breaking news
chikati rajyam
-
చీకటిలో... చదరంగం..!
కొత్త సినిమాలు గురూ! చిత్రం: చీకటి రాజ్యం; తారాగణం: కమలహాసన్, త్రిష, కిశోర్, ప్రకాశ్‌రాజ్, ‘మిర్చి’ సంపత్‌రాజ్, యూహి సేతు; స్క్రీన్‌ప్లే: కమలహాసన్; సంగీతం: జిబ్రాన్ కెమేరా: సానూ జాన్ వర్గీస్; యాక్షన్: గిల్గెస్ కాంసే యిల్, టి. రమేశ్; నిర్మాతలు: ఎస్.చంద్రహాసన్, కమలహాసన్; దర్శకత్వం: రాజేశ్ ఎం. సెల్వా, నిడివి: 129 నిమిషాలు సృజనాత్మకత తక్కువైపోయి సినిమాలన్నీ ఒకే తరహాలో వస్తుంటే..? అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఇవాళ ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. మరి, సృజనాత్మకత మరీ ఎక్కువైపోతేనో? వెరైటీగా అనిపించినా, అదీ ఇంకో రకమైన ఇబ్బందే. కానీ, కొత్త తరహాగా ఆలోచించాలనీ, నలుగురూ వెళుతున్న దోవకు భిన్నంగా వెళ్ళాలనీ, కొత్తదనాన్నీ చూపించాలనీ అనుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకొనే కమలహాసన్ చేసిన తాజా ప్రయత్నం - ‘చీకటి రాజ్యం’. చాలాకాలం తరువాత తమిళం (‘తూంగావనమ్’)తో పాటు తెలుగులోనూ కమల్ అందించిన స్టైలిష్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. దీపావళికి ఒక రోజు ముందే తమిళ వెర్షన్ అక్కడ విడుదలై, విజయవంతంగా ప్రదర్శితమవుతుంటే, సరిగ్గా పది రోజుల తరువాత ఇప్పుడీ తెలుగు వెర్షన్ జనం ముందుకొచ్చింది. ఫ్రెంచ్ చిత్రం ‘స్లీప్‌లెస్ నైట్’ ఆధారంగా ఈ కథ అల్లుకున్నట్లు కమల్ పేర్కొన్నారు. టైటిల్స్‌లో క్రెడిట్ కూడా ఇచ్చారు. సినిమా స్టోరీ ఏమిటంటే... సి.కె. దివాకర్ అలియాస్ సి.కె.డి. (కమలహాసన్) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్. డాక్టరైన భార్య విడాకులిచ్చేస్తుంది. వాళ్ళబ్బాయి వాసు స్కూల్లో చదువుకొనే పిల్లాడు. ఇద్దరికీ పిల్లాడే ప్రాణం. ఊళ్ళో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ జరుగుతుంటే, పది కిలోల కొకైన్ బ్యాగ్‌ను దివాకర్, అతని కొలీగ్ మణి (యూహీ సేతు) కొట్టే స్తారు. కొకైన్ దంధా నడిపే నైట్‌క్లబ్ ఓనర్ విఠల్‌రావు (ప్రకాశ్‌రాజ్) విషయం తెలిసి, పిల్లాణ్ణి కిడ్నాప్ చేయిస్తాడు. కొకైన్ బ్యాగ్ ఇస్తేనే, పిల్లాణ్ణి అప్పగిస్తానని బేరం పెడతాడు. బాబు కోసం ఆ బ్యాగ్ ఇచ్చేయ డానికి దివాకర్ సిద్ధపడతాడు. ఆ బ్యాగ్ తీసుకొని క్లబ్‌కు వెళ్ళి, టాయి లెట్లో దాచిపెడతాడు. నార్కోటిక్స్ బ్యూరోలోనే మరో పోలీసైన మల్లిక (త్రిష) అనుకోకుండా దివాకర్‌ను వెంబడించి, బ్యాగ్ సంగతి చూస్తుంది. తీసి మరోచోట దాస్తుంది. తీరా పిల్లాణ్ణి కాపాడుకొందామని ప్రయత్నిం చిన దివాకర్‌కు దాచినచోట బ్యాగ్ కనిపించదు. ఒకపక్క విఠల్‌రావు, అతని బిజినెస్ పార్టనర్ (‘మిర్చి’ సంపత్), అనుచరులు, మరోపక్క ఆఫీసర్లు మల్లిక, మోహన్ (కిశోర్) వెంటాడుతుంటే, బిడ్డను కాపాడు కోవడానికి అతను తంటాలు పడుతుంటాడు. ఆ రాత్రి పోలీస్ డిపార్ట మెంట్‌తో సహా, నేరసామ్రాజ్యంలోని చీకటి కోణాలెన్నో బయటపడ తాయి. అవేమిటి? దివాకర్ కన్నబిడ్డను కాపాడుకోగలిగాడా? అవన్నీ తెరపై చూడాల్సిన విషయాలు. పాయింట్ చిన్నదైనా, ప్రధానంగా కథనశైలి మీద ఆధారపడి తీసిన క్రైవ్‌ు యాక్షన్ థ్రిల్లర్ ఇది. అందుకు తగ్గట్లే నేపథ్య సంగీతం, యాక్షన్ అంశాలే కీలకమయ్యాయి. భార్య నుంచి విడాకులు తీసుకొని, కొడుకే ప్రాణంగా బతుకుతున్న తండ్రి పాత్రలోని బాధను కమల్ బాగా చూపించారు. యాక్షన్ సన్నివేశాల్నీ రియలిస్టిక్‌గా పండిం చారు. అలాగే, పోలీస్ ఆఫీసర్లుగా త్రిష, కిశోర్, గ్యాంగ్స్టర్లుగా ప్రకాశ్‌రాజ్, సంపత్ అందరూ సీనియర్లే. పాత్రల్ని సమర్థంగానే పోషించినవారే. కాకపోతే, కమల్ పోషించిన పాత్రను మొదటి నుంచి కొంత నెగిటివ్ షేడ్ ఉన్నదిగా చూపెడుతూ వస్తారు. సెకండాఫ్ సగంలోకి వచ్చే సరికి ఆ పాత్ర అసలు స్వరూపం ఏమిటో, ఎందుకలా ప్రవర్తిస్తోందో తెలియజేస్తారు. అదీ వట్టి డైలాగులతో. దాంతో, ఆ పాత్ర ఒక్కసారి డార్క్ షేడ్ నుంచి బ్రైట్ షేడ్ వైపు గెంతినట్లనిపిస్తుంది. సినిమా దాదాపు నైట్ క్లబ్‌లోనే జరుగుతుంది. దాంతో, సీన్లన్నీ డ్యాన్స్ ఫ్లోర్, కిచెన్, టాయిలెట్స్‌లోనే తిరుగుతుంటాయి. ఒక విభిన్న తరహా ప్రయత్నంగా, బడ్జెట్ కలిసొచ్చే అంశంగా దాన్ని సర్దిచెప్పుకోవచ్చు కానీ, పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాను ఆ పరిధిలోనే సరిపెట్టుకోవడం ఆడియన్సకు ఇబ్బందే. సినిమా చివరలో రోలింగ్ టైటిల్స్ వస్తుంటే, యూనిట్ మొత్తం నర్తించిన ప్రమోషనల్ వీడియో తరహా సాంగ్, సాహిత్యం, ఆర్కెస్ట్రయిజేషన్ బాగు న్నాయి. ఆ పాటలో కమల్ ఎనర్జీ చూస్తే ముచ్చటేస్తుంది. వెరసి కొన్ని సినిమాలు కథను బట్టి చూస్తాం. మరికొన్ని దర్శకుణ్ణి బట్టో, హీరోను బట్టో చూస్తాం. కానీ, ఒక నటుణ్ణి బట్టి, అతని అభినయం మీద ప్రేమ కొద్దీ చూసే సినిమాలు ఇవాళ తక్కువ. యాభై ఏళ్ళ పైగా కెరీర్ తరువాత కూడా అలాంటి నటుడిగా కమల్ అలా ఆసక్తికరంగా ఆయన సినిమాలూ ఉండడం విశేషమే. ఆ ఆసక్తి ‘చీకటి రాజ్యం’ లోకి ప్రేక్షకుల్ని తెస్తుంది. కానీ, కమల్ కెరీర్లో కొన్నాళ్ళుగా పేరుకున్న బాక్సాఫీస్ చీకటిని తొలగిస్తుందా అన్నది కొన్ని కోట్ల రూపాయల ప్రశ్న. కమల్ శిష్యుడే దర్శకుడు రాజేశ్. దర్శకుడిగా అతనికి ఇదే తొలి చిత్రం. రామజోగయ్యశాస్త్రితో డైలాగ్స రాయించాలని కమల్ భావించారట. మణి పాత్రకు తెలుగులో రచయిత అబ్బూరి రవి డబ్బింగ్ చెప్పారు. ఉన్న ఒకే ఒక్క పాట కమలే పాడారు. ఫారిన్ యాక్షన్ మాస్టర్ గిల్గెస్ కాంసే యిల్ కొన్ని ఫైట్స్ కంపోజ్ చేశారు. రెంటాల జయదేవ -
‘చీకటి రాజ్యం’ మెరుపు తీగెలు
అందాల తారలు రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్‌లు గురువారం నగరంలో సందడి చేశారు. కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన ‘చీకటి రాజ్యం’ ప్రీమియర్ షోను తిలకించేందుకు ఐమ్యాక్స్‌కు వీరు వచ్చారు. -
నిరసన అంటే ఇది కాదు!
సినిమా ఆయనకి ప్రాణం. సమాజం దాన్ని నిలబెట్టే ఊపిరి. ఈ రెంటిపై నిర్దిష్ట అభిప్రాయం ఉన్న విశ్వనటుడు కమల్‌హాసన్. ఈ 7వ తేదీ 61 ఏళ్ళు నిండుతున్న కమల్ త్వరలో ‘చీకటిరాజ్యం’తో పలకరిస్తున్నారు. అవార్డలు వెనక్కివ్వడం నుంచి పలు అంశాలపై ‘సాక్షి’తో ముచ్చటించారు. ‘చీకటి రాజ్యం’ డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. ఈ నెల 10న తమిళంలో (‘తూంగా వనమ్’) రిలీజ్. మంచి థియేటర్స్ కోసం తెలుగులో కాస్త ఆలస్యంగా 20న రిలీజ్ చేయనున్నాం. మామూలుగా అయితే ఒకేసారి రిలీజ్ చేస్తారు. కథ మీద నమ్మకంతో గ్యాప్ తీసుకున్నాం.{థిల్లర్ సినిమాల్లో డెప్త్ ఉండదు. కానీ ‘చీకటి రాజ్యం’లోని పాత్రల్లో డెప్త్, స్పీడ్ ఉంటాయి. సినిమాలో స్టంట్స్ స్టయిలిష్‌గా, రియలిస్టిక్‌గా ఉంటాయి. కమర్షియల్ వాల్యూస్ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. ఒక సినిమా చూశామంటే అరే ఇలాంటి కథ మన భాషలో కూడా వస్తే బాగుంటుందనుకుంటాం. ఫ్రెంచ్ సినిమా ‘స్లీప్‌లెస్ నైట్’ థీమ్ బాగుంది. అందుకే, ‘చీకటిరాజ్యం’గా తీశాం. చెప్పాలంటే ‘సాగర సంగమం’ కూడా ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ ప్రేరణతో వచ్చిందే. సినిమా అనేది టాలెంట్‌తో మాత్రమే ముడిపడి ఉండదు. ప్రొడక్షన్‌కు తగ్గట్టు ఒక్కోసారి యాక్టర్స్‌ను తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది యాక్టర్స్‌కు టాలెంట్ ఉన్నా సరే, వాళ్లకి మార్కెట్ ఉండదు. కొంత మంది సినిమాకు బాగా సహకరిస్తారు. బాలచందర్‌గారు అవకాశం ఇవ్వకపోతే నేనీ స్థాయికి వచ్చేవాణ్ణి కాదు. నేను నా శిష్యులకు ఛాన్స్ ఇవ్వకపోతే నాకు కృత జ్ఞత లేనట్టే. కొత్త యాక్టర్స్‌కు, టెక్నీషియన్స్‌కి కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. అందుకే, నా దగ్గర పనిచేసిన రాజేశ్ సెల్వాకు ‘చీకటిరాజ్యం’లో ఛాన్సిచ్చా.నేను చేసిన చాలా సినిమాల్ని జనం రిసీవ్ చేసుకున్నారు. అయితే, కొన్నిసార్లు జనం మెచ్చలేదు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, దిలీప్‌కుమార్ లాంటి మహానటులకే అది తప్పలేదు. ఎవరికీ వందశాతం సక్సెస్ రేటుండదు! విజయానికి ఒక్కరిని కారణమనలేం. అలాగే పరాజయానికి కూడా. సినిమా సమష్టి కృషి . మంచి సినిమా సరైన టైమ్‌లో రిలీజ్ కాకపోతే ఫ్లాపవుతుంది. నాకు సినిమాలంటే ఇష్టం. అదే నన్ను నడిపిస్తోంది.‘బాహుబలి’ పదేళ్ల క్రితం వచ్చినా హిట్ అయ్యేది. అంతెందుకు... ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి పుట్టకముందే ‘మొఘల్ ఎ ఆజమ్’ లాంటి భారీ చిత్రం వచ్చి, హిట్ అయింది. మంచి సినిమాలు ఎప్పుడు వచ్చినా హిట్ అవుతాయి. ‘మరుద నాయగమ్’ను పునః ప్రారంభించడానికి చర్చలు జరుగుతున్నాయి. ‘షోలే’ వచ్చినప్పుడు అది చాలా అడ్వాన్స్డ్ సినిమా. కానీ అందరికీ రీచయింది. జనాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ‘ఉత్తమ విలన్’ టైమ్‌లో నన్ను డెరైక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తావని అంతా అడిగారు. అందుకే ‘చీకటిరాజ్యం’ చేసేశా. వెంటనే టి.కె. రాజీవ్ కుమార్ దర్శకత్వంలో మళ్లీ ఇంకో తెలుగు, తమిళ సినిమా చేస్తున్నా. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాం. చాలా కాలం తర్వాత అమల, జరీనావహాబ్లతో నటిస్తున్నా.భిన్నాభిప్రాయాల్ని సహించలేక, ప్రభుత్వ పరంగా ఇప్పుడు వ్యక్తమవుతున్న అసహనం అసాధారణం. దానిపై అంతా పోరాడాల్సిందే. కానీ, అవార్డుల్ని వెనక్కివ్వడం పరిష్కారం కాదు. నిరసనంటే ఇది కాదు. ఆ అవార్డులు ప్రతిభకు గుర్తింపుగా, జనం మెప్పుతో వేర్వేరు ప్రభుత్వాలిచ్చినవి. మనం గాంధీలా ‘సత్యాగ్రహం’తో వేరే మార్గంలో పోరాడాలి.‘ఆస్కార్’ కోసం ఆరాటం అనవసరం. నన్నడిగితే, మనదేశానికి వాళ్ళు చిత్రాలు పంపేలా మనం తయారవ్వాలి. ఎందుకంటే మనం దేశం నుంచి ఏడాదికి 1000 చిత్రాలు వస్తున్నాయి. హాలీవుడ్ వాళ్లు మన రికార్డ్‌ని దాటలేరు. అక్కడ సినిమాల్ని మనంత గా ప్రేమించరు. మనం సినిమాల్ని ప్రేమిస్తాం. -
త్రిష @ 50
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ హీరోయిన్ కెరీర్ లో అయిన 50 సినిమాలు చేయటం మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన రికార్డ్‌ను అందుకుంది సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష. టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోలందరితో కలిసి నటించిన ఈ భామ బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఎక్కువగా సౌత్ సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తున్న ఈ బ్యూటి కొంత కాలంగా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో సినిమాలకు దూరమైన త్రిష తరువాత పెళ్లి క్యాన్సిల్ అవ్వటంతో తిరిగి సినిమాలు సైన్ చేయటం ప్రారంభించింది. తాజాగా తన 50వ సినిమాగా లోకనాయకుడు కమల్ హాసన్ తో కలిసి చీకటిరాజ్యం సినిమాలో నటిచింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ బ్యూటి యాక్షన్ సీన్స్‌లోనూ అదరగొట్టింది. ఈ సినిమాతో పాటు మరో ఐదు సినిమాలతో బిజీ బిజీగా ఉంది ఈ బ్యూటి.