breaking news
collied
-
డీసీఎంను ఢీకొన్న లారీ : ముగ్గురు మృతి
అశ్వాపురం: భద్రాద్రికొత్తగూడెంజిల్లా అశ్వాపురం మండలం మొండికుంట వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతిచెందారు. బీఎస్ఎన్ఎల్ పైపులు దింపుతున్న డీసీఎంను మరో లారీ ఢీకొంది. ఈ సంఘటనలో పైపులు దింపుతున్న కూలీ శివరాత్రి గోపయ్య (50), డీసీఎం డ్రైవర్ భాగ్యరావు(23) అక్కడికక్కడే మృతిచెందారు. మరో పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులు, గాయపడిన వారు గుంటూరుకు చెందిన కూలీలు. కాగా, భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతిచెందాడు. -
విహారానికి వెళుతూ మృత్యు ఒడిలోకి..
నిడదవోలు రూరల్ : సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ద్విచక్ర వాహనాలపై గోదావరి అందాలను తిలకించేందుకు బయలుదేరిన స్నేహితులు అనుకోని రీతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. నిడదవోలు మండలం శెట్టిపేట విద్యుత్ కేంద్రం వద్ద వంతెనపై మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మిత్రులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన పరిమి హరికృష్ణ (39), పాలపర్తి పవన్‌కుమార్ (25) ఓ బైక్‌పై, వీరి స్నేహితులు తాడేపల్లి జానీ, ఎస్కే సద్దమ్ మరో బైక్‌పై విజ్జేశ్వరం బ్యారేజీ, గోదావరి అందాలను తిలకించేందుకు బయలుదేరారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ శెట్టిపేటలోని విద్యుత్ కేంద్రం వద్ద వంతెనపై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఒకదానినొకటి ఢీకొనడంతో ఓ బైక్‌పై ఉన్న హరికృష్ణ, పవన్‌కుమార్ తలలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మరో బైక్‌పై ఉన్న జానీ, సద్దమ్కు గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని కొవ్వూరు రూరల్ సీఐ ఎం.సుబ్బారావు పరిశీలించారు. పోలీసులు ప్రమాద వివరాలు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషాదంలో కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన పరిమి హరికృష్ణకు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు సత్య, ఆది. హరికృష్ణ 17 ఏళ్ల క్రితం లక్షి్మని కులాంతర వివాహం చేసుకున్నాడు. తనను ఆప్యాయంగా చూసుకునేవాడని లక్ష్మి గుండెలవిసేలా రోదిం చడం కంట తడిపెట్టించింది. పెళ్లయిన 17 రోజులకే.. పాతూరుకు చెందిన పాలపర్తి కృష్ణబాలాజీ ఏకైక కుమారుడు పవన్‌కుమార్ హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 19న తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెంకు చెందిన బాతుల మంగరాజు కుమార్తె వెన్నెలతో అతడికి వివాహమైంది. వివాహం జరిగిన 17 రోజులు కాకుండానే ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య వెన్నెల డిగ్రీ పరీక్షలు రాయడానికి వెళ్లిందని, త్వరగా వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లాలని పవన్‌కుమార్ చెప్పాడని స్నేహితులు జాన్, సద్దమ్ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదం ఎలా జరిగింది..! ఘటనా స్థలంలో మృతదేహాలను చూస్తే ప్రమాదం ఎలా జరిగిందో పోలీసులకు అర్థం కావడం లేదు. ప్రమాదం జరిగిన షాక్‌లో మృతుని స్నేహితులు చెప్పే మాటలకు ప్రమాద వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. ప్రమాదంలో పవన్‌కుమార్, హరికృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. మృతుల బైక్ వంతెన గోడను ఢీకొట్టిందా.. లేదా ఏదైనా భారీ వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టిందా అనే కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బైక్ వచ్చి తమ బైక్‌ను ఢీకొట్టడంతో కిందపడి గాయాలైనట్టు జాన్, సద్దమ్ పోలీసులకు తెలిపారు. -
రెండు విమానాలు ఢీకొంటే అంతే మరి!
చైనా: సాధారణంగా మనం కారు రివర్స్‌లో పెడుతున్నా.. లేదా బ్రేక్ ఆగక ముందు వెళ్లే వాహనానికి మెల్లగా తాటించిన గబాళ్లు మని శబ్దం రావడంతోపాటు రెండు వాహనాలకు భారీ సొట్టలు పడతాయి.. అలాంటిది రెండు విమానాలు ఒక దానికి మరొకటి తాగిలితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదే ఘటన షాంఘైలోని హంకియో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ రెండు విమానాలు కూడా చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్యాసింజర్ విమానాలే. ఒక విమానం తన ప్రయాణం ముగించుకుని సురక్షితంగా దిగి టర్మినల్ వద్దకు వస్తుండగా మరో విమానం ప్రయాణీకులను ఎక్కించుకుని బయలుదేరేందుకు రన్ వే వైపు కదిలేందుకు సిద్ధమై కదిలింది. ఇంతలో పెద్ద శబ్ధం.. చూస్తూండగానే వాటి రెక్కలు ఒకదానికి మరొకటి తగిలి అందులో ఓ విమానం రెక్క అమాంతం సగానికి పైగా చీలిపోయింది. ఏంజరుగుతుందా అని రెండు విమానాల్లో ప్రయాణీకులు అదిరిపడ్డారు. వెంటనే వాటిని పైలెట్లు ఆపేశారు. రెండు విమానాల్లోని ప్రయాణీకులను దించివేసి ఎయిర్ పోర్టుకు తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు. కొంత ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన ఎలా జరిగిందో విచారించేందుకు అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. -
గ్రానైట్ లారీ-డీసీఎం ఢీ
వరంగల్: రాయపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గ్రానైట్ లారీ-డీసీఎం ఢీకొని ఎనిమిదిమందికి గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో సదరు కుటుంబాల్లో కొంత విషాద చాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులు మర్రిపేట మండలం, చినమంచిర్యాల గ్రామానికి చెందినవారు.