breaking news
Chinese President jinping
-
పోరాటాలకు సిద్ధం కావాలి
బీజింగ్: రాబోయే కాలంలో అతిపెద్ద పోరాటాలకు, ఊహించని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటినుంచే సంసిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా వ్యవహరించాలని సూచించారు. చైనా నేషనల్ డే సందర్భంగా ఖిషీ పత్రికలో జిన్‌పింగ్ ఈ మేరకు ఓ వ్యాసం రాశారు. సవాళ్లను ప్రభావవంతంగా అధిగమించే దిశగా ప్రజలను ముందుకు నడిపించాలని పేర్కొన్నారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ కీలక సదస్సు ఈ నెల 16న జరగనుంది. జిన్‌పింగ్ పదవీ కాలాన్ని వరుసగా మూడోసారి మరో ఐదేళ్లపాటు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మావో జెడాంగ్ తర్వాత పదేళ్లకుపైగా అధికారంలో ఉన్న నాయకుడిగా జిన్‌పింగ్ రికార్డు సృష్టిస్తారు. -
పల్లవించిన స్నేహగీతం
సాక్షి ప్రతినిధి, చెన్నై: బంగాళాఖాతం తీరంలో, ఏడవ శతాబ్దపు అద్భుత శిల్పకళా నిర్మాణాల నేపథ్యంలో మామల్లపురం(మహాబలిపురం)లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య రెండో అనధికార భేటీ శుక్రవారం సానుకూల వాతావరణం మధ్య ప్రారంభమైంది. చెన్నై నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో మామల్లపురం వచ్చిన జిన్‌పింగ్‌కు మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు పల్లవ రాజులు నిర్మించిన అత్యద్భుత కట్టడాలను సందర్శించారు. సంప్రదాయ తమిళ వస్త్రధారణలో ఉన్న మోదీ.. జిన్‌పింగ్‌కు ప్రపంచ పురావస్తు నిర్మాణాలుగా యునెస్కో గుర్తింపు పొందిన ఆ శిల్పకళా సంపద చారిత్రక ప్రాధాన్యతను, పౌరాణిక ప్రాశస్త్యాన్ని, నిర్మాణ కౌశలాన్ని ఒక గైడ్ తరహాలో వివరించారు. అర్జునుడు తపస్సు చేసినట్లుగా భావిస్తున్న ప్రాంతంలో ఏకశిలపై నిర్మితమైన కట్టడాన్ని, పంచ రథ రాతి(పాండవ రథాలు) నిర్మాణాన్ని, శ్రీకృష్ణుడి వెన్నముద్ద బంతి(గుండ్రని పెద్దబండరాయి)ని సందర్శించారు. వీటి వివరాలను జిన్‌పింగ్ ఆసక్తిగా విన్నారు. పంచ రథ నిర్మాణ ప్రాంతంలో కొబ్బరి నీరు తాగి కాసేపు సేద తీరారు. ఆ సమయంలో అనువాదకుల సాయంతో ఇరువురు నేతలు ముచ్చటించుకున్నారు. అనంతరం సముద్ర తీరంలో నిర్మితమైన శివ విష్ణు రాతి దేవాలయాన్ని సందర్శించారు. సూర్యాస్తమయం వేళ అక్కడి ప్రకృతి దృశ్యాలను కాసేపు ఆస్వాదించారు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని సందర్శన సందర్భంగా ఆ దేవాలయాన్ని దీపకాంతులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఆ ఆలయ నేపథ్యంలో ఏర్పాటు చేసిన వేదికపై కళాక్షేత్ర ఫౌండేషన్ కళాకారుల బృందం ప్రదర్శించిన భరతనాట్యం, కథాకళి నృత్య ప్రదర్శనలను వీక్షించారు. ఇరువురు నేతలు పలు సందర్భాల్లో షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం, నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది. అన్ని సందర్భాల్లోనూ ఇరువురి నేతల మధ్య నెలకొన్న స్నేహానుబంధం స్పష్టంగా కనిపించింది. నేడు(శనివారం) ఇరువురు నేతలు, రెండు దేశాల ప్రతినిధి బృందాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఉగ్రవాదంపై పోరు, వాణిజ్యం, 3500 కి.మీల సరిహద్దు వెంబడి ఉన్న ఇరుదేశాల సైనిక సహకారం.. తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. సాంస్కృతిక ప్రదర్శనలు ముగిసిన తరువాత, చైనా అధ్యక్షుడి గౌరవార్థం ఆలయ ప్రాంగణ ప్రాంతంలోనే మోదీ విందు ఏర్పాటు చేశారు. చెన్నైలో ఘన స్వాగతం అంతకుముందు, శుక్రవారం మధ్యాహ్నం చెన్నై విమానాశ్రయంలో తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్, ముఖ్యమంత్రి పళనిసామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రీ తదితరులు జిన్‌పింగ్‌కు స్వాగతం పలికారు. జిన్‌పింగ్‌తో పాటు 90 మంది సభ్యులతో చైనా ప్రతినిధి బృందం కూడా చెన్నై చేరుకుంది. అదే సమయంలో ‘వెల్కమ్ ఇండియా.. ప్రెసిడెంట్ జిన్‌పింగ్’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. విమానాశ్రయంలో జిన్‌పింగ్‌కు స్వాగతం పలుకుతూ కళాకారులు తమిళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే చిన్న సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చారు. అనంతరం, చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌కు జిన్‌పింగ్ వెళ్లారు. అక్కడ కాసేపున్న తరువాత సాయంత్రం మహాబలిపురం బయల్దేరారు. జిన్‌పింగ్ కాన్వాయ్ సాగిన మార్గంలో దారిపొడవునా విద్యార్థులు, ప్రజలు భారత్, చైనా జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ స్వాగతం పలికారు. ప్రకటన ఉండొచ్చు గత సంవత్సరం చైనాలోని వుహాన్‌లో జరిగిన అనధికార భేటీ తరహాలోనే.. ఈ భేటీ అనంతరం ఇరుదేశాలు వేరువేరుగా ప్రకటనలు విడుదల చేస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం నుంచి దాదాపు ఆరు గంటల పాటు ఇరువురు నేతలు ముఖాముఖి, ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని పేర్కొన్నాయి. ‘భవిష్యత్తు ద్వైపాక్షిక సంబంధాలకు నూతన మార్గం చూపే పరస్పర ఆమోదిత మార్గదర్శకాలు ఈ భేటీ ద్వారా నిర్ణయమయ్యే అవకాశముంది’ అని భారత్‌లో చైనా రాయబారి సున్ వీడాంగ్ పేర్కొన్నారు. విందు సందర్భంగా చర్చలు విందు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పలు అంశాలపై చర్చలు జరిపారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. ఇరువురు నేతలు వాణిజ్య లోటుపై చర్చించారని, ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారని గోఖలే వెల్లడించారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఇద్దరూ ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. అన్ని అంశాలపై ప్రధాని మోదీతో కలసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నానని జిన్‌పింగ్ తెలిపారని గోఖలే పేర్కన్నారు. విందు సమయంలో ఇద్దరు నేతలు రెండున్నర గంటల పాటు మాట్లాడుకున్నారని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత శక్తిమంతం చేసుకోవాలని, వివాదాస్పద అంశాల కన్నా సంబంధాల బలోపేతానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఇరువురు నేతలు నిర్ణయించారని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. అయతే, వారిమధ్య కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చినదా? లేదా? అన్న విషయం తెలియలేదు. ‘తొలిరోజు అనధికార సమావేశం ఫలప్రదంగా జరిగింది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ ట్వీట్ చేశారు. జిన్‌పింగ్‌కు తమిళ రుచులు చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆయనకు ఇష్టమైన మాంసాహార వంటకాలతో పాటు సంప్రదాయ తమిళ వంటకాలను అందించారు. జిన్‌పింగ్‌కు ఇష్టమైన మాంసం, ఉల్లిగడ్డలతో ఓ కర్రీ.. క్యారెట్, క్యాబేజీ, లివర్లతో మరో కూర, నూడుల్స్, సూప్‌లను అందించారు. అవికాకుండా, అన్నం, బిర్యానీ, సాంబారు, టమాట రసం, చపాతీ, బటర నాన్, పులావ్, టమాటా–క్యారెట్ సూప్‌లను కూడా ఆ మెనూలో చేర్చారు. శనివారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ, వడ, సాంబారు, చట్నీ, పొంగల్ తదితర తమిళ రుచులను ఆయనకు చూపనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిన్‌పింగ్ కోసం మోదీ ఏర్పాటు చేసిన విందులోనూ తమిళ రుచులను ఏర్పాటు చేశారు. పప్పు, మసాలాలు, కొబ్బరి వేసి చేసిన తమిళ ప్రత్యేక సాంబారును జిన్‌పింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. టమాట రసం, కూర్మా, హల్వాలను మెనూలో చేర్చారు. జిన్‌పింగ్‌కు ఇష్టమైన మాంసాహార వంటకాలనూ అందించారు. తమిళ వస్త్రధారణలో మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మామల్లపురం(మహాబలిపురం) పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. పొట్టి చేతుల తెలుపు రంగు చొక్కా, దానిపై అంగవస్త్రం, ఆకుపచ్చ బోర్డరున్న సంప్రదాయ తమిళ లుంగీని ధరించారు. జిన్‌పింగ్ వైట్ షర్ట్‌ను డార్క్ కలర్ ప్యాంట్‌లోకి ఇన్ చేసుకుని సింపుల్‌గా కనిపించారు. మహాబలిపురంలోని సముద్ర తీరంలోని రాతి దేవాలయం, పంచ రథాలు, అర్జునుడు తపస్సు చేశాడని భావించే ప్రదేశంలోని 73 అడుగుల ఎత్తైన భారీ కళాత్మక నిర్మాణం.. తదితరాలను వారు సందర్శించారు. ఆ సందర్భంగా ఆ ప్రాంత ప్రాముఖ్యతను, ఆ దేవాలయ చరిత్రను, నిర్మాణ విశిష్టతను జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. అనంతరం వారిరువురు కొబ్బరి బోండాలను సేవించి సేదతీరారు. తమిళ సంప్రదాయ వస్త్రాలను మోదీ ధరించడంపై పలు తమిళ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. ‘తమిళ సంప్రదాయాన్ని ప్రధాని ప్రపంచానికి చూపారు’ అని పట్టలి మక్కల్ కచ్చి వ్యవస్థాపకుడు ఎస్ రామ్‌దాస్ ట్వీట్ చేశారు. ‘ఏ ప్రాంతానికి వెళ్తే, ఆ ప్రాంత సంప్రదాయాలను గౌరవించడం ప్రధాని మోదీకి బాగా తెలుసు. తమిళ పంచెకట్టులో ఆయన సౌకర్యవంతంగా కనిపించారు’ అని తమిళనాడు మంత్రి సీటీ రవి వ్యాఖ్యానించారు. జిన్‌పింగ్‌కు ఆలయ గొప్పదనాన్ని వివరిస్తున్న మోదీ మామల్లపురంలో సముద్ర తీరంలో వారసత్వ కట్టడం -
నాలుగు దేశాల అధ్యక్షులకు మోదీ ఘనస్వాగతం
-
భారత్‌లో 1.2 లక్షల కోట్ల చైనా పెట్టుబడులు
ఇరు దేశాల మధ్య ఐదేళ్ల వాణిజ్య, ఆర్థిక సహకార ఒప్పందం - చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్,ప్రధాని మోదీ సమక్షంలో సంతకాలు న్యూఢిల్లీ: చైనాతో ఐదేళ్ల వాణిజ్య, ఆర్థిక సహకార ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. తద్వారా వాణిజ్య సమతౌల్యాన్ని సాధించడంతోపాటు, 20 బిలియన్ డాలర్లమేర(రూ. 1.2 లక్షల కోట్లు) చైనా పెట్టుబడులను అందుకునేందుకు మార్గాన్ని వేసుకుంది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు ఐదేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఒప్పంద ప్రతులపై భారత వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, చైనా వాణిజ్య మంత్రి గావో హుచెంగ్ సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య సమతౌల్యం, నిలకడతో కూడిన ఆర్థిక, వాణిజ్య విధానాలకు ఒప్పందం మార్గదర్శకంగా నిలవనుంది. సమానత్వం, ఇరు దేశాలకూ లాభదాయకం అన్న అంశాల ప్రాతిపదికగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ అంశాల ఆధారంగా రానున్న ఐదేళ్లలో చైనా నుంచి భారత్‌కు 20 బిలియన్ డాలర్ల(రూ. 1.2 లక్షల కోట్లు) పెట్టుబడులు లభించేందుకు వీలు చిక్కనుంది. ఒప్పందంలో భాగంగా ఇన్వెస్టర్లకు అనుకూలమైన, పారదర్శకమైన, స్థిరమైన వాతావరణాన్ని ఇరు దేశాలూ కల్పించనున్నాయి. రెండు దేశాల వాణిజ్య మండళ్లు, ఆర్థిక రంగాలు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవలసి ఉంటుంది. గతేడాది రెండు దేశాల మధ్య 66.4 బిలియన్ డాలర్ల వాణిజ్యం నమోదైనప్పటికీ, చైనా 35 బిలియన్ డాలర్ల ఆధిక్యాన్ని సాధించడం గ మనార్హం. మన ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్... ఒప్పందంలో భాగంగా చైనా రానున్న ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసేందుకు కట్టుబడి ఉంటుంది. అంతేకాకుండా భారత వ్యవసాయోత్పత్తులు, జౌళి ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, హస్తకళలు, ఔషధాలు, రత్నాలు, ఆభరణాలు తదితరాలకు చైనాలో మార్కెట్‌ను కల్పించనుంది. తద్వారా ద్వైపాక్షిక వాణిజ్యంలో ఇండియా ఎదుర్కొంటున్న భారీ లోటును తగ్గించేందుకు కృషి చేయనుంది. దిగుమతి సుంకాలను తగ్గించమంటూ ఇండియా ఎప్పటినుంచో చైనాను కోరుతూ వస్తున్న నేపథ్యంలో తాజా ఒప్పందానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఒప్పందంపై సంతకాల అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశీయంగా రెండు చైనీస్ పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుతోపాటు, 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఒప్పందం కుదరడం సంతోషదాయకమని పేర్కొన్నారు. దీంతో తమ రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాలలో కొత్త అధ్యాయం మొదలవుతుందని వ్యాఖ్యానించారు. ఒప్పందం ప్రకారం మహారాష్ట్రలో ఆటో పారిశ్రామిక పార్క్, గుజరాత్లో విద్యుత్ పరికరాల పారిశ్రామిక పార్క్‌ను చైనా ఏర్పాటు చేస్తుంది. బ్యాంకింగ్ దిగ్గజాలతోనూ... దేశీ బ్యాంకింగ్ దిగ్గజాలు స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ), ఐసీఐసీఐ, యాక్సిస్‌లతో చైనా ఎగ్జిమ్ బ్యాంక్, చైనా డెవలప్మెంట్ బ్యాంక్ కార్పొరేషన్(సీడీబీ) గురువారం వివిధ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. తద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యానికి సహకారమందించనున్నాయి. దీనిలో భాగంగా చైనా ఎగ్జిమ్ బ్యాంక్ అందించే లైన్ ఆఫ్ క్రెడిట్‌ను దేశీ సంస్థల దిగుమతులకు బ్యాంకింగ్ దిగ్గజాలు వినియోగించనున్నాయి. దేశీ కంపెనీలు చైనా నుంచి ఇంధనం, పరికరాలు, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర వస్తువులను దిగుమతి చేసుకునేందుకు లైన్ ఆఫ్ క్రెడిట్ సౌకర్యాన్ని వినియోగించుకోనున్నాయి.