రైట్ రైట్ | Right Right | Sakshi
Sakshi News home page

రైట్ రైట్

Jan 14 2014 2:21 AM | Updated on Sep 2 2017 2:36 AM

రాష్ట్రంలో లారీల యజమానులు చేపట్టిన సమ్మెను సోమవారం విరమించారు. ప్రభుత్వ ఇసుక విధానాన్ని నిరసిస్తూ ఇసుక లారీల యజమానులు...

  •  లారీల సమ్మె విరమణ
  •  ముఖ్యమంత్రితో ఇసుక లారీల యజమానుల భేటీ
  •  క్రిమినల్ కేసులను ఉపసంహరించుకుంటామని సీఎం హామీ
  •  ఇతర డిమాండ్లను పరిష్కరిస్తామని భరోసా
  •  
    సాక్షి ప్రతినిధి, బెంగళూరు :రాష్ట్రంలో లారీల యజమానులు చేపట్టిన సమ్మెను సోమవారం విరమించారు. ప్రభుత్వ ఇసుక విధానాన్ని నిరసిస్తూ ఇసుక లారీల యజమానులు గత 24 రోజులుగా సమ్మె చేపట్టారు. వారికి మద్దతుగా వాణిజ్య లారీలు కూడా రెండు రోజుల కిందట సమ్మె బాట పట్టాయి. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన క్యాంప్ కార్యాలయం కృష్ణాలో పలు దఫాలుగా లారీల యజమానుల సంఘాలతో చర్చించారు. రోజూ 20 వేల లోడ్ల ఇసుక రవాణాకు లెసైన్స్‌లు ఇవ్వాలని సంఘాల నాయకులు పట్టుబట్టారు. దీనికి ముఖ్యమంత్రి ససేమిరా అనడంతో కాసేపు ప్రతిష్టంభన ఏర్పడింది.

    తొలుత ప్రజా పనుల శాఖ మంత్రి హెచ్‌సీ. మహదేవప్ప, రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి, హోం మంత్రి కేజే. జార్జ్‌లతో సీఎం చర్చలు జరిపారు. సమ్మెను విరమింపజేయడానికి అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. అనంతరం మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ, డీజీపీ లాల్ రుకుం పచావ్‌లతో కూడా సమాలోచనలు జరిపారు. తదనంతరం లారీల సంఘాల ప్రతినిధులతో చర్చలకు ఉపక్రమించారు.

    ఇసుక రవాణా సందర్భంగా లారీలపై నమోదు చేసిన 1,600కు పైగా క్రిమినల్ కేసులను ఉపసంహరించుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. తమ డిమాండ్లన్నిటినీ ఒప్పుకుని తీరాలని చిన్నప్ప రెడ్డి, షణ్ముగప్పల నాయకత్వంలోని బృందాలు పట్టుబట్టాయి. పలు సార్లు చర్చల అనంతరం న్యాయ నిపుణులతో మాట్లాడి ఈ డిమాండ్లను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

    దీంతో సమ్మె విరమణకు వారు సమ్మతించారు. రోజూ 18 వేల లోడ్ల ఇసుక రవాణాకు పర్మిట్లు ఇవ్వాలని తాము కోరగా, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా అంత మొత్తానికి అనుమతి ఇవ్వలేమని అధికారులు తెలిపారని షణ్ముగప్ప చెప్పారు. ఎనిమిది వేల నుంచి పది వేల లోడ్లకు అనుమతి ఇవ్వవచ్చని అభిప్రాయపడ్డారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా నెరవేర్చాలని ఆయన కోరారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement