breaking news
circar express
-
బాపట్ల: రైలులో దొంగల బీభత్సం.. కాల్పులతో ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లాలోని అప్పికట్ల–బాపట్ల రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం తెల్లవారుజామున షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చెంగల్పట్టు నుంచి కాకినాడకు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులోకి ప్రవేశించిన దోపిడీ దొంగలు నిద్రిస్తున్న ప్రయాణికుల బంగారం, విలువైన వస్తువులను లాక్కునేందుకు ప్రయత్నించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తాజాగా తెలిపారు. ఈ క్రమంలో ప్రయాణికులు అప్రమత్తమై దొంగలను ప్రతిఘటించడంతో పాటు గట్టిగా కేకలు వేయడంతో రైలులో ఒక్కసారిగా కలకలం రేగింది. పరిస్థితిని గమనించిన కొందరు ప్రయాణికులు అత్యవసర చైన్ లాగడంతో రైలు మధ్యలోనే ఆగిపోయింది. రైలు ఆగిన వెంటనే దొంగలు చీకటిని ఆసరాగా చేసుకుని పరారయ్యేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న రైల్వే భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించి దొంగలను వెంబడించారు. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు రైల్వే పోలీసులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం.అయితే చీకటి కారణంగా దుండగులు పోలీసుల నుంచి తప్పించుకుని పరారైనట్లు తెలుస్తోంది. ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైలులో ఉన్న ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తూ, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దోపిడీ యత్నానికి పాల్పడిన వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు తెలిసింది.అనంతరం, రైల్వే డీఎస్సీ అక్కేశ్వరరావు మాట్లాడుతూ..‘రాత్రి ఒంటిగంట సమయంలో సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు పడ్డారు. బోగీ నెంబర్-3, 5లో ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు లాక్కున్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురై పెద్దగా అరిచారు. వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. రైలు నుంచి దూకి పరారీ అయ్యారు. దొంగలు పొలాల్లోకి పారిపోయారు. ఇదే సమయంలో పోలీసులు తొమ్మిది రౌండ్లు దొంగలపై కాల్పులు జరిపారు. ఘటన జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లో సివిల్ పోలీసులతోపాటు రైల్వే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దుండగులకు సంబంధించిన రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నాం’ అని తెలిపారు. -
ప్రాణం నిలిపిన టీటీఈ సమయస్ఫూర్తి
నెల్లూరు: చెన్నై నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వెళ్లే సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి టీటీఈ సమయస్ఫూర్తి ప్రయాణికుడి నిండు ప్రాణాన్ని కాపాడింది. కాకినాడ పోర్టు ఉద్యోగి బెన్నెట్ సింగ్ (ఎస్-1, 46) సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై నుంచి తిరిగివస్తున్నారు. ఆయన నెల్లూరు స్టేషన్లో అల్పాహారాన్ని కొనుక్కోవడానికి దిగారు. ఆ వెంటనే రైలు కదిలిపోవడాన్ని గమనించి ఆదరా బాదరాగా పరుగెత్తుకెళ్లి రాడ్‌ను పట్టుకుని మెట్లపై నిల్చుని ఉండిపోయారు. తలుపు రాకపోవడంతో రక్షించమంటూ హాహాకారాలు చేశారు. దీన్ని గమనించిన ప్రయాణికులు తలుపు తెరవడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. చెయిన్ లాగి రైలును ఆపడానికి ఎవరూ సాహసించలేదు. ఒకరిద్దరు ప్రయత్నించినా బోగీలో ఉన్న పోలీసులు చెయిన్ లాగడానికి వీల్లేదని అడ్డుపడ్డారు. తదుపరి స్టేషన్ వరకూ ఓపిక పట్టమని ప్రయాణికునికి వారు సలహా ఇచ్చారు. ఈలోగా అటుగా వచ్చిన టీటీఈ వి. భగవాన్ విషయం తెలుసుకుని చెయిన్లాగి రైలును ఆపారు. బతుకుజీవుడా అనుకుంటూ వేరే ద్వారం గుండా ఆయన లోపలికి చేరుకున్నారు. ఇదంతా అయ్యేసరికి 45 నిమిషాలకుపైగా సమయం పట్టింది. రైలు వేగం అందుకున్నాక తనకు ప్రాణాలపై ఆశ పోయిందని బెన్నెట్సింగ్ అన్నారు. విషయం తెలిసిన వెంటనే చెయిన్లాగి తనను కాపాడిన టీటీఈ భగవాన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కనీసం బోగీ తలుపులు ఎలా ఉన్నాయో కూడా చూసుకోకుండా రైళ్లు నడపడం సరికాదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.


