breaking news
colonial domination
-
US: యూఎస్‌లో అసలైన అమెరికన్లు ఎంతమందంటే..!
భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అవడంతో, ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అందరికీ ఉపాధి కల్పించడం, నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలించడం ఏ ప్రభుత్వానికైనా సవాలు లాంటిదే. అందుకే బతుకు దెరువు వెతుక్కుంటూ అటు అరబ్బు దేశాలకో, ఇటు చదువుల పేర అమెరికా లాంటి దేశాలకో వెళ్లడం ఇప్పుడు మన యువతకు తప్పడంలేదు. మనదే మనదే మనదే.. ఈ ప్రపంచమంతా మనదే శక్తి యుక్తి సామర్థ్యాలకు.. సరిహద్దులతో పనిలే కష్టపడి పనిచేసే వారిని.. కాదనువారు లేరులే విశ్వాసంతో ముందుకు వెళితే.. అపజయమన్నది లేదులే గడప దాటితే ఒంటరివెట్లా.. బాటసారులే బంధుమిత్రులు కలిసి నడిస్తే మాట కలిపితే.. ప్రపంచమంతా మనదేలే ! మన NRIలను ఉద్దేశించి నేను రాసిన ‘వలస పక్షులు ’ అన్న ఒక చిన్న కవితలో. అయితే బయటి దేశాలు ఏవైనా వాళ్ళ అవసరాలను బట్టే విదేశీయులను అనుమతిస్తాయి, అందులో కూడా పైకి ఎన్ని చెప్పినా అంతరాంతరాల్లో కొంత వివక్ష ఉండనే ఉంటుంది. ఒక విధంగా చూస్తే అమెరికా పూర్తిగా వలసవాదుల దేశం. ఆ దేశ జనాభాలో నిజమైన భూమిపుత్రుల సంఖ్య నామమాత్రమే. చరిత్రలోకి వెళితే ఆ దేశంలో కొలంబస్ అడుగు పెట్టింది 1492 లో. అలా అమెరికా కు వచ్చిన సెటిలర్స్ రెడ్ ఇండియన్స్‌ను పూర్తిగా తొక్కిపెట్టి అక్కడి పాలకులయ్యారు. బ్రిటిష్ వారి నుంచి వారు స్వాతంత్య్రం ప్రకటించుకున్నది 1776 జులై 4 న. ఆఫ్రికా దేశాల నుంచి బానిసలుగా తెచ్చుకున్న నల్లవారి శ్రమశక్తితో వారు తమ వ్యవసాయాన్ని వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నది నిజం. ఆలస్యంగా నైనా తమ తప్పిదాన్ని గ్రహించి, బానిసత్వాన్ని నిషేధించి అమెరికా నాగరిక దేశం అనిపించుకున్నది 1807 లో మాత్రమే. కాని బానిస వ్యాపారం ఆ దేశంలో అంత సులభంగా పోలేదు, అదో అంతర్యుద్దానికి దారి తీసింది. అబ్రహం లింకన్ ఆ దేశాధ్యక్షుడు అయినాకనే ( 1860) అక్కడి జాత్యహంకారులపై విజయం సాధ్యమైంది. అదీ ఆ మహానుభావుని ప్రాణత్యాగంతో. ఎలాగైతేనేం అలా వచ్చిన వలసవాదులు, వారిచే బానిసలుగా తీసుకు రాబడ్డవారు, బతుకుదెరువు కోసం వచ్చినవారు అంతా కలిసి ఆ దేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా నిలబెట్టారు. ఇప్పుడు వాళ్ళే మా దేశంలోకి అక్రమ వలసలు పెరిగిపోతున్నాయని బాధపడిపోవడం విశేషం. పక్కనే వున్న మెక్సికో లాంటి దేశాల నుండి చాలామంది దొంగచాటుగా ప్రాణాలకు తెగించి వచ్చి అమెరికాలో ఏ పని దొరికితే ఆ పని చేసుకొని బతుకుతున్నారు. నిర్మాణ రంగంలో, పారిశుద్ధ్య పనుల్లో, ఇంటి పనుల్లో అన్నింట్లో వాళ్ళే కనిపిస్తారు. తక్కువ వేతనం మీద ఎక్కువ శ్రమ చేస్తున్న వీరు ఒక్క రోజు పని మానేస్తే అక్కడి నగరాలు చెత్త కుప్పల్లా కనబడుతాయి మరి. కానీ ఇలాంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రాంట్స్ ను కట్టడి చేయాలని, అమెరికాలో పుట్టినంతమాత్రానే వాళ్లకు పౌరసత్వం ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నాయి అక్కడి రాజకీయ పార్టీలు కొన్ని. చైనా, పాకిస్థాన్, ఇండియా వంటి దేశాల నుంచి కూడా అక్రమ వలసలు పెరుగుతున్నాయంటారు. మన గుజరాతీలు, పంజాబీలు, దక్షిణాది రాష్ట్రాల వారు కూడా వ్యాపార రంగాల్లో బాగా స్థిరపడ్డారు. సాఫ్ట్వేర్ పుణ్యమా! అని ఇప్పుడు యూఎస్ లోని ఏ సిటీకి వెళ్లినా కనబడే NRIల్లో తెలుగు వారే ఎక్కువ, మంచి కమ్యూనిటీల్లో ఉంటున్నది కూడా మన వాళ్లే, ఎక్కువ కష్టపడే వాళ్లు కూడా మనవాళ్లే. సెలవులు, వీకెండ్లను కూడా త్యాగం చేసి శ్రమిస్తూనే కనిపిస్తారు. ఇక్కడికి చదువుల కోసమని వస్తున్న మన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ఇక్కడ ఉన్నత విద్య చాలా ఖర్చుతో కూడుకున్న పని అవడంతో, జేబు ఖర్చులకోసం మన పిల్లలు చిన్న చిన్న పనుల్లో కనబడుతున్నారు. వీటికి తోడు ఇటీవలి కాలంలో మనవారి గుళ్ళు గోపురాల హడావిడి ఎక్కువవడంతో దీన్ని కొందరు గిట్టనివారు చేస్తున్న దుష్ప్రచారం వల్ల భారత సంతతి వారిపై కొంత ఈర్ష్యాద్వేష భావాలు పెరుగుతున్న వార్తా సంకేతాలు. ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా అమెరికాలో కూడా పేదరికం ఉంది, అక్కడక్కడ అడుక్కుతినేవాళ్ళు కనబడతారు. ఇండియాలో ఉన్నా అమెరికా వెళ్లినా ప్రతినిత్యం నేను విధిగా చేస్తున్నది మార్నింగ్ వాక్. అలా అమెరికాలో నేను బయటికి వెళ్తున్నప్పుడల్లా మా అమ్మాయి పర్సులో డబ్బులున్నాయా డాడీ ! అని అడిగేది. నేను షాపింగ్‌కు వెళ్లడం లేదు కదా! అంటే ‘అలా కాదు, కనీస మొత్తం డాలర్లైనా దగ్గరుండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆకస్మాత్తుగా ఎవరైనా మగ్గర్స్ వచ్చి అడిగితే ఎదురు చెప్పకుండా వాళ్లకు ఉన్నవి ఇచ్చేయడం మంచిది. ఇక్కడ గన్ కల్చర్ ఎక్కువ జాగ్రత్త ! ’ అని హెచ్చరించేది!. నాకు మాత్రం అలా ఎప్పుడూ జరగలేదు, ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఆడా మగా అనకుండా వాకింగ్‌లో చిరునవ్వుతో ‘ హాయ్ ’ అని చెప్పడం నన్ను ముగ్దుణ్ణి చేసిన విషయం ! వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికా లైబ్రరీ ఇంత బాగుంటుందా! అందులోనే..!) -
వారధిలా పనిచేస్తా..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘వలసవాద ఆధిపత్యం కింద పాలమూరు జిల్లా నలిగిపోయింది. ఉపాధి లేకపోవడంతో వలసల జిల్లాగా పేరొందింది. పాలమూరుకు జరిగిన అన్యాయాలను సరిదిద్దేందుకు మండలిలో ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తా.. గతంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమించాం. భవిష్యత్‌లో అన్నివర్గాల సమస్యలపై మండలిలో గొంతువిప్పుతా..’’అని ఉద్యోగ సంఘం నేత దేవీప్రసాద్‌రావు అన్నారు. మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వలసవాద ఆధిపత్యం కింద పాలమూరు జిల్లా నలిగిపోయింది. దేశంలో అత్యధికంగా వలసకార్మికులు ఇక్కడినుంచే ఉన్నారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు లేకపోవడం, నీటిపారుదల సౌకర్యాలపై పాలకులు శ్రద్ధచూపకపోవడమే ప్రధాన కారణం. వలసల నివారణకు రాజకీయ పార్టీలు గతంలో సరైన కార్యాచరణ రూపొందించలేదు. టీడీపీ జిల్లాను దత్తత తీసుకున్నప్పటికీ సవతి తల్లి ప్రేమను కనబరిచింది. ఉపాధికి సంబంధించి ఇప్పటివరకు భారీపరిశ్రమలు రాలేదు. ఆర్డీఎస్కు నీటికేటాయింపులు ఉన్నా పావువంతు ఆయకట్టుకు కూడా నీరందని పరిస్థితి నెలకొంది. పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టాలనే డిమాండ్ ఉన్నా గత పాలకులు పట్టించుకోలేదు. సర్వేకోసం జీఓ జారీచేసినా నిధులు ఇవ్వలేదు. సాగునీటిరంగంలో గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దేందుకు పాలమూరు ఎత్తిపోతల వంటి పథకాలను ప్రభుత్వం చేపడుతోంది. కేంద్రనాన్చివేత వైఖరే కారణం వివిధవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టింది. అయితే ప్రభుత్వపరంగా ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఆలస్యానికి కారణం ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాకపోవడమే.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నాన్చివేతధోరణి మూలంగా విభజనకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఐఏఎస్‌ల విభజన మొదలుకుని రాష్ట్ర విభజన బిల్లులో లోపాల సవరణ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అడుగడుగునా కొన్నిశక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. అవే శక్తులు తిరిగి మండలి ఎన్నికల్లో ఓట్లు అడగడం దురదృష్టకరం. మండలిలో గొంతు విప్పుతా.. త్వరలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు, ప్రైవేట్‌రంగంలో ఉద్యోగావకాశాల కల్పన, ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. గతంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమించాం. భవిష్యత్‌లో వివిధరంగాలు, వర్గాల సమస్యలపై మండలిలో గొంతు విప్పుతా. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారిధిలా పనిచేస్తా.