట్టూ పంటపొలాల్లో వెంచర్లు వెలుస్తున్నాయి. సదాశివనగర్ నుంచి మెదక్ జిల్లా రామాయంపేట్ జాతీయ రహదారి చుట్టూ రియల్ ఎస్టేట్ ‘మాఫియా’ ఇష్టారాజ్యంగా ఆక్రమ భూదందా చేస్తోంది. కామారెడ్డి కేంద్రంగా కొత్తగా జిల్లా ఏర్పడుతుందన్న ప్రచారంతో ఒక్కసారిగా కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. కొంత పెట్టుబడి.. నేతల అండ ఉంటే చాలు ఈ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు నివేశన స్థలాలుగా మారిపోతున్నాయి. వ్యవసాయ పొలాలను నివేశన స్థలాలను మారుస్తున్నా.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల అధికారులు, సిబ్బంది చేయి తడిపి రూ.లక్షల్లో ప్రభుత్వ ఖజానాకు గండికొడ్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వారు కామారెడ్డి, ఎల్లారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, సదాశివనగర్ల శివార్లలో ప్లాట్లు చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. రియల్టర్లకు అధికారుల అండదండలు కామారెడ్డి జిల్లా కేంద్రం కానున్న తరుణంలో ఒక్కసారిగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో స్థిరాస్తి వ్యాపారం సాగుతోం ది. విచ్చలవిడిగా అక్రమ లే అవుట్లు వెలుస్తున్నాయి. వీటిని అదుపు చేయాల్సిన రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ అధికారుల నుంచి కనీస చర్యలు లేవు. ఈ ప్రాంతంలో కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న భూదందా.. కొత్త జిల్లాల ఏర్పాటుతో కామారెడ్డి-హైదరాబాద్ మధ్యన ఉన్న ఒక్కసారిగా ఊపందుకుంది. కామారెడ్డితో పాటు కామారెడ్డి-హైదరాబాద్‌ల మధ్యన జాతీయ రహదారి పొడువునా మండల కేంద్రా లు, మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నచోట కూడా లే-అవుట్లు ఏర్పాటు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో నెల వ్యవధిలో ఏడు రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లు పెట్టాయి. ఎల్లారెడ్డిలో ఇప్పటికే ఒక సంస్థ నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తోంది. చెరువును ఆక్రమించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో వివాదాస్పదంగా మారినా.. విక్రయాలు సాగి స్తున్నారు. ‘సూర్యనగర్’ పేరుతో మరో వెంచర్ కూడా మళ్లీ విక్రయాలు సాగిస్తుండగా.. ఈ రెండు వెంచర్ల వెనుక కామారెడ్డికి చెందిన రియల్టర్లే ఉన్నారు. భిక్కనూర్, సదాశివనగర్, కామారెడ్డి శివార్లలో కామారెడ్డికి చెందిన కొందరు నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి ప్లాట్లను విక్రయిస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. కామారెడ్డి జిల్లా తెరపైకి వచ్చాక నెల రోజుల వ్యవధిలో చుట్టూ పక్కల 42 చోట్ల స్థిరాస్తి వ్యాపారం కోసం అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేయగా పంచాయతీ, నగర/పట్టణ పాలక సంస్థల అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి భారీగా కమీషన్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లే-అవుట్ల నిబంధనలు.. ⇒ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారంలో వేస్తున్న లే అవుట్లు అధికశాతం నిబంధనలు పాటిం చడం లేదు. ఫలితంగా కొనుగోలు దారు లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ⇒ లే అవుట్ వేసేందుకు ముందుగా పంచాయతీ ఆమోదం పొందాలి. నగరాలు, పట్టణాల్లో మున్సిపాల్టీ తీర్మానం చేయాలి. ⇒ లే అవుట్ వేస్తున్న భూమిని భూ మార్పిడి కింద(వ్యవసాయేతర వినియోగం) రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి పొందాలి. ఇందుకు భూమి రిజిస్ట్రేషన్ విలువలో 10 శాతం సొమ్ము రుసుము కింద చెల్లించాలి. ⇒ పదెకరాల్లో లే అవుట్ వేస్తే దాని రిజిస్ట్రేషన్ విలువను బట్టి 10 శాతం రుసుము ఉంటుంది. ఉదాహరణకు ఎకరా రూ.30 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయిస్తే.. రూ.3 లక్షలు రుసుముగా చెల్లించాలి. ⇒ లే అవుట్‌కు పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుని అనుమతి పొందాలి. ⇒ లే అవుట్ మొత్తం విస్తీర్ణంలో 10 శాతం స్థలాన్ని ప్రజోపయోగానికి వదిలివేయాలి. గ్రామ పంచాయతీ అయితే పంచాయతీకి, పట్టణాల్లో అయితే మున్సిపాల్టిలకు రిజిస్ట్రేషన్ చేయించాలి. ⇒ అనుమతి పొందిన లే అవుట్లో ప్రణాళికా విభాగం సూచించిన స్థలాన్నే ప్రజోపయోగానికి వదిలి వే యాలి. ఈ స్థలాల్లో సామాజిక భవనం, పాఠశాలలు, పార్కులు తదితర నిర్మాణాలు చేపట్టే వీలుంటుంది. రూ.కోట్లలో ఎగవేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కామారెడ్డి ప్రాంతంలో ఎక్కడా నిబంధనలకు అనుగుణంగా లే అవుట్లు వేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లు గండి పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. గత ఆరు నెలల్లో దాదాపు 100కు పైగా లే అవుట్లు వెలిశాయి. ఈ భూమి సగటున ఎకరాకు కనీసం రూ.30 లక్షల వంతున విలువ రూ.300 కోట్లు. ఇందులో 10 శాతం రుసుము ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే వ్యాపారులు, అధికారులు కూడ బలుక్కొని రూ.30 కోట్లు ఎగవేశారు. లే అవుట్లో 10 శాతం స్థలాన్ని కూడా వదల్లేదు. కొన్నింటికీ గ్రామ పంచాయతీల తీర్మానాలు, ఆమోదం లేవు. ⇒ కామారెడ్డితోపాటు పట్టణ శివారులో జాతీ య రహదారికి ఇరువైపులా లే అవుట్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. అటు మున్సిపాలిటీ, ఇటు సంబంధిత పంచాయతీ ఆమోదం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా ఏర్పాటు కానుందన్న ఒకే ఒక కారణంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటోంది. ⇒ ఎల్లారెడ్డిలో రెండు చోట్ల భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేశారు. ఆ రెండు లే-అవుట్లకు కూడా చట్టబద్ధత లేకపోగా.. వ్యవసాయ క్షేత్రాలను ప్లాట్లుగా మార్చారు. కొనుగోలుదారులు ఇప్పటికే సంశయిస్తుండగా.. అధికారుల మౌనం చర్చనీయాంశం అవుతోంది. ⇒ నిజామాబాద్-హైదరాబాద్ మార్గంలో జాతీయ రహదారి పక్కన సదాశివనగర్‌లో ఏడాది క్రితం కొత్తగా వెంచర్ ఏర్పడింది. అయితే వారు ఆశించిన రేటు రాక కొంతకాలంగా క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. ఇటీవల కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో మళ్లీ ఊపందుకుంది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నాయని ఈ వెంచర్ నిర్వాహకులు చెబుతున్నా అందుకు సంబంధించిన పత్రాలు చూపడం లేదు. ఓ రైసుమిల్లుకు అతి సమీపంలో వెలసిన ఈ వెంచర్‌పై అధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ⇒ దోమకొండ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్లు లేకుండానే వెంచర్లు వెలిశాయి. దోమకొండ శివారులో సబ్‌స్టేషన్ వె నకాల ఉమాబాగ్లో సర్వే నంబర్ 60,61 లో ఇటీవల ప్లాట్లను విక్రయిస్తున్నారు. కానీ, నిబంధనల ప్రకారం ఎలాంటి లేఅవుట్ లేకుండా దానిని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. డీటీసీపీ లే అవుట్ పర్మిషన్ లేకుండా వారు ప్లాట్లను విక్రయిస్తున్నారు. దాదాపు 5 ఎకరాల 35 గుంటల స్థలంలో 121 ప్లాట్లను ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వీరు విక్రయిస్తున్నారు. వెంచర్‌కు హద్దులో సర్వే నంబర్ 23లో 2 ఎకరాల 15 గుంటల ప్రభుత్వ శిఖం భూమి ఉంది. ⇒ కామారెడ్డి శివారు జాతీయ రహదారి వెంట ఉన్న బస్వాపూర్, భిక్కనూరు, జంగంపల్లి, నర్సన్నపల్లి, సరంపల్లి, క్యాసంపల్లి, రామేశ్వర్‌పల్లి, అడ్లూర్, ఇల్చిపూర్, టేక్రియాల్, అడ్లూర్ఎల్లారెడ్డి, మర్కల్, సదాశివనగర్, పద్మాజివాడీ ఎక్స్‌రోడ్, పద్మాజీవాడీ తదితర గ్రామాల పరిధిలో రియల్ దందా పరుగులు పెడుతోంది. కాదు రియల్టర్లు దందాను పరుగులు పెట్టిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అసైన్డ్, శిఖం భూములను కూడా తమ వెంచర్లలో కలిపేసుకుంటున్నారు. ఇల్చిపూర్, అడ్లూర్, రామేశ్వర్‌పల్లి గ్రామాల శివారులో అసైన్డ్ భూములు పెద్ద ఎత్తున రియల్ వ్యాపారుల ఆధీనంలో ఉన్నాయి. -
111 జీఓకు తూట్లు..!
♦ అడ్డగోలుగా లేఅవుట్లు.. ♦ వెలిసిన నిర్మాణాలు 12,442 ♦ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో లెక్కతేల్చిన ♦ జిల్లా యంత్రాంగం ఆక్రమణల జాబితాలో సర్కారీ భవనాలు జీవసంరక్షణ మండలి (బయో కన్జర్వేషన్ జోన్)లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు వెలిశాయని ప్రభుత్వం లెక్క తేల్చింది. నిర్మాణాలపై ఆంక్షలు విధిస్తూ జారీచేసిన 111 జీఓ అమలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ పరిధిలోని 83 గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన జిల్లా యంత్రాంగం.. ఆక్రమణల జాబితాను రూపొందించింది. 111జీఓ బేఖాతరు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని శంషాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచా రించిన ట్రిబ్యునల్ 111జీఓ అమలుపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలో పక్షం రోజులుగా పంచాయతీ కార్యదర్శులు జీఓ పరిధిలోని గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వే చేశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జీఓ 111లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో విస్మయ పరిచే వాస్తవాలు వెలుగుచూశాయి. గతంలో రెవెన్యూ యంత్రాంగం చేసినప్పటి కంటే ఎక్కువగా ఆక్రమణలు పుట్టుకొచ్చాయని తేలింది. అనధికార లేఅవుట్లు, అనుమతిలేకుండా నిర్మాణాలు రావడం.. నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు, రైస్‌మిల్లులు, శీతల గిడ్డంగులు, ఇటుకబట్టీలు, మార్బుల్, ఫర్నీచర్ యూనిట్లు, విద్యాసంస్థల బహుళ అంతస్తు భవనాలు, సంపన్నవర్గాల రిసార్టులు వెలిశాయని స్పష్టమైంది. జంట జలాశయాలు కలుషితం కాకుండా.. వీటి ఉనికి ప్రశ్నార్థకంగా పరీవాహక ప్రాంతంలో పరిశ్రమలు, నిర్మాణాలు రాకుండా అడ్డుకునేందుకు జీవసంరక్షణ మండలి(111జీఓ)ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిర్మాణాలు, పరిశ్రమల స్థాపనపై ఆంక్ష లు విధించింది. అయితే, జీఓ అమలులో అధికారయంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడంతో అక్రమార్కులకు అడ్డూఅదుపులేకుండా పోయింది. ఈ క్రమంలోనే 111 జీఓను పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం.. సమగ్ర నివేదికతో కౌంటర్ దాఖలు చేయాలని ట్రిబ్యునల్ స్పష్టం చేయడంతో జిల్లా యంత్రాంగం గ్రామాల వారీగా సర్వేచేసి అక్రమార్కుల చిట్టా రూపొందించింది. పుట్టుకొచ్చిన 426 లేఅవుట్లు శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి మండలాల్లో 426 లేఅవుట్లు వెలిశాయని లెక్క తీసింది. ఇందులో ప్రధానంగా శంషాబాద్ గ్రామ పరిధిలో ఏకంగా 60 లేఅవుట్లు పుట్టుకొచ్చాయని గుర్తించింది. మిగతా గ్రామాల విషయానికి వస్తే సురంగల్‌లో 30, చిలుకూరులో 22, నర్కుడలో 28, పెద్దషాపూర్ 20, తొండుపల్లిలో 19, కేతిరెడ్డిపల్లి, పెద్దమంగళారం గ్రామాల్లో 15 లేఅవుట్లను వేసినట్లు సర్వేలో వెలుగు చూసింది. మొత్తం 426 లేఅవుట్లలో 12,442 ప్లాట్లు చేతులు మారిననట్లు స్పష్టమైంది. ఇందులో వాణిజ్య, గృహాలకు సంబంధించిన నిర్మాణాలే గాకుండా.. 99 పరిశ్రమలు, 86 సర్కారీ భవనాలు కూడా కొలువు దీరాయని ప్రభుత్వం అంగీకరించింది. వీటిలో విద్యుత్ సబ్స్టేషన్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ భవనాలు, పోలీస్స్టేషన్లు, పొదుపు సంఘాల భవనాలు ఉన్నట్లు ఒప్పుకుంది. అదే క్రమంలో జీఓ పరిధిలోని 8 గ్రామాల్లో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని స్పష్టం చేసింది. 40 గ్రామాల్లో 50లోపు, 26 గ్రామాల్లో 51-200లోపు, 8 గ్రామాల్లో 201-300, ఒక ఊరులో 301-400, మరో 8 గ్రామాల్లో 400 పైచిలుకు నిర్మాణాలు వెలిశాయని పంచాయతీ కార్యదర్శుల సర్వేలో తేలింది. విచిత్రమేమిటంటే.. అక్రమ కట్టడాలు వెలిసిన దాంట్లో 2,891 నిర్మాణాలు శంషాబాద్‌లో, 691 పాల్మాకులలో ఉన్నాయి. -
రైట్ రైట్
లారీల సమ్మె విరమణ ముఖ్యమంత్రితో ఇసుక లారీల యజమానుల భేటీ క్రిమినల్ కేసులను ఉపసంహరించుకుంటామని సీఎం హామీ ఇతర డిమాండ్లను పరిష్కరిస్తామని భరోసా సాక్షి ప్రతినిధి, బెంగళూరు :రాష్ట్రంలో లారీల యజమానులు చేపట్టిన సమ్మెను సోమవారం విరమించారు. ప్రభుత్వ ఇసుక విధానాన్ని నిరసిస్తూ ఇసుక లారీల యజమానులు గత 24 రోజులుగా సమ్మె చేపట్టారు. వారికి మద్దతుగా వాణిజ్య లారీలు కూడా రెండు రోజుల కిందట సమ్మె బాట పట్టాయి. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన క్యాంప్ కార్యాలయం కృష్ణాలో పలు దఫాలుగా లారీల యజమానుల సంఘాలతో చర్చించారు. రోజూ 20 వేల లోడ్ల ఇసుక రవాణాకు లెసైన్స్‌లు ఇవ్వాలని సంఘాల నాయకులు పట్టుబట్టారు. దీనికి ముఖ్యమంత్రి ససేమిరా అనడంతో కాసేపు ప్రతిష్టంభన ఏర్పడింది. తొలుత ప్రజా పనుల శాఖ మంత్రి హెచ్‌సీ. మహదేవప్ప, రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి, హోం మంత్రి కేజే. జార్జ్‌లతో సీఎం చర్చలు జరిపారు. సమ్మెను విరమింపజేయడానికి అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. అనంతరం మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ, డీజీపీ లాల్ రుకుం పచావ్లతో కూడా సమాలోచనలు జరిపారు. తదనంతరం లారీల సంఘాల ప్రతినిధులతో చర్చలకు ఉపక్రమించారు. ఇసుక రవాణా సందర్భంగా లారీలపై నమోదు చేసిన 1,600కు పైగా క్రిమినల్ కేసులను ఉపసంహరించుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. తమ డిమాండ్లన్నిటినీ ఒప్పుకుని తీరాలని చిన్నప్ప రెడ్డి, షణ్ముగప్పల నాయకత్వంలోని బృందాలు పట్టుబట్టాయి. పలు సార్లు చర్చల అనంతరం న్యాయ నిపుణులతో మాట్లాడి ఈ డిమాండ్లను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో సమ్మె విరమణకు వారు సమ్మతించారు. రోజూ 18 వేల లోడ్ల ఇసుక రవాణాకు పర్మిట్లు ఇవ్వాలని తాము కోరగా, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా అంత మొత్తానికి అనుమతి ఇవ్వలేమని అధికారులు తెలిపారని షణ్ముగప్ప చెప్పారు. ఎనిమిది వేల నుంచి పది వేల లోడ్లకు అనుమతి ఇవ్వవచ్చని అభిప్రాయపడ్డారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా నెరవేర్చాలని ఆయన కోరారు.