breaking news
chinna gollapalli
-
అందాల దీవిలో కడలి కల్లోలం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సహజసిద్ధ ప్రకృతి అందాలతో కనువిందు చేసే సుందర ద్వీపం చిన్నగొల్లపాలేనికి కష్టం వచ్చింది. దీనిని కడలి ఏటా మింగేస్తోంది. మరికొన్నేళ్లు గడిస్తే దీవి అనవాళ్లు కనబడవేమో అనే బెంగ ఆ గ్రామ వాసులను పీడిస్తోంది. మూడువైపులా ఉప్పుటేర్లు, ఒకవైపు బంగాళాఖాతం (Bay of Bengal) ఉండటంతో చుట్టూ నీటితో నిండిన చినగొల్లపాలెం కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో ఉంది. రెండు జిల్లాల సంస్కృతి మేళవింపు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సరిహద్దులో రెండు జిల్లాల సంస్కృతికి అద్దం పడుతూ భౌగోళికంగానే కాక జీవన విధానంలోనూ భిన్న సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా చినగొల్లపాలెం (chinna gollapalem) నిలుస్తోంది. 1962వ సంవత్సరానికి ముందు దీవి మూడువైపులా నీటితో ఒక వైపు భూభాగంతో ద్వీపకల్పంగా ఉండేది. 1962లో కొల్లేరు పరీవాహక ప్రాంత ముంపునీరు సముద్రంలో కలిసేందుకు చినగొల్లపాలెం, పడతడిక గ్రామాల మధ్య కాలువ తవ్వారు. అప్పటి నుంచి ఇది మానవ నిర్మింత దీవిగా మారిపోయింది. నాటినుంచి దాదాపు అర్ధ శతాబ్దంపాటు బాహ్య ప్రపంచంతో రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. జల రవాణా మాత్రమే ఉండటంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉప్పుటేరుపై (Upputeru) వారధి నిర్మాణం జరిగింది. దీంతో రవాణా సంబంధాలు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ప్రతిపాదనలతోనే సరి చినగొల్లపాలెం కోత నివారణకు సీ కోస్టల్ ఏరియా (ప్రొటెక్షన్ కీ)లో భాగంగా రూ.210 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త కాలువ, పాత కాలువల పూడికతీత, రెగ్యులేటర్ల నిర్మాణాలకు, పాత కాలువపై రెగ్యులేటర్‌కు రూ.364 కోట్లు, కొత్త కాలువపై రెగ్యులేటర్ కోసం రూ.166.35 కోట్లతో పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించినప్పటికీ ప్రతిపాదనల దశలోనే ఆగిపోయాయి. ప్రభుత్వం అక్కడి ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోత నివారణకు శాశ్వత పరిష్కారంగా రాతి కట్టడం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.సముద్ర గర్భంలో కొబ్బరి తోటలు ఆరువేల ఎకరాలకుపైగా విస్తీర్ణంతో 10వేల జనాభా గల చినగొల్లపాలెం ప్రజల భద్రతకు భరోసా లేకుండాపోయింది. ప్రస్తుతం దీవిని రెండువైపుల నుంచి సముద్రం కోతకు గురిచేస్తోంది. గతంలో ఏటిమెండి వద్ద పాతకాలువ ముఖద్వారంతో పాటు ప్రస్తుతం కొత్తకాలువ ముఖద్వారం సైతం పూడుకుపోవడంతో సముద్రం దీవిని కోసేస్తోంది. ఇప్పటికే దాదాపు 800 ఎకరాల వరకు సరుగుడు, కొబ్బరి తోటలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే దీవిని సముద్రం (Sea) మింగేయడం ఖాయమని ప్రజలు భయపడుతున్నారు.పూడిక తీయాలి సముద్రం వేగంగా కోతకు గురి చేస్తోంది. దీనికి ప్రధాన కారణం దీవికి తూర్పు, పశ్చిమ దిక్కున ఉన్న పాత, కొత్తకాలువలు పూడుకుపోవడమే. వెంటనే సముద్ర ముఖద్వారాల వద్ద పూడిక తీయాలి. ప్రకృతి ప్రసాదించిన అరుదైన సహజసిద్ధ సంపదను కాపాడాలి. – కొప్పినేటి హనుమంతరావు, మాజీ సర్పంచ్, చినగొల్లపాలెంకోతకు కళ్లెం వేయాలి మా గ్రామాన్ని సముద్రం కోసేస్తూ ఊరివైపు దూసుకువస్తోంది. ఇప్పటికే వందలాది ఎకరాల భూములు సముద్రంలో కలిసిపోయాయి. కోత నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అతి త్వరలో దీవి కనుమరుగైపోతుంది. – మాసాబత్తుల శ్రీనివాసరావు, దీవి పరిరక్షణ అధ్యక్షుడు -
కోటి విలువజేసే ఎర్రచందనం పట్టివేత
వైఎస్సార్ కడప: జిల్లాలోని సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి వద్ద పోలీసులు భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక్కసారిగా ఎర్రచందనం స్మగ్లర్లపై దాడి చేశారు. కాగా, ఈ దాడిలో కోటి రూపాయలు విలువజేసే ఎర్రచందనం దుంగలను, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడుగురు కూలీలను అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో 30 మంది తమిళ కూలీలు తప్పించుకు పారిపోయినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.