breaking news
coastal and rayalaseema
-
గాలిలో తేమ ఎఫెక్ట్.. కోస్తా, సీమలో రెండు రోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: మాండూస్ తుపాను తీరాన్ని దాటి మూడు రోజులవుతున్నా రాష్ట్రంలో ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వానలు కురుస్తూనే ఉన్నాయి. గాలిలో తేమ అధికంగా ఉండడం వల్ల వర్షాలు కొనసాగడానికి దోహదం చేస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, వైఎస్సార్, గుంటూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో గాలిలో తేమ 90–95% నమోదవుతోంది. అందువల్లే ప్రస్తుతం అల్పపీడనాలు, ఆవర్తనాలు వంటివి లేకపోయినా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకంటే ఆయా చోట్ల వానలు ఇంకా కురుస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంపైకి ఈశాన్య/తూర్పు గాలులు వీస్తున్నాయి. కొద్దిరోజులకంటే ప్రస్తుతం వీటి వేగం తగ్గింది. ఇలా ఈ గాలుల వేగం, గాలిలో తేమ తగ్గితే వాతావరణంలో పొగమంచు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. కాగా సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి. -
సీమాంధ్రను తాకనున్న నైరుతి రుతుపవనాలు
విశాఖపట్నం : కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు సోమవారం తాకనున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. విదర్భ నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు తీరం వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తం ఏర్పడిందని పేర్కొంది. ఈ రెండింటి ప్రభావం వల్ల కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది.