breaking news
common exams
-
విద్యార్థులకు ఉమ్మడి పరీక్షలు
1 నుంచి 10 తరగతులకు సమ్మేటివ్–1 ఎగ్జామ్స్ 21 నుంచి ప్రారంభం 23 నుంచి మూల్యాంకనం ఆన్లైన్లో మార్కుల జాబితాలు రాయవరం / రాజమహేంద్రవరం రూరల్ : ఈ ఏడాది నుంచి విద్యా శాఖ నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది. దీని ప్రకారం ఒకటి నుంచి 10వ తరగతి వరకూ ఉమ్మడి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి సమ్మేటివ్–1 (క్వార్టర్లీ) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆరు నుంచి పదో తరగతి వరకూ 4,03,860 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావాలి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రకటించిన తేదీ, సమయానికి ప్రభుత్వం అందించే ప్రశ్నపత్రాలతోనే ఈ పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జంబ్లింగ్ విధానంలో.. ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ విధానంలో విద్యార్థుల ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. ఆయా మండలాల్లో మూల్యాంకన కేంద్రాలు (స్పాట్ వేల్యుయేషన్) ఏర్పాటు చేసి పక్క మండలాల విద్యార్థుల జవాబు పత్రాలు దిద్దనున్నారు. ఈ నెల 23 నుంచి అక్టోబరు 3వ తేదీ వరకూ మూల్యాంకనం చేసి అక్టోబరు 11 నుంచి 25వ తేదీ లోపు విద్యార్థుల మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. తద్వారా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడానికి, ఏ సబ్జెక్టులో వెనుకబడ్డారో గుర్తించి, అందులో రాణించేలా చేయడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. జంబ్లింగ్ పద్ధతిని వ్యతిరేకిస్తున్నాం బాలాజీచెరువు (కాకినాడ) : సమ్మెటివ్ పరీక్షల మూల్యాంకనంలో జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్ పేరిట ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్నారని, ఇప్పుడు ఈ నూతన సంస్కరణల పేరుతో మరింత గందరగోళానికి గురి చేస్తున్నారని అన్నారు. ఇదీ పరీక్షల షెడ్యూల్.. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకూ ఆరు నుంచి పదో తరగతి వరకూ విద్యార్థులకు సమ్మేటివ్–1 పరీక్షలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకూ రెండు విడతలుగా నిర్వహించనున్నారు. 21వ తేదీన 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఓరియంటల్ లాంగ్వేజెస్, ఒకేషనల్ కోర్సులకు పరీక్ష జరుగుతుంది. 6వ తరగతి : ఈ విద్యార్థులకు ఉదయం మాత్రమే పరీక్ష జరుగుతుంది. 22వ తేదీన తెలుగు (భాషలు), 23న హిందీ, 24న ఇంగ్లిష్, 26న గణితం, 27న సైన్స్, 28న సోషల్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. 7వ తరగతి : 22వ తేదీ ఉదయం తెలుగు, మధ్యాహ్నం తెలుగు / సంస్కృతం / ఉర్దూ మినహా మిగిలిన పరీక్షలను నిర్వహిస్తారు. 23న హిందీ, 24న ఇంగ్లిష్, 26న గణితం, 27న సైన్స్, 28న సోషల్ పరీక్షలు జరుగుతాయి. 8వ తరగతి : 22 ఉదయం తెలుగు / ఉర్దూ / సంస్కృతం, మధ్యాహ్నం సంస్కృతం పరీక్షలు జరుగుతాయి. 23 ఉదయం హిందీ, 24 ఉదయం ఇంగ్లిష్, 26 ఉదయం గణితం, 27 ఉదయం ఫిజికల్ సైన్స్, మధ్యాహ్నం బయలాజికల్ సైన్స్, 28 ఉదయం సోషల్ పరీక్షలు నిర్వహిస్తారు. 9, 10 తరగతులు : 22వ తేదీ ఉదయం, మధ్యాహ్నం తెలుగు/ఉర్దూ/సంస్కృతం, 23 ఉదయం హిందీ, 24 ఉదయం ఇంగ్లిష్–1, మధ్యాహ్నం ఇంగ్లిష్–2, 26 ఉదయం గణితం–1, మధ్యాహ్నం గణితం–2, 27 ఉదయం ఫిజికల్ సైన్స్, మధ్యాహ్నం బయలాజికల్ సైన్స్, 28 ఉదయం సోషల్–1, మధ్యాహ్నం సోషల్–2 పరీక్షలు జరుగుతాయి. 24 నుంచి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు.. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు. 24న తెలుగు, 26న ఇంగ్లిష్, 27న గణితం, 28న పరిసరాల విజ్ఞానం సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. -
'ఎవరి పరీక్షలు వారివే...ఉమ్మడి ప్రసక్తే లేదు'
-
'ఎవరి పరీక్షలు వారివే...ఉమ్మడి ప్రసక్తే లేదు'
హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ పరీక్షల వివాదం మళ్లీ మొదటికొచ్చింది. మార్చి11 నుంచి ఉమ్మడి పరీక్షలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించే ప్రసక్తే లేదనే స్పష్టం చేసింది. ఎవరి పరీక్షలు వారే నిర్వహించుకోవాలని సూచించింది. ఇంటర్ పరీక్షలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఇదే అంశం శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలను తామే నిర్వహించుకుంటామని తేల్చి చెప్పారు. పరీక్షల టైం టేబుల్.... తేదీలు సబ్జెక్టు మార్చి 11 ఇంటర్ ఫస్టియర్, ద్వితీయ భాష (తెలుగు తదితర) మార్చి 12 సెకండ్ ఇయర్, ద్వితీయ భాష (తెలుగు తదితర) మార్చి 13 ఇంటర్-1 ఇంగ్లీష్ మార్చి 14 ఇంటర్-2 ఇంగ్లీష్ మార్చి 16 గణితం-1ఎ, బోటనీ-1, సివిక్స్-1 మార్చి 17 గణితం-2ఎ, బోటనీ-2, సివిక్స్-2 మార్చి 18 జువాలజీ-1, హిస్టరీ-1 మార్చి 19 గణితం-2బి, జువాలజీ-2, హిస్టరీ-2 మార్చి 20 ఫిజిక్స్-1, ఎకనమిక్స్-1 మార్చి 23 ఫిజిక్స్-2, ఎకనమిక్స్-2 మార్చి 24 కెమిస్ట్రీ-1, కామర్స్-1, సోషియాలజీ-1 మార్చి 25 కెమిస్ట్రీ-2, కామర్స్-2, సోషియాలజీ-2 మార్చి 26 జువాలజీ-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, హోమ్ సైన్స్-1 మార్చి 27 జువాలజీ-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, హోమ్ సైన్స్-2 మార్చి 30 జాగ్రఫీ-1, మోడ్రన్ లాంగ్వేజ్ పేపరు-1 మార్చి 31 జాగ్రఫీ-2, మోడ్రన్ లాంగ్వేజ్ పేపరు-2 -
ఉమ్మడి విధానంలో ఇంటర్ పరీక్షలు: గంటా
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు(ఐపీఈ-2014) వచ్చే మార్చి 11నుంచి నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వానికి పంపించినట్లు చెప్పారు. ఉమ్మడి విధానంలోనే ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, ఇందుకు తెలంగాణ సర్కార్ సహకరించాలని కోరుతున్నట్లు తెలిపారు. డీఎస్సీపై కేంద్రం అడిగిన డేటా పంపించామని, బీఈడీ అభ్యర్థులకు, ఎన్జీటీ పోస్టులకు అవకాశం కల్పించడం కష్టమంటున్నారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. కేంద్రం పూర్తిస్థాయి నిర్ణయం ప్రకటించాక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలు చేస్తామన్నారు. కేంద్ర విద్యాసంస్థలకు స్థలాలు ఖరారు చేస్తామని, ఐఐటీ, ఐఎస్ఈఏఆర్లను చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఏర్పాటు చేస్తామని గంటా తెలిపారు. ఐఏఎమ్ విశాఖ జిల్లాలోని గంభీరంలో, ఎన్ఐటీ తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు విజయనగరం జిల్లాలో స్థలం సానుకూలంగా లేదని కేంద్రం తిరస్కరించిందన్నారు. విశాఖ జిల్లా సబ్బవరం స్థలాన్ని పరిశీలిస్తున్నామని, ట్రిపుల్ ఐటీ, సెంట్రల్ యూనివర్శిటీలకు ఇంకా స్థలాలు ఖరారు కాలేదన్నారు. రాష్ట్రంలో 8,601 పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మాణానికి 10 ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకొచ్చాయన్నారు. రూసా పథకం కింద రూ.1747 కోట్లతో విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తామన్నారు.